కల్లలవుతున్న సొంతింటి కలలు 'మహా వీరుడు' రివ్యూ..

by Vinod kumar |
కల్లలవుతున్న సొంతింటి కలలు మహా వీరుడు రివ్యూ..
X

జీవితమంతా కష్టపడినా సొంత ఇల్లు సంపాదించుకోలేక మనిషి పడే పాట్లు మన దేశంలో ఇంతింతా కాదు. రిటైరైన తర్వాత కూడా ఉండటానికి ఒక గూడు మిగుల్చుకోలేని జీవితాలు ఈ 2023 సంవత్సరంలో కూడా ఇండియా అనబడే భారత్‌లో కనిపించడం పరమ దౌర్భాగ్యం. డబుల్ బెడ్ రూముల కోసం దందా ఏ స్థాయిలో జరుగుతోందో, ప్రభుత్వాలు ఇళ్ల నిర్మాణంలో చెబుతున్న లెక్కలు కాకిలెక్కలుగా ఎలా మారిపోతున్నాయో మనందరికీ తెలిసిందే. నిరుపేదలు, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలలు ఎలా కల్లలవుతున్నాయో చూపించడానికి తమిళ దర్శకుడు మడోన్ అశ్విన్ చేసిన సినిమాటిక్ ప్రయత్నమే మహా వీరుడు (మావీరన్) సినిమా. తీరా ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇళ్లు కూడా ఎంత నాసిరకంగా ఉంటున్నాయంటే వాటిలో చేరిన రోజునుంచి ఎక్కడ పెచ్చులూడి మీద పడతాయనే భయంతో బతకడం ఆ ఇళ్లలో చేరిన వారికి అలవాటుగా మారిపోయింది. ప్రజల జీవితాలను నిత్యం బద్నాం చేస్తున్న సీరియస్ సమస్యకు కామెడీని జోడించి తీసినప్పటికీ సక్సెస్‌లో వెనుకబడని సినిమా మహా వీరుడు.


'మహా వీరుడు' ఒక కామిక్ స్ట్రిప్ సిరీస్‌తో ప్రారంభమవుతుంది, ఇక్కడ హీరో శిథిల భవనం నుండి యువరాణి (తమిళంలో ఇళవరసి)ని రక్షించాడు. మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ వన్ లైనర్ సినిమాలో సత్య (శివకార్తికేయన్) ఒక మురికివాడలో నివసించే కామిక్ స్ట్రిప్ ఆర్టిస్ట్. స్థానిక సంస్థ మంత్రి జయకోడి (మిస్కిన్) హౌసింగ్ బోర్డును నిర్మించి మురికివాడలో నివసించే ప్రజలను వేరే ప్రాంతాలకు మారుస్తాడు. అయినప్పటికీ, అపార్ట్మెంట్ పేలవంగా నిర్మించడమే కాదు.. అన్ని నిబంధనలను ఉల్లంఘించారు. మన దేశంలో సాగుతున్న భవన నిర్మాణాల్లో కాంట్రాక్టర్లు, రాజకీయ నేతల నిలువుదోపిడి ఏ స్థాయిలో జరుగుతోందో రియలిస్టిక్‌గా చెప్పిన పూర్తి ఎంటర్‌టైనర్ మహా వీరుడు. అవినీతి, పేదరికం, చిల్లర రాజకీయాలు వంటి ప్రబలమైన సమస్యలను ఈ సినిమా ముందుకు తెస్తుంది. కానీ, ప్రజలు తమ ప్రాథమిక హక్కుల కోసం ఎలా తిరుగుబాటు చేయాల్సి వస్తుందో కూడా చూడటానికి ఈ సినిమా ఒక క్యారెక్టర్ స్టడీగా పనికొస్తుంది.

కథేమిటంటే..

సత్య(శివకార్తికేయన్‌) ఓ కార్టూనిస్ట్‌. మహావీరుడు పేరుతో కామిక్ కథలు రాస్తుంటాడు. నిజ జీవితంలో భయస్తుడు. కానీ తన కథలు మాత్రం సమాజం కోసం పోరాడే ఓ మహావీరుడి గురించే ఉంటాయి. తను ఉండే స్లమ్‌ ఏరియా నుంచి అందరిని వేరే ప్రాంతానికి తరలిస్తుంది ప్రభుత్వం. ఆ ఏరియా ప్రజలందరికి ఓ అపార్ట్‌మెంట్‌కి తరలిస్తారు. మంత్రి ఎమ్‌ ఎమ్‌ సూర్య(మిస్కిన్‌) మనుషులు నాసిరకం సిమెంట్‌తో ఆ అపార్ట్‌మెంట్‌ని నిర్మిస్తారు.పైకి అందంగా, అద్భుతంగా కనిపించినప్పటికీ.. ఇంట్లోకి వెళ్లిన తొలిరోజు నుంచి కిటికీలు పడిపోవడం, గోడలకు పగుళ్లు రావడం జరుగుతుంటాయి. ఇదేంటని ప్రశ్నిస్తే మంత్రి మనుషులు బెదిరిస్తారు. తన తల్లిని, సోదరిని అవమానించినా..సత్య ఎదురు తిరగడు. అయితే ఓ సందర్భంలో చనిపోవాలని అపార్ట్‌మెంట్‌ పైకి దూకేందుకు ప్రయత్నిస్తాడు సత్య. దెబ్బలు తగిలినా ప్రాణాలతో బయటపడతాడు. అప్పటి నుంచి అతనికి మాత్రమే ఓ అజ్ఞాత వ్యక్తి వాయిస్‌ వినిస్తుంది. అతను సత్యని ఓ మహావీరుడిగా, మంత్రి సూర్యని యముడిగా వర్ణిస్తుంటాడు. అంతేకాదు మంత్రి నాసిరకంగా కట్టించిన ప్రజా భవనం కూలిపోతుందనే విషయాన్ని ఆ గొంతు అతనికి తెలియజేస్తుంది.

అప్పుడు సత్య ఏం చేశాడు, ఆ అజ్ఞాత గొంతు కారణంగా సత్య జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, అతని ప్రయాణంలో జర్నలిస్ట్‌ చంద్ర(అదితి శంకర్‌) పాత్ర ఏంటి, చివరకు మంత్రిని ఎదురించి ప్రజల ప్రాణాలను ఎలా కాపాడాడు అనేదే ‘మహావీరుడు’ కథ. ఎలా ఉందంటే..ఓ రాజకీయ నాయకుడు ప్రజలను మోసం చేయడం.. హీరో వారికి అండగా నిలిచి, ఆ రాజకీయ నాయకుడి అవినీతిని భయటపెట్టడం, ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడడం.. ఇలాంటి కాన్సెప్ట్‌తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. మహావీరుడు కథ కూడా ఇదే. కానీ ఇక్కడ హీరో భయస్తుడు. ఓ పిరికివాడు ప్రజల కోసం ఎలా ధైర్యవంతుడిగా మారాడనేదే ఈ మూవీ కథ. ఇదంతా సీరియస్‌ కాకుండా.. సెటిల్డ్‌ కామెడీతో ఎంటర్‌టైన్‌గా సాగుతుంది. 'మహావీరుడు' మిమ్మల్ని ఆస్వాదింపజేస్తూనే పునరాలోచన చేసేలా మలిచిన మరో సాలిడ్ ఎంటర్‌టైనర్.

కామెడీ పీస్.. కాని పొలిటికల్ సెటైర్..

యోగి బాబు నటించిన 'మండేలా' చిత్రంతో ఫిల్మ్ మేకర్‌గా అరంగేట్రం చేసిన మడోన్ అశ్విన్ తీసిన రెండవ చిత్రం మావీరన్. ఆద్యంతం కామెడీ పీస్‌గా కనిపిస్తూనే ఫక్తు పొలిటికల్ సెటైర్‌గా తెరకెక్కిన సినిమా ఇది. చెన్నైలోని కొడంబాక్కం ప్రాంతంలో ఓవర్ బ్రిడ్జ్ పక్కనే పాతికేళ్ల క్రితం ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు కట్టించిన బహుళ ప్లాట్‌ల సముదాయం అప్పట్లో సంచలనానికి దారితీసింది. పేదవర్గాలకు ఇంత భారీ అపార్ట్‌మెంట్లలో ఇళ్లు కట్టించడం అనేది అంతకుముందెన్నడూ జరగకపోవడమే నాటి సంచలనానికి కారణం. కానీ పైకి ఎంత ఆడంబరంగా, డాంబికంగా కనిపించినప్పటికీ లోపల మాత్రం డొల్లగా నే ఉంటుందనేది అందరికీ తెలిసిందే. అలా పేద, వెనుకబడిన వర్గాలకోసం నిర్మించిన ఇళ్లు వాటిలో నివసించడానికి వచ్చిన వారి కళ్లముందే పెచ్చులు ఊడిపోవడంతో భయభ్రాంతులకు గురవుతారు. వాటి రిపేర్లు కూడా నాసిరకంగానే కనిపించి ఎవరైనా నిలదీసి అడిగితే స్థానికి రాజకీయ నేతలు ఎంత దౌష్ట్యానికి పాల్పడతారో తెలిసిందే. ఈ నేపథ్యంలో అతి భయస్తుడైన హీరోకి ఆ అపార్ట్‌మెంట్లు కూలిపోతాయని ఒక అజ్ఞాత గొంతు వివరిస్తుంది. హీరో ఆ స్వరం సహాయంతో ఏం చేస్తాడు. తనవారిని ఎలా కాపాడుకుంటాడు, చివరికి అతనికి ఏమవుతుంది అనేదే మావీరన్ కథ.

వాస్తవికతకు ప్రతిరూపం మహావీరుడు..

తమిళంలో ప్రయోగాత్మక చిత్రాలు నేల విడిచి సాము చేయవు. పేదలు నివసించే కొత్త అపార్ట్ మెంట్లను కూడా అతి సుందరంగా చూపించకుండా అక్కడి పరిసరాలను, జీవితాన్ని నగ్న వాస్తవికతతో చూపడంలో తమిళ, మలయాళ చిత్రాలు భారతీయ సినీ పరిశ్రమలోనే తొలి స్థానంలో ఉంటున్నాయి. పుష్ప 1 సినిమా ప్రభావంతో కాబోలు.. మన సునీల్‌కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర ఇచ్చారు. రాజకీయ నాయకుడి సహాయకుడిగా ఈ సినిమాలో తన నటనతో ఆద్యంతం సునీల్ రక్తి కట్టించాడు అజ్ఞాత వ్యక్తికి రవితేజ వాయిస్ ఇవ్వడం మరో మసాలా. ఇక హీరోహీరోయిన్లైన శివకార్తికేయన్, లేడీ జర్నలిస్టు అదితి శంకర్ ఎక్కడా పార్కుల్లో తైతక్కలాడరు. తమ పరిధికి కట్టుబడి పాత్ర పోషణ చేయడంలో ఇద్దరూ గొప్పగా నటించారు. యోగిబాబు కామెడీ రోల్ ఈ సినిమాలో పరాకాష్టకు చెందిందనే చెప్పాలి. తెలుగు సినిమాల్లో కనిపించే ఆడంబరం, పటాటోపం వంటి పనికిరాని ప్రదర్శనలను మించి నిజమైన సమస్యను కూడా నేలమీద నిలబడే ఎలా దృశ్యీకరించవచ్చో చెప్పిన తాజా చిత్రం మావీరన్. సొంత ఇంటి కల మన దేశంలో నిత్య సమస్యగా ఉంటోంది. దాని వెనుక రాజకీయ క్రీడను అర్థం చేయించే కామెడీ ఎంటర్ టైనర్ మావీరన్. జూలై 14న విడుదలై ఈ చిత్రం తెలుగు తదితర భాషల్లో కూడా ఓటీటీలోకి వచ్చేసింది.

కె. రాజశేఖర రాజు,

73964 94557


Next Story