మరో కోణం: దృష్టి మళ్లింపు వ్యూహం!

by D.Markandeya |
మరో కోణం: దృష్టి మళ్లింపు వ్యూహం!
X

కేసీఆర్ కొత్త పార్టీపై రాష్ట్రంలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. దేశ్ కీ నేతా కేసీఆర్.. అంటూ టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే, ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఆయన పార్టీ చేసేదేముండదని కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీలు విమర్శించాయి. ఇప్పటికే అధికార పార్టీ వెనుక చేరిన సీపీఐ, సీపీఎం మాత్రమే స్వాగతించాయి. కాగా, ఢిల్లీ స్థాయిలో కొత్త పార్టీ ప్రకటనపై స్పందన కరువైంది. దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ రాకను ఎవరూ పెద్దగా పట్టించుకోనేలేదు.

ప్రత్యేక రాష్ట్ర సాధనకై టీఆర్ఎస్‌ను స్థాపించి, లక్ష్యం నెరవేరగానే దానిని ఫక్తు రాజకీయ పార్టీగా మార్చిన కేసీఆర్ ఇప్పుడు జాతీయ పార్టీని ఎందుకు ఏర్పాటు చేసినట్లు? 17 సీట్లున్న తెలంగాణ నుంచి ఎన్ని సీట్లు గెలుస్తామో స్పష్టత లేని స్థితిలో దేశ రాజకీయాల్లోకి ఏ బలంతో వెళుతున్నట్లు? పార్టీ లెఫ్టా? రైటా? లేక మధ్యస్థమా? అసలు ఆయన పార్టీ సిద్ధాంతమేమిటి? చేరేదెవరు? కలిసివచ్చేదెవరు? అన్నీ ప్రశ్నలే.

వాస్తవమేమంటే, మొదటిసారి సెంటిమెంటుతో, రెండవసారి సంక్షేమ పథకాల వలతో గెలిచిన కేసీఆర్ అమ్ములపొదిలో ఇప్పుడు అస్త్రాలేమీ లేవు. అబ్బురపరిచే వార్త చెప్పడానికి అప్పుల ఖజానా మాత్రమే మిగిలింది. రెండు దఫాల పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేసీఆర్ ప్రజలకు ఇచ్చిందానికన్నా, ఆయన కుటుంబం తిన్నదే ఎక్కువన్న భావన రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తోంది. ధరణి వైఫల్యంతో రైతాంగంలో అసంతృప్తి రాజుకుంది. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు నిప్పులై మండుతున్నారు. పెన్షన్లు వంటి వివిధ ప్రయోజనాలు పొందుతున్న వాళ్లు సైతం 'ఆయనేమన్నా ఇంటి నుంచి తెస్తున్నాడా' అంటున్నారు.

హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓటమి తర్వాత పీకే టీంతో, ఇంటెలిజెన్స్ వర్గాలతో చేయించుకున్న పలు సర్వేల్లో టీఆర్ఎస్ ఈసారి ఓటమి దిశగా పయనిస్తున్నట్లు కేసీఆర్‌కు అర్థమైంది. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత క్రమంగా ప్రబలుతోందని ఆయన గ్రహించారు. సడెన్‌గా తన వ్యూహాన్ని మార్చారు. తెలంగాణ ప్రజల దృష్టి మళ్లింపు ఎత్తుగడలను ముందుకు తెచ్చారు. కమలదళంపై యుద్ధ ప్రకటన చేసి కొత్త జాతీయ పార్టీ ఏర్పాటుకు ఉపక్రమించారు. మోడీ విధానాలను దునుమాడడం ద్వారా టీఆర్ఎస్ పాలనపై వ్యతిరేకతను బీజేపీ పైకి తిప్పడానికి యత్నిస్తున్నారు. జాతీయ పార్టీ స్థాపనతో ప్రజల్లో కొత్త ఆశలను చిగురింపజేయ చూస్తున్నారు. బంగారు తెలంగాణ కలను సాకారం చేసిన తాను ఇక స్వర్ణ భారత్ సాధనకు బయలుదేరానని, ఆశీర్వదించాలని ఓటర్లను గారడి చేయబోతున్నారు.

బీఆర్ఎస్‌గా పేరు మార్చుకున్న టీఆర్ఎస్ ఆచరణలో సాధించగలిగేది నామమాత్రపు ఫలితాలే. ఇప్పటికే ఈ దారిలో నడిచి జాతీయ పార్టీలుగా మారిన ఆల్ ఇండియా అన్నా డీఎంకే, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్‌ల లాగే ఈ పార్టీ కూడా పేరుకు జాతీయ పార్టీగా కొనసాగగలదేమో కానీ వాస్తవ అర్థంలో గుర్తింపు మాత్రం పొందలేదు. మహా అయితే తెలంగాణ, తెలుగు ఓటర్లున్న ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోని కొన్ని స్థానాల్లో ఉనికిని చాటుకునే అవకాశముంది. ఆ పార్టీల్లాగానే జాతీయస్థాయిలో ఏదో ఒక కూటమిలో చేరడమో, కొత్త ఫ్రంట్ కోసం ప్రయత్నించడమో చేయగలదు.

కాంగ్రెసేతర-బీజేపీయేతర ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించడం ద్వారా అంతిమంగా కేసీఆర్ యూపీఏను, కాంగ్రెస్‌ను మాత్రమే నష్టపర్చే అవకాశముంది. ప్రస్తుతం ఆయన టచ్ లో ఉన్న నేతలందరూ బీజేపీ వ్యతిరేకులై ఉండడమే ఇందుకు సాక్ష్యం. అప్రతిహతంగా కొనసాగుతున్న మోడీ పాలనకు ప్రత్యామ్నాయమే కరువైన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిపక్షాల ఐక్యత కోసం, బీజేపీ వ్యతిరేక కూటమి కోసం ప్రయత్నించాల్సింది పోయి, తద్విరుద్ధంగా చర్యలు చేపడుతున్న కేసీఆర్ ఎవరికి మేలు చేస్తున్నట్టు?

కొత్త పార్టీ ప్రణాళిక ఏమిటో, రాజకీయ ఎజెండా ఏమిటో, ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహించాల్సిన కర్తవ్యమేమిటో కేసీఆర్ వెంటనే ప్రజల ముందుంచాలి. మోడీని గద్దె దింపేందుకు, ప్రతిపక్షాలను ఒక్కటి చేయడానికి ఏం చేస్తారో తెలియజెప్పాలి. రేపటి సాధారణ ఎన్నికల తర్వాత తాను ఎన్డీయేలో చేరబోనని, బీజేపీకి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ సహకరించనని స్పష్టంగా ప్రకటించాలి. లేదంటే ఆయన చిత్తశుద్ధిని శంకించక తప్పదు.


- డి. మార్కండేయ

[email protected]
Next Story

Most Viewed