మోడీ వదిలిన చీతాల వెనకనున్న రాజకీయ కుట్ర!18 సంవత్సరాల పోరాటం

by Disha edit |
మోడీ వదిలిన చీతాల వెనకనున్న రాజకీయ కుట్ర!18 సంవత్సరాల పోరాటం
X

భారత్ ఒకప్పుడు ఆసియా చీతాలకు నెలవు. కాలక్రమేణా వాటి ఆవాసాలతో పాటు ఆ జాతి కూడా అంతరించింది. దీని కోసం ఆవాసాలను కృత్రిమంగా సృష్టించాల్సి వచ్చింది. చీతాలు, సింహాల ఆవాసాలు ఒకే రకంగా ఉండటంతో సింహాల కోసం ఏర్పాటు చేసిన అభయారణ్యంలో చీతాలను దించారు. మన దేశంలో చీతాలు చివరగా ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో కనిపించాయి. కుక్కను, పిల్లిని పోలి అత్యంత తక్కువ బరువును కలిగి ఉండే చీతాలు సెన్సిటివ్ ఎనిమల్స్. వీటిని fragile animal గా వ్యవహరిస్తారు. చిన్న ప్రతికూల పరిస్థితులను కూడా అవి తట్టుకోలేవు. చీతాలు ఎంత వేగంగా పరుగెత్తుతాయో అంతే వేగంగా అంతరిస్తాయి. చీతాల మరణాల రేటు ఎక్కువే. వాటి సర్వయివల్ రేటు కేవలం 20 శాతంగా ఉందని చెబుతారు.

నం ఒకప్పుడు గాలిలోకి పావురాలను ఎగురవేసేది. నేడు చీతాలను వదులుతున్నాం' అని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల మధ్యప్రదేశ్‌లోని 'కునార్ అభయారణ్యంలో' చీతాల విడుదల సందర్భంగా వ్యాఖ్యానించారు. కానీ, అక్కడ గుజరాత్ సింహాలకు బదులుగా చీతాలను ఎందుకు విడుదల చేయాల్సి వచ్చిందో, దాని వెనుక ఉన్న కారణాలేమిటో మాత్రం ఆయన వెల్లడించలేకపోయారు.

గిర్ సింహాల కోసం

740 చదరపు కిలోమీటర్ల సువిశాల 'కునార్ అభయారణ్యం' పరిధికి గుజరాత్ గిర్ ఫారెస్ట్‌లోని సింహాలను తరలించేందుకు 2004లోనే 'కునార్ నేషనల్ పార్క్' ఏర్పాటు చేశారు. గుజరాత్ ప్రభుత్వం సంకుచిత వైఖరి, కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణతో 'ప్రాజెక్టు లయన్' కాస్తా 'ప్రాజెక్టు చీతా'గా మారింది. దీని వెనుక పెద్ద రాజకీయం, రెండు దశాబ్దాల పోరాటం ఉంది. ఆసియా జాతికి చెందిన అరుదైన సింహాలు ప్రస్తుతం దేశంలో ఒక్క గుజరాత్ గిర్ ఫారెస్టులోనే ఉన్నాయి. సింహాల గుంపును 'ప్రైడ్' అంటారు. అందుకే వీటిని గుజరాత్ ప్రభుత్వం 'ప్రైడ్ ఆఫ్ గుజరాత్' గా చెప్పుకుంటున్నది. ఈ సింహాలను చూపి ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నది.

గిర్ ఫారెస్ట్ పరిధి 2,400 చదరపు కిలోమీటర్లే ఉంది. సింహాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో ఇక్కడ కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. ఒకేసారి ఒకే చోట ఉండాల్సి రావడంతో అవి మనుషుల మధ్యకు రావడం ప్రారంభించాయి. ఒకే చోట పరిమితికి మించి ఒకే జాతి జంతువులు ఉంటే ఇన్ బ్రీడింగ్ వంటి ఆరోగ్య సమస్యలు, అంగ వైకల్యం సమస్యలు వస్తాయి. అనేక రకాల వైరస్‌లు వ్యాపించి సామూహిక మరణాలు సంభవిస్తాయి. చివరకు ఆ జాతి మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే వాటిని ఇతర రాష్ట్రాలలోని అనువైన ప్రదేశాలకు తరలించాలని పర్యావరణవేత్తలు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం 18 సంవత్సరాల క్రితమే వాటిని తమ రాష్ట్రానికి దిగుమతి చేసుకునేందుకు ముందుకు వచ్చింది. 'కునార్ నేషనల్ పార్క్'ను అందుకు అనువైన ప్రాంతంగా చూపించింది.

అనేక ఆటంకాలు

అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యప్రదేశ్ ప్రతిపాదనను ఆమోదించింది. కొన్ని సింహాలను అక్కడకు తరలించాల్సిందిగా గుజరాత్ ప్రభుత్వాన్ని కోరింది. అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ దానికి సానుకూలంగా స్పందించలేదు. అయినా, మధ్యప్రదేశ్ ప్రభుత్వం గిర్ సింహాల మనుగడ కోసం 'కునార్ నేషనల్ పార్క్'ను తీర్చిదిద్దింది. గుజరాత్ మాత్రం తమ ప్రాంతానికి పరిమితమైన సింహాల తరలింపును అనుమతించేది లేదని తెగేసి చెప్పింది. అక్షయ్ దోబే లాంటి పర్యావరణవేత్తల పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీంకోర్టు 2013లోనే కొన్ని సింహాల తరలింపునకు అనుమతించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా, గుజరాత్ తన పట్టు వీడలేదు. రకరకాల కారణాలు చెబుతూ వాయిదా వేస్తూ వచ్చింది. దీంతో విసిగిపోయిన సుప్రీంకోర్టు సింహాల తరలింపులో సాధ్యసాధ్యాలను పరిశీలించాలంటూ ఒక సబ్ కమిటీని నియమించింది.

అప్పుడే దేశంలో రాజకీయాలు వేగంగా మారాయి. నరేంద్ర మోడీ ప్రధాని పదవిని చేపట్టారు. మధ్యప్రదేశ్‌లోనూ, గుజరాత్‌లోనూ బీజేపీ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా గిర్ సింహాల తరలింపు కోసం ప్రయత్నాలు జరిపారు. గుజరాత్ రాజీపడలేదు. 'వాటిని తప్పక మార్చాల్సి వస్తే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తాం కానీ, మధ్యప్రదేశ్‌కు ఇవ్వబోమని' భీష్మించుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాని కావడంతో సుప్రీంకోర్టు ఆదేశాలు సైతం మరుగున పడ్డాయి.

నరేంద్ర మోడీ సింబల్ కోసం

2014లో అప్పటి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలలో చీతాలకు అనువైన వాతావరణం ఉందని గుర్తించి ఆఫ్రికా చీతాల ట్రాన్స్‌లొకేషన్ కోసం సంప్రదింపులు జరిపారు. అదే సమయంలో దేశంలో అంతరించిపోతున్న ఆసియాటిక్ చీతాల క్లోనింగ్ కోసం హైదరాబాద్ సీసీఎంబీ కేంద్రంగా ప్రయత్నాలు జరిగాయి. ఇరాన్ ప్రభుత్వం తమ వద్ద ఉన్న ఆసియా చీతాలను ఇవ్వడానికి కానీ, రక్తపు నమూనాలను ఇవ్వడానికిగానీ అంగీకరించలేదు. క్లోనింగ్ అంత మంచిది కాదని నిపుణులు కూడా తేల్చడంతో అది నిలిచిపోయింది. దీంతో నమీబియా నుంచి మధ్యప్రదేశ్‌కు ఆఫ్రికా చీతాలను తరలించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఇటు సింహాలను గుజరాత్‌కే పరిమితం చేయడం వెనక భారీ ఆలోచనే ఉంది. 'సింహం అంటే గుజరాత్ గుర్తుకు రావాలి. సింహం అంటే నరేంద్ర మోడీ' సింబల్ కావాలి' అని భావించారని, అందుకే కునార్‌లో సింహాలకు బదులు చీతాలు వదిలారని విమర్శలు వచ్చాయి. పార్లమెంట్ భవనం మీద ఏర్పాటు చేసిన సింహాల గుర్తు కూడా ఇందులో భాగమేననే వ్యాఖ్యలు వినిపించాయి. అయితే, మోడీ వదిలిన చీతాలు మనదేశంలో మనగలుగుతాయా? అనేది పెద్ద ప్రశ్న గా నిలిచింది.

క్రమంగా అంతరించి

భారత్ ఒకప్పుడు ఆసియా చీతాలకు నెలవు. కాలక్రమేణా వాటి ఆవాసాలతో పాటు ఆ జాతి కూడా అంతరించింది. దీని కోసం ఆవాసాలను కృత్రిమంగా సృష్టించాల్సి వచ్చింది. చీతాలు, సింహాల ఆవాసాలు ఒకే రకంగా ఉండటంతో సింహాల కోసం ఏర్పాటు చేసిన అభయారణ్యంలో చీతాలను దించారు. మన దేశంలో చీతాలు చివరగా ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో కనిపించాయి. కుక్కను, పిల్లిని పోలి అత్యంత తక్కువ బరువును కలిగి ఉండే చీతాలు సెన్సిటివ్ ఎనిమల్స్. వీటిని fragile animal గా వ్యవహరిస్తారు.

చిన్న ప్రతికూల పరిస్థితులను కూడా అవి తట్టుకోలేవు. చీతాలు ఎంత వేగంగా పరుగెత్తుతాయో అంతే వేగంగా అంతరిస్తాయి. చీతాల మరణాల రేటు ఎక్కువే. వాటి సర్వయివల్ రేటు కేవలం 20 శాతంగా ఉందని చెబుతారు. అంటే పుట్టిన వాటిలో 80 శాతం బతకడం కష్టం. ఇంత నాజూకైన చీతాలు మధ్యప్రదేశ్‌లో మనుగడ సాగించగలుగుతాయా? దీనికి కాలమే సమాధానం చెబుతుంది.


మాడ్యమ్ మధుసూదన్

99497 74458


Next Story

Most Viewed