ప్రకృతి వైద్య సాహిత్య పునరుజ్జీవనం

by Disha Web Desk 13 |
ప్రకృతి వైద్య సాహిత్య పునరుజ్జీవనం
X

ప్రాచీన ఆయుర్వేద వైద్య విధానంలో భాగమైన ప్రకృతి వైద్య విధానం చాలా విశిష్టమైనది. ముఖ్యంగా భారతీయ గ్రామీణ జీవితంలో వంట ఇల్లే ఒక వైద్యశాల, అమ్మ పోపుల డబ్బా నే మందుల గని. ఉపవాసమే సర్వరోగ నివారణి. అనాదిగా మానవుడు, పశు, పక్షాదులు సహజ ప్రకృతి వాతావరణంతో సహజీవనం చేస్తూ స్వేచ్ఛగా, హాయిగా, ఆరోగ్యంగా జీవించాడు. చిన్నపాటి అనారోగ్యం సంభవిస్తే గ్రామీణ వైద్యులు పెద్దగా చదువుకోక పోయినా ,ఆనాటి రుషులు, పెద్దలు తమ అనుభవంతో సహజంగా ప్రకృతిలో లభించే ఆకులు, దుంపలు, పండ్లను తిని జీవించేవారు. కాలక్రమంలో వచ్చిన మార్పుల వల్ల ప్రాచీన వైద్య పద్ధతులు, ప్రకృతి వైద్యం ప్రాధాన్యత తగ్గిపోయింది. అల్లోపతి వైద్య విధానానికి ఆదరణ పెరిగింది.

అయితే ప్రాచీన కాలం నుండి మన దేశంలో ప్రకృతి వైద్య నిపుణులు, రుషులు, వైద్యులు, వివిధ కాలాల్లో సంభవించే వివిధ జబ్బులకు కారణాలను, వాటిని తగ్గించడానికి, తాము కనుగొన్న వైద్య చికిత్సా పద్ధతులను అనుభవాలతో రంగరించి, వాటిని తాటి ఆకులపై, రాతి పలకలపై, రాగి రేకులపై చెక్కి భావితరాలకు ఆ విజ్ఞానాన్ని భద్రపరిచారు. ఆధునిక కాలంలో కాగితం కనుగొనటం, అచ్చు యంత్రాలు రావటంతో ఆనాటి వైద్య విధానాలు ముద్రణా రూపంలో, పుస్తకాలలో, పత్రికలలో వెలువడ్డాయి.

అయితే కాల ప్రవాహంలో ఎక్కడో మూలన, గుప్తంగా మరుగున పడి ఉన్న అపూర్వ ప్రకృతి వైద్య, ఆరోగ్య శాస్త్రాల విజ్ఞానాన్ని, దేశంలోని పలు రాష్ట్రాలు తిరిగి పలు దేశ, విదేశీ భాషలలో వెలువడిన పుస్తకాలు, పత్రికలలో ప్రచురిత సాహిత్యాన్ని ఒక చోట చేర్చి, ఒక అపూర్వ, విశిష్ట అంతర్జాతీయ ప్రకృతి వైద్య ఆరోగ్య శాస్త్ర గ్రంధాలయాన్ని, తన సొంత భవనంలో ఒంటి చేత్తో స్థాపించారు ఆచార్య గజ్జల రామేశ్వరం.

ప్రకృతి వైద్య గ్రంథాలయం ప్రత్యేకతలు

ఈ అపూర్వ సాహిత్యానికి, నూతన గ్రంథాలయం శాస్త్ర నియమాలను అనుసరించి, వర్గీకరించి, ఇండెక్స్‌లూ, కేటలాగింగ్, బిబిలోగ్రఫీని సమకూర్చి, పుస్తకం రూపంలో తీసుకు వచ్చారు, ప్రకృతి వైద్య నిఘంటువును తయారు చేసి ప్రచురించారు, గ్రంథాలయంలోని పుస్తకాలను,జర్నల్స్ ను ఇతర సాహిత్యాన్ని డిజిటలైజ్ చేశారు. గ్రంథాలయ శాస్త్రంలో శిక్షణ పొందిన లైబ్రేరియన్(M.Lib.Sc) దుర్గం శంకరయ్య ఈ గ్రంథాలయంలో గ్రంథ పాలకునిగా పరిశోధకులకు, సాధారణ చదువరులకు తన సేవలు అందిస్తునాడు. మన దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి ప్రకృతి వైద్యులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఈ గ్రంథాలయాన్ని సందర్శిస్తుంటారు.

విదేశీ పరిశోధకులు కూడా సమాచారం సేకరించుకుంటున్నారు. దూర ప్రాంతాల నుండి సమాచార సేకరణకు వచ్చే వారికి రెండు, మూడు రోజులు ఉండటానికి సకల సౌకర్యాలతో కూడిన ఉచిత వసతి గదిని కూడా గ్రంథాలయంలో ఏర్పాటు చేశారు. పరిశోధకులకు విశాలమైన హాలు, ప్రశాంత వాతావరణంలో అనువుగా ఉంది. ఈ గ్రంథాలయం ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకూ అన్ని పనిదినాల్లో పనిచేస్తుంది. ప్రతి బుధవారం, జాతీయ సెలవుదినాల్లో మూసివేస్తారు.

ప్రొ. గజ్జల రామేశ్వరం కష్టార్జితం

ఇదంతా ఆచార్య గజ్జల రామేశ్వరం సొంత కష్టార్జితం. గత 33 సంవత్సరాలుగా తన నిర్విరామ కృషితో ఈ ఘనతను సాధించారు. ఒక జాతీయ స్థాయి యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలు సమిష్టిగా చేయవలసిన పనిని కేవలం తన ఆసక్తి, అభిరుచి మేరకు ఈ గ్రంథాలయాన్ని ఒంటరిగా ఏర్పాటు చేశారు. దీనికి అంతర్జాతీయ ప్రకృతి వైద్య గ్రంథాలయంగా నామకరణం చేశారు. దీనిని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రకృతి వైద్య ఉద్యమ ప్రచార కార్యదర్శి, ప్రకృతి వైద్యులు పద్మశ్రీ అయ్యంకి వెంకట రమణయ్య 113 వ జయంతి సందర్భంగా ఈ గ్రంథాలయాన్ని 2018 జూలై 24న ప్రారంభించడం జరిగింది.


3 దశాబ్దాలుగా ప్రొఫెసర్ రామేశ్వరం భారత దేశంలో పలు రాష్ట్రాలను, మారుమూల ప్రాంతాలను కూడా పర్యటించి, ప్రకృతి వైద్యానికి సంబంధించిన పుస్తకాలను, వాటిలో అరుదైన సాహిత్యాన్ని సేకరించి, గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ గ్రంథాలయంలో తెలుగు భాషలో 800 పుస్తకాలు, హిందీ భాషలో 1000, ఇంగ్లీష్‌లో 1000, మరాఠీలో 45, తమిళంలో 30, బెంగాలీలో 10, కన్నడంలో 70, ఉర్దూలో 05, గుజరాతీలో 40, మొత్తం 10 భారతీయ భాషల్లో పుస్తకాలు ఉన్నాయి.

ఈ గ్రంథాలయంలో 30 , దేశ, విదేశాలలో ప్రచురణ పొందిన అనేక జర్నల్స్ ఉన్నాయి. ఇవి కాక ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, లాటిన్ మొదలైన విదేశీ భాషల్లో వెలువడిన పుస్తకాలు, జర్నల్స్ కూడా ఉన్నాయి. అపురూపమైన పుస్తకాలు పత్రికలు కరపత్రాలు మాన్యుస్క్రిప్ట్ ఈ గ్రంథాలయంలో ఉన్నాయి. ప్రపంచంలో అరుదైన ప్రకృతి చికిత్సకు సంబంధించిన సాహిత్యాన్ని సేకరించి ప్రకృతి వైద్య సాహిత్య పునరుజ్జీవనం కోసం భవిష్యత్తు తరతరాలకు అందించాలన్నదే ప్రొఫెసర్ గజ్జల రామేశ్వరం ప్రధాన ఆశయం.

డా. రాధికా రాణి,

9849328496.




Next Story

Most Viewed