ఉద్యమ కేంద్రాలను కాపాడుకుందాం!

by Ravi |
ఉద్యమ కేంద్రాలను కాపాడుకుందాం!
X

సుమారు పన్నెండు వందల మంది ఆత్మబలిదానాల పునాదులపై ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలుగా విద్యార్థి, నిరుద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలతో విద్య, వైద్యం మొదలు అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయినవి. కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి నేడు విద్యారంగానికి నిధులు కేటాయించకుండా, నియామకాలు చేపట్టకుండా పాఠశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయాల వరకు విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ విద్యా విధ్వంసానికి తెరలేపారు. ఇప్పటికే ఫీజుల భారం, అందని రీయింబర్స్‌మెంట్, పంతుళ్లు, పర్యవేక్షణ లేమితో యూనివర్సిటీలు, సంక్షేమమెరుగని సంక్షేమ హాస్టల్స్‌లో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. అధికార నాయకులు మాత్రం అవినీతి, అధికార దుర్వినియోగం చేస్తూ రాష్ట్రాన్ని అద్దాల మేడలతో అభివృద్ధి చేస్తున్నామంటూ ప్రగల్భాలు పలుకుతుంటే మేడిపండు సామెత గుర్తువస్తుంది.

యూనివర్సిటీల పాలన గడీల్లో చిక్కుకొని...

రాష్ట్రంలో మానవవనరుల వికాస కేంద్రాలైన విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిర్వీర్యం అయిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ యూనివర్సిటీ పరిస్థితి దారుణం. తెలంగాణ ఉద్యమ జ్వాలను రగిల్చిన యూనివర్సిటీలు, నేడు అంధకారంలోకి నెట్టివేయబడ్డాయి. వసతుల లేమి, ఆధునీకరణలేని అధ్యయనం, నిధుల కొరత, నియామకాల్లో జాప్యం, భూకబ్జా వంటి చర్యలతో యూనివర్సిటీల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఉస్మానియాను ఆక్స్ఫర్డ్ వర్సిటీగా, కాకతీయను కేంబ్రిడ్జ్ యూనివర్శిటీగా చేస్తామన్న మాటలు మరుగున పడిపోయె. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో 75 శాతానికి పైగా అధ్యాపక పోస్టులు ఖాళీలు, వేల సంఖ్యలో అధ్యాపకేతర ఖాళీలను భర్తీ చేయకుండా యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం కామన్ రిక్రూట్మెంట్ బోర్డు అంటూ కొత్త నాటకానికి తెరలేపింది. ప్రతి సంవత్సరం బ్లాక్ గ్రాంట్‌ను పెంచుతూ వర్సిటీలను అభివృద్ధి చేయకుండా ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తూ, ప్రైవేట్ యూనివర్సిటీలకు పట్టంకడుతూ సామాన్య, పేద గ్రామీణ ప్రాంత విద్యార్థులను యూనివర్సిటీ విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతుంది. అంతేకాదు అకాడమిక్ స్వేచ్ఛ, అంతర్గత ప్రజాస్వామ్యంతో నూతన వరవళ్ళు సృష్టిస్తూ వెలుగొందాల్సిన విశ్వవిద్యాలయాలు మితిమీరిన రాజకీయ ప్రమేయంతో స్వయం ప్రతిపత్తిని, ప్రతిష్టను సైతం కోల్పోతూ యూనివర్సిటీల పాలన ప్రగతి భవన్ గడీల్లో బందీ అయి వాటి అస్తిత్వాన్నే కోల్పోతున్నాయి.

పేదలకు దూరమౌతున్న విద్య

ఎన్నో ఉద్యమాలు, ఒత్తిళ్ల కారణంగా ప్రభుత్వం 2021లో అన్ని యూనివర్సిటీలకు కొత్త వీసీలను నియమించింది. అయితే వారు పాలనపై దృష్టి పెట్టకుండా విద్యార్థులను దోచుకోవడం మొదలుపెట్టారు. దాంతో విద్యార్థుల పరిస్థితి ‘పెనం నుండి పొయిల పడ్డట్టు’ అయింది. వర్సిటీలన్ని కోర్స్ ఫీజులను ఏకధాటిగా పెంచాయి. గతంలో ఉన్న ఫీజులతో పోల్చితే ఇప్పుడు కోర్సు ఫీజులు వంద శాతం మేర పెంచారు. దీంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు యూనివర్సిటీ చదువుకు దూరమవుతున్నారు. రాష్ట్రంలో యూనివర్సిటీలలో 2,152 అధ్యాపక ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఇవి భర్తీ చేయకపోతే వచ్చే అకడమిక్ ఇయర్ న్యాక్ గుర్తింపు పొందే విషయంలో ఉస్మానియా లాంటి యూనివర్సిటీలకు తిప్పలు తప్పేలా లేవు. అధికారులు మాత్రం ఇవి ఏమీ పట్టనట్లు వర్సిటీలను మినీ రాజకీయ వ్యవస్థలుగా మారుస్తున్నారు.

ఎవరి కోసం ప్రైవేట్ యూనివర్సిటీలు?

ఉమ్మడి రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు యూనివర్సిటీ విద్య అందాలనే లక్ష్యంతో కొత్త ప్రభుత్వ యూనివర్సిటీలను నెలకొల్పితే, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం మాత్రం విద్యావ్యాపారం చేస్తూ 2021 సెప్టెంబర్లో అవసరం లేకున్నా తెలంగాణలో ప్రైవేట్ యూనివర్సిటీలను ఏర్పాటు చేసే బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలిపింది. ఇందులో గురునానక్, శ్రీనిధి కళాశాలలకు యూనివర్సిటీ హోదా ఇచ్చారు. కానీ సరైన వసతులు లేని కారణంగా రిజక్ట్ చేసారు. అయినప్పటికీ అధికార పార్టీ నాయకుల అండతో యూనివర్సిటీలుగా చలామణి అవుతూ ఎలాంటి అనుమతులు లేకుండానే యథేచ్ఛగా ఈ అకడమిక్ సంవత్సరానికి కూడా ఆ రెండు కళాశాలలు విద్యార్థులను మోసం చేస్తూ 4,000 పైగా అడ్మిషన్స్ తీసుకున్నారు. ఇప్పుడు అనుమతి రద్దు కావడంతో వర్సిటీగా చలామణి అవుతున్న కళాశాలలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థుల పరిస్థితి ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. దీనిపై ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు భరోసా కల్పిస్తూ కళాశాలలపై చర్యలకు పూనుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ప్రభుత్వ విద్యను అభ్యసిస్తూనే విద్యార్థులు గొప్ప గొప్ప స్థాయికి ఎదిగారు. ఆ స్ఫూర్తితో ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్యను అందించాల్సిన కనీస బాధ్యతను గుర్తెరిగి పనిచేయాలి. కానీ స్వార్ధ రాజకీయాల కోసం ప్రభుత్వ విద్యను పాతరేస్తూ, ప్రైవేట్ విద్యను ప్రజలపై రుద్దడం సరైంది కాదు.

శ్రీహరి పగిడిపల్లి

ఏబీవీపీ వర్కింగ్ కమిటీ మెంబర్

96765 43472

Next Story