ఇదీ సంగతి:పర్యావరణ పరిరక్షణ బాధ్యత లేదా?

by Disha edit |
ఇదీ సంగతి:పర్యావరణ పరిరక్షణ బాధ్యత లేదా?
X

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు ఎంతోమంది రాజీవ్‌గాంధీ జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ గనిని చూస్తూనే ఉంటారు. ఈ గని వలన జరుగుతున్న పర్యావరణ విధ్వంసం కళ్లకు కట్టినట్టు కనిపిస్తూనే ఉంటుంది. అయినా, వారంతా సోయి లేనట్లుగానే వ్యవహరిస్తున్నారు. సింగరేణికి ఈ విధ్వంసం కనిపించదు. ఎందుకంటే, సంస్థకు బొగ్గు ఉత్పత్తి, లాభాలతోనే పని. నాలుగు మొక్కలు నాటి తమ పని అయిపోయిందనుకుంటుంది. ఇలా చాలావరకు ఓపెన్‌ కాస్ట్ గనులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గోదావరికి ప్రమాదకరంగా ఉన్న ఇందారం ఓపెన్‌కాస్ట్ గని మీద ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ఒక కన్ను వేయాలి. అవసరం అయితే సందర్శించాలి. ఓపెన్‌ కాస్ట్ వలన మంచిర్యాల, మందమర్రి, శ్రీరాంపూర్, గోదావరిఖని, భూపాలపల్లి, ఇల్లందు, మణుగూరు పట్టణాలు దుమ్ము ధూళి లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. గోదావరి నీరు కలుషితం అవుతోంది.

ది తెలంగాణ గోదావరి తీరంలోని పర్యావరణ పరిరక్షణ విషయం. భవిష్యత్తు తరాల సంక్షేమం కోసం మనం ఏం మిగుల్చుతున్నామని ప్రశ్నించుకునే అవసరం. ఆషామాషీ అంశం అస్సలు కాదు. అభివృద్ధి పేరు మీద జరిగే విధ్వంసం బాధ్యతలు మోసేవారికి సోయి ఉండాలి. 'ఇల్లు పీకి పందిరి' వేస్తున్నారు. ఇదే అభివృద్ధి, సంక్షేమ రాజకీయం అనుకుంటే ఎలా? 'కాదేది అధికారానికి మించి అతీతం' అనే పరిస్థితి ఉంటోంది. మానవత్వం, మనిషితనం హుష్‌కాకి అయిపోయింది. ప్రశ్నించినోడు వ్యవస్థలకు, బ్యూరోక్రాట్లకు, రాజకీయ నేతలకు, పార్టీలకు, సంస్థలకు శత్రువు కింద లెక్కకు వస్తున్నాడు. నిజం జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తంగా పరిస్థితి 'తమకు మించిన ధర్మం లేదు' అన్నట్టుగా అయిపోయింది.

పదవుల కోసం ఆశపడే కొందరు ఇదే అద్భుత అభివృద్ధి అంటూ చంకలు గుద్దుకుంటూ చప్పట్లు కొడుతున్నారు. గుడ్డిగా గడప దాటి బోర్లా పడుతున్నారు. అసలు విషయానికి వద్దాము. తెలంగాణలోని గోదావరి తీరమంతటా బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. మరో 150 ఏండ్లు తవ్వి తీసినా తరగని నల్ల బంగారం ఉంది. 10 వేల మిలియన్ టన్నుల బొగ్గు తవ్వి తీయాలి. ఇంకా అన్వేషణ సాగుతోంది. 130 సంవత్సరాల చరిత్ర సింగరేణికి ఉంది. దేశంలోనే మొట్ట మొదటి ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి. దేశానికి స్వాతంత్య్రం రాకముందు నుంచే ఇది ప్రభుత్వ రంగంలో ఉండడం విశేషం. కేంద్ర వాటా 49 శాతం, రాష్ట్ర వాటా 51 శాతంతో సంస్థ కార్యకలాపాలు జరుగుతున్నాయి.

పెత్తనమంతా రాష్ట్రానిదే

సింగరేణి సీఎండీ నియామకం మొదలు అడ్మినిస్ట్రేషన్ అంతా రాష్ట్రానిదే. అందుకే, దేశంలో ఎక్కడా లేని విధంగా ఏడేండ్లు కావస్తున్నా ఒకే ఒక ఐఏఎస్ అధికారి నడిమెట్ల శ్రీధర్ సింగరేణికి సీఎండీ గా కొనసాగుతున్నారు. ఇది చరిత్రాత్మక విషయం. తన పని తీరు తీరు తో ఆయనకు ఇలాంటి అరుదైన సువర్ణావకాశం లభించింది. గత రెండు దశాబ్దాలుగా మంచి వృద్ధి సాధించి లాభాలలో నడుస్తున్న సంస్థ సింగరేణి. ఆర్‌హెచ్ ఖ్వాజా, ఏపీవీఎన్ శర్మ, నర్సింగరావు, సుతీర్థ భట్టాచార్యలాంటి దిగ్గజ ఐఏఎస్‌లు సింగరేణిని గాడిన పెట్టి కాపాడారు. నర్సింగరావు సింగరేణికి 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ తెచ్చారు. సంస్థ వృద్ధి రేటును పెంచడంలో అద్భుత కృషి చేసారు. ప్రస్తుతం శ్రీధర్ పీరియడ్‌లో వృద్ధి రేటు అద్భుతంగా పెరిగింది. లాభాలు పుష్కలంగా వస్తున్నాయి. సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. దేశంలో నంబర్ వన్ అయింది సింగరేణి.

గతంలో రెండు సార్లు నష్టాలలలోకి తోయబడి బీఐఎఫ్ఆర్‌లోకి వెళ్లి బయట పడిన ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ. ఇందుకోసం అప్పటి ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు, సీఎండీలు, యూనియన్ నాయకులు కృషి చేసారు. కార్మికులు, సూపర్‌వైజర్‌లు కష్టపడ్డారు. గట్టెక్కించారు. ఆ కష్ట ఫలితాలే రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న లాభాలు. లాభాలలో వాటాగా కార్మికులకు, అధికారులకు బోనస్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్మికులకు లాభాలలో వాటా బోనస్ ఇవ్వడం ప్రారంభించారు. చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని పట్టు బట్టి అమలు చేయించింది ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి. సింగరేణి యూనియన్ అధ్యక్షులు దివంగత కె ఎల్. మహేంద్ర. ఈ విషయాన్నీ ఎవరూ కాదనలేరు.

నాడు అనేక అవకాశాలు

ఇక్కడ గతంలో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయి. భూగర్భ గనులను వరుసగా ప్రారంభించడానికి ప్రణాళికలు రూపొందించి, పరుగు పందాలు పెట్టి బరువులు లేపే పోటీ పెట్టి విరివిగా ఉద్యోగాలు ఇచ్చిన రోజులు. ఓపెన్‌ కాస్ట్ గనులు తక్కువ తవ్విన కాలం. సింగరేణిలో 40కిపైగా కొత్త గనులు, 65 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని 1989లో సింగరేణి తన శత వార్షికోత్సవ ప్రణాళికలో చెప్పింది. ఆ తరువాత ప్రధానిగా వచ్చిన పీవీ నరసింహారావు నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు, గ్లోబలైజేషన్ లాంటి పాలసీలను అమలు చేశారు. దీంతో అటు కోల్ఇండియాలోనూ, ఇటు సింగరేణిలోను కొత్త గనుల తవ్వకానికి, ఉపాధికి గండి పడింది.

26 సార్లు వీఆర్ఎస్, గోల్డెన్ హ్యాండ్ షేక్ అమలు చేశారు. 1 లక్షా 16 వేల నుంచి మ్యాన్ పవర్ 65 వేలకు తగ్గింది. డిపెండెంట్ ఉద్యోగాలు రద్దు అయ్యాయి. భూగర్భ గనులను సైతం ఓపెన్ కాస్ట్ గనులుగా మార్చడమే కాదు కొత్తగా ఓపెన్ కాస్ట్ గనులు వచ్చాయి. వేల ఎకరాలలో పంట పొలాలు, 120కి పైగా గ్రామాలు ధ్వంసం అయ్యాయి. కనీసం భూములు గ్రామాలు త్యాగం చేసిన వారికి ఉద్యోగాలు ఇవ్వలేదు. తినే కంచం ఇచ్చి ఎంగిలి మెతుకుల మాదిరిగా అరకొర పరిహారం అందుకోవాల్సి వచ్చింది. తెలంగాణ వచ్చాక సింగరేణిలో కార్మికుల ఇన్‌వ్యాలీడేషన్ ద్వారా డిపెండెంట్ ఉద్యోగాలను సీఎం కేసీఆర్ ఆదేశంతో ప్రారంభించారు. భూములకు పరిహారం పెరిగింది తప్ప నిర్వాసితులకు ఉపాధి రాలేదు. కార్మికుల సంఖ్య ఇప్పుడు 42 వేలకు పడిపోయింది. ఔట్ సోర్సింగ్ భారీగా పెరిగింది. కాంట్రాక్టీకరణ వచ్చింది.

పునరావాసంలోనూ అక్రమాలు

వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలలో ఆదివాసీ గ్రామీణ ప్రాంతాలలో పెద్ద విధ్వంసమే జరిగింది. ఆశించిన స్థాయిలో పునరావాస కార్యక్రమాలు అమలు కాలేదు. ఇందులోనూ అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇంకా పరిహారం పెంపు, చెల్లింపులు, పునరావాసంపై ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఓపెన్ కాస్ట్ గనులు వద్దని ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. చిత్తం వచ్చినట్లు పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతూ ఓపెన్ కాస్ట్ గనులను తవ్వుతూనే ఉన్నారు. మూతపడిన భూగర్భ గనులను ఓపెన్‌ కాస్ట్ గనులుగా మార్చుతున్నారు. మంచిర్యాల జిల్లాలో ఇందారం ఓపెన్ కాస్ట్ గని గోదావరికి ఆనుకుని ఉంటుంది. గోదావరి పరిరక్షణకు, మనుషులకు ఇది అత్యంత ప్రమాదకరమైనది.

అసలు ఈ గనికి ఎలా అనుమతి ఇచ్చారో అంతు చిక్కని విషయం. గోదావరి కలుషితం అవుతున్న దృశ్యం చూస్తుంటే దుఃఖం వస్తుంది. అనర్థాలకు కారణం అయిన ఇందారం ఓపెన్ కాస్ట్ గనిని ప్రారంభించవద్దని దివంగత కె. బాలగోపాల్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, ప్రజా గాయకుడు గద్దర్, ప్రొఫెసర్ కోదండరాం, హక్కుల నేతలు, జర్నలిస్టులు, ఇందారం గ్రామస్తులు ఆందోళన చేశారు. అయినా, పర్యావరణ విభాగాలను, నాయకులను మేనేజ్ చేసుకుని, అనుమతులు పొంది గనిని ప్రారంభించారు. ఈ గనిని సందర్శించిన వారికి, గోదావరి బ్రిడ్జిపై నుంచి వెళ్లినవారికి గని మట్టి కుప్పలు గోదావరిని ఎలా ముంచుతున్నాయో కనిపిస్తుంది.

కంటికి కనిపిస్తున్నా

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు ఎంతోమంది రాజీవ్‌గాంధీ జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ గనిని చూస్తూనే ఉంటారు. ఈ గని వలన జరుగుతున్న పర్యావరణ విధ్వంసం కళ్లకు కట్టినట్టు కనిపిస్తూనే ఉంటుంది. అయినా, వారంతా సోయి లేనట్లుగానే వ్యవహరిస్తున్నారు. సింగరేణికి ఈ విధ్వంసం కనిపించదు. ఎందుకంటే, సంస్థకు బొగ్గు ఉత్పత్తి, లాభాలతోనే పని. నాలుగు మొక్కలు నాటి తమ పని అయిపోయిందనుకుంటుంది. ఇలా చాలావరకు ఓపెన్‌ కాస్ట్ గనులు బీభత్సం సృష్టిస్తున్నాయి.

గోదావరికి ప్రమాదకరంగా ఉన్న ఇందారం ఓపెన్‌కాస్ట్ గని మీద ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ఒక కన్ను వేయాలి. అవసరం అయితే సందర్శించాలి. ఓపెన్‌ కాస్ట్ వలన మంచిర్యాల, మందమర్రి, శ్రీరాంపూర్, గోదావరిఖని, భూపాలపల్లి, ఇల్లందు, మణుగూరు పట్టణాలు దుమ్ము ధూళి లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. గోదావరి నీరు కలుషితం అవుతోంది. ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించాలి. ఇది పర్యావరణం పరిరక్షణకు సంబంధించిన విషయం.

ఎండీ మునీర్

జర్నలిస్ట్. కాలమిస్ట్

99518 65223

Read Disha E-paper

Next Story