ఉట్టిమీద చేపల కూరగా.. మహిళా బిల్లు!

by Ravi |
ఉట్టిమీద చేపల కూరగా.. మహిళా బిల్లు!
X

చట్టసభల్లో మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం కల్పించేందుకు ఉద్దేశించిన రిజర్వేషన్ బిల్లు డ్రాఫ్ట్‌ని కేంద్ర మంత్రి వర్గం ఆమోదించడం అభినందనీయం. ఇక పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడమే తరువాయి. ఏళ్ల నాటి కల నిజం కాబోతుందని ఆలోచించడానికి ధైర్యం చాలడం లేదు. ఎందుకంటే ఇదే రకం తంతు 26 ఏళ్లుగా మళ్లీ మళ్లీ జరుగుతూ వచ్చింది కాబట్టి. బిల్లు అన్ని అవరోధాలను దాటి చట్టంగా రూపుదిద్దుకున్నప్పుడు ఇంకోసారి గట్టిగా అభినందిద్దాం. ప్రస్తుతానికి మొదటి అడుగు వేసినందుకు ప్రభుత్వాన్ని కొంచెం భుజం తట్టుదాం.

ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు కథ విన్నప్పుడల్లా ఉట్టి మీద చేపల కూర కథ గుర్తుకు వస్తుంది. ఇంట్లో అందరూ పక్కా శాకాహారులే. అయితే ఉట్టి మీద చేపల కూర మాయం అవుతుంది. ఎలానో అంతు బట్టదు! ఇదీ అంతే. పార్లమెంట్‌లో బిల్లు పాస్ కావడానికి అవసరమైన సంఖ్యా బలం ఎప్పుడూ ఉంటుంది. బలమైన అధికార, ప్రతిపక్షాలు ఇరువైపులా బిల్లు పట్ల సానుకూలంగా ఉంటాయి. కానీ ఒక్కసారి కూడా పాస్ కాదు. మొదటిసారి 1996 సంగతి వదిలేసినా తరువాత అంతా ఇదే కథ. 1998, 1999, 2002, 2003, 2010 సంవత్సరాల్లో పాత సినిమానే కొత్తగా రిలీజ్ అయినట్టు ఒకే రకం దృశ్యాలు. బిల్లు ప్రవేశపెట్టడం, గొడవ జరగడం, మద్దతు ఇస్తున్న లేదా ఇస్తున్నట్టు ప్రకటించిన పెద్ద పార్టీలు ప్రేక్షక పాత్ర వహించడం. ‘మేం సిద్ధమే కానీ నిస్సహాయులమ’ని బయటకు రావడం. 2010లో మాత్రం రాజ్యసభలో పాస్ అయినా, లోక్‌సభ మొహం చూడలేకపోయింది. అధికార పక్షానికి ఎన్నికల మేనిఫెస్టో‌లోని అంశం. పెద్ద ప్రతిపక్షానికి తన స్వంత హామీ అన్నంత బిల్డప్. మిగతా పార్టీలు కూడా ఎక్కువగానే మద్దతు పలుకుతున్నాయి. వాస్తవానికి గట్టిగా అనుకుంటే ఇట్టే అమలులోకి రావాల్సిన చట్టం. సామాజిక మార్పు కోసం అవసరం కూడా.

పంచాయతీరాజ్ వ్యవస్థలో మహిళా రిజర్వేషన్ అమలు అవ్వడం వల్ల సామాజిక, రాజకీయ ముఖచిత్రంలో మంచి మార్పు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇంకొన్ని రాష్ట్రాలు మరికొంత ముందుకు వెళ్లి మహిళలకు పంచాయతీరాజ్ సంస్థల్లో 50 శాతం ప్రాతినిధ్యం కల్పించే చట్ట సవరణలు చేశారు. సమాజంలో సగభాగం ఉన్న మహిళలు సాధికారత పొందితేనే సమాజం బాగుపడుతుంది. పంచాయతీ నుండి పార్లమెంట్ దాకా వారి వాటా వారికివ్వాల్సిందే. ఇప్పటికే రెండున్నర దశాబ్దాల ఆలస్యం అయ్యిందని గుర్తించి వారి హక్కుని గుర్తించి పార్లమెంట్ అధికారికంగా ఆమోదం తెలపాలి.

- డా. డి.వి.జి.శంకర రావు

94408 36931

Next Story

Most Viewed