ఎఫ్ఆర్ఓ హత్య బాధ్యత ఎవరిది?

by Disha edit |
ఎఫ్ఆర్ఓ హత్య బాధ్యత ఎవరిది?
X

పోడు భూములపై తమ వైఖరి తెలియజేయకుండా ఎన్నికల సమయంలో కమిటీల పేరుతో కాలం వెళ్లదీస్తూ ఆదివాసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ రాజకీయ పబ్బం గడుపుతున్నారు. వారికి పట్టాలిచ్చి పోడు సమస్యను పరిష్కరిస్తే ఇలాంటి ఘటనలు జరగవు కదా? అందుకే ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్యగా ఆదివాసీ సమాజం భావిస్తున్నది. ఆదివాసీలు సైతం ఓపికతో ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయాలి. చట్టాన్ని చేతులలోకి తీసుకొని ఇలాంటి హత్యలు చేయకూడదని మేధావులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై ఫారెస్ట్ అధికారులు కూడా అవగాహన కల్పించాలి. పోడు భూముల గురించి ప్రజలకు వివరించాలి. దౌర్జన్యంగా దాడులు చేసి కేసులు పెట్టడం వంటివి చేయకుండా సమన్యాయం పాటించాలి.

మొన్న చండ్రుగొండలో జరిగిన ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ హత్య దురదృష్టకరం. అటవీ శాఖ అధికారులపై దాడులకు దిగడం చట్టరీత్యా నేరం. కానీ, నిన్న చండ్రుగొండలో జరిగిన ఘటనకు కారణం ఎవరన్నది మాత్రం తెలుసుకోవాలి. పోడు భూముల గురించి సరైన నిర్ణయం తీసుకోకుండా కాలక్షేపం చేస్తున్న ప్రభుత్వానిది తప్పు కాదా? 'ఎన్నో సంవత్సరాలుగా పోడు చేస్తున్నాం. భూముల మీద హక్కు కల్పించండి మహాప్రభో' అని ఆదివాసీలు ఎన్నోసార్లు అధికారులను వేడుకున్నారు. అయినా, కావాలని నిర్లక్ష్యం చేసిన అధికారుల దురాగతాల ఫలితమే ఎఫ్ఆర్ఓ హత్య అని ఆదివాసీ మేధావులు విశ్లేషిస్తున్నారు.

ఆ దురాగతాల సంగతేమిటి?

ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ హత్యను ఖండించి, దోషులను కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరి, గతంలో అటవీ శాఖ అధికారులు ఆదివాసీలతో ఏ విధంగా వ్యవహరించారో, ఎలాంటి దురాగతాలకు పాల్పడ్డారో తేల్చడానికి, క్షేత్రస్థాయిలో నిజాలేమిటో తెలుసుకోవడానికి జిల్లా జడ్జితో విచారణ జరిపించాలని కూడా ఆదివాసీలు కోరుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాలు, వారి అభ్యున్నతి, ఏజెన్సీ చట్టాల అమలు గురించి ప్రభుత్వాలు చేస్తున్న కృషిపై నివేదికను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి సాధారణ ప్రజలు, ఆదివాసీలు కనిపించడం లేదని, వారి అభ్యున్నతి, సంస్కృతిపై ఏమాత్రం పట్టింపు లేదని మండిపడుతున్నారు.

ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనేతరులకు అక్రమంగా భూమి పట్టాలు మంజూరు చేసి, వారిని ప్రోత్సహించి వత్తాసు పలుకుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన షెడ్యూల్ ప్రాంతంలో శాంతియుత వాతావరణం క్రమంగా తగ్గి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తున్న వారిని తక్షణమే మైదాన ప్రాంతాలను పంపించేయాలి. ఆదివాసీలకు సంపూర్ణ హక్కులు కల్పించి, శాంతియుత వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికారులపైనే ఉందని ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. పోడు భూములకు సంబంధించి అటవీ హక్కుల చట్టం అమలు పరచడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి పరోక్షంగా ప్రభుత్వమే ఆదివాసీలకు అధికారులకు మధ్య తగాదాలు సృష్టిస్తున్నది. దాడులకు ప్రభుత్వమే ఉసిగొల్పేలా చేస్తున్నది. తీరా ప్రాణాల మీదకు వచ్చేసరికి ఆదివాసీలపై ఆ నేరం నెట్టివేస్తున్నది.

అప్పుడు స్పందించలేదేం?

మొన్న జరిగిన అటవీ శాఖ అధికారి హత్యను ఖండిస్తున్న ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు మరి, ఇదే అటవీ శాఖ అధికారులు గతంలో అనేక చోట్ల ఆదివాసీ ప్రాంతాలలో, ఏజెన్సీలో ఆదివాసీ మహిళల మీద, చిన్నారుల మీద దాడులు చేసి వారి పంటలను, ఇళ్లకు నిప్పు పెట్టినప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఖండించేవారంతా ఆదివాసీలపై మూత్రం పోసినప్పుడు ఎక్కడకు పోయారు? అప్పుడు ఎందుకు స్పందించలేదు? ఇది ప్రజాస్వామ్యమేనా? అని ఆదివాసీలు ప్రశ్నిస్తున్నారు. మైదాన ప్రాంతాలవారి నుంచి డబ్బులు తీసుకుని వారిని ఆదివాసీలపైకి ఎగదోస్తున్నారు. వారు అడవులను నాశనం చేస్తుంటే పట్టించుకోకుండా, ఆదివాసీలు పోడు చేస్తుంటే ఆపుతూ 'అడవి వినాశనాన్ని అడ్డుకుంటున్నం' అంటూ గొప్పలు చెప్పుకుంటున్నది అధికారులు కాదా? ఇప్పటికైనా అలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఏజెన్సీ చట్టాలను అమలుపరిచాలి.

ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇస్తామని, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చనిపోయిన శ్రీనివాస్‌ను తిరిగి తీసుకురాగలరా? పోడు భూములపై తమ వైఖరి తెలియజేయకుండా ఎన్నికల సమయంలో కమిటీల పేరుతో కాలం వెళ్లదీస్తూ ఆదివాసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ రాజకీయ పబ్బం గడుపుతున్నారు. వారికి పట్టాలిచ్చి పోడు సమస్యను పరిష్కరిస్తే ఇలాంటి ఘటనలు జరగవు కదా? అందుకే ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్యగా ఆదివాసీ సమాజం భావిస్తున్నది. ఆదివాసీలు సైతం ఓపికతో ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయాలి. చట్టాన్ని చేతులలోకి తీసుకొని ఇలాంటి హత్యలు చేయకూడదని మేధావులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై ఫారెస్ట్ అధికారులు కూడా అవగాహన కల్పించాలి. పోడు భూముల గురించి ప్రజలకు వివరించాలి. దౌర్జన్యంగా దాడులు చేసి కేసులు పెట్టడం వంటివి చేయకుండా సమన్యాయం పాటించాలి.


వూకె రామకృష్ణ దొర

ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

9866073866


Next Story