కథా సంవేదన: నేనూ, నా సైకిల్

by Disha edit |
కథా సంవేదన: నేనూ, నా సైకిల్
X

నా చిన్నప్పుడు మా వూర్లో సైకిళ్లు పెద్దగా లేవు. నాకు తెలిసి మొదటి సైకిల్ మా బాపుదే. ఆయన ఆయుర్వేద డాక్టర్. ఆయన తన దవాఖానాకి అదే విధంగా రోగులను వాళ్ళ ఇళ్ల దగ్గర చూడటానికి సైకిల్‌ని వాడేవాడు. కొద్దిరోజుల తరువాత నడిచి వెళ్ళడం అలవాటు చేసుకున్నాడు. ఆ తరువాత ఆయన సైకిల్ ఏమైందో నాకు తెలియదు.

చిన్నప్పుడు నాకు మూడు గిరల సైకిల్ ఉండేది. దాని మీద తిరగడం ఓ అద్భుత ప్రపంచంలా వుండేది. ఇంట్లోనే కాకుండా ఇంటి బయట కూడా ఆ సైకిల్ మీద తిరిగేవాన్ని. ముందు సీట్లో కూర్చోని సైకిల్ తొక్కడం హుషారుగా తిరిగేవాన్ని. అప్పుడప్పుడు వెనక సీట్లో మిత్రులు కూర్చునే వారు. కొంత పెద్దవాన్ని అయిన తరువాత నా మూడు గీరల సైకిల్ మూలబడిపోయింది. మా పాత అర్రలోకి వెళ్ళిపోయింది. మా తాత చనిపోయిన తరువాత ఆయన అర్ర పాత సామానులు పెట్టుకునే అర్రగా మారిపోయింది.

పెద్ద సైకిల్ తొక్కాలన్న కోరిక పెరిగిపోయింది. కానీ ఇంట్లో గతంలో ఉన్న సైకిల్ లేదు. అందుకని మా హరి దుకాణం ప్రక్కన వున్న సైకిల్‌ని కిరాయకు తీసుకొని తొక్కడం ప్రారంభించాను. మా మిత్రులు రాజేందరో, రవీందరో సహాయం చేసేవాళ్ళు. సీటు మీద కూర్చుంటే కాళ్ళు పెడల్‌కి అందేవి కాదు. అందుకని నేనూ నా మిత్రులు అందరం కలిపి కైంచీ తొక్కడం నేర్చుకున్నాం. అది నాకు వచ్చిన తరువాత సీటు మీద నుంచి సైకిల్ తొక్కడం ప్రారంభించాం. మొదట్లో సైకిల్ ఎక్కడం కొంత కష్టంగా వుండేది. ఏదైనా బండ దగ్గరలో, గద్దె దగ్గరో సైకిల్‌ని పెట్టి ఎక్కి సైకిల్‌ని తొక్కడం, ఆ తరువాత వాటి సహాయం లేకుండానే సైకిల్ ఎక్కడం తొక్కడం అలవాటైపోయింది. కొద్దిరోజుల తరువాత సైకిల్ తొక్కే మోజు తగ్గిపోయింది.

డిగ్రీ చదువుకి వచ్చిన తరువాత సైకిల్ అవసరం ఏర్పడింది. కరీంనగర్‌లో మా రాధక్క దగ్గర వుండేవాన్ని. మొదట్లో వాళ్ళు క్లాక్ టవర్ దగ్గర వుండేవాళ్ళు. ఆ తరువాత మంకమ్మ తోటకి మారినారు. ఈ రెండు ప్రదేశాల నుంచి మా ఎస్.ఆర్.ఆర్ డిగ్రీ కళాశాల దూరమే. అందుకని సైకిల్ ఆవశ్యకత ఏర్పడింది. అందుకని ఓ సైకిల్ కొనిచ్చారు. దాన్ని మూడు నెలలకొకసారి ఓవర్ ఆయిలింగ్ చేసిన తరువాత సైకిల్ చాలా స్మూత్‌గా నడిచేది. అప్పుడప్పుడు రాజనర్సు ఆయిల్ వేసేవాడు.

డిగ్రీ చదువు అయిపోయిన తరువాత సైకిల్ అవసరం లేకుండాపోయింది. నా సైకిల్ ఏమైందో నా స్పురణ లో లేకుండాపోయింది. ఆ తరువాత యూనివర్సిటీకి వచ్చాను. మా ‘లా’ కాలేజీకి ఎదురుగానే హాస్టల్ వుండేది. సిటీకి వెళ్ళాలంటే బస్సు వుండేది. దానికి జనరల్ బస్‌పాస్ తీసుకునేవాన్ని . ఇప్పటి మాదిరిగా మోటర్ సైకిల్ అప్పుడు లేవు. నేను లా కాలేజీ ఎలక్షన్లో కంటెస్టు చేసినప్పుడు సిటీలో వున్న ‘డే స్కాలర్సు’ ని కలవడానికి మోటరు సైకిల్ అవసరం ఏర్పడింది. అప్పుడు మా కజిన్ దగ్గర నుంచి ఓ వారం పది రోజుల కోసం ఓ మోటరు సైకిల్‌ని తెచ్చుకొని నేనూ, రవీందర్, శ్రీధర్‌లమీ సిటీ అంతా తిరిగి మా ‘లా’ కాలేజీ మిత్రులని కలిశాం. చివరికి ఎలక్షన్లో గెలిచాను.

యూనివర్సిటీలో వున్నప్పుడు, ఆ తరువాత న్యాయవాదిగా మారిన తరువాత సైకిల్‌తో అవసరం లేకుండా పోయింది. న్యాయవాదిగా మారిన తరువాత సైకిల్‌తో అవసరం లేకుండా పోయింది. న్యాయవాదిగా మారిన తరువాత స్కూటర్‌కి మారిపోయాను. అలా కొంతకాలం తరువాత న్యాయమూర్తిగా మారిపోయాను. అప్పుడు సైకిల్‌తో పనిలేకుండా పోయింది. ఆఫీసు వాహనమో, స్వంత కారో అందుబాటులో వుండేది. కానీ సైకిల్ అవసరం ఏర్పడింది. అయితే ఇది తిరిగే సైకిల్ కాదు. స్టేషనరీ సైకిల్. ఆరోగ్యరీత్యా అవసరమని కొన్నాను. అయితే అది వ్యాయామం కన్నా ఎక్కువ ఇతర అవసరాలకు ఉపయోగపడుతూ వస్తుంది.

కొంతకాలం తరువాత ఫ్లాట్ నుంచి విల్లాకు మారిపోయాను. అయినా నా స్టేషనరీ సైకిల్ నాతోనే వుండిపోయింది. కానీ కొంతపాడైపోయింది. దాన్ని వ్యాయామం కోసం ఉపయోగించడం లేదు. ఇతరత్రా అవసరాలకు బాగా ఉపయోగపడుతుంది.

సైక్లింగ్ కానీ వాకింగ్ కానీ క్రమం తప్పకుండా చేయాలని మా డాక్టర్ కాంతిలాల్ షా చెప్పారు. అప్పుడు డిగ్రీ చదువుతున్నప్పటి నా సైకిల్ గుర్తుకొచ్చింది. మా రాజనర్సు గుర్తుకొచ్చాడు. ఇక్కడ విల్లాలో కావాల్సినంత ఖాళీ స్థలం వుంది. అందుకని సైకిల్ తీసుకుంటే ఉపయోగమే.

సైకిల్ అవసరం వుండదని ఎప్పుడో డిగ్రీ అయిపోయిన తరువాత అనుకున్నాను. కానీ దాని అవసరం ఇంతకాలం తరువాత ఏర్పడింది.

అంతే కాదు, జీవితం ఓ సైకిల్ అన్న విషయం బోధపడింది.

మంగారి రాజేందర్ జింబో

94404 83001



Next Story

Most Viewed