అతి విశ్వాసంతోనే ఆశాభంగం

by Ravi |
అతి విశ్వాసంతోనే ఆశాభంగం
X

18వ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు.. ప్రతిపక్ష ఇండియా కూటమికి మోదాన్ని, అధికార బీజేపీకి కాస్త ఖేదాన్ని కలిగించాయని చెప్పాలి. బీజేపీని అధికారం నుండి తొలగించడానికి సైద్ధాంతిక వైరమున్న పార్టీలన్నీ కలిసి 'ఇండియా' పేరుతో కూటమి కట్టి, బీజేపీ వ్యతిరేక ఓటును చీలిపోకుండా పగడ్బందీ వ్యూహాన్ని పన్నినట్టు ఎన్నికల ఫలితాలు తెలియజేశాయి.

బీజేపీపై ఇండియా కూటమి నేతల దుష్ప్రచారం దేశంలో ముస్లిం ఓటర్లు కన్సాలిడేట్ కావడానికి బాగా ఉపకరించినట్లు ఈ ఎన్నికల ఫలితాలు తెలిపాయి. బీజేపీ మూడో దఫా అధికారంలోకి వస్తే ఉమ్మడి సివిల్ కోడ్ ఏర్పాటు చేసి, ముస్లిం ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని, అక్రమ చొరబాటుదారుల విషయంలో ఎన్ఆర్‌సీ అమలు చేస్తుందని, నిమ్నవర్గాలకు ఉండే రిజర్వేషన్లు తీసేస్తుందని, ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మారుస్తుందని కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలను ముస్లింలు, క్రైస్తవులు బాగా విశ్వసించారు. ఉత్తర భారతంలో హిందుత్వ నాయకుల అతి విశ్వాసం బీజేపీ కొంపముంచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. బీజేపీ ఈ ఎన్నికల్లో వెనుకబడిపోవడం హిందుత్వాభిమానులను నిరాశ, నిస్పృహలకు గురిచేసింది. మొత్తం మీద ఈ దఫా సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ ఓటర్లు సమతుల్యత పాటించారనే చెప్పాలి.

ఎన్నికల ఫలితాలు కౌంటింగ్ మొదలైన గంటలోపే ఇండియా కూటమి దాదాపు 100 సీట్లలో లీడింగ్‌లోకి వచ్చింది. మధ్యాహ్నం రెండు గంటల వరకు 230 స్థానాల్లో లీడింగ్‌ను కొనసాగింది. 2019 ఎన్నికల్లో 303 సీట్లు సాధించిన బీజేపీ ఈ సారి 37.76 శాతం ఓట్లను సాధించింది. ఉత్తర భారతంలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ హర్యానాలలో బీజేపీ వెనుకబడిపోవడం హిందుత్వాభిమానులను నిరాశ, నిస్పృహలకు గురిచేసింది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అనేక సీట్లలో వెనుకబడిపోవడం, కాంగ్రెస్‌తో జతకట్టిన సమాజ్ వాది పార్టీ అనూహ్య విజయ పరంపరతో ముందుకు వెళ్లడం ఊహించింది కాదు. ఇందుకు కారణం లేకపోలేదు. యాదవ్ ముస్లిం కాంబినేషన్ ఇక్కడ బాగా పనిచేసింది. మాయావతి ఆధ్వర్యంలోని బహుజన సమాజ్ వాదీ పార్టీ నిష్క్రియత్వాన్ని ప్రదర్శించడం అంతర్జాతీయ సంస్థల కుట్రగా భావించాలి. ఈ రాష్ట్రంలో హిందుత్వ నాయకుల అతి విశ్వాసం బీజేపీ కొంపముంచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్నటక వంటి దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ తన ప్రభావాన్ని ఊహించిన దానికంటే ఎక్కువగానే చూపిందని చెప్పాలి. ఒరిస్సా, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన ఫలితాలను సాధించడం ఆ పార్టీకి కొంత ఊరట కలిగించే విషయమే!

వ్యతిరేక ఓటు చీలనందున..

బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి అసెంబ్లీ ఎన్నికలలో, లోక్‌సభ ఎన్నికల్లో గణనీయమైన విజయాన్ని సాధించి, అధికారం చేపట్టబోతోంది. ఎన్డీఏ కన్వీనర్‌గా చంద్రబాబునాయుడు కొనసాగాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోరడం అనూహ్యంగా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఇండియా కూటమి ప్రయత్నించినట్లే, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఎన్డీఏ కూటమి నాయకులు జాగ్రత్త పడ్డారు. కూటమి కట్టిన బీజేపీ, టీడీపీ, జనసేన చక్కటి సమన్వయంతో పనిచేయడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఈ విజయం సాధించినట్లు స్పష్టంగా కనబడుతుంది.

కాంగ్రెస్ ఆశలు గల్లంతు

బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని అంతా మోడీ మీదికి నెట్టి, మోడీ ప్రభావంతోనే ఎన్నికల్లో ఓట్లు, సీట్లు వస్తాయంటూ బీజేపీ పార్టీ అనుయాయులు నిష్క్రియాతత్వం ప్రదర్శించినట్లు ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో 400 సీట్లు బీజేపీకి వస్తే విప్లవాత్మకమైన చర్యలను తీసుకుంటుందని కొందరు బీజేపీ నాయకులు చెప్పిన మాటలను వక్రీకరించి, కొన్ని వర్గాల ప్రజలలో అపోహలు, అనుమానాలు కలిగించారు. ఈ విషయంలో బీజేపీ నాయకులు గానీ, వారికి మార్గదర్శనం చేసే హిందుత్వ సంస్థల ప్రతినిధులు గానీ ప్రజలకు వాస్తవాలు వివరించడంలో విఫలమయ్యారని చెప్పాలి. ఎన్నికల ఫలితాల ట్రెండును చూసి కాంగ్రెస్ నాయకులు అనేక ఊహాగానాలకు తెరలేపారు. ఎన్నికల చివరి ఫలితాలలో అనూహ్యంగా మార్పు వస్తుందని, నవీన్ పట్నాయక్, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు ఇండియా కూటమిలో చేరితే బీజేపీని మట్టి కురిపించడం సులభం అనే ఊహాగానాలు ఇప్పటికే మొదలుపెట్టారు. రాజకీయాలలో శత్రువులు, మిత్రులు ఎవరో చెప్పడం కష్టం. భవిష్యత్తులో ఏమైనా జరుగవచ్చు సుమా!

ఉల్లి బాలరంగయ్య,

సామాజిక, రాజకీయ విశ్లేషణలు

94417 37877



Next Story

Most Viewed