వాహనాలేమో 1 శాతం.. ప్రమాదాలేమో 11 శాతం!

by Ravi |
వాహనాలేమో 1 శాతం.. ప్రమాదాలేమో 11 శాతం!
X

ప్రపంచం మొత్తం మీద జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 11 శాతానికి పైగా ఒక్క భారతదేశంలోనే జరుగుతున్నాయి. అయితే మన దేశంలోని వాహనాల శాతం ప్రపంచంతో పోలిస్తే.. ఒకే ఒక్క శాతం. ఒక్క శాతం వాహనాలతో పదకొండు శాతం ప్రమాదాలు చేస్తున్నామంటే రహదారి భద్రతలో మనం ఎంత దయనీయ స్థితిలో ఉన్నామో తెలుస్తోంది.

రోడ్డు ప్రమాదాలను అంకెలు, శాతాల దృష్టిలో చూస్తే ఏదో మామూలు విషయంలానే అనిపిస్తుంది. కానీ ఆ అంకెలు ప్రాణాలవి. ప్రతి గంటకు దేశంలో జరుగుతున్న ప్రమాదాలు 53 అయితే పోతున్న ప్రాణాలు 19 అంటే రోజుకు 456. సంవత్సరానికి రోడ్డు బలి తీసుకుంటున్న ప్రాణాలు లక్షా అరవై ఐదు వేలకు పైగానే.. ఇలా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో అత్యధికులు యుక్త వయస్కులే..!

రోడ్లు సరిగా లేకున్నా..

పది పదిహేనేళ్ళ క్రితం ఈ రోడ్డు ప్రమాదాలను, మరణాలనూ చూసి పలు దేశాలు కలవరపాటుకు గురయ్యాయి. అందుకే ఆ దేశాలు అత్యంత విశాలమైన రహదారులు నిర్మించుకున్నాయి. అయితే, యూరప్‌ దేశాలు వాహనాల వేగాలను నియంత్రించడం ద్వారా 50 శాతానికి పైగా మరణాలను నియంత్రించగలిగాయి. మన పొరుగుదేశం చైనా వాహనాల తయారీ దశలోనే వేగనియంత్రణ చేయించి తమ పౌరుల ప్రాణాలను కాపాడుకుంటోంది. వాహనాల వేగాన్ని నియంత్రించడం ద్వారా 30% రోడ్డు ప్రమాదాలను నియంత్రించే అవకాశం ఉంటుందని నిపుణులు నివేదిస్తుంటే పట్టుమని పది నిమిషాల పాటు తిన్నగా వెళ్ళలేని రహదార్ల మీదకు ఆరేడు సెకన్లలో వంద కి.మీల వేగాన్ని అందుకునే వాహనాలు వస్తుంటే గుడ్లప్పగించి చోద్యం చూస్తున్న ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలు, మరణాలు దైవాధీనాలు అని భావిస్తున్నట్లు అనిపిస్తోంది.

ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో కుటుంబం మృతి అనే వార్త దాదాపు ప్రతిరోజు దినపత్రికలో కనిపిస్తూనే ఉంటుంది. 50 కి.మీ.లకు ఒక టోల్‌గేటు చొప్పున పెట్టుకొని టోలుఫీజు వసూలు చేసే సంస్థలు, నేషనల్‌ హైవే అథారిటి ఆఫ్‌ ఇండియా అధికారులు అలా జాతీయ రహదారులపై లారీలు ఎక్కడపడితే అక్కడ ఆగకుండా గట్టి చర్యలు కూడా తీసుకోలేకపోతున్నారంటే వారివెంత పాషాణ హృదయులో కదా..! నివాస ప్రాంతాలకు దూరంగా వేయవలసిన రహదారులు వ్యాపారస్తుల ప్రయోజనాల కోసం వారి ఒత్తిళ్ళకు లొంగి పట్టణాల మధ్యనుండి వేయడం చూస్తుంటే మన దగ్గర ఏదైనా సాధ్యమే ఒక్క భద్రత తప్ప అనిపించక మానదు.

బాధ్యతే.. ప్రాణాలు కాపాడుతుంది..!

రోడ్డు ప్రమాదాలకు కారణం కేవలం ప్రభుత్వ నిర్లిప్త వైఖరి మాత్రమే కాదు. ప్రజల బాధ్యతా రాహిత్యం కూడా. చిన్న చిన్న పట్టణాలే కాదు. హైదరాబాద్‌, బెంగుళూరు, ముంబై, ఢిల్లీ లాంటి మహానగరాల్లోని వారికి ట్రాఫిక్‌ నియమ నిబంధనల గురించి కనీస పట్టింపు ఉండదు. లైన్‌ డ్రైవింగ్‌ పాటించరు, యుటర్న్‌ తీసుకొనేటపుడు అవతల ట్రాఫిక్‌ తగ్గేవరకు వేచి ఉండేంత ఓపిక ఉండదు. రెడ్‌ సిగ్నల్‌ పడ్డా నిర్లక్ష్యంగా ముందుకెళ్ళడంలాంటి ఉల్లంఘనలు మనకు నిత్యకృత్యం.

పది మీటర్ల దూరానికి, దానికి ఖర్చయ్యే పెట్రోల్‌కి లెక్కలు కట్టి పిల్లల్ని స్కూలుకు తీసుకెళ్ళే తల్లిదండ్రులు రాంగ్‌రూట్‌ ఎంచుకుంటే ఆ పిల్లలకు మనమేం నేర్పుతున్నట్లు. త్వరగా వెళ్లడానికి మార్గం అక్రమమైనా తప్పులేదని సంకేతాలు ఇవ్వడమే కదా! హారన్లు తప్ప డ్రైవింగ్‌లో బుద్ధిని వాడని మన అల్పబుద్ధిని చూసి ప్రపంచం ఇప్పటికే నవ్వుకుంటోంది. చిన్న వాహనం కొనాలన్నా, అడ్వాన్స్‌ ఇవ్వాలన్నా, ఇంటికి తేవాలన్నా మహూర్తాలు చూడటం, వాహన పూజ, ప్రతీ కారు లోపల ఉండే ఆయా మతాల దేవుళ్ళ ప్రతిమలు, బొమ్మలూ ఇవ్వన్ని కూడా మన నమ్మకాలు మాత్రమే. కానీ కేవలం నమ్మకాలు మాత్రమే ప్రాణాలను కాపాడేట్టయితే మన దేశం రోడ్డు ప్రమాదాలలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండేది కాదు. నమ్మకాలతోపాటు డ్రైవింగ్‌ నిబంధనల గురించి, చట్టాల గురించి తెలుసుకోవడం, వాహనం నడిపే సమయంలో అనుక్షణం అప్రమత్తతతో ఉండడం, తగిన విశ్రాంతి లేకుండా వాహనాన్ని నడపకుండా ఉండడంలాంటివి తప్పక పాటించాలి.

నరసింహ ప్రసాద్‌ గొర్రెపాటి

9440734501



Next Story

Most Viewed