జోడోయాత్ర సక్సెస్ కానీ..మూడింట రెండొంతులు బాకీ!

by Disha edit |
జోడోయాత్ర సక్సెస్ కానీ..మూడింట రెండొంతులు బాకీ!
X

దాదాపు నాలుగువేల కిలోమీటర్లకు పైగా దూరం కాలినడకతో రాహుల్ గాంధీ సాగించిన భారత్ జోడో యాత్ర ఆయన వ్యక్తిగత ప్రతిష్టను పెంచింది. కానీ కాంగ్రెస్ పార్టీ ముందున్న రాజకీయ కర్తవ్యంలో ఇది మూడింట ఒక వంతు మాత్రమే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయాన్ని రూపొందించడం, జనంకి మరింత నమ్మకం కలిగించేలా ప్రతిపక్ష ఐక్యతను సాధించి, మద్దతును కూడగట్టడం. వీటిని పరిపూర్తి చేస్తేనే రాహుల్ పాదయాత్రకు లక్ష్యం సిద్ధిస్తుంది.

కొన్ని సంవత్సరాల తర్వాత దేశ ప్రజల దృష్టిని బాగా ఆకర్షించిన కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ కార్యక్రమం 'భారత్‌ జోడో' యాత్ర ముగిసింది. పార్టీ ముఖ్య నాయకుడు, దేశానికి ముగ్గురు ప్రధానమంత్రుల్ని ఇచ్చిన కుటుంబపు వ్యక్తిగా రాహుల్‌ గాంధీ ఒక పరీక్ష నెగ్గారు. నిందో, నిజమో తెలియకుండా... ఇన్నాళ్లు రాహుల్‌‌పై ఉన్న ఒక విమర్శ తొలగిపోయి, వ్యక్తిగతంగా ఆయన ప్రతిష్ఠ పెరిగింది. ఆయన స్వభావం, వ్యవహార శైలిలోనూ కొంత మార్పు కనిపిస్తోంది. ఇదే క్రమంలో మరో రెండు పరీక్షలకు దీంతో ఆయన అర్హత సాధించినట్టయింది. అవి నెగ్గడం సమకాలీన భారత రాజకీయాలకు తప్పక కొత్త మలుపు అవుతుంది. కన్యాకుమారి నుంచి 140 రోజుల పాటు సాగిన సుదీర్ఘ పాదయాత్రను ముగిస్తూ, విపక్షాల ఉమ్మడి స్వరంతో కశ్మీర్‌లో సోమవారం జరిపిన సభ ఈ 'పరీక్షా పే చర్చ'కు తెర లేపింది. తప్పుబట్టడానికి ఏమీ లేకుండా పలువురి ప్రశంసలు పొందిన యాత్ర విజయవంతమవడం కాంగ్రెస్‌ పార్టీ ముందున్న రాజకీయ కర్తవ్యంలో మూడింట ఒకవంతు ఫలితమే! సాధించాల్సిన రెండు పాళ్ల గెలుపు ఇంకా మిగిలే ఉంది.

ఆ రెండిట్లో ... మొదటిది: దేశపు రెండు కొసల్ని కలుపుతూ 75 జిల్లాల గుండా 4080 కిలోమీటర్ల మేర సాగిన యాత్రలో పట్టుకున్న జనంనాడి, వారి ఆర్తిని, ప్రజల కడగండ్లు, అవసరాలతో కూడిన క్షేత్ర పరిస్థితిని... పార్లమెంటులో ప్రతిబింబించి ప్రస్తుత ప్రభుత్వ విధాన, పాలనా వైఫల్యాలను సమర్థంగా ఎండగట్టడం. ఇక రెండో పరీక్ష: ఇప్పుడున్న బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కాదనుకుంటే ప్రజలకు దక్కే రాజకీయ, సామాజికార్థిక ప్రత్యామ్నాయాన్ని కాంగ్రెస్‌ తరపున రూపొందించి వారికి వివరించడం, విడమర్చడం. జనం మెప్పు పొందడంతో పాటు, ఈ విషయంలో మరింత నమ్మకం కలిగించేలా ఇతర విపక్షాల మద్దతును కూడగట్టడం కాంగ్రెస్‌ పార్టీ ముందున్న ముఖ్య ఎజెండా! ఇవి చేయకుంటే, పెద్ద ఎత్తున వ్యయ`ప్రయాసలకోర్చి జరిపిన పాదయాత్ర సాధించి పెట్టే ప్రయోజనం నామమాత్రమే అవుతుంది!

అవకాశాన్ని మించి బాధ్యత

లోగడ పార్లమెంటు అనెక్స్‌లో, ఉభయసభల సభ్యులకు జరిగిన ఓరియంటేషన్‌ కార్యక్రమంలో ప్రసంగిస్తూ కేంద్ర మాజీ మంత్రి, మాజీ గవర్నర్‌, దివంగత నేత పి.శివశంకర్‌ ఒక మాట చెప్పారు. 'ప్రజలకు మేలు చేయని ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం, ఎండగట్టడం, దించడం (అప్పోజ్‌, ఎక్స్ పోస్, డిపోజ్‌) విపక్షాల కార్యాచరణ మాత్రమే కాదు, రాజ్యాంగం కల్పించిన బాధ్యత' అన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'భారత్‌ జోడో' కాంగ్రెస్‌కు 'ఓట్ల జోడింపు యాత్ర' అవుతుందా? లేదా? అనే చర్చను కొందరు పనిగట్టుకొని లేవనెత్తినప్పటికీ, పార్టీ ముందున్న తక్షణ కర్తవ్యం అది కాదు. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ముందు తనను తాను నిరూపించుకోవాలి. దేశంలోనే అత్యున్నత చట్టసభ పార్లమెంటు వేదికగా సదరు బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలి. ముందు ప్రజలకు ఈ విషయంలో విశ్వాసం కలిగించాలి. తద్వారా మిగతాది దానంతట అదే జరిగిపోతుంది. విద్వేషం- విభజన భావనలు, అసాధారణ ద్రవ్యోల్బణం, పెరిగిన ధరలు, నిరుద్యోగిత, సామాజిక అసమానతలు, వ్యవసాయ దయనీయత... వంటి అంశాలే ప్రాతిపదికగా సాగిన యాత్ర సాధారణ జనం దృష్టికన్నా సగటు ఆలోచనా పరులు, మేధావుల దృష్టిని ఎక్కువగా ఆకర్షించింది. అప్పటివరకు నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ తదుపరి కార్యాచరణకు ఈ యాత్ర కొత్త ఊపిరులూదింది.

1999 ఎన్నికల్లో. వరుసగా రెండో సారి ఓటమి తర్వాత తెలుగునాట కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశానిస్పృహల్లోకి జారిపోయాయి. ఆర్థిక సరళీకరణల తర్వాత, ప్రపంచ బ్యాంకు నిర్దేశాల నీడలో పాలన గతితప్పి ప్రజలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న గడ్డుకాలమది. అప్పుడు 'ప్రజాప్రస్థానం' పాదయాత్ర తలపెట్టిన డా.వైఎస్‌.రాజశేఖరరెడ్డి జనక్షేత్రంలో ఎదురైన పరిస్థితుల్ని చట్టసభలో ఎత్తిచూపారు. ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ప్రజాక్షేత్రమే లాబొరేటరీగా తాను గడించిన అనుభవాలతో రాజకీయ ఎజెండా రచించి, సామాజికార్థికాంశాల్ని ఎన్నికల ప్రణాళిక చేయడంతో ప్రజలు ఆయన్ని నమ్మారు. ఓట్లు, సీట్లు ఇచ్చి అధికారం అప్పగించారు. ఫలితంగానే ఉచిత విద్యుత్తుతో పాటు ఆరోగ్యశ్రీ, ఫీజు-రీఇంబర్స్‌మెంట్‌, జలయజ్ఞం, పావలావడ్డీ...వంటి ఎన్నో పథకాలు అమల్లోకొచ్చాయి. ఆయన తనయుడు 2014 ఓటమి తర్వాత 'ప్రజాసంకల్ప యాత్ర' రచించి, నడిచి, జనాన్ని కలిసి, 'నేను ఉన్నాను, నేను విన్నాను' అంటూ రూపొందించిన 'నవరత్నాలే' 2019లో ఆయనకు గెలుపు బాటలు పరిచాయి. మొన్న చంద్రబాబు, నేడు లోకేష్‌ పాదయాత్రలతో చేస్తున్నది కూడా అదే ప్రయత్నం. రాహుల్‌కు భిన్నమైన రహదారులేమీ ఉండవు.

కొత్త విశ్వాసం కలిగించాల్సిందే!

విపక్ష శిబిరానికి సంబంధించి ఒక విచిత్ర పరిస్థితి నేడు దేశంలో నెలకొని ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి కాంగ్రెస్‌ ప్రత్యామ్నాయం కాజాలదు. కాంగ్రెస్‌ రహిత విపక్ష కూటమికి బలం, సత్తువా సరిపోవు గనుక దానికి మనుగడ లేదు. దీన్ని అధిగమించేందుకు చేసిన యత్నాలన్నీ పురుట్లోనే సంధికొట్టాయి. నేటి 'భారత్‌ జోడో' ముగింపు సభ కూడా విపక్షాల అనైక్యతనే ఎత్తి చూపింది. అందరూ బీజేపీ`ఆరెస్సెస్‌ పాలనను గద్దె దించాలనే వారే! కానీ, ఐక్య విపక్ష కూటమిగా కలిసి రాలేని వారి నిస్సహాయతకు తాజా పరిస్థితి అద్దం పట్టింది. 21 పార్టీలకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆహ్వానం పంపితే వేర్వేరు కారణాలు చెప్పి ముఖ్యమైన వారు ఎగ్గొట్టారు. మమతా బెనర్జీ, నితీష్‌ కుమార్‌, అఖిలేష్‌ యాదవ్‌, లాలూ ప్రసాద్‌యాదవ్‌/తేజస్వీ యాదవ్‌ వంటి ముఖ్యనాయకులెవరూ సభకు రాలేదు. 'కీలకమైన ప్రజా సమస్యల నుంచి వారి దృష్టిని మళ్లించి... విభజన, విద్వేషాల వైపు జనాన్ని పాలకులు నడుపుతున్న ప్రస్తుత సంక్షుభిత దుస్థితిని ప్రతిఘటించడానికి, విపక్షాలన్నీ కలిసి గట్టి గొంతుక వినిపించాల్సిన అవసరం ఉంది' అని ఖర్గే తన ఆహ్వాన పత్రంలో పేర్కొన్నారు.

'దేశం ఈ రోజు రాజకీయ, ఆర్థిక, సామాజిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, పార్లమెంటులోనూ విపక్షాల గొంతు నొక్కుతున్నార'ని సదరు లేఖలో పేర్కొన్నారు. జోడో యాత్ర ముగింపునకు ఒకరోజు ముందు, ఆదివారం లాల్‌చౌక్‌ వద్ద భారత జాతీయ పతాకాన్ని ఎగురవేస్తూ రాహుల్‌ కూడా 'విపక్షాలకు భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు! కానీ, బీజేపీ`ఆరెస్సెస్‌ కి వ్యతిరేకంగా వారంతా ఏకమౌతారు' అని ఆశావహంగా మాట్లాడారు. ఈ దేశంలో విపక్షాలకొక కొత్త నమ్మకాన్నీ, విశ్వాసాన్నీ కల్పించాల్సిన బాధ్యత కూడా తమపైనే ఉందని కాంగ్రెస్‌ గ్రహించాలి.

ప్రేమ గెలిచే సంకేతం!

'రాహుల్‌ యాత్ర ఇలా ఉండాలి' 'కాదు, అలా ఉంటే ఇంకా బావుండేది!' అంటూ... దేశం నలుమూలల నుంచీ ఎన్నో సూచనలు, సలహాలు వచ్చాయి యాత్ర పొడుగునా! కిందటేడు మే నెలలో, ఉదయ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ చింతన్‌ బైటక్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు సెప్టెంబరు 7న మొదలెట్టి, కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు ఈ యాత్ర సాగింది. ఓట్ల కోణంలో ఇది పెద్దగా ప్రభావం చూపిన యాత్ర కాదని గుజరాత్‌ ఎన్నికల ఫలితాలే కాదు ఇటీవలే వెల్లడైన సీఓటర్‌-ఇండియా టుడే సర్వే ఫలితాలూ తేల్చి చెప్పాయి. దేశంలో రాజస్థాన్‌, ఛత్తీస్‌ఘడ్‌ తర్వాత పార్టీకి దక్కిన మూడో రాష్ట్రంగా ఇటీవలే హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ గెలిచినా.... భారత్‌ జోడో ప్రభావంతో కాదని, స్థానికాంశాలతో సమర్థంగా పోరాడటం, పాలక బీజేపీలో లుకలుకలే కారణమని విశ్లేషణలు వచ్చాయి.

అయినా, రాహుల్‌ యాత్రకు మంచి స్పందన లభించింది. 'తమ కష్టాలు చెప్పుకున్నారు. నాకెంతో సహకరించారు. నన్ను తనవాడిగా ప్రేమ చూపారు, నాకు కంటతడి పెట్టించిన దేశ ప్రజలకు నేనెంతో రుణపడి ఉన్నానం'టూ, కశ్మీర్‌ ముగింపు సభలో, గడ్డకట్టే మంచులోనూ గుండె అట్టడుగు నుంచి రాహుల్‌‌కు మాటలు పెగిలాయి. కాంగ్రెస్‌ సీనియర్లు, ఇతర పార్టీల నాయకులే కాకుండా రాజకీయేతర ప్రముఖులు కూడా యాత్ర పొడుగునా రాహుల్‌తో కాలు కదిపి స్ఫూర్తినిచ్చారు. రఘురామరాజన్‌ (ఆర్బీఐ మాజీ), అరుణరాయ్‌ (ఎమ్కేఎసెస్‌), యోగేంద్ర యాదవ్‌ (సీఎస్‌డీఎస్‌), మేధాపాట్కర్‌ (హక్కుల యోద్ద), సుజాతారావ్‌ (ఎక్స్‌ సర్వీస్‌), గణేష్‌ దేవి (రైటర్‌-కల్చరల్‌), మృణాల్‌ పాండే (జర్నలిస్టు), బెజవాడ విల్సన్‌ (నోబెల్‌ గ్రహీత) ఇలా ఎందరెందరో పాల్గొన్నారు.

ఎలాంటి తెచ్చిపెట్టుకున్నతనం లేకుండా... స్థిరత్వం, చిత్తశుద్ధి, నిబద్దతతో ప్రజల కోసం, వారితో మమేకమై రాహుల్‌ చురుకుగా, చలాకీగా జరిపిన యాత్రగా మన్ననలు లభించాయి. తన స్వభావానికి విరుద్ధంగా, ఎక్కడా నోరుపారేసుకోకుండా హూందాగా యాత్ర జరిపారనే పేరొచ్చింది. 'విద్వేషంతో ఎప్పుడూ, ఏదీ గెలువలేము. ఏదైనా ప్రేమతో గెలవాల్సిందే!' అనే సందేశం కూడా తన ప్రసంగంతోనే కాదు యాత్ర ద్వారా తెలిపారాయన. దశాబ్దాల కింద 'యంగ్‌ టర్క్‌' ముద్రతో ఒక ప్రెషర్‌గ్రూపులో క్రియాశీలంగా ఉండిన మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ తర్వాత అంతగా ప్రాధాన్యత సంతరించుకున్న రాజకీయ పాదయాత్ర ఇదేనేమో! విద్వేష రాజకీయాలకు ఇప్పటికిప్పుడు విరుగుడు లభించకపోయినా... ఒక ఆరోగ్యవంతమైన చర్చకు, తిరస్కరణకు భూమిక లభించినట్టయింది. దాంతోపాటే జనాల్ని పీకల్లోతు కష్టాల్లోకి నెట్టిన సామాన్యుల రోజువారీ దయనీయ స్థితి, పెరుగుతున్న ఆర్థిక అసమానతలు కూడా చర్చనీయాంశాలు అయ్యాయి. ఇవన్నీ రేపు చట్టసభల్లో చర్చకు వచ్చి, విధాన నిర్ణయాలను ప్రభావితం చేయగలిగితే దేశ రాజకీయాల్లో 'భారత్‌ జోడో' యాత్ర మేలు మలుపే!

-ఆర్‌.దిలీప్‌రెడ్డి,

పొలిటికల్‌ అనలిస్ట్‌, పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,

[email protected],

9949099802

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Also Read...

అదానీ వ్యాపార సామ్రాజ్యంలో కల్లోలం




Next Story

Most Viewed