ఆశలు రేపుతున్న మోడీ అమెరికా యానం

by Ravi |
ఆశలు రేపుతున్న మోడీ అమెరికా యానం
X

ప్రధాని నరేంద్ర మోడీ జూన్ 21 నుంచి నాలుగు రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. సతీసమేతంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇచ్చిన ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ మంగళవారం ఉదయం అమెరికాకు బయలుదేరారు. అయితే ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రక్షణ, కృత్రిమ మేధస్సు, అంతరిక్ష రంగం, క్వాంటమ్ కంప్యూటింగ్, టెలికమ్యూనికేషన్ వంటి రంగాల్లో భారత్‌కు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని అందించడానికి అడ్డుగా ఉన్న ఆంక్షలను సడలించడం, ఆర్థిక మాంద్యం, ఉక్రెయిన్- రష్యా యుద్ధం వంటి కీలకమైన అంశాలు ఇద్దరు నేతల మధ్య చర్చకొచ్చే అవకాశం ఉంది. భారతదేశ విదేశాంగ విధానం ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎంతో వ్యూహాత్మకంగా, బలంగా మారింది. దాదాపు అన్ని అభివృద్ధి చెందిన దేశాలతో ఇండియా సత్సంబంధాలు కొనసాగించాలని కోరుకుంటోంది. భారత ప్రధాని అమెరికా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణ శాస్త్ర సాంకేతిక, వాణిజ్య రంగాలు కొత్త పుంతలు తొక్కనున్నాయని భావిస్తున్నారు.

ఏడు రంగాల్లో భాగస్వామ్యం

అమెరికాతో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయటంలో భాగంగా ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింతగా మెరుగుపర్చడం, ప్రజాస్వామ్య విలువలు, అచంచలమైన నిబద్ధతతో ప్రపంచ శాంతి, శ్రేయస్సుకు తోడ్పడటం వంటివి ప్రధాని అమెరికా పర్యటనలో ప్రధాన అంశాలు కానున్నాయి. జూన్ 21 నుంచి నాలుగు రోజుల పాటు ఈ పర్యటన జరగనున్న నేపథ్యంలో.

అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్‌తో మోదీ- బైడెన్‌ భేటీకి సంబంధించిన ఏర్పాట్లపై విస్తృత స్దాయిలో చర్యలు జరిపారు. ఏడు రంగాల్లో భాగస్వామ్యం కోసం భారత్‌, అమెరికాలు ఒక రోడ్ మ్యాప్‌ను ఆవిష్కరించాయి. కృత్రిమ మేధస్సు, క్వాంటమ్‌ కంప్యూటింగ్, సెమీకండక్టర్స్, టెలికమ్యూనికేషన్స్, డిఫెన్స్ అండ్ స్పేస్ వంటి రంగాల్లో సహకారం అందించడం, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసే యుద్ధ విమానాలకు శక్తినిచ్చే ఇంజిన్‌లను భారతదేశంలో ఉత్పత్తి చేయడానికి జనరల్‌ ఎలక్ట్రిక్‌తో మల్టీ మిలియనీర్‌ డాలర్‌ ఒప్పందంపై ఆమోదం, సెమీకండక్టర్ల తయారీకి ఎంఓయూ, సెమీకండక్టర్ల తయారీపై ఉమ్మడి ప్రాజెక్టులు, సాంకేతిక భాగస్వామ్యాలకు మార్గం సుగమం చేసే అవగాహన ఒప్పందం యూఎస్ నుంచి భారత్‌కు హై-పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ టెక్నాలజీ, సోర్స్ కోడ్‌‌ను ఎగుమతి చేయడంలో ఉండే అడ్డంకులను తగ్గించడం, రెండు దేశాల మధ్య రక్షణ వాణిజ్యం, పెట్టుబడుల్లో ఉన్న అడ్డంకులను తొలగించడం, ఆయుధాలను తీసుకుని వెళ్లగలిగే సామర్థ్యంతో ఉండే దాదాపుగా 30 వరకూ సాయుధ ఎంక్యూ 9 బి సీగార్డియన్ డ్రోన్ల తయారీ... ఆయుధ, రక్షణ పాటవ అంశాలపై సహకారం, గ్రౌండ్ వెహికిల్స్ సహ నిర్మాణానికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉంది.

మోదీకి అరుదైన గౌరవం

ఆమెరికాలో స్టేట్ విజిటింగ్‌కు వెళ్లనున్న మూడో ఇండియన్ లీడర్‌గా ప్రధాని మోడీ నిలవనున్నారు. గతంలో 1963 జూన్‌లో నాటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, 2009 నవంబర్‌లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇలాంటి పర్యటనలకు వెళ్ళారు. అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో రెండుసార్లు ప్రసంగించిన మొదటి భారత ప్రధానిగా మోదీ నిలవనున్నారు. అధ్యక్షుడు బైడెన్‌, ప్రథమ మహిళ 21-గన్ సెల్యూట్‌తో స్వాగతం పలుకుతారు. ఈ పర్యటనలో వాషింగ్టన్‌లోని జాన్ ఎఫ్.కెన్నెడీ సెంటర్‌లో అమెరికా అగ్రశ్రేణి కంపెనీల చైర్‌పర్సన్స్, సీఈవోలతో ప్రధాని మోదీ సమావేశం అవుతారు. యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ జాయింట్‌ సెషన్‌లో ప్రసంగిస్తారు. ఇది ద్వైపాక్షిక సంబంధాల బలాన్ని సూచిస్తుంది. రక్షణ రంగ ఉత్పత్తుల అభివృద్ధి, తయారీలోని అన్ని అంశాలపైనా మోదీ, బైడెన్‌ల భేటీ దృష్టి సారించనుంది. ప్రస్తుతం ఉన్న దాని కంటే మరింత మెరుగైన పారిశ్రామిక వ్యవస్థలను ఏర్పాటు చేయడంలో సహకారంపై చర్చించనుంది. రక్షణ రంగంలో సరఫరా వ్యవస్థల మెరుగుదలపైనా భేటీ దృష్టి సారించనుంది. అమెరికాతో సంబంధాల్లో రక్షణ సహకారం అనేది కీలక స్తంభం లాంటిది. భారత్‌, అమెరికా రక్షణ బంధం సుదృఢమైనది. అందులో అన్ని అంశాలూ ఇమిడి ఉన్నాయి. ఇప్పటికే రెండు దేశాలు పలుమార్లు సైనిక విన్యాసాలను నిర్వహించాయి. సైనిక దళాల మధ్య సంబంధాలు పెరిగాయి.

అమెరికా కాంగ్రెస్‌లో మోడీ ప్రసంగం

ప్రధాని అగ్రరాజ్య పర్యటన భారత్ - అమెరికాల మధ్య రక్షణ ,శాస్త్ర సాంకేతిక రంగాలే కాకుండా వర్తక వాణిజ్యాలు విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో సాగుతుందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో అమెరికా కాంగ్రెస్ లో భారత ప్రధాని చేసే ప్రసంగం గూర్చి యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. ప్రపంచ శాంతి పర్యావరణ పరిరక్షణ, రక్షణ శాస్త్ర సాంకేతిక రంగాలలో పరస్పర సహకారం, సమాచార రంగంలో రానున్న కాలంలో వినియోగించే సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, విద్య వైద్య రంగాలలో పరిశోధనలు అలోచనలు, ఆవిష్కరణలు విజ్ఞాన మార్పిడి కృతిమ మేధస్సు వినియోగం వాటి సవాళ్ళు అంతరిక్ష రంగంలో పరస్పర సహకారం , ఉగ్రవాద నిర్మూలన, సేంద్రియ వ్యవసాయం, సాంస్కృతిక ఆంశాలే కాకుండా ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కోసం రాజీలేని బేషరతు మద్దతు కోరే అవకాశం లాంటి అనేక అంశాలు ప్రస్తావించాలి. ఈ వేదిక సాక్షిగా భారతదేశం రానున్న కాలంలో అన్ని రంగాలలో బలమైన ప్రబలమైన ప్రభావశాలిగా అభివృద్ధి పధంలో దూసుకుపోగలదన్న సందేశాన్ని వినిపించాలి. ఐక్యరాజ్యసమితిలో భారత దేశానికి శాశ్వత సభ్యత్వం ఇచ్చే విషయంలో సుముఖంగా వున్నట్లు ప్రకటనలకు మాత్రమే పరిమితమైన అమెరికా ఈ విషయంలో చిత్తశుద్ధి తో మెలిగి సహకరించాలి. ఆరమరికలు లేని , ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం కావడానికి మోదీ పర్యటన కారకం కావాలి.

శ్రీధర్ వాడవల్లి

99898 55445

Next Story

Most Viewed