కపట నాటకంతో వంచన

by Disha edit |
కపట నాటకంతో వంచన
X

బీజేపీకి బలమైన జాతీయోద్యమ వారసత్వం, నాయకులు లేకపోవడంతో హిందూ రాజులు, యోగుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నది. టీఆర్ఎస్ కూడా వాటికి చేయూతనిస్తున్నది. ఈ క్రమంలోనే ఇటీవల కాకతీయుల వారసుడంటూ భంజ్‌దేవ్‌ను ఛత్తీస్‌గఢ్ నుంచి 'కాకతీయ వేడుకలకు' ఆహ్వానించారు. ఇది తెలంగాణ రాజకీయ, సామాజిక వాతావరణంలో ఫ్యూడల్ వారసత్వాన్ని, వర్గకుల ఆధిపత్య స్వభావాన్ని మరోసారి ప్రతిబింబించింది. ప్రభుత్వ ఖజానా నుంచి కోట్లాది రూపాయలతో తిరుమల వెంకటేశ్వర ఆలయానికి, బెజవాడ దుర్గ ఆలయానికి కానుకలు సమర్పించారు. వేయి కోట్లతో యాదగిరిగుట్ట ఆలయాన్ని నిర్మించారు. ఇవన్నీ టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని తేల్చేశాయి. ఓటే లక్ష్యంగా వీరు నాటకమాడుతుంటే, మరి తెలంగాణ జనం ఎటువైపు నిలబడతారో వేచి చూడాలి.

రో వందేళ్లలో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ, అది అవలంబిస్తున్న సామ్యవాద సిద్ధాంతం భూస్థాపితం అవుతాయి. బ్రహ్మ సిద్ధాంతం (నిచ్చెన మెట్ల కుల సంస్కృతి) పునరుద్ధరించబడుతుంది. అప్పటి దాకా నేను జీవించి ఉండను కానీ, నేను స్థాపించిన సంస్థ మాత్రం కాంగ్రెస్‌ను, మా ధర్మానికి వ్యతిరేకంగా చిన్నజాతిని, పెద్ద జాతితో సమానంగా నిలబెట్టేందుకు పుట్టిన, పుట్టబోయే ఇతర పార్టీలను చంపుతుంది. మను సిద్ధాంతాన్ని కాపాడుతుంది. దాని రూపంలో నన్ను బతికిస్తుంది' 1925లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) స్థాపించిన సమయంలో హెడ్గేవార్ అన్న మాటలు ఇవి.

ప్రస్తుతం దేశంలో రాజకీయ పరిణామాలు అలాగే ఉన్నాయి. భారతదేశ ఎన్నికలలో స్థిరమైన ఫార్ములా లేదు. దేశంలో, రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయాలను చూస్తుంటే, వర్ణ వ్యవస్థను, విభజన రాజకీయాలను ఏ రకంగా ప్రోత్సహించి, మను సిద్ధాంతాన్ని కాపాడుతున్నాయో తెలుస్తున్నది. ఇప్పటికే బీజేపీ కుట్రపూరితంగా కర్ణాటక, మహారాష్ట్రలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. తెలుగు రాష్ట్రాలలోనూ ముఖ్యమంత్రులతో చీకటి ఒప్పందాలు చేసుకుంది. ఆ ఒప్పందంలో భాగంగానే రాష్ట్రంలో ఎదుగుతున్న కాంగ్రెస్‌ను, బహుజన్ సమాజ్ పార్టీని ఖతం చేసే బాధ్యతను బీజేపీ ఇద్దరు నాయకులకు అప్పగించింది.

మైండ్ గేమ్ ఆడుతూ

రాష్ట్రాన్ని విభజించడంతో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కనుమరుగైంది. తెలంగాణలో కేసీఆర్ కుయుక్తుల కారణంగా కాంగ్రెస్ పుంజుకోవడం లేదు. టీఆర్ఎస్ ఎనిమిదేండ్ల పాలన తరువాత ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఆ వ్యతిరేకత నేపథ్యంలోనే ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ రాజకీయ అరంగేట్రం చేశారు. దీంతో బీఎస్‌పీకి ఆదరణ పెరగడం, కాంగ్రెస్ పగ్గాలు రేవంత్ రెడ్డి చేతిలో పడడంతో మారుతున్న రాజకీయ పరిణామాలు కేసీఆర్‌కు వణుకు పుట్టించాయి. ఈ రెండు పార్టీలు రాష్ట్రంలో ఎదిగితే, గతంలో దొరలకు పట్టిన గతే పునరావృతమవుతుందని భయపడుతున్నారు. అందుకే కాంగ్రెస్, బీఎస్‌పీని చంపే పనిలో పడ్డారు. ఈ రెండు పార్టీల పోరాటాలను తక్కువ చేసి మాట్లాడుతూ, విస్మరిస్తూ, మైండ్ గేమ్ ఆడుతూ ప్రజల మనసులో వాటికి చోటు లేకుండా చేస్తున్నారు.

ప్రశాంత్ కిశోర్ అనే రాజకీయ ప్లానర్‌ను తీసుకొచ్చి బెంగాల్ తరహా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. తన ప్రత్యర్థిగా బలహీన బీజేపీని ఎంచుకుని ఎన్నికలలో గెలవాలని చూస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు బాగా బలహీనపడ్డాయి. ఆ శూన్యతను మమత బీజేపీతో నింపారు. తన పార్టీ ఎమ్మెల్యేలను ఎంపీలను బీజేపీలోకి పంపి మిలిటెంట్ పోరాటం చేస్తున్నట్టు నటించారు. అంతిమంగా గెలిచి తానే ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ మూడు స్థానాల నుంచి డెబ్బై స్థానాలకు ఎదిగింది. అలాగే కేసీఆర్ తన కపట రాజకీయంతో తెలంగాణలో లేని బీజేపీకి బలాన్ని పెంచే ఎత్తుగడలు వేస్తున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ప్రజలలోకి సంకేతాలు పంపుతున్నారు.

అదే ప్రత్యామ్నాయమనేలా

బీజేపీ అధికారం అందుకోవడంతోపాటు హిందూ భావజాలాన్ని విస్తరించడం, మనుధర్మాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా ఉంది. ఇందుకు తెలంగాణలో కేసీఆర్ సహకరిస్తున్నారు. వీరి ఒప్పందం ప్రకారం రానున్న రోజులలో తెలంగాణలో ఈ రెండు పార్టీలలోనే ఏదో ఒకటి అధికారం చేపట్టాలి. ఈ ఒప్పందం మేరకే ప్రస్తుతం తెలంగాణలో ఆ రెండు పార్టీలు గాండ్రించుకుంటున్నాయి. రెండు పార్టీలే బలంగా ఉన్నాయని ప్రజలను నమ్మిస్తున్నాయి. టీఆర్ఎస్ మీద ప్రజలలో ఉన్న వ్యతిరేకతను బీఎస్‌పీ, కాంగ్రెస్‌కు అనుకూలం కాకుండా చూస్తున్నాయి. ఉత్తుత్తి కొట్లాట నాటకం ఆడుతున్నాయి.

అందుకే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నగరంలో ఏర్పాటు చేయించి, నగరమంతా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు పెట్టి తాను బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకమని నమ్మించారు. కోట్ల రూపాయలతో ప్రకటనలు, రైతు ఆందోళనలో మరణించిన వారికి సహాయం, గల్వాన్ లోయ ఘర్షణలో మరణించిన ఆర్మీ జవాన్లకు సహాయం ఈ కోవలోనివే. తెలంగాణలో నాయకులు 119 నియోజకవర్గాలలో దళితుల ఇండ్లలో బస చేసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఒక సీటే గెలిచింది. 2019 లోక్‌సభ ఎన్నికలలో నాలుగు ఎంపీ సీట్లు గెలిచింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో గట్టిపోటి ఇచ్చింది, కేసీఆర్ రాజకీయ విన్యాసంతోనే ఇది సాధ్యమైంది.

ఫ్యూడల్ వారసత్వం

అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్ బలహీనంగా ఉందని ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ అసంతృప్త నేతలను బీజేపీ వైపునకు మళ్లిస్తున్నారు. కాంగ్రెస్‌కు ఊరూరా కేడర్ ఉంది. అయినా, బీజేపీ తమ ప్రత్యామ్నాయం అంటున్నారు. దీనికి తోడు సోషల్ ఇంజనీరింగ్‌తో బీసీలను, దళితులను కేంద్రంగా చేసుకొని రెడ్లను సమీకరించే పనిలో పడ్డారు. కాంగ్రెస్, బీఎస్‌పీ ఎదుగుదలకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. బీజేపీకి బలమైన జాతీయోద్యమ వారసత్వం, నాయకులు లేకపోవడంతో హిందూ రాజులు, యోగుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నది. టీఆర్ఎస్ కూడా వాటికి చేయూతనిస్తున్నది.ఈ క్రమంలోనే ఇటీవల కాకతీయుల వారసుడంటూ భంజ్‌దేవ్‌ను ఛత్తీస్‌గఢ్ నుంచి 'కాకతీయ వేడుకలకు' ఆహ్వానించారు.

ఇది తెలంగాణ రాజకీయ, సామాజిక వాతావరణంలో ఫ్యూడల్ వారసత్వాన్ని, వర్గకుల ఆధిపత్య స్వభావాన్ని మరోసారి ప్రతిబింబించింది. ప్రభుత్వ ఖజానా నుంచి కోట్లాది రూపాయలతో తిరుమల వెంకటేశ్వర ఆలయానికి, బెజవాడ దుర్గ ఆలయానికి కానుకలు సమర్పించారు. వేయి కోట్లతో యాదగిరిగుట్ట ఆలయాన్ని నిర్మించారు. ఇవన్నీ టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని తేల్చేశాయి. ఓటే లక్ష్యంగా వీరు నాటకమాడుతుంటే, మరి తెలంగాణ జనం ఎటువైపు నిలబడతారో వేచి చూడాలి.

మేకల ఎల్లయ్య

9912178129

Next Story