- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోరుగడ్డ తెలంగాణపై.. అవాకులు చవాకులు ఏల?
తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్ర సాధన కోసం జరిగిన త్యాగాలు, ప్రాంతీయ భావోద్వేగాల ప్రాధాన్యతపై ఈ విశ్లేషణాత్మక వ్యాసం చర్చిస్తుంది. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, వాటిపై వచ్చిన విమర్శలు, అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలపై సమగ్రంగా విశ్లేషిస్తుంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఆ ఉద్యమ నేపథ్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా, దానిని తక్కువ చేసి మాట్లాడటం ఇప్పటికీ కొనసాగుతుండటం ఆశ్చర్యకరం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వంటి నాయకుడు తెలంగాణ అంశంపై మాట్లాడిన ప్రతిసారీ వివాదాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.
తెలంగాణ ఉద్యమం అనేది ఒక్కరోజులో పుట్టిన భావోద్వేగం కాదు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న ‘నీళ్ళు, నిధులు, నియామకాల’ అన్యాయాలపై, ‘భాషా, సంస్కృతుల’ పై దాడులతో పేరుకుపోయిన ఆవేదనకు అది ప్రతి రూపం. 1969లోనే కాసూ బ్రహ్మానందం రెడ్డి, జలగం వెంగళరావు ఎన్‌కౌంటర్లకు 365 మంది విద్యార్థులు బలైనారు, యువత వీధుల్లోకి వచ్చి ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడారు. ఆ ఉద్యమ చరిత్రను విస్మరించి తెలంగాణ ఏర్పాటును ఒక రాజకీయ ప్రమాదంలా చిత్రీకరించడం బాధ్యతారాహిత్యం.
భావోద్వేగాల స్థాయికి దించొద్దు!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ఒక్క పార్టీ గానీ, ఒక్క నాయకుడు గానీ కారణం కాదు. ఉద్యమకారులు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, కళాకారులు, మేధావులు, రచయితలు , గాయకులు అందరూ కలిసి ఐక్యంగా చేసిన దీర్ఘకాల సకల జనుల సమ్మె పోరాటమే దానికి పునాది. మావోయిస్టులతో సహా వివిధ రాజకీయ పక్షాల సమ్మతులు సహకారం వల్లే చివరకు తెలంగాణ రాష్ట్రం ప్రజల చిరకాల వాంఛగా ఏర్పడింది. అంటే ఇది ఎవరో ఒకరు వ్యక్తిగతంగా చేసిన దానం కాదు. ప్రజలందరి ఆకాంక్షకు రాజకీయ అంగీకారం లభించిన ఫలితం. అలాంటి చారిత్రక ప్రక్రియ నేపథ్యాన్ని అర్థం చేసుకోకుండా ‘తెలంగాణ వస్తే నేను 13 రోజులు అన్నం తినలేదు’, ‘గద్దర్‌కు కారు కొనిచ్చాను’ వంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ పరిపక్వత కాదు. ఉద్యమాలను వ్యక్తిగత భావోద్వేగాల స్థాయికి దించడం ద్వారా లక్షలాది ప్రజల త్యాగాలను చిన్నబుచ్చినట్టవుతుంది.
మంచి వాతావరణం ఉన్న సమయంలో..
తెలంగాణ ప్రజలు పోరాడింది ఎవరి మీదో ద్వేషంతో కాదు. తమ ఆత్మగౌరవం, స్వపరిపాలన కోసం వీరోచిత పోరాటం చేసి చివరకు తమ రాష్ట్రాన్ని తాము సాధించుకున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతే అది పవన్ కళ్యాణ్ అవగాహన లోపమే. ప్రతి వేదికపై వేర్వేరు పాత్రలు పోషించడం, తాను బ్యాలెన్స్ తప్పి పూనకం వచ్చినట్టు ఊగిపోతూ సినిమాలో డైలాగ్స్‌తో నటించటం సాధ్యమేమో గానీ, రాజకీయాల్లో అది ఎక్కువకాలం పనిచేయదు. ఇప్పటి వరకు తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లోనూ తెలంగాణలో ఇతర చోట్ల నివసిస్తున్న ఆంధ్ర, రాయలసీమ ప్రజలకు ఎలాంటి నష్టం జరగలేదన్నది వాస్తవం. హైదరాబాద్‌లో వ్యాపారాలు, పరిశ్రమలు, సినిమా రంగం, ఉద్యోగాలు అన్నీ సాధారణంగా, సజావుగానే కొనసాగుతున్నాయి. రెండు ప్రాంతాల ప్రజలు కలిసిమెలిసి శాంతియుతంగా జీవిస్తున్నారు. ఇలాంటి చక్కని వాతావరణం ఉన్న సమయంలో తెలంగాణపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, ప్రాంతీయ ద్వేషాలను రెచ్చగొట్టడం తనకూ, ఆంధ్ర, రాయలసీమ ప్రజలకూ క్షేమకరం కాదు.
ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొడితే..
తన వ్యక్తిగత "ఇగో" రాజకీయ లాభం కోసం ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమ అంటూ ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టడం చివరికి సాధారణ ప్రజలకే నష్టం చేస్తుంది. తెలంగాణ నేల పోరాటాల చరిత్ర కలిగిన గడ్డ. ఇక్కడి ప్రజలు మాటల కంటే ఉద్యమాలను ఎక్కువ నమ్ముతారు. కేవలం సినిమా డైలాగులు, భావోద్వేగ ప్రసంగాలతో ఆ ప్రజలను ప్రభావితం చేయడం అంత సులభం కాదు. రాజకీయ నాయకుడు తన మాటలకు బాధ్యత వహించాలి. ముఖ్యంగా మరో రాష్ట్ర గౌరవం, చరిత్ర, ఉద్యమాల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. విమర్శలు చేయడం ప్రజాస్వామ్యంలో సహజమే. కానీ చారిత్రక వాస్తవాలను వక్రీకరించడం, ఉద్యమాల త్యాగాలను తక్కువ చేయడం మాత్రం సమంజసం కాదు.
డిప్యూటీ సీఎంగా చేయాల్సిన పనులివే..
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ముందున్న అసలు సవాలు తెలంగాణపై వ్యాఖ్యలు చేయడం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తాను జనసేన పార్టీ స్థాపించిన నాడు, తాను అక్కడ ఎన్నికల్లో పోటీచేసిన నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకసారి గుర్తుకు తెచ్చుకొని, అవి ఎంతవరకు అమలు చేయగలిగారో అక్కడ ప్రజలకు సమాధానం చెప్పొలి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నిరుద్యోగం, రైతు సమస్యలు, అమరావతి రాజధాని కోసం తమ భూములను కారుచౌకగా ఇచ్చిన రైతులకు ఈ రోజు మార్కెట్ ధరల ఇప్పిస్తామని చేసిన వాగ్దానాలను నిలుపుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటు పరం కానివ్వను.. ఎంతకైనా పోరాడతా అని తాను ఆనాడు చేసిన వాగ్దానం నిలుపుకోవాలి. విద్య, ఆరోగ్యం మొదలైన రంగాల్లో తన ఉపముఖ్యమంత్రి పదవి హోదాలో ఏమి సాధించి ప్రజలకు మేలు చేశాడో వివరించాలి.
తెలంగాణలో పోటీ చేయండి కానీ..
ఉప ముఖ్యమంత్రి పదవి ఒక గౌరవం మాత్రమే. అది ప్రజలకు ఉపయోగపడినప్పుడే దానికి విలువ ఉంటుంది. రాజకీయాల్లో స్థిరమైన వ్యక్తిత్వం, స్పష్టమైన సిద్ధాంతం, ప్రజల పట్ల బాధ్యత ఇవే, నాయకుడిని నిలబెడతాయి. లేకపోతే సినిమాలో హీరో డైలాగులు... బూటకపు మాటలు ఎంత పెద్దవైనా కాలంతో కలిసి మాయమైపోతాయి. పైగా... పవన్ కళ్యాణ్ (జనసేన పార్టీ) తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తా అంటున్నారు. తాను స్వయంగా ఎన్నికల ప్రచారం చేస్తా అంటున్నారు. ఎవరికీ అభ్యంతరం లేదు. అది ఆయన ప్రజాస్వామిక హక్కు. కానీ డిపాజిట్ అయినా దక్కించుకోవాలీ అంటే ప్రజాభిమానం కావాలి. అందుకు పవన్ కళ్యాణ్ ఈ "రేలకాయి మాటలు" మానుకోవటం మంచిది. ఆయన మాటలు, చేష్టలతో అందివచ్చిన ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా గందరగోళంలో పడేయటం ఆయన అభిమానులకు కూడా ఇష్టం ఉండదు.
-డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్






