లోన్ యాప్స్‌లో రుణాలు హానికరం

by Disha edit |
లోన్ యాప్స్‌లో రుణాలు హానికరం
X

ఇంటర్‌నెట్లో లభించే పలు రుణాలు అందించే యాప్‌లు మోసపూరితమైనని, ఆర్బీఐ గుర్తింపులేని ఈ యాప్ ద్వారా రుణ ఆధారిత దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకోకూడదు. ఈ యాప్ ద్వారా అందించే రుణాల వడ్డీ రేట్లు రోజుకు ఒక శాతం వరకు ఉంటాయి. రుణాలు స్వీకరించే సమయంలో ఏ విధమైన షరతులకు అంగీకరించకుండా ఉండడం మంచిది.

ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో యువత జల్సాలకు అలవాటుపడి వివిధ ఆన్లైన్ యాప్‌లలో రుణాలు తీసుకొని తిరిగి చెల్లించలేక వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు అనేక రకాల ఆన్లైన్ యాప్‌ల ద్వారా వారికి వచ్చే ఆదాయం కంటే ఎక్కువగా రుణాలు తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న అప్పును తీర్చలేక, వారు పెట్టే టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్‌లో గానీ లేదా ఏ విధమైన బ్యాంకు నుంచి గాని రుణాలు అందించే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు కచ్చితంగా వర్తిస్తాయి. ఇటీవలి కాలంలో దేశంలోని వివిధ రాష్ట్రలలో యాప్ ద్వారా అనేక మందికి నగదు రుణాలు తీసుకోని వాటిని తిరిగి చెల్లించే క్రమంలో సంబంధిత యాప్‌ల యాజమాన్యం వారు చేసే వేదింపులను భరించలేక పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డ సంఘటనలు చాలా జరుగుతున్నాయి. ఇందులో అధిక శాతం యువత ఇంకా మధ్యతరగతి ప్రజలు ఉండటం ఆందోళన కలిగిస్తున్న అంశం.

రిజిస్ట్రేషన్ లేని యాప్‌లు

అయితే ఆర్బీఐ చట్టం 1934 లోని సెక్షన్ 45-1 ప్రకారం NBFC లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. తగిన రిజిస్ట్రేషన్ అనంతరమే నిబంధనల మేరకు పని చేయడానికి అనుమతి ఉంటుంది. రిజిస్టర్ కాని ఏ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు చట్టబద్ధత ఉండదు. అలాంటి వాటి మీద పోలీసులు చర్యలు చేపట్టవచ్చు. ప్రస్తుతం చలామణిలో ఉన్న ఈ ఆన్ లైన్ యాప్‌లలో అధికశాతం ఆర్బీఐలో నమోదు కాలేదు. వారికి రుణాలు అందించే అధికారం లేదు కానీ ఈ విషయం తేలిక చాలా మంది అలాంటి యాప్స్‌లోనే లోన్ తీసుకొని మోసపోతున్నారు. ఈ యాప్‌లలో అధికంగా చైనీస్ యాప్‌లే ఉన్నాయి. వాటికి రిజిస్టర్ అయిన చిరునామా గాని, సరైన మొబైల్ నెంబర్ గానీ ఇతర వివరాలు ఉండవు. ఫోన్ ద్వారానే సమాచారాన్ని (డేటా)ను యాప్ నిర్వాహకులు తెలుసుకుంటారు, ఈ యాప్‌ల యూజర్లు లిఖితపూర్వకంగా లేని రూపంలో తమ కాంటాక్ట్ నెంబర్లు, ఫోటోలు, వీడియోలు, సోషల్ మీడియా సమాచారం ఇతర వ్యక్తిగత సున్నిత అంశాలను తమకు తెలియకుండానే అందిస్తారు. యాప్‌ల ద్వారా తీసుకున్న రుణాలను చెల్లించని బాధితులను వేధించేందుకు ఈ సమాచారాన్ని రుణాలు అందించే యాప్‌ల నిర్వాహకులు దుర్వినియోగం చేస్తారు.

యాప్ రుణాలు మోసపూరితం

ఈ నేపథ్యంలో రుణాలు స్వీకరించే సమయంలో ఏ విధమైన షరతులకు అంగీకరించకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా మీ వ్యక్తిగత వివరాలు, ఆధార్, బ్యాంకు వివరాలను ఎట్టి పరిస్థితుల్లో అందజేయకూడదు. ఇంటర్‌నెట్లో లభించే పలు రుణాలు అందించే యాప్‌లు మోసపూరితమైనవని, ఆర్బీఐ గుర్తింపులేని ఈ యాప్ ద్వారా రుణ ఆధారిత దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకోకూడదు. ఈ యాప్ ద్వారా అందించే రుణాల వడ్డీ రేట్లు రోజుకు ఒక శాతం వరకు ఉంటాయి. ఇది సాధారణంగా బ్యాంకులు లేదా NFBC రిజిస్టర్ అయిన సంస్థలు అందించే రుణ వడ్డీల కన్నా అత్యధికంగా ఉంటాయి. రుణ బాధితులు సకాలంలో చెల్లించని పరిస్థితిలో ఈ వడ్డీ మొత్తం రెట్టింపు లేదా మూడొంతులు అయి రుణవలయంలో చిక్కుకుంటున్నారు. దీంతో రుణాలు చెల్లించని రుణగ్రహితలను తిరిగి చెల్లించమని బెదిరించడం, మీ వ్యక్తిగత ఫోటోలు మీ కాంటాక్ట్‌లో ఉన్న వాళ్ళకి పంపిస్తాం అని బ్లాక్ మెయిల్ చేయడంతో పాటు ఆన్‌లైన్ వేధింపులకు ఈ యాప్‌ నిర్వాహకులు పాల్పడుతుంటారు. రుణాలను చెల్లించనట్టైతే మీపై క్రిమినల్ కేసులు బుక్ చేయడం జరుగుతుందని రుణం అందించే యాప్‌లు బెదిరించే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఎదురైతే సంబంధిత బాధితులు వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి ఇంకా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి. ఇలాంటి లోన్ యాప్స్ పట్ల అవగాహన పెంచుకోండి.

కె. నిషాంత్ కుమార్,

అడ్వొకేట్, తెలంగాణ హైకోర్టు

80990 30375

Next Story