గ్రామీణ విద్యార్థిని కలల సాక్షాత్కారం..'కమలి ఫ్రమ్ నడుకావేరి'

by Disha edit |
గ్రామీణ విద్యార్థిని కలల సాక్షాత్కారం..కమలి ఫ్రమ్ నడుకావేరి
X

హిళా ప్రాధాన్యత కలిగిన సినిమాలు అంటే సాధారణంగా మనకు కనిపించే దృశ్యం ఏమిటి? పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్లు, కలెక్టర్లు వంటి గౌరవనీయమైన కులీన వర్గ పాత్రల్లో హీరోయిన్ల ప్రవేశంతో పాటు, హీరోలకు మించి యాక్షన్ సినిమాల్లో విలన్లను దంచి పారేయడం వంటి ధీరోదాత్తమైన పాత్రల్లో మహిళలు వెలిగిపోవడమే కదా. కానీ తమిళ సినిమా వీటికి భిన్నంగా సరికొత్త మహిళా ప్రాధాన్యత కలిగిన సినిమాల వైపు నెమ్మదిగా అడుగులేస్తున్న సూచనలు కనబడుతున్నాయి. వీటిలో కొన్ని వాణిజ్యపరంగా కూడా విజయం పొందడంతో ఈ కోవలో మరిన్ని వాస్తవిక సినిమాలు వచ్చేందుకు మార్గం కూడా సుగమమవుతోంది. ఈ కోవ సినిమాల్లోకి 'కమలి ఫ్రమ్ నడుకావేరి' చేరిపోయింది. ఎలాంటి మసాలాలు లేకుండా, కేవలం లాభాల కోసం గ్రాఫిక్స్ జిమ్మిక్కులు, ఫారిన్ టూర్లు, హీరోయిన్ల డ్యాన్సులు వంటి చమక్కులతో సినిమా రీల్స్‌ను చుట్టేయడానికి బదులుగా ఇలాంటి నిజాయితీతో కూడిన ప్రయత్నాలకు వీక్షకులు ప్రోత్సాహం కూడా తోడైతే మరిన్ని ప్రయోగాత్మక చిత్రాలు చోటు చేసుకుంటాయనడంలో సందేహమే లేదు.

కథేంటంటే..

కలలు కనడం, అందులోనూ పెద్ద పెద్ద కలలు కనడంలో పట్టణ, గ్రామీణ హద్దులు ఉండవని వాచ్యంగా సూచించిన చిత్రం కమలి ఫ్రమ్ నడుకావేరి (Kamali From Naducauvery). తంజావూరు సమీపంలోని చిన్నపాటి గ్రామం నడుకావేరిలో నివసించే ప్లస్ వన్ విద్యార్థిని కమలి (ఆనందిని). ఆ ఊరిలో ఉన్న రిటైర్డ్ ప్రొఫెసర్ అరి ఉదయ్ నంబి (ప్రతాప్ పోతన్)ని లక్ష్యంగా చేసుకున్న కమలి వీలు కుదిరినప్పుడల్లా అతడిని టీజ్ చేస్తుంటుంది. ఆమెను పట్టుకోవాలని అతడు ఎంత ప్రయత్నించినా చిక్కదు. ఒకరోజు కమలి టీవీలో ఒక ప్లస్ టూ టాపర్ ఇంటర్వ్యూ ని చూస్తూ వెంటనే అతడి ఆకర్షణలో పడుతుంది. ప్రతిష్టాత్మకమైన మద్రాస్ ఐఐటీలో చదవడానికి తాను వెళుతున్నట్లు అతడు ఆ ఇంటర్వ్యూలో చెప్పడంతో తన కలల రాకుమారుడిని చేజ్ చేయడానికి తాను కూడా ఐఐటీలో చేరాలని ఆమె కోరుకుంటుంది. అయితే ఒక సగటు విద్యార్థిని అయిన కమలి అన్ని అవరోధాలను అధిగమించి భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలో సీటు సంపాదించగలుగుతుందా? తాను కోరుకున్న వ్యక్తిని చేరుకుంటుందా లేదా అన్నది చిత్ర కథాంశం.

సీబీఎస్ఈ నేషనల్ టాపర్, చెన్నయ్‌కి చెందిన అశ్విన్ ఇంటర్వ్యూ చూసేంతవరకు సాధారణమైన పల్లెటూరు అమ్మాయిలా అల్లరి చిల్లరిగా గడిపిన కమలి షణ్ముగం ఆ తర్వాత తనలాంటి మామూలు అమ్మాయికి ఐఐటీలో చేరడం సామాన్యమైన విషయం కాదని అర్థమై తమ మంచి స్నేహితురాలు వల్లి సాయం కోరుతుంది. ఈలోపు ఆమె తండ్రి షరతు పెడతాడు. స్టేట్ బోర్డ్ స్కూల్ పరీక్షలు తప్పినట్లయితే తమ బంధువులబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేస్తానంటాడు. రిటైర్డ్ ప్రొఫెసర్ అరివుదయ్ నంబి సలహా తీసుకోవాలంటూ ఆమె స్కూల్ టీచర్ సుబ్రమణి సలహా మేరకు కమలి అతడి ఇంటికి వెళుతుంది కానీ, గతంలో తాను అల్లరి పట్టించింది ఈ ప్రొఫెసర్‌నే అని తెలిసి హతాశురాలవుతుంది. ఎలాగైనా సరే తనకు కోచింగ్ ఇవ్వాలని ప్రాధేయపడితే అతడు తిరస్కరిస్తాడు. కానీ జీమెయిన్స్, అడ్వాన్స్‌డ్ కోర్సులను ఛేదించే సామర్థ్యం ఆ అమ్మాయికి ఉందని గ్రహించిన ఆ ప్రొఫెసర్ క్షమాపణ చెప్పి ఆమెకు కోచింగ్ ఇవ్వడానికి అంగీకరిస్తాడు. ఆ తర్వాత కోచింగ్ సెషన్లకు క్రమం తప్పకుండా హాజరైన కమలి స్కూల్ పరీక్షల్లో ప్రావీణ్యత ప్రదర్శించడమే కాకుండా, ఎంట్రెన్స్ పరీక్షల్లో కూడా నెగ్గి ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీటు సాధిస్తుంది.

మంచి కథను ఎన్నుకొని..

నటన విషయానికి వస్తే కమలి ఫ్రమ్ నడుకావేరి సినిమా పూర్తిగా ఆనంది షో అనే చెప్పాలి. హైస్కూల్ విద్యార్థినిగా ఆమెను ఆమోదించడం ప్రారంభంలో కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ తన పాత్రకు సంబంధించిన భావ వ్యక్తీకరణలను సినిమా పొడవునా సమర్థంగా ప్రదర్శించడంతో ఆమె తన అనుభవాన్నంతటినీ ధారపోసింది. ప్రొఫెసర్ ఇంట్లో తానెవరు, తన స్థాయి ఏమిటి అని ఆమె గుర్తించడం, ఐఐటీ క్యాంపస్‌లో ఆమె పూర్తిగా పరివర్తన చెందడం సినిమాలోని బెస్ట్ సీన్లలో ఒకటిగా చెప్పవచ్చు. ఆమె అభిమానాన్ని చూరగొన్న అశ్విన్ పాత్రలో రోహిత్ సరఫ్ చక్కగా కనువిందు చేసిన పాత్రను పోషించాడు. సీనియర్ నటుడు ప్రతాప్ పోతన్, తనను ఏడిపించే కమలికి తదనంతరం మెంటర్‌గా ఉంటూ నిజాయితీతో కూడిన ప్రయత్నం చేసే పాత్రను పోషించాడు. కమలి తండ్రి పాత్రలో అళగమ్ పెరుమాళ్, ఫన్నీ టీచర్ పాత్రలో ఇమ్మాన్ అన్నాచ్చి తమ తమ పాత్రలను నీట్‌గా పోషించారు. అలాగే కమలి ఫ్రెండ్ పాత్రను పోషించిన అమ్మాయి అత్యంత సహజంగా కనిపిస్తుంది.

ఒక మామూలు గ్రామీణ విద్యార్థిని తన ప్రేమ సాఫల్యం కోసం పెద్ద కల కనడం, నిజంగా తానెవరు అని కనుగొనే క్రమంలో తన ప్రాధాన్యతలను ఏర్పర్చుకోవడమే ఈ సినిమాకు కేంద్రబిందువైంది. ఆనంది, ప్రతాప్ పాత్రల మధ్య ఘర్షణ, ఆమె జీవిత క్రమంలో అది ఎలాంటి మార్పులను సంతరించుకుంది అనే అంశాన్ని అత్యంత ప్రభావవంతంగా దర్శకుడు మలిచారు. చిత్ర కథ ముగింపును అందరికీ నచ్చేలా చేయడంలో స్క్రీన్ ప్లే అద్భుత పాత్ర పోషించింది. క్లైమాక్స్‌లో రోహిత్ సరఫ్, కమలి పాల్గొన్న క్విజ్ ప్రోగ్రాం ఆసక్తి గొలుపుతుంది. ధీనా దయాలన్ సంగీత స్వరకల్పన, జగదీశన్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ సినిమాకు ప్రాణప్రతిష్ట పోశాయి. గ్రామీణ విద్యార్థిని పెద్ద కలను సహజాతి సహజంగా ఆవిష్కరించడంలో అబ్బుండు స్టూడియోస్ అందించిన ప్రోత్సాహం మాటలకందనిది. తొలి చిత్రాన్ని తీసిన దర్శకుడు రాజశేఖర్ దురైస్వామి మంచి కథను ఎన్నుకోవడమే కాకుండా స్క్రీన్‌ప్లేలో వినూత్న భావాలను పొందుపర్చారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ఫీల్ గుడ్ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్. మసాలాలు, గ్రాఫిక్స్ జిమ్మిక్కులు లేని కథా ప్రాధాన్య చిత్రాలను కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూడవచ్చు. రెండేళ్ల క్రితమే విడుదలై మంచి స్పందనను పొందిన ఈ తమిళ సినిమా ఇతర భాషల్లో డబ్బింగ్ అయినట్లు లేదు.

కె. రాజశేఖర రాజు

73964 94557

Also Read: ఫిల్మ్ తెలంగాణ మొట్టమొదటి ఉత్సవం..



Next Story

Most Viewed