విజయం నేర్పుతున్న పాఠాలు

by Ravi |
విజయం నేర్పుతున్న పాఠాలు
X

గ్జిట్ ఫలితాలు ఎగ్జాక్ట్ ఫలితాలేనని మరోసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు తేల్చి చెప్పాయి. కాంగ్రెస్ పార్టీ మేజిక్ సంఖ్యను దాటి ఆధిక్యతను సాధించింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మొదటిసారిగా అధికారం హస్తగతం కాగా, పదేళ్లు అధికారం చలాయించిన బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ఉద్యమ నేతగా, తెలంగాణ సాధించిన నాయకుడిగా చరిత్రకెక్కిన కేసీఆర్ పదేళ్లలోపే అధికార వైకుంఠపాళి నుంచి కిందికి దిగజారారు.

కాంగ్రెస్‌కు ప్రజలు పట్టం కట్టబెట్టారన్నదే ఇప్పుడు వాస్తవం. అందుకే ఈ పదేళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పిదాలేంటి, ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలేమిటి అనే అంశాలపై రాబోయే ప్రభుత్వం గుణ పాఠాలు నేర్చుకుని గత ప్రభుత్వ వైఫల్యాలను సవరించుకుంటే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి వీలవుతుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, అంతిమ లక్ష్యం ప్రజా సంక్షేమం, అభివృద్ధి, అవినీతి రహిత నిజాయితీ పాలనే కావాలి.

కొత్త ప్రభుత్వం ఏం చేయాలి

ప్రజాభిప్రాయాన్ని నిత్యం ఆలకించాలి. మేధావులు, జర్నలిస్టులు, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై,నాయకులపై చేసే విమర్శలను, అధికార పక్షం, ప్రభుత్వ అధికారులు ప్రజాస్పందనగా భావించాలి, వారిని శత్రువులుగా చూడకూడదు. లోపాలు ఉంటే ఒప్పుకొని, సవరించుకోవాలి. లోపాలు లేకపోతే, ప్రభుత్వ పరంగా వివరణ ఇవ్వాలి. పాలనలో పారదర్శకత ఉండాలి. అన్ని ప్రభుత్వ జీవోలు ప్రభుత్వ నెట్‌లో ఉంచాలి. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక, ప్రభుత్వ చెల్లింపులు పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఉండాలి. ఎమ్మెల్యేలు, మంత్రులు తాము ప్రజా సేవకులమే తప్ప, ప్రజలపై పెత్తనం చేసేవారం కాదు అనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ప్రజా సమస్యలు పరిష్కరించటానికంటే ముందు రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు ఓపిక, సహనం కలిగి ఉండాలి. ఎదుటి వాడు ఏం చెబుతున్నాడో కనీసం ఓపికతో వినాలి. వారు ఇచ్చే విజ్ఞాపన పత్రాలను స్వీకరించి, రసీదులు ఇవ్వాలి. సమస్య పరిష్కారం అయితే వెంటనే సమాచారం ఇవ్వాలి. పరిష్కారం కాకపోతే ప్రభుత్వ పరంగా, అధికారికంగా కారణాలు వివరిస్తూ సమాచారం త్వరగా అందించాలి. ప్రజాసమస్యలను సాధ్యమైనంత తొందరగా, హేతుబద్ధమైన నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలి. అనవసరపు జాప్యం, సాగదీతలు లేకుండా చూడాలి. ప్రజాప్రతినిధులు నిరాడంబరత్వాన్ని ప్రతి విషయంలో పాటించాలి. డాబు, దర్పం, గర్వం ప్రదర్శించకూడదు. ప్రజల సొమ్ము ఏ విషయంలో దుబారా చేయకూడదు.

ప్రజా హక్కులను గౌరవించాలి

తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులన్నింటినీ రద్దు చేయాలి. నిర్బంధంలో ఉన్న వారిని విడిపించాలి. పాలనలో ఎక్కడా కక్ష సాధింపు చర్యలు ఉండరాదు. చట్టప్రకారం నిష్పక్షపాతంగా అవినీతి, అధికార దుర్వినియోగాలపై విచారణ జరిపించాలి. శాంతియుతంగా తమ సమస్యలపై ఉద్యమం చేసే హక్కు, నిరసన తెలిపే హక్కు, ప్రదర్శనలు చేసే హక్కు, సభలు పెట్టుకునే హక్కు ప్రజలకు ఉంటుందనే విషయాన్ని ప్రజాప్రతినిధులు, పోలీసులు ఎల్లప్పుడూ స్పృహ కలిగి ఉండాలి. అక్రమంగా నిర్భంధించే పనులు మానుకోవాలి. అన్ని విషయంల్లో ప్రజాస్వామికంగా వ్యవహరించాలి. రాజ్యాంగం, ప్రభుత్వ చట్టాలు అందరికీ ఒకటే. నాయకులకు మినహాయింపు లేదనే విషయం ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. పోలీసులకు, విచారణ సంస్థలకు విధి నిర్వహణలో స్వేచ్ఛను ఇవ్వాలి. వారు కూడా వంద శాతం, రాజ్యాంగాన్ని,చట్టాలను విధిగా పాటించాలి. అక్రమ నిర్భందాలు, లాకప్, హింసలు, హత్యలు మానుకోవాలి. పోలీసులు ఉపయోగించే భాష విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు అవినీతికి, అక్రమ సంపాదనకు దూరంగా ఉండాలి. వ్యక్తిగత ప్రవర్తన హుందాగా, నిజాయితీగా ఉండాలి.

మ్యానిఫెస్టో పవిత్ర పత్రం

ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో, ఒకరితో ఒకరు పోటీపడి తొందరపాటుతో కొన్ని అలవికాని, ఆచరణ సాధ్యం కాని చాలా ఖరీదైన, హామీలు, వాగ్ధానాలను గుప్పించారు. కొత్త ప్రభుత్వం ఆచరణ సాధ్యం కాని హామీలను వెంటనే రద్దు చేయాలి. అన్ని ప్రభుత్వ పాలనా శాఖల్లో ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు పాటించాలి. ఆయా రంగాల నిపుణులతో, మేధావులతో చర్చించి ప్రణాళికా బద్ధంగా, ప్రాధాన్యతా క్రమంలోనే ప్రజా సమస్యలు పరిష్కరించాలి. విద్యా, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, బడ్జెట్ కేటాయింపులు కనీసం ఈ రెండింటికి 15 శాతం విడివిడిగా కేటాయించాలి. చివరిగా కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోను పవిత్ర పత్రంగా భావించి. ప్రతి రోజూ తమ పాలనా సక్రమంగా వాగ్ధానాల నెరవేర్పు దిశగా సాగుతుందా వ్యతిరేక దిశగా సాగుతుందా అనేది ముఖ్యమంత్రి సరిచూసుకోవాలి. అనవసర మాటలు తగ్గించి గౌరవప్రదంగా భాషను ఉపయోగించాలి. అప్పుడే పరిపాలకుడికి విలువ పెరుగుతుంది. ముఖ్యమంత్రిని పొగిడే భజన బృందానికి, వ్యక్తి ఆరాధనకు, ముఖస్తుతికి ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు దూరంగా ఉండాలి. వారితోనే అసలు ప్రమాదం. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఏ పార్టీనైనా ప్రజలు సుధీర్ఘకాలం ఆదరిస్తారు.

డా. కోలాహలం రామ్ కిషోర్

98493 28496

Next Story