కథా సంవేదన: భగవంతుడు గొప్పవాడేనా..?

by Disha edit |
కథా సంవేదన: భగవంతుడు గొప్పవాడేనా..?
X

ఆ మధ్య ఓ కథ రాశాను. బీచుపల్లి దగ్గర బస్సు ప్రమాదం గురించిన కథ అది. ఆ కథ ఇలా వుంటుంది.

"కర్నూలుకి వెళ్తున్న బస్సు కృష్ణానదిలో పడి బస్సులోని ప్రయాణికులందరూ చనిపోతారు.చివరి క్షణంలో బస్సు మిస్ అయి మా మిత్రుడు ఒకడు ఆ బస్సు ప్రమాదం నుంచి తప్పించుకుంటాడు. ఆ విషయం మా మిత్రులందరికీ తెలిసింది. ఉదయాన్నే వెళ్లి వాడిని కలిసాం. వాడి ఆనందానికి అవధుల్లేవు. ఇల్లంతా పండుగ వాతావరణం. అతని భార్య మా అందరికీ స్వీట్స్ తెచ్చి ఇచ్చింది. కాఫీ కూడా తెచ్చి ఇచ్చింది. మిత్రులందరు వాడిని అభినందిస్తూ మాట్లాడుతున్నారు. నేనూ అభినందించాను. నాకు సంతోషంగానే ఉంది కానీ ఆ బస్సు ప్రమాదం జరుగకపోతే మరెంత బాగుండేదనిపించింది. అలా అనిపించిన విషయం ఎవరికీ చెప్పలేదు. ఎవరితో అనలేదు. నాలో నేనే అనుకున్నాను. ఆలోచించాను.

మా మిత్రుడు అన్న ఒకే ఒక్క మాట - ‘గాడ్ ఈజ్ గ్రేట్’ (భగవంతుడు గొప్పవాడు) అక్కడ చేరిన మా మిత్రులంతా అదే మాట. భగవంతుడు గొప్పవాడు. భగవంతుడు గొప్పవాడు. అతను కాకుండా గొప్పవాళ్లు మరెవరుంటారు అని అనుకున్నాను. అంత గొప్ప భగవంతుడు వాడికి ఒక్కడికే ఎందుకు గొప్పవాడు అయినాడు. మిగతావాళ్లకి ఎందుకు గొప్పవాడు కాలేకపోయినాడు..? ఇదీ నేను నాలో నేను వేసుకున్న ప్రశ్న. ఇదీ కథ.

ఈ కథ రాసి చాలా కాలం అయ్యింది.ఆ సంఘటనని మరిచిపోయిన తరువాత అలాంటిదే మరో సంఘటన జరిగింది. అదీ ఈ మధ్యే.

ఈ మధ్యకాలంలో మా డాక్టర్ మిత్రుడు హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కి కార్లో బయల్దేరాడు. అది అర్ధరాత్రి పూట. పన్నెండు దాటిన తరువాత డ్రైవర్ నిద్రలోకి జారుకున్నాడు. కారు రెండు మూడు పల్టీలు కొట్టి రోడ్డుకి అర ఫర్లాంగు దూరంలో ఆగింది. అనుకోకుండా అటువైపు వచ్చిన రైతులు చూసి డ్రైవర్‌ని, మా మిత్రుడిని కారులో నుంచి బయటకు తీసుకొని వచ్చి వేరే వాహనంలో కరీంనగర్‌కి తరలించారు. మా మిత్రుడికి చిన్న గాయాలు మాత్రమే తగిలాయి. డ్రైవర్‌కి బలమైన గాయాలు తగిలాయి. కాలూ, చెయ్యి కూడా విరిగింది. మా మిత్రుడిని చాలామంది కలిశారు. సంతోషం వ్యక్తపరిచారు. నేనూ కలిసి వాడిని పలకరించాను. నా సంతోషం వ్యక్త పరిచాను.

వాడు, అతని భార్య కూడా ‘భగవంతుడు చాలా గొప్పవాడు’ అని కితాబు ఇచ్చారు. నాలో మళ్లీ ప్రశ్నలు, సందేహాలు. బీచుపల్లి సంఘటన గుర్తుకొచ్చింది. భగవంతుడు గొప్పవాడే. అందులో ఏ మాత్రం సందేహం లేదు. కానీ కొంతమందికి మాత్రమే ఎందుకు గొప్పవాడు అవుతున్నాడు. ఆ కర్నూలు బస్సులో ప్రయాణం చేసిన నలభై మందికి ఎందుకు గొప్పవాడు కాలేదు. వాళ్లని ఎందుకు కరుణించలేదు. అదే విధంగా మా డాక్టర్ మిత్రునికే ఎందుకు గొప్పవాడు అయినాడు? వాడి డ్రైవర్‌కి ఎందుకు గొప్పవాడు కాలేదు. అతన్ని ఎందుకు కరుణించలేదు? ఈ ప్రశ్నలు నన్ను చాలాకాలం నుంచి వెంటాడుతూనే ఉన్నాయి. మళ్లీ అవి నాలో మొదలయ్యాయి. మా మిత్రుడు బాధపడతాడని నేను ఈ విషయం ఏమి ప్రస్తావించలేదు.

ఓ సంవత్సరం గడిచింది. నా ప్రశ్నలు అలాగే నాలో వుండిపోయాయి. ఈ ప్రశ్నల పరంపర నాలో కొనసాగుతుండగానే ఆ మధ్య ఓ ఆధ్యాత్మికవేత్తతో ఓ గంట గడిపే అవకాశం లభించింది. ఈ రెండు వృత్తాంతాలు చెప్పి - ‘భగవంతుడు కొంతమందికి మాత్రమే ఎందుకు గొప్పవాడుగా ఉంటాడు? మిగతా వాళ్లకు ఎందుకు గొప్పవాడుగా ఉండడు?’ అని అడిగాను.

ఆయన చిన్నగా నవ్వాడు. అంతే. మళ్లీ అదే ప్రశ్న అడిగాను. ‘మీరు చెప్పిన రెండు ప్రమాదాల్లో తప్పించుకున్న మీ మిత్రుల కోణం నుంచి చూడండి. భగవంతుడు గొప్పవాడు కాదా?’ అన్నాడు ఆయన. ఆయన ఇచ్చిన సమాధానం నాకు అంతగా సంతృప్తిని కలిగించలేదు. అదే విషయం చెప్పాను. ఇంకా ఏదో రెండు మూడు అనుబంధ ప్రశ్నలు వేశాను. కానీ వాటికి ఇలాంటి సమాధానమే వచ్చింది. "వాళ్ల కోణం నుంచి చూడండి. వాళ్ల కుటుంబ సభ్యుల కోణం నుంచి చూడండి. భగవంతుడు గొప్పవాడని మీకు అనిపిస్తుంది" అన్నాడు.

నేను మరేమీ మాట్లాడలేదు. ఆయన లాజిక్ ముందు నా ప్రశ్నలు నిలవవు. అందుకని మౌనం వహించాను. కానీ నా ప్రశ్నలకి సంతృప్తికరమైన సమాధానాలు లభించలేదు. నిజమే! వాళ్ల కోణం నుంచి చూస్తే భగవంతుడు గొప్పవాడే. కానీ ఆ బీచుపల్లి ప్రమాదంలో మరణించిన కుటుంబాల కోణం నుంచి, ఆ గాయపడ్డ డ్రైవర్ కోణం నుంచి చూస్తే ఆ సమాధానం సంతృప్తికరంగా అన్పించదు.

నా కోణం నుంచి కూడా సంతృప్తి కలగలేదు. వాళ్లు చనిపోవడానికి, గాయపడటానికి మనకు తెలియని కోణం మరేదైనా ఉందా..? నాకు తెలియదు. తోచలేదు కూడా. ఏమైనా భగవంతుడు గొప్పవాడేనా..?

మీరే చెప్పాలి.... కనీసం ఆలోచించాలి.

మంగారి రాజేందర్ జింబో

94404 83001


Next Story

Most Viewed