మానవజాతి పురోగతికి మూలం సైన్స్

by Ravi |
మానవజాతి పురోగతికి మూలం సైన్స్
X

విజ్ఞాన శాస్త్రం లేదా సైన్స్ అనేది ఈ ప్రపంచం గురించి మనకు తెలిసిన విషయాల్ని ఒక పద్ధతి ప్రకారం వివరించే శాస్త్రం. విశ్వం ఎలా పనిచేస్తుందనే దానిపై ఒక క్రమబద్ధమైన మరియు తార్కిక అధ్యయనమే సైన్స్. ఎప్పటికప్పుడు మారుతున్న పదార్థం, భౌతిక విశ్వం స్వభావం-ప్రవర్తనపై క్రమబద్ధమైన పరిశీలన, ప్రయోగం కొలతనే సైన్స్ అంటారు. అలాగే ఈ వాస్తవాలను సాధారణార్థంలో సూచించడానికి చట్టాలను రూపొందించడమే సైన్స్ అని కూడా నిర్వచిస్తున్నారు.మానవజాతి రూపొందించుకున్న అతి గొప్ప ఆవిష్కరణల్లో సైన్స్ ఒకటి. మానవుల జీవన ప్రమాణాలను పెంపొందించడంలో ఇది గణనీయమైన పాత్రను కలిగి ఉంది. మన జీవితంలోని ప్రతి అంశంలో, సైన్స్ సర్వవ్యాప్తిగా ఉంటోంది. పైగా ఇది సర్వ శక్తిమంతమైనది. మన జీవితంలోని ప్రతి భాగంలో సైన్స్ ప్రధాన పాత్ర పోషిస్తోంది.

సైన్స్ దినోత్సవం నేపథ్యం

ఆధునిక విజ్ఞాన ప్రపంచంలో మేటి భౌతిక శాస్త్రవేత్తగా పాదం మోపినవాడు సర్‌ సి.వి.రామన్‌. భారతీయ వైజ్ఞానికులలో అత్యంత ప్రతిభావంతులు. ఆయన కనుక్కున్న 'రామన్‌ ఎఫెక్ట్‌'కు 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి లభించింది. ఈ ప్రతిష్టాత్మకమైన బహుమతి అందుకున్న తొలి భారతీయుడు సి.వి.రామన్‌. ఆయన రామన్‌ ఎఫెక్ట్‌ను కనుగొన్న ఫిబ్రవరి 28న మనం సైన్స్‌ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దేశ ప్రజలంతా 1987వ సంవత్సరం నుంచి సైన్స్ డేని జరుపుకుంటున్నారు. దేశంలోని కళాశాలలు పాఠశాలలు, రీసెర్చ్ సెంటర్లు, మెడికల్‌, ఇంజనీరింగ్‌ కళాశాలలు , పరిశోధనా రంగంలోని సంస్థలు, సైన్స్‌ను ప్రచారం చేసే పత్రికలు అనేకానేక సంస్థలలో సైన్స్‌ దినోత్సవం అద్భుతంగా జరుగుతుంది. మహానుభావులు కనుక్కున్న సైన్స్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలంటే ఎంతో శ్రమించాలి. సైన్స్‌కంటూ ఓ రోజును కేటాయించుకొని అనేక కార్యక్రమాలు చేపడుతూ ప్రజా జీవితంలో సైన్స్‌ పాత్రను, ప్రాముఖ్యతనూ ప్రజల చేరువకు తీసుకువెళుతున్నారు.

రామన్ ఎఫెక్ట్ అంటే ఏమిటి

పదార్థాలలోని అణువులచే చెదర గొట్టబడిన కాంతి కిరణాల శక్తిలో అంటే రంగులో వచ్చే మార్పు ఆ పదార్థాలలోని అణువులని బట్టి, దాని స్థితిని బట్టి ఉంటుంది. అందుచేత పదార్థాలలో అణువు రచనను, స్థితిని నిర్ణయించడంలో రామన్‌ ఎఫెక్ట్‌కు సాటియైనది మరొకటి లేదు. కనుకనే రామన్‌ ఎఫెక్ట్‌ భౌతికశాస్త్రానికి కన్నబిడ్డగానూ, రసాయన శాస్త్రానికి పెంపుడు బిడ్డగానూ పెరిగింది. కాంతికిరణాలు ఒక ద్రవ పదార్థంపై పడినప్పుడు ఆ కాంతి పరిక్షేపం చెందుతుంది. అంటే కాంతి కిరణాలలోని ఫోటాన్‌ కణాలు ద్రవ పదార్థాలు పరమాణువులపై పడి పరిక్షేపం చెందుతాయి. రసాయన పదార్థాలలోని అణువులు పరమాణువుల పరిశీలనకు, వైద్యరంగంలోని మందుల తయారీలోని విశ్లేషణలకూ రామన్‌ ఎఫెక్ట్‌ ఉపయోగపడుతుంది. ఆకాశం, సముద్రపు నీరు, దూరంగా కనిపించే కొండలు ఇవన్నీ మనకు నీలం రంగులో కనిపిస్తాయి. ఇలా అవి నీలి రంగులో కనిపించటానికి గల కారణాలను రామన్‌ ఎఫెక్ట్‌ వివరిస్తుంది.

రామన్ జీవితం- విద్యాభ్యాసం

పరిశోధనల కోసం భారతీయులు విదేశాలకు వెళ్ళడమేమిటి, విదేశీయులే పరిశోధనల కోసం ఇక్కడికి రావాలని చెప్పిన వ్యక్తి సి.వి.రామన్. చంద్రశేఖర్ వెంకటరామన్ 1888 నవంబర్ 7 వ తేదీన తిరుచినాపల్లి సమీపంలోని అయ్యన్ పెటాయ్ అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి చంద్రశేఖర్ అయ్యర్, తల్లి పార్వతి అమ్మాళ్. వారిది మధ్య తరగతి కుటుంబం. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుండేవారు. విశాఖపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. చిన్నతనం నుంచి విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల అమితమైన ఆసక్తిని ప్రదర్శించేవారు. ఆయన తండ్రి భౌతిక అధ్యాపకులవడం, అతనిని భౌతిక శాస్త్రం పట్ల మరింత కుతూహలం పెంచుకునేలా చేసింది. తన 12వ ఏట మెట్రిక్యులేషన్ (ఫిజిక్స్‌లో గోల్డ్‌మెడల్) పూర్తి చేశాడు. 1907లో ఎం.ఎస్.సి (ఫిజిక్స్)లో యూనివర్సిటీకి ప్రథముడిగా నిలిచారు. తన 18వ ఏటనే కాంతికి సంబంధించిన ధర్మాలపై ఈయన పరిశోధనా వ్యాసం లండన్ నుంచి వెలువడే ఫిలసాఫికల్ మేగజైన్‌లో ప్రచురితమైంది. ఆయనలోని పరిశోధనాభిరుచిని పరిశీలించిన అధ్యాపకులు ప్రోత్సహించి ఇంగ్లాండు వెళ్ళి పరిశోధన చేయమన్నారు. కానీ ప్రభుత్వం నిర్వహించిన వైద్య పరీక్షలో ఒక వైద్యుడు ఆయన ఇంగ్లాండు వాతావరణానికి సరిపడదని తేల్చడంతో అతను ఇంగ్లాండు ప్రయాణం విరమించుకున్నాడు. నన్ను అన్‌ఫిట్ అన్న ఆ డాక్టరుకు నేనెంతో రుణపడి ఉన్నాను అని తర్వాత రామన్ పేర్కొన్నారు. ఎమ్మే చదివి ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేశారు.

ప్రస్తుత సైన్స్ పరిస్థితి

భారతరత్న అందుకున్న సమయంలో రామన్ చేసిన ప్రసంగం భావి శాస్త్రవేత్తలకు ఎంతో ప్రేరణగా నిలుస్తుంది. నిరంతర పరిశోధన, స్వతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞాన శాస్త్రాన్ని మదించివేస్తాయి అంటూ రామన్ చేసిన ప్రసంగం నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. ఇప్పుడున్న విజ్ఞాన శాస్త్ర పాఠ్య పుస్తకాలు, పాఠశాలల్లో వసతులు ముఖ్యంగా ప్రయోగశాలలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. చాలా ఉన్నత పాఠశాలల్లో ప్రయోగాలు చేసేందుకు ప్రయోగశాలలు లేవు. కొన్ని చోట్ల ఉన్నా అవి నిరుపయోగంగా ఉన్నాయి. నేడు పాఠశాలల్లో అమలౌతున్న సిసిఈ విధానానికి తగ్గట్టుగా ప్రయోగాలకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. బట్టీ విధానం, మార్కులే కొలమానంగా చూస్తున్న నేటి పరిస్థితుల్లో విద్యార్థులలో ఆలోచించే ప్రవృత్తి క్రమక్రమంగా తగ్గిపోతుందని చెప్పక తప్పదు.

అధిక నిధులు కేటాయించాలి

సైన్స్ పట్ల విద్యార్థులు ఆకర్షితులయ్యే విధంగా పాఠ్య ప్రణాళికలు రూపొందించాలి. సైన్స్ ప్రయోగాలకు జీడీపీలో అధిక నిధులు కేటాయించాలి. పరిశోధనలకు నిధులు కేటాయించడంలో భారత్ అట్టడుగు స్థానంలో ఉన్నది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను సంపాదించే యంత్రాలుగా చూడకుండా వాళ్ళు ఎంచుకున్న రంగంలో ప్రోత్సహిస్తూ భావిభారత శాస్త్రవేత్తలను దేశానికి అందించాల్సిన బాధ్యత వారిపై ఉన్నది. ప్రభుత్వం నామమాత్రంగా నిధులు కేటాయించి మొక్కుబడిగా ఇన్స్పైర్, సైన్స్ కాంగ్రెస్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పుకుంటూ పోతే భారతదేశం ఇంకో 100 ఏళ్ళు గడిచినా నోబెల్ బహుమతి సాధించడం అసాధ్యం. పాఠశాలల్లో విద్యార్థులు సొంతంగా ఆలోచించే విధంగా విజ్ఞాన శాస్త్ర గ్రంధాలయాలు ఏర్పాటు చేయాలి. శాస్త్ర విజ్ఞానం పెంపొందించే విధంగా వ్యాసరచన, వక్తృత్వ పోటీలు,సెమినార్‌లు నిర్వహించాలి. యువ శాస్త్రవేత్తలను ఉత్సాహపరుస్తూ వారు నూతన ఆవిష్కరణలు రూపొందించే విధంగా ప్రోత్సహించడమే మనం సి.వి.రామన్‌‌కి, ఇతర శాస్త్రవేత్తలకు అందించే విలువైన బహుమతి.

(నేడు జాతీయ సైన్స్ దినోత్సవం)

సుధాకర్.ఏ.వి

రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు, STUTS

90006 74747

Also Read...

అభివృద్ధి‌కి సోపానం సైన్స్

అభివృద్ధి‌కి సోపానం సైన్స్


Next Story