చింతలు తీర్చని చింతన్ శిబిర్!

by D.Markandeya |
చింతలు తీర్చని చింతన్ శిబిర్!
X

ష్టాల కడలిలో జీవన్మరణ పోరాటం చేస్తున్న భారత జాతీయ కాంగ్రెస్ గట్టెక్కే మార్గాలను వెతకడానికి ఇటీవల రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మూడు రోజుల 'నవ సంకల్ప్ చింతన్ శిబిర్‌' నిర్వహించింది. నాయకత్వపరంగా, సంస్థాగతంగా, రాజకీయంగా పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలపై మేధోమథనం జరిపింది. చివరిరోజు ఉదయ్‌పూర్ డిక్లరేషన్ పేరిట కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. పార్టీ పునరుజ్జీవం కోసం పైనుంచి కింది స్థాయి వరకు సంస్థాగత సంస్కరణలు చేపట్టడానికి ఒక టాస్క్‌‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని తలపెట్టింది. రాజకీయ వ్యవహారాలపై సలహాలు, సూచనలు ఇవ్వడానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుల నుంచి పొలిటికల్ అఫేర్స్ కమిటీని ఏర్పాటుచేయాలని నిశ్చయించింది.

కుటుంబ రాజకీయాలకు చెక్ పెట్టే ఉద్దేశంతో ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్ నియమాన్ని ప్రవేశపెట్టబోతోంది. కొత్తవాళ్లకు చోటు కల్పించేందుకు అన్ని కమిటీల పదవులకు ఐదేళ్ల కాలపరిమితిని విధించాలని, యువతకు ప్రాధాన్యం ఇచ్చేందుకు యాభై శాతం పదవులను యాభై ఏళ్లలోపు వారికి కేటాయించాలని నిర్ణయించింది. క్రిందిస్థాయిలో మరికొందరు నేతలను తయారుచేసుకునేందుకు బూత్-బ్లాక్ కమిటీల మధ్యలో మండల్ కమిటీలను ఏర్పరచాలని, అన్ని స్థాయిల కమిటీలకు ప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నికలు జరపాలని తీర్మానించింది. ప్రజల నాడిని పసిగట్టేందుకు, ఎలక్షన్ మేనేజ్మెంట్‌కు, కార్యకర్తల శిక్షణకు వేర్వేరు యంత్రాంగాలను ఏర్పాటుచేయాలని అనుకుంటోంది. దేశవ్యాప్తంగా ప్రజలతో మమేకం కావడానికి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 'భారత్ జోడో' యాత్రను చేపట్టాలని, ఇందులో రాహుల్‌గాంధీ సైతం పాల్గొనాలని నొక్కిచెప్పింది. భావసారూప్యత కలిగిన అన్ని పార్టీలతో పొత్తులకు సిద్ధమని ప్రకటించింది.

డిక్లరేషన్ మీద విమర్శలు

అయితే, ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ పట్ల దేశం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు సమస్యలను దాటవేసి కొసరు సమస్యలను చర్చించారని మేధావులు, రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు కావాల్సింది నరేంద్ర మోడీకి దీటుగా పోటీ పడగల జనాకర్షణ, వ్యూహచతురత కలిగిన సమర్థ నాయకుడని, ఆ విషయాన్ని వదిలేసి సంస్థాగతంగా ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం శూన్యమని అంటున్నారు. నాయకత్వం విషయంలో ఈ చింతన్ శిబిర్ మరింత గందరగోళం క్రియేట్ చేసిందని అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న సోనియాగాంధీనా, శ్రేణులకు మార్గనిర్దేశనం చేస్తూ ముగింపు ఉపన్యాసం ఇచ్చిన రాహుల్‌గాంధీనా ఎవరు భవిష్యత్తులో పార్టీని లీడ్ చేస్తారన్న విషయంలో సీడబ్ల్యూసీ నుంచి కిందిస్థాయి నేతల వరకు ఎవరికీ స్పష్టత లేదని చెబుతున్నారు. వచ్చే రెండు నెలల్లో అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని షెడ్యూలు ప్రకటించినా, నిర్ణీత సమయానికి పూర్తి కావడం డౌటేనంటున్నారు. ఒకవేళ రాహుల్‌నే ప్రెసిడెంటుగా ప్రకటించినా, సోనియా జోక్యం లేకుండా పార్టీ వ్యవహారాలు నడవడం అసాధ్యమని, ప్రియాంకతో కలుపుకుని పార్టీలో మూడు పవర్ సెంటర్‌లు ఖాయమని బల్లగుద్ది చెబుతున్నారు.

ప్రత్యామ్నాయ నేతలు ఏరీ?

ప్రస్తుతం కాంగ్రెస్‌కు కావాల్సింది అధ్యక్ష స్థానంలో అన్ని రకాల సమర్థతలు కలిగిన ఒక బలమైన నేత. బూత్ స్థాయి నుంచి శ్రేణులలో కొత్త ఉత్సాహాన్ని నింపి 2024 సాధారణ ఎన్నికల కోసం పార్టీని రాజకీయంగా, నిర్మాణపరంగా సన్నద్ధం చేసే వ్యక్తి. ఈ విషయంపై చర్చించి ఒక నిర్ణయానికి రావడంలో చింతన్ శిబిర్ ఘోరంగా విఫలమైంది. గాంధీ కుటుంబం నుంచే కావాలనుకుంటే ఆ పార్టీకి మూడు ఆప్షన్లున్నాయి. సోనియా మొదటి చాయిస్ అనుకుంటే ఆమెకు వయస్సు, అనారోగ్యం రీత్యా పరిమితులున్నాయి. తాత్కాలిక ఏర్పాటుకు మాత్రమే పనికివస్తారు. రెండవ చాయిస్ రాహుల్ ఇప్పటికే ఒకసారి అధ్యక్ష బాధ్యతలను చేపట్టి ఎన్నికలలో ఓటమికి గురి కాగానే యుద్ధరంగానికి వెన్నుచూపి పారిపోయారు. తిరిగి మరోసారి యాక్టివ్ అయినట్లు కనిపిస్తున్నా, పగ్గాలు చేపట్టడానికి తాను పూర్తి సిద్ధంగా ఉన్నానని స్పష్టంగా చెప్పే స్థితిలో లేరు.

ఇక, ప్రియాంకను తెరపైకి తెద్దామన్న వాదన.. ఇటీవలి యూపీ ఎన్నికలలో పార్టీ అవమానకర ప్రదర్శన నేపథ్యంలో సులువుగా వీగిపోతుంది. గాంధీ కుటుంబానికి ఆవలి వ్యక్తిని గద్దెపై కూర్చోబెట్టాలన్న జీ-23 నేతల డిమాండును పరిశీలిద్దామన్నా మల్లికార్జున ఖర్గే తప్ప మరెవరూ కనిపించరు. దిగ్విజయ్‌సింగ్, ఏకే అంటోనీ, గులాం నబీ ఆజాద్‌ ఉన్నా వారి వయస్సు చాలా ఎక్కువ. పైగా వీరెవరికీ దేశవ్యాప్త పేరు ప్రతిష్టలు లేవు. ఈ పరిస్థితులలో కావాలనే ఈ అంశాన్ని శిబిర్‌లో చర్చించలేదనిపిస్తుంది.

అన్నీ కాపీ తీర్మానాలేనా?

చింతన్ శిబిర్ తీర్మానాలపై ప్రశాంత్ కిశోర్@పీకే ముద్ర ఉందన్నది మరో వివాదాస్పద అంశం. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ పేరిట విడుదల చేసిన తీర్మానాలలో మెజారిటీ గత నెలలో సోనియాగాంధీ సమక్షంలో పీకే ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లోని అంశాలేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాయకత్వ సంక్షోభాన్ని వెంటనే పరిష్కరించుకోవాలన్న సలహా తప్ప సంస్థాగత సంస్కరణలకు ఉన్నత స్థాయి కమిటీ వేయాలనడం, ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్ ఇవ్వాలనడం నుంచి భారత్ జోడో పాదయాత్ర, భావసారూప్యత కలిగిన పార్టీలతో మైత్రి వరకూ అన్ని సూచనలనూ ఆయన బ్లూప్రింట్ నుంచే కాపీ కొట్టారని అంటున్నారు. చివరకు, పార్టీ షరతులు ఆయనకు నచ్చకపోవడమో, ఆయన వైఖరి పార్టీకి నచ్చకపోవడమో జరిగి పీకే కాంగ్రెస్‌లో చేరలేదని, ఈ ప్రక్రియలో కోల్పోయిన పరువును తిరిగి రాబట్టుకునేందుకే నవ సంకల్స్ పేరిట మేధోమథనాన్ని ప్లాన్ చేశారన్న వాళ్లూ లేకపోలేదు.

చిత్తశుద్ధితో అమలైతేనే

ఈ విషయాలను వదిలేస్తే, శిబిర్‌లో తీసుకున్న నిర్ణయాలను చిత్తశుద్ధితో అమలు చేసిన పక్షంలో వచ్చే రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ దశ, దిశ మారనుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలలో కొనసాగుతున్న అంతర్గత కుమ్ములాటలు, సీనియర్ల మంకుపట్లు, యువనేతల కొరత, శ్రేణులలో నెలకొన్న నిస్తేజం, ఈ నిర్ణయాల అమలులో అడ్డు నిలువడం ఖాయంగా కనిపిస్తోంది. ఉదాహరణకు ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్ అన్న తీర్మానానికి ఆ వెంటనే, రెండవ వ్యక్తి పార్టీలో ఐదేళ్లు పనిచేసి వుంటే ఓకే అన్న సవరణను చేర్చాల్సివచ్చింది. గాంధీ కుటుంబమే మొదటి అడ్డంకిగా మారింది.

ఒక వ్యక్తికి ఒకే పదవి, ఏ పదవికైనా ఐదేళ్ల కాలపరిమితి, యాభై శాతం పదవులు యాభై ఏళ్ల లోపు వారికి వంటి సంస్థాగత సంస్కరణల మూలంగా పదవులు కోల్పోయే సీనియర్, జూనియర్ నేతలందరూ అసంతృప్తికి గురికావడం, తిరుగుబాటు చేయడం, పార్టీ ఫిరాయించడం ఖాయమని చెప్పవచ్చు. ఆయా జిల్లాలలో, నియోజకవర్గాలలో పేరూ పలుకుబడి కలిగినవాళ్లు ఈ కోటాలో ఉన్నప్పుడు పీసీసీ చీఫ్‌లు కఠిన నిర్ణయాలు తీసుకోవడం కష్టం కావచ్చు కూడా. క్రమశిక్షణారాహిత్యానికి, అంతర్గత తగువులాటలకు మారు పేరైన కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలు ఎలా అమలవుతాయో మనందరికీ బాగా తెలుసు.

అలా చేయగలరా మరి!

ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో, హోం మంత్రి అమిత్ షా వ్యూహాలతో, అధ్యక్షుడు నడ్డా సారథ్యంలో బీజేపీ దేశమంతటా దూసుకుపోతోంది. ఎనిమిదేళ్ల పాలనలో మూటగట్టుకున్న ప్రభుత్వ వ్యతిరేకతను హిందూత్వ నినాదాలతో, ఆర్ఎస్ఎస్ దన్నుతో సమర్థంగా ఎదుర్కొంటోంది. ఓడిపోతుందన్న యూపీలో డబుల్ ఇంజన్ బలంతో భారీ మెజారిటీ సాధించి అందరి అంచనాలనూ తలకిందులు చేసింది. తనదైన మందీ మార్బలంతో నవతరం వేదికైన సోషల్ మీడియాపై పట్టు సాధించింది.ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో బీజేపీ శ్రేణులు మంచి జోష్ మీదున్నాయి.

ఈ పరిస్థితులలో తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందాలంటే కాంగ్రెస్ పార్టీకి 'అల్లావుద్దీన్ అద్భుతదీపం'లాంటిది ఏదో దొరకాలి. దేశవ్యాప్తంగా కమలనాథులతో నేరుగా తలపడే 150-200 లోక్‌సభ సీట్లలో 100కు పైగా గెలవాలి. ప్రాంతీయ పార్టీలతో సత్సంబంధాలు నెరపుతూ యూపీఏను పటిష్టం చేసుకోవాలి. థర్డ్ ఫ్రంట్ కలలు కంటున్న మమత, పవార్, కేసీఆర్ వంటి రీజనల్ సత్రప్‌ల ఆకాంక్షలను అధిగమించాలి. అప్పుడే ఢిల్లీ గద్దెను వశం చేసుకోవచ్చు.

చివరగా,

ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ నాయకుడు కేపీ సింగ్‌దేవ్ చేసిన ఓ ఆసక్తికర వ్యాఖ్యను ఇక్కడ ప్రస్తావించాలి. చింతన్ శిబిర్‌ను ఆయన పురాణగాథలో దేవతలు, రాక్షసులు కలిసి చేసిన సాగరమథనంతో పోల్చారు. ఈ మథనంలో వెలువడే విషాన్ని తమ సీనియర్ నేతలు స్వీకరిస్తారని, అమృతాన్ని పార్టీ శ్రేణులకు అందిస్తారని అన్నారు. ఆ అమృతాన్ని సేవించిన పార్టీ కొత్త జవసత్వాలు సంతరించుకుని వచ్చే ఎన్నికలలో కేంద్రంలో అధికారం చేపట్టడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఒకవేళ ఆయన చెప్పింది తలకిందులై, సీనియర్ నాయక గణమే అమృతాన్ని స్వీకరించి, శ్రేణులకు విషాన్ని విరజిమ్మితేనో?-డి మార్కండేయ

[email protected]

We are Hiring SEO Executive for Telugu News website.
For more details Click here
Send us your resume to:[email protected] / Whatsapp 8886424242

Next Story

Most Viewed