ఈ కార్మికుల అమానవీయ పరిస్థితులు..

by Disha edit |
ఈ కార్మికుల అమానవీయ పరిస్థితులు..
X

భారతదేశంలోని వేలాది మంది ఈ కామర్స్ వేర్‌హౌస్ కార్మికులు నెలకు రూ. 10,000 -15,000 కంటే తక్కువ వేతనం పొందుతున్నారు. మెటీరియల్‌లను ఎంచుకొని, ప్యాకేజీ చేసేవారు, లోడ్ చేసేవారు రవాణా చేసేవారు ఇలా వారు రోజుకు 10 గంటల పాటు నిలబడి పని చేయాల్సి ఉంటుంది, గంటకు 240 వస్తువులను ప్రాసెస్ చేస్తూ ఉండాలని, కేవలం రెండు సార్లు 10 నిమిషాల విరామం మాత్రమే ఉంటుంది. ఈ గిడ్డంగులలో పని పరిస్థితులు కార్మికుల ఆరోగ్యంపై శారీరకంగా ప్రభావితమే కాకుండా వారి గౌరవానికి భంగం కలిగిస్తున్నాయి. ఈ కార్మికులకు రోజువారీ లక్ష్యాలు ఇస్తూ వాటిని చేరుకోవడంలో వైఫల్యం చెందితే కాంట్రాక్టు రద్దు చేయవచ్చు. ప్రత్యేకంగా మహిళా కార్మికులు వారి బహిష్టు సమయాల్లో భయంకరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే వారు ఎక్కువ గంటలు, విరామం లేకుండా విపరీతమైన నొప్పితో పాటు అసౌకర్యాన్ని భరిస్తూ పని చేయవలసి వస్తుంది. పైగా కార్మికులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి సైతం అనుమతి లేదు.

మహిళా కార్మికుల స్థితి అమానుషం

ఈ కార్మికులకు రోజువారీ లక్ష్యాలు ఇస్తుంటారు. వాటిని వారు చేరుకోవడంలో వైఫల్యం చెందితే కాంట్రాక్టు రద్దు చేయవచ్చు. మహిళా కార్మికులు వారి బహిష్టు సమయాల్లో భయంకరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే వారు ఎక్కువ గంటలు, విరామం లేకుండా విపరీతమైన నొప్పితో పాటు అసౌకర్యాన్ని భరిస్తూ పని చేయవలసి వస్తుంది. కార్మికులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా అనుమతి లేదు. వారు "దాదాపు రోబోట్" లాగా పని చేయవలసి వస్తుంది. ఉదాహరణకు, ఈ కంపెనీల అవుట్‌బౌండ్ డిపార్ట్‌మెంట్‌లోని ఒక కార్మికుడు ఒక గంటలో 600 ప్యాకేజీలపై లేబుల్‌లను ఉంచాలని ఆదేశం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని కార్మికుడు చేరుకోకపోతే కార్మికుడిని మందలించడం, కొన్నిసార్లు బహిరంగంగా అవమానించడం లేదా కార్మికుడిని ఉద్యోగం నుండి తొలగించే పరిస్థితులు ఉన్నాయి. ఈ గిడ్డంగులలో పని పరిస్థితులు కార్మికుల ఆరోగ్యంపై శారీరకంగా ప్రభావితమే కాకుండా వారి గౌరవానికి భంగం కలిగిస్తున్నాయి.

గాయపడినా పని చేయాల్సిందే

కార్మికులు గాయపడినప్పుడు కూడా, వారికి కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేసేంతవరకు పనిని కొనసాగించవలసి వస్తుంది. వారు అలా చేయడంలో విఫలమైతే, లేదా వైద్య సహాయం కోసం అనుమతి కోరితే, వెంటనే రద్దు చేస్తామని బెదిరిస్తారు. ముప్ఫై నిమిషాలు ఆహార విరామంలో, గేట్ వద్ద భద్రతా తనిఖీ కోసమే పదిహేను నిమిషాలు వెచ్చించే పరిస్థితి. ఈ కంపెనీల వేర్‌హౌస్ కార్మికులందరూ కాంట్రాక్ట్‌పై నియమించబడతారు. ఒక కార్మికుడు ఈ వేర్‌హౌస్‌లో ఎనిమిదినెలలకు పైగా పని చేస్తున్నప్పటికీ, వారి ఒప్పందాలు అకస్మాత్తుగా రద్దు చేయబడతాయి. ఈ కార్మికులకు స్థిరమైన వేతనాలు లేదా ఏ విధమైన సామాజిక భద్రత లేదు. వారికి వేతనంతో కూడిన సెలవులు, ప్రసూతి సెలవులు లేదా మరే ఇతర ఉద్యోగ ప్రయోజనాలు లేవు.

కనీస కనికరం లేని దోపిడీ

ఈ కనికరంలేని దోపిడీని అమెజాన్ కార్మికులు ప్రతిఘటిస్తున్నారు. భారతదేశంలోని ఈ-కామర్స్ గుత్తాధిపత్య సంస్థ అమెజాన్ కార్మికులు వారి కఠినమైన పని పరిస్థితులకు వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించారు. వారు అమెజాన్ ఇండియా గ్లోబల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ హెడ్, అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్, భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రి భూపేందర్ యాదవ్‌కు లేఖ రాశారు. తమ లేఖలో వారు పని చేయాల్సిన అమానవీయ పరిస్థితులను ఎత్తిచూపి డిమాండ్లను హైలైట్ చేశారు. అన్ని అమెజాన్ గిడ్డంగుల్లోని కార్మికులందరికీ సమాన వేతనాన్ని అందించాలని, అలాగే కనీస వేతనం రూ.25,000, దీపావళి బోనస్ రూ.20,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలని, 200 రోజులు పనిచేసిన కార్మికులందరినీ క్రమబద్ధీకరించాలని, 240 రోజులు పనిచేసిన కార్మికులందరికీ పర్మినెంట్ హోదా కల్పించాలని, విధి నిర్వహణలో ప్రమాదాల బారిన పడిన కార్మికులందరికీ తగిన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళా కార్మికులపై వేధింపులు జరగకుండా నిబంధనలు అమలు చేయాలని, ముఖ్యంగా మహిళా కార్మికులకు విశ్రాంతి, పరిశుభ్రమైన టాయిలెట్, విశ్రాంతి గది సౌకర్యాలు కల్పించాలని, కార్మికుల శారీరక మానసిక సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని మానవీయ కోణంలో ఆలోచించాలని అమెజాన్ కార్మికులు కంపెనీ యాజమాన్యాన్ని కోరారు. నోటీసు లేకుండా తమ జాబ్‌కార్డులను కంపెనీ ఏకపక్షంగా బ్లాక్ చేయడాన్ని అరికట్టాలని, తమ కుటుంబాలపై వేధింపులను ఆపాలని కోరారు. అమెజాన్ కార్మికుల డిమాండ్ పూర్తిగా న్యాయమైనది.

ఆళవందార్ వేణు మాధవ్

86860 51752



Next Story

Most Viewed