జనగళమే.. యువగళం..

by Disha edit |
జనగళమే.. యువగళం..
X

సాగనిస్తే పాదయాత్ర.. లేదంటే అది దండయాత్రే అవుతుందని యువగళం ప్రారంభంలో లోకేష్ చేసిన హెచ్చరిక. అరాచక పాలనపై దండయాత్ర చేసి యువత, మహిళల్లో చైతన్య స్ఫూర్తి రగిల్చి వారిలో నైతిక స్థైర్యం నింపారు. పాదయాత్రకు ముందు లోకేష్.. తర్వాత లోకేష్‌ను చూడాలి. పరిణితి చెందిన పరిపూర్ణమైన నాయకుడిగా ఎదిగారు. ప్రజలతో మమేకమై వారి అంతరంగాన్ని శోధించారు. తన లక్ష్యాన్ని ఛేదించారు. దోపిడీపాలనపై సింహగర్జన చేస్తూ యువగళం పాదయాత్ర దిగ్విజయంగా డిసెంబర్ 18న పూర్తవుతోంది. పాదయాత్రకు పల్లెలకు పల్లెలు ఉప్పెనలా కదిలొచ్చాయి. ఎటు చూసినా జన ప్రభంజనమే. అడుగు తీసి అడుగువేయలేనతంగా జనం తరలి వచ్చారు. దారిపొడవునా మంగళ హారతులు ఇస్తూ, ఆశీర్వదిస్తూ నీరాజనాలు పలికారు. పాదయాత్రకు అపూర్వ స్పందన వచ్చింది. అందరి అంచనాలను తలకిందులను చేస్తూ లక్షలాది ప్రజలు తరలివచ్చారు. వారి సమస్యలు శ్రద్ధగా వింటూ, అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని భరోసా ఇస్తూ చిరునవ్వుతో ముందుకు సాగారు. అరాచకపాలన అంతం యువగళం పంతంగా నినదించారు. యువగళం ఓ యోధుడి పొలికేకలా పాలకపక్షం గుండెల్లో సింహగర్జన చేసింది. దారిపొడవునా లోకేశ్‌ను చూసేందుకు ప్రజలు మేడలపైకి, మిద్దెలపైకి ఎక్కి జయజయధ్వానాలు పలికారు.

పార్టీ శ్రేణులకు భరోసా

జనవరి 27న కుప్పం శ్రీవరదరాజస్వామి పాదాల చెంతనుంచి మొదలైన యువగళం జనప్రభంజనమై సాగింది. చంద్రబాబు అక్రమంగా అరెస్ట్‌తో పార్టీలో ఏర్పడిన అతిపెద్ద నాయకత్వ సంక్షోభంలో బలమైన నాయకత్వం ఇవ్వగల భవిష్యత్ నేతగా పార్టీ శ్రేణులకు భరోసా కల్పించారు. నాయకునిగా నిలబడాలంటే దృఢమైన వ్యక్తిత్వం, మానసిక పరిపక్వత ఉంటేనే సాధ్యం... దానిని నిరూపించుకున్నారు. చంద్రబాబు అరెస్ట్‌తో కొద్ది రోజులు విరామం ప్రకటించారు. సెప్టెంబర్ 9న ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే నవంబర్ 27న పునప్రారంభం కావడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. తాడిత, పీడిత, బడుగు బలహీనవర్గాల తరపున యువనేత ఉద్యమించాలని తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతించారు. అన్ని అవాంతరాలను అధిగమించి ప్రజాచైతన్యంలో విజయం సాధించిన యువగళం.. డిసెంబర్ 18న గాజువాక సమీపంలోని అగనంపూడి వద్ద ముగియనుంది. 11 ఉమ్మడి జిల్లాలు, 97 అసెంబ్లీ నియోకవర్గాలు, 230 మండలాలు మున్సిపాలిటీలు, 2వేల గ్రామాల మీదుగా సాగిన చారిత్రాత్మక యువగళం 3,131 కి.మీ.లు చేరుకోనుంది. 226 రోజుల సుదీర్ఘ పాదయాత్రలో లోకేష్ సుమారు కోటిన్నర మందిని ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిశారు.

పాదయాత్రకు ఇన్ని అడ్డంకులా?

లోకేశ్‌ పాదయాత్రకు వస్తున్న ప్రజాదరణను చూసి వైసీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారు. ప్రశాంతంగా జరుగుతున్న పాదయాత్రపై అనేక సందర్భాల్లో రాక్షసత్వం ప్రదర్శించారు. దేశంలో ఎక్కడా లేని క్రూరమైన, అమానుష చట్టాలు అమలు చేస్తూ ప్రజాస్వామ్య పీక నులిమారు. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన జగన్ రెడ్డి.. పాదయాత్రను అడ్డుకొనేందుకు రకరకాల విన్యాసాలు చేశారు. ఆయన పాలనలో అభివృద్ధి అనేది మిథ్యగా మారింది. అసమర్థ పాలనపై గళం విప్పితే సమస్యలను విశ్లేషించుకోవడం మాని.. ప్రశ్నిస్తున్న లోకేష్ గొంతు నొక్కాలని చూశారు. తన ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధపడిన విషయం జగన్‌కి అర్ధం అయింది. లోకేష్ పాదయాత్రలో ప్రభుత్వంపై సంధిస్తున్న ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పలేక వైసీపీ గూండాలను ఉసిగొల్పారు. రాజ్యాంగం కల్పించిన పౌరుల ప్రాథమిక హక్కులను వైసీపీ ప్రభుత్వం కాలరాస్తోంది. ప్రశ్నించిన, విమర్శించిన ప్రతిపక్షాలపై దాడులకు దిగుతున్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. కుల, మత, ప్రాంతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతూ వికృత రాజకీయాలకు పాల్పడుతున్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమల యజమానులను తన్ని తరిమేస్తున్నారు. కొత్త పరిశ్రమలు రావడానికి వీలులేని పరిస్థితులు కల్పించారు. ఈ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడటంతో పాటు అధికారంలోకి రాగానే ప్రజల కష్టాలన్నీ తీరుస్తామని వారిలో ఈ యాత్ర ద్వారా లోకేష్ నైతిక స్థైర్యాన్ని నింపారు.

పాదయాత్ర.. ఓ అధ్యయన వేదిక

లోకేష్ సమర్ధ నాయకుడిగా నిరూపించుకోవడానికి యువగళం వేదికగా మారింది. గతంలో మంత్రిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన ప్రతిభా పాటవాలతో కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు. సుదీర్ఘ పాదయాత్రలో అలుపెరుగని బాటసారిలా నిరంతరం తనని తాను మలుచుకుంటూ ప్రజలతో కలివిడిగా ఉంటూ వడివడిగా అడుగులు వేశారు. ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్ ఇవ్వాలని, ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలనేది ఆయన ఆరాటం. ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు, అడ్డంకులు, అవరోధాలను దాటుకుంటూ ముళ్లబాటను పూలబాటగా మలచుకున్నారు. వారసత్వంగా వచ్చిన అధికారమంటూ హేళన చేసిన వాళ్లే నేడు లోకేష్ పోరాట పటిమను చూసి అవాక్కవుతున్నారు. అన్ని చోట్ల జనసేన పార్టీ శ్రేణులు యువగళానికి మద్దతు పలకడం మరింత ఉత్సాహాన్ని నింపింది. ఇది కేవలం పాదయాత్ర మాత్రమే కాదు.. లోతుగా అధ్యయనం చేసే వేదిక. సమస్యలు తెలుసుకుంటూ, వాటికి పరిష్కార మార్గాలు వెతుకుతూ కొనసాగారు. అనేక నియోజకవర్గాల్లో వైసీపీ నేతల అవినీతి అక్రమాలను సాక్ష్యాధారాలతో సహా బయటపెడుతూ స్థానిక వైసీపీ శాసనసభ్యులను చీల్చిచెండాడుతూ కంటి మీద కునుకు లేకుండా చేశారు. అభివృద్ధిపై సెల్ఫీ ఛాలెంజ్‌లతో ప్రభుత్వాన్ని సవాల్ చేశారు.

ఎండనకా వాననకా.. పగలనక రేయనక పట్టువదలని విక్రమార్కుడిలా నిలిచారు. కిక్కిరిసిన జనసందోహాల ఒత్తిడితో ఒకవైపు చేతులకు గాయాలు, మరోవైపు కాళ్లకు బొబ్బలు వచ్చినా ఏ ఒక్కరోజూ యాత్రకు విరామం ప్రకటించలేదు. ప్రజలు యువగళంలో భాగస్వాములై తమ గొంతుకను వినిపించారు. పాదయాత్రలో ఇప్పటివరకు 4వేలకు పైగా వినతిపత్రాలు అందాయి. లక్షలాది మంది ప్రజలు నేరుగా కలుసుకుని తమ సమస్యలు చెప్పుకున్నారు. 70 బహిరంగ సభల్లో ప్రసంగించారు. 150 ముఖాముఖి సమావేశాలు, 8 రచ్చబండ, 12 ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొని వివిధ వర్గాల సమస్యలు తెలుసుకున్నారు.

దిగ్విజయంగా 3 వేల కి.మీ. పూర్తి

రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందనతో ప్రభుత్వ పెద్దల్లో వణుకు మొదలైంది. దీంతో ప్రచార రథం, మైకు, సౌండ్ సిస్టమ్, చివరకు స్టూలుతో సహా అన్నింటిని పోలీసులు స్వాధీనం చేసుకుని యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభం మొదలు తంబళ్లపల్లి నియోజకవర్గం వరకు ప్రతి 20 కిలోమీటర్లకు ఒకటి చొప్పున మొత్తంగా 25 పోలీసు కేసులు నమోదయ్యాయి. ఎంతగా వేధించినా, ఎన్ని తప్పుడు కేసులు బనాయించినా లోకేష్ ఏమాత్రం వెన్నుచూపలేదు. కోట్లాది మంది ప్రజల గొంతుకనే తనగళంగా వినిపించారు. యువగళం పాదయాత్ర అన్ని ప్రాంతాల్లో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. గతంలో మరే నాయకుడూ చేయని విధంగా రాయలసీమలో 124 రోజుల పాటు 44 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1587కి.మీ పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించారు. 3వేల కి.మీ మైలురాయిని దాటిన చారిత్రాత్మక ఘట్టానికి చిహ్నంగా తుని వద్ద పైలాన్‌ను ఆవిష్కరించారు.

పాదయాత్ర ముగింపు సభ 20న

సంక్షోభాల నుంచి అవకాశాలు వెతకడం తండ్రి నుంచి నేర్చుకున్న తొలిపాఠం. కష్టకాలంలో బాధ్యత కలిగిన నాయకుడిగా, కుమారుడిగా సర్వం తానై నడిపించడం లోకేష్ రాజకీయ పరిణితికి అద్దం పడుతోంది. ఒకవైపు న్యాయం పోరాటం, మరోవైపు పార్టీ కార్యక్రమాలను సమీక్షించుకుంటూ నాయకుడిగా తనని తాను నిరూపించుకున్నారు. లోకేష్ మాటల తూటాలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న వారిలో అభద్రతాభావాన్ని తొలగించి నూతనోత్సాహాన్ని నింపారు. పనిచేసే వారికి మాత్రమే పార్టీలో గౌరవం, ఉన్నత స్థానం లభిస్తుందనే సంకేతాలు పంపారు. ఈ నెల 20న జరగనున్న లోకేష్ పాదయాత్ర ముగింపు సభలో చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణ పాల్గొననున్నారు. ఈ సభ ద్వారా వచ్చే ఎన్నికల్లో వైసీపీపై పోరాటానికి పార్టీ శ్రేణులను సిద్ధం చేయనున్నారు. లోకేష్ నాయకత్వం పట్ల ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో పూర్తి విశ్వాసం కలిగింది. యువగళం పాదయాత్ర ప్రజాచైతన్యంలో సంపూర్ణంగా విజయం సాధించింది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సాధించబోయే అప్రతిహత విజయాలకు యువగళం జైత్రయాత్ర బాటలు వేసింది.

-మన్నవ సుబ్బారావు

99497 77727


Next Story

Most Viewed