పారిశ్రామికాభివృద్ధిపై పచ్చి అబద్ధాలు

by Disha edit |
పారిశ్రామికాభివృద్ధిపై పచ్చి అబద్ధాలు
X

హిందూ దిన పత్రికలో ప్రతిరోజు కనీసం 10 నుంచి 20 చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎస్ఎంఇ) మూసివేస్తున్నట్టు లేదా వేలం వేస్తున్నట్టు ప్రకటనలు కనిపిస్తాయి. ఒక్క హిందూ దినపత్రిక దక్షిణ భారత ఎడిషన్లో నెలకు 1000కి పైగా పరిశ్రమలకు ఉరితాడు వేస్తున్నట్టు బ్యాంకుల ప్రకటనలు కనిపిస్తాయి. ఇలా మొత్తం ఆంగ్ల పత్రికలలో ప్రకటనలు లెక్కిస్తే ఈ సంఖ్య 2000కి తక్కువ కాదు. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం సూక్ష్మ, మధ్య తరగతి పరిశ్రమల (ఎస్ఎంఇ)కు తాము అందిస్తున్న సహకారం చాలా ఉందని, బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఫోటోతో పూర్తి పేజీ ప్రకటనలతో అప్పుడప్పుడు దేశంలోని అన్ని భాషలలో గొప్పగా చెబుతుంటుంది. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు (ఎస్ఎంఇ) తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు గొప్ప అవకాశం అంబుడ్స్‌మెన్ (మధ్యవర్తి) ఈ తరహా విధానమని, తక్షణ పరిష్కారానికి వినియోగించుకోవాలని రిజర్వు బ్యాంకు తరఫున ప్రకటనలలో సారాంశంగా ఉంటుంది.

అయితే ఈ ప్రకటనలో వాగాడంబరం తప్ప చిన్న పరిశ్రమలు నెలకొల్పే వారికి ప్రోత్సాహకాలు ఏమీ లేవని తేలుతున్నది. నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చాక ఓ లెక్క ప్రకారం 60 లక్షల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూసివేతకు గురైనట్టు సమాచారం. పెద్ద నోట్ల రద్దు, కోవిడ్ కారణంగా ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది.

9 ఏళ్లలో.. రూ.13.50 లక్షల కోట్లు..

కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా వీరికి ఒరిగింది ఏమీ లేదు. స్వయం కృషి, పదిమందికి ఉపాధి కల్పించేందుకు ముందుకు వచ్చి పరిశ్రమలు స్థాపిస్తున్న వారికి ప్రోత్సాహం కరువవుతున్నది. ముఖ్యంగా బ్యాంకులు పెట్టిన నిబంధనలు సామాన్యులు ఎవరూ తట్టుకుని పరిశ్రమలు కొనసాగించేలా లేవు. సాధారణమైన పరిశ్రమల పరిస్థితి ఇలా ఉండగా కార్పొరేటు కంపెనీలకు అధిపతులుగా ఉన్న అదానీ, అంబానీ లాంటివాళ్లకు లక్షల కోట్ల రూపాయల రుణాలను ఉత్తి పుణ్యంగా రద్దు చేస్తున్నారు. 2018లో ఇక్రా అనే ఏజెన్సీ తయారు చేసిన గణాంకాల ప్రకారం 70 ఖాతాలకు చెందిన 3.80 లక్షల కోట్లు నిరర్ధక ఆస్తులుగా (ఎన్‌పీఏలు) మారిపోయాయని ఇందులో ప్రధానంగా విద్యుత్, ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్, టెలికాం రంగాలకు చెందినవని పేర్కొన్నారు. ఈ 70 ఖాతాలలో 34 ఖాతాలు ఎలక్ట్రిసిటీ రంగానికి చెందినవని ఆ నివేదికలో ఉంది. బ్యాంకులు తాము ఇచ్చిన రుణాలను ఆస్తులుగా పరిగణిస్తాయి. ఈ చెల్లింపులు నిబంధనల ప్రకారం 90 రోజులపాటు పూర్తిగా కానీ, పాక్షికంగా గానీ జరపకపోతే ఆ రుణాలను ఎన్‌‌పీఏలుగా పరిగణిస్తారు.

మోడీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి 2022 డిసెంబర్ నాటికి ప్రభుత్వ, ప్రయివేటు విదేశీ బ్యాంకులకు రూ.12,09,606 కోట్ల నష్టం వాటిల్లిందని గణాంకాలు చెబుతున్నాయి. రుణాల ఎగవేతదారులకు మోడీ పాలన స్వర్గధామంలా తయారైంది. స్వతంత్ర భారత చరిత్రలో బ్యాంకులకు ఇంత పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లిన దాఖలాలు లేవు, నష్టాల తీవ్రతను తగ్గించి చూపటానికి బ్యాంకుల విలీనం నాటకం ప్రారంభించారు. మోడీ హయాంలో బ్యాంకులకు బకాయిలు రూ. 67.66 లక్షల కోట్లకు చేరాయి. వీటిలో ప్రభుత్వరంగ బ్యాంకులవి రూ. 54.33 లక్షల కోట్లు, మిగిలినవి ప్రయివేటు, విదేశీ బ్యాంకులవి. వీటిలో ఇప్పటికే 12,10 లక్షల కోట్లను మొండి బకాయిలుగా ప్రకటించి రద్దు చేశారు. మోడీ అధికారంలోకి వచ్చాక గత 9 ఏళ్లలో రూ. 13,50 లక్షల కోట్ల రుణాలను రద్దు చేశారు. ఇలా గత ఐదేళ్లలో బ్యాంకులు మాఫీ చేసిన రుణాల మొత్తం రూ. 10.57 లక్షల కోట్లకు చేరిందని సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఆర్‌బీఐ సమాధానం చెప్పింది. గత పదేళ్లలో బ్యాంకులు రద్దు చేసిన మొండి బకాయిలు మొత్తం అక్షరాల రూ.15.5 లక్షల కోట్లు, గత మూడేళ్లలో బ్యాంకులకు బడా బాబులు ఎగవేసిన రుణాలు రూ.10.32 లక్షల కోట్లు.

పరిశ్రమలు పెట్టి చేతులు కాల్చుకుని..

ఆర్‌బీఐ సమాచారం ప్రకారం గడిచిన మూడేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ. 3,66,380 కోట్ల రూపాయలను అంటే 62.45 శాతం రుణాలను రద్దు చేశాయి. ఉద్దేశ్యపూర్వకంగా ఎగవేసిన వారి రుణాలను రద్దు చేస్తున్నారు. బాగుపడదామని, సమాజానికి ఏదో చేద్దామని ముందుకు వచ్చిన చిన్న, మధ్య తరహా పరిశ్రమల వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వరంగ బ్యాంకులకు వచ్చిన రూ.14,91,177 కోట్ల లాభాలను కేంద్ర ప్రభుత్వ వత్తిడితో కార్పొరేట్ కంపెనీలు కట్టాల్సిన మొండి బకాయిల స్థానంలోకి బ్యాంకులు తరలించాయి.

నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, నిషాంత్ మోడీ వంటి బడా గుజరాతి పారిశ్రామిక వేత్తలు పంజాబ్ నేషనల్ బ్యాంక్ దాని అనుబంధ సంస్థల నుంచి రూ.11,400 కోట్లు దోచుకున్నా ఎవరూ నోరు మెదపటం లేదు.. వీరందరూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సన్నిహితులే. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురాం రంగరాజన్ దేశంలో బడా బాబులు చెల్లించాల్సిన మొత్తం 28 లక్షల కోట్ల రూపాయలు మొండి బకాయిలుగా మిగిలిపోయి ఉన్నాయని గణాంకాలు వివరించారు. వీరందరూ దేశంలోని బడా పారిశ్రామికవేత్తలే! వీళ్లేకాక 5 వేల కోట్లు అంతకన్నా తక్కువ ఉన్నవాళ్లు అనేక మంది ఉన్నారు. ప్రజాధనంతో లావాదేవీలు జరిపే ఈ బ్యాంకులు బడా పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులతో బంధం ఉన్న వారికి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎలా ఇస్తున్నారు? వాటిని వసూళ్ళు చేయలేక, కనీసం వారిని ప్రశ్నించటం కూడా చేతకాక ప్రజాధనాన్ని ప్రభుత్వం ఎలా మాఫీ చేస్తున్నది?

సామాన్యుల విషయంలో బ్యాంకులు ప్రవర్తించే తీరు ఇలానే ఉంటుందా? ముమ్మాటికీ కాదు! రైతులు, కిరాణా వ్యాపారస్తులు, చిన్న పారిశ్రామిక వేత్తలు తాము చెల్లించాల్సిన వాయిదాలు (కిస్తీలు) సక్రమంగా లేకపోతే విరుచుకుపడే బ్యాంకులు ఎందుకు నోరు మెదపలేకపోతున్నాయి. ఇదంతా నాణేనికి ఒకవైపు. మరోవైపు ఎలా ఉందో చూద్దాం. ఏదో ఉద్దరిద్దామని చిన్నా చితకా పరిశ్రమలు పెట్టి చేతులు కాల్చుకుని ఆ సంక్షోభ చట్రం నుంచి బయటపడలేక అల్లాడిపోతున్న జీవితాలు లక్షల సంఖ్యలో ఉన్నాయి. భర్త తీసుకున్న రుణం భర్త చనిపోయిన తర్వాత భార్య చెల్లించలేకపోతే బ్యాంకులు పెడుతున్న ఇబ్బందులు, తాత, ముత్తాతలు తీసుకున్న రుణానికి మనమళ్లు, వారి ముని మనవళ్లు కోర్టుల చుట్టూ తిరుగుతూ మానసిక క్షోభకు గురవుతున్న ఘటనలు కోకొల్లలు. కాఫీ డే సంస్థకు అంతర్జాతీయ ప్రతిష్టను ఆర్జించి పెట్టిన విజి సిద్ధార్థ హెగ్దే తన బలవన్మరణానికి కారణం తీవ్రమైన వత్తిడి, బ్యూరోక్రసీ వేధింపులే కారణమని లేఖ రాసినా, ఇప్పటివరకూ ఎలాంటి చర్యలూ లేవు.

బ్యాంకులపైనే పోరాటం చేస్తూ..

అలాగే తిరుపతికి చెందిన ఓవి రమణ అనే మధ్యతరహా పారిశ్రామిక వేత్త చెయ్యని నేరానికి ఫ్యాక్టరీని, ఎంతో ప్రేమతో కట్టుకున్న ఇంటిని, ఆస్తులను పోగొట్టుకుని బ్యాంకులపై చేస్తున్న పోరాటం ఎంతో ఆశ్చర్యాన్ని, ఆసక్తిని కలిగిస్తుంది. ఆయన నితిన్ ఫుడ్స్ అనే పరిశ్రమను చిత్తురు దగ్గర స్థాపించి 12 రకాల ఉత్పత్తులు తయారు చేసి అమ్మేవాడు. కానీ వీటిని రిలయన్స్ వంటి కార్పొరేట్ శక్తులు నిర్వహించే సూపర్ మార్కెట్లలో ప్రదర్శనకు ఉంచాలంటే రూ.50 వేలు కనీసంగా చెల్లించాలి. పైగా వారు ముందుగానే డబ్బులు చెల్లించి తీసుకోరు. అమ్ముడయిన వాటికి తమకు వచ్చినప్పుడు డబ్బులు చెల్లిస్తారు. కానీ 90 రోజులలో వాయిదాలు చెల్లించకుంటే బ్యాంకు ఎన్‌పీఏలుగా ప్రకటిస్తుంది. తగినంత స్టాకు చూపకపోయినా ఇంతే. పరిశ్రమ విస్తరణకు తెచ్చిన యంత్రాలకు కనీసం నీలు కూడా విప్పక ముందే ఆయన ఎంతో ఆశయంతో నిర్మించుకున్న పరిశ్రమను నిరర్ధక ఆస్తిగా ప్రకటించారని, 70 కోట్లు ఖర్చుతో, 300 మంది ఉద్యోగులతో ప్రారంభించిన పరిశ్రమను మూసివేశారని, నేను ఎంతో అపురూపంగా తిరుపతి నగరంలో నిర్మించుకున్న ఇంటిని రెండు గంటల వ్యవధిలో ఖాళీ చేయించి కట్టు బట్టలతో బయటకు పంపి సీలు వేశారని వాపోయాడు. నేను ఏ వ్యాపారం చేయకుండా, ఏ అకౌంటు నిర్వహించకుండా, ఆఖరుకు కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెడుతూ వారి ఆస్తులను అటాచ్ చేసుకుంటామని నోటీసులు ఇస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారని వివరించారు. 30 ఏళ్లు ఉత్తమ ఖాతాదారుడిగా ఉన్న తాను లోను తీసుకున్న 6 నెలలకే ఎగవేతదారుడిగా మారిపోతానా? కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమే దీనికి కారణమంటాడు. 2019లో మోడీ ప్రకటించిన ఎన్‌సీఎల్‌టీ పథకం కూడా అందులో భాగమేనని, అంబుడ్స్‌మెన్ పథకం వట్టి బూటకమని ఏ ఒక్కరి సమస్యను పరిష్కరించలేదని ఆయన విమర్శిస్తారు.

వాస్తవానికి నేను డీఫాల్టర్ కాదు. కానీ నా ఆస్తిని నిరర్ధక ఆస్తిగా ప్రకటించారు. దీనిపై హైకోర్టుకు వెళితే కోర్టు, బ్యాంకు వ్యవహరించిన తీరు సరైంది కాదని తక్షణం పరిశ్రమను తెరిపించాలని ఆదేశించినా, బ్యాంకు వారు పట్టించుకోలేదు. దీనిపై కోర్టు ధిక్కారం కేసు వేస్తే బెంబేలెత్తిన యాజమాన్యం చర్చిద్దామంటే ధిక్కార పిటిషన్ను వెనక్కు ఉపసంహరించుకున్నానని, తీరా ఉపసంహరించుకున్నాక బ్యాంక్ మోసపూరితంగా ప్రవర్తించింది. దీనిపై 2016 సంవత్సరం నుండి కొట్లాడుతున్నానని, నాలాగే రోజుకు 1000 మంది ఇలాంటి ఇబ్బందులకు గురవుతున్నారని కానీ వీరి సమస్యలను పాలకులు పట్టించుకోవటం లేదని ఓవి రమణ విమర్శిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అందరిలా తాను ఉండకూడదని భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బ్యాంక్ అధికారుల తీరును నిశితంగా కోర్టులకు వివరించానని, వారిపై ఎదురు కేసులు పెట్టాననీ, ప్రస్తుతం బ్యాంకు యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ అయిందని, ఇది దేశ చరిత్రలో మొదటి కేసుగా ఆయన అభివర్ణించారు. బాధితుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు బ్యాంకులు పాల్పడ్డాయని తనలాంటి వాళ్లపై సాగుతున్న బ్యాంకుల దాష్టీకాలపై న్యాయం జరిగేంత వరకు తన పోరు సాగుతుందని ఓవి రమణ ప్రకటించారు.

- కందారపు మురళి

సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు, తిరుపతి

94900 98840

Next Story

Most Viewed