ఏపీ రాజకీయం క్లాస్‌ వారా? క్యాస్ట్‌ వారా?

by Disha edit |
ఏపీ రాజకీయం క్లాస్‌ వారా? క్యాస్ట్‌ వారా?
X

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి ఇటీవల పలు ప్రభుత్వ సమావేశాల్లో, పార్టీ కార్యక్రమాల్లో ‘క్లాస్‌ వార్‌’ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ‘క్లాస్‌ వార్‌’ జరుగుతోందని ‘క్యాస్ట్‌ వార్‌’ కాదని పదే పదే చెప్తున్నారు. అయితే, కులాల ప్రభావం ఎలా ఉంటుందో సీఎం జగన్‌కి బాగా తెలుసు. అందుకే, వ్యూహాత్మకంగా కులాలను కప్పిపుచ్చి లబ్ది పొందడానికి ‘క్లాస్‌ వార్‌’ని లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారు. పేదలకు, ధనికులకు మధ్య జరిగే వర్గ పోరునే ‘క్లాస్‌ వార్‌’ అని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి ‘క్లాస్‌వార్‌’ గురించి పదేపదే ప్రస్తావించడం వెనుక రాజకీయవ్యూహం ఉంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ ఓడిపోతే ప్రస్తుతం అందుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయని చెప్పకనే చెబుతున్నారు. అందుకే 2024 ఎన్నికలను పేదలు ధనవంతుల మధ్య పోరుగా మార్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ‘క్లాస్‌వార్‌’ పేరిట ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతోంది ‘క్యాస్ట్ వారే’. ఇందులో ఎటువంటి సందేహం లేదు.

2019 ఎన్నికలకు ముందు వైఎస్‌ఆర్‌సీపీ కమ్మా వర్సెస్‌ నాన్‌ కమ్మా ఫార్ములాను చాపకింద నీరులా ప్రచారం చేయడంతో కమ్మలను వ్యతిరేకించే కులాలన్నీ వైఎస్‌ఆర్‌సీపీకి దగ్గరవడంతో కనీవిని ఎరుగని మెజార్టీతో అధికార పగ్గాలు చేపట్టింది. అయితే 2024లో జరిగే ఎన్నికల్లో కులంకోణం కన్నా ‘క్లాస్‌వార్‌’ కోణం వల్ల ఎక్కువ లబ్ధి చేకూరుతుందని భావిస్తున్న ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికలను ‘క్లాస్‌వార్‌’గా మార్చడానికి వ్యూహరచన చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ‘ఎవ్రిడే క్యాస్టిజం’ నడుస్తోంది. ప్రతీ అంశము కులం కోణమే. దీనికి ప్రధాన కారణం వైఎస్‌ఆర్‌సీపీ అనుసరిస్తున్న విధానాలే. దీనిని రాజకీయ కోణంలో పరిశీలించినప్పుడు కులం ప్రభావం ‘క్లాస్‌ వార్‌’ కంటే చాలా పెద్దది. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కులం పోషిస్తున్న పాత్రను పీపుల్స్‌ పల్స్‌ బృందం క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ వస్తోంది.

2019లో వైఎస్‌ఆర్‌సీపీ అధికారపగ్గాలు చేపట్టడానికి ఏయే సామాజికవర్గాలు అండగా నిలబడ్డాయి, 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఏయే సామాజికవర్గాలు సహకరించాయి, 2024లో జరిగే ఎన్నికల్లో ఆయా సామాజికవర్గాలు, ఆయా పార్టీలకు అండగా వుంటాయా? లేదా? సమీక్షించడమే ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశ్యం. గత ఎన్నికల్లో ఏయే సామాజికవర్గాలు ఏయే రాజకీయ పార్టీలకు మద్దతునిచ్చాయి తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకోవడానికి దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన సీఎస్‌డీఎస్‌ లోక్‌నీతి డేటాను పరిగణలోనికి తీసుకుని విశ్లేషించడం జరుగుతోంది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో జరుగుతున్న అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న మా బృందం ఆయా సామాజికవర్గాల్లో ప్రస్తుతం వస్తున్న మార్పును కూడా నిశితంగా గమనిస్తూ దానికనుగుణంగానే రాజకీయ విశ్లేషణ చేస్తోంది.

వైసీపీ ఓటు బ్యాంక్

రాజకీయాలను నడిపించేది రెండు అంశాలు. అందులో కులం ఒకటి అయితే మరొకటి ధనం. కులాల్లో సైతం నడిపించే కులాలు, వెంబడించే కులాలు అని రెండు వర్గాలుంటాయి. నడిపించే కులాలు ఆయా రాజకీయ పార్టీలలో నాయకత్వ స్థానాల్లో ఉంటే వెంబడించే కులాలు ఆయా పార్టీల గెలుపోటములను శాసిస్తాయి. వైఎస్‌ఆర్‌సీపీని నడిపించేది రెడ్డి సామాజికవర్గం అయితే, ఆ పార్టీకి రెడ్డి సామాజికవర్గంతో పాటు దళితుల్లో మాలలు, ముస్లింలు, క్రిస్టియన్లు, గిరిజనులు, బ్రాహ్మణ సామాజిక వర్గాలు అండగా ఉండే కులాలు. టీడీపీని నడిపించేది కమ్మ సామాజికవర్గం అయితే, బీసీలు, మాదిగలు, క్షత్రియులు, వైశ్యులు, వెలమలు ఈ పార్టీ వెంట నడిచే కులాల జాబితాలోకి వస్తాయి. జనసేనను నడిపించేది కాపులు కాగా, వారిని వెంబడించే కులాల జాబితాలో వారు తప్పా ఇతర కులాల ప్రభావం లేదు. కాబట్టి నడిపే, నడిపించే కులాల పాత్రను క్షుణ్ణంగా పరిశీలిస్తేనే ఆంధ్రా రాజకీయాలను స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం.

2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీకి రెడ్డి, దళితులు, మాల, మాదిగ, గిరిజనుల తదితర సామాజికవర్గాల్లో భారీ మద్దతు లభించింది. రాష్ట్రచరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 86 శాతం రెడ్డి సామాజికవర్గం మద్దతు వైసీపీకి లభించింది. 2014 ఎన్నికలతో పోలిస్తే ఇది 22 శాతం అధికం. దళితుల సామాజికవర్గం విషయానికొస్తే 2014లో 57 శాతం మద్దతు ఇవ్వగా 2019లో 76 శాతం, బీసీ విషయానికొస్తే 2014లో 37 శాతం, 2019 వచ్చేసరికి 39 శాతం మద్దతు ఇచ్చారు. ఇక కమ్మ సామాజికవర్గానికి వ్యతిరేకంగా ముద్రపడిన వైఎస్‌ఆర్‌సీపీ 2014తో పోలిస్తే 2019 వచ్చే సరికి 21 శాతం అధికంగా ఈ సామాజికవర్గం మద్దతును కూడగట్టగలిగింది. ఈ అంశాన్ని టీడీపీ నాయకులు, కమ్మ సామాజికవర్గానికి చెందిన ప్రముఖ నాయకులు ఏకీభవించరు. అయితే వాస్తవాలను ఎవరూ దాచలేరు. 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీకి కేవలం 20 శాతం మంది మాత్రమే కాపు సామాజిక వర్గం మద్దతిచ్చింది. 2014 ఎన్నికలతో పోలిస్తే ఈ సామాజికవర్గంలో 29 శాతం ఓట్లను వైఎస్‌ఆర్‌సీపీ కోల్పోయింది. రాయలసీమలో అత్యధిక శాతం ఉన్న ముస్లింలు 2019లో వైఎస్‌ఆర్‌సీపీకి కేవలం 49 శాతం మాత్రమే మద్దతిచ్చారు. 2014తో పోలిస్తే 17శాతం ఓట్లు కోల్పోవాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం బీజేపీ పట్ల వైఎస్‌ఆర్‌సీపీ సానుకూలంగా వ్యవహరించడమే. బలమైన అన్ని సామాజికవర్గాల్లో పట్టు సాధించడం వల్లే 2019లో వైఎస్‌ఆర్‌సీపీ భారీ మెజార్టీతో విజయం సాధించలిగింది. 2019లో మద్దతిచ్చిన వివిధ సామాజికవర్గాలు 2024లో జరిగే ఎన్నికల్లో కూడా వైఎస్‌ఆర్‌సీపీకి అదేస్థాయిలో మద్దతిస్తాయా లేదా అనే దానిపై వారి విజయావకాశాలుంటాయి.

టీడీపీ ఓట్‌బ్యాంక్

టీడీపీ ఆవిర్భావం నుండి ఎన్నడూలేని విధంగా 2019 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు నేతృత్వంలోని పరాజయాన్ని ఎదుర్కొంది. దీనికి ప్రధాన కారణం స్వయంకృతాపరాధమే. ఆవిర్భావం నుండి వెన్నుముకగా నిలిచిన బీసీ సామాజికవర్గాన్ని ఆ పార్టీ నిర్లక్ష్యం చేయడం, సామాజిక న్యాయం పాటించకపోవడం, సోషల్‌ ఇంజనీరింగ్‌ పాటించడంలో విఫలమవడం, కమ్మ సామాజికవర్గానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే భావనను తొలగించుకోకపోవడం. 2019 ఎన్నికల్లో ఘోరపరాజయం పొందిన తరువాత అయినా వాటినుండి గుణపాఠాలు నేర్చుకోకుండా పాతపద్ధతిలోనే రాజకీయాలు కొనసాగించడం, కమ్మ సామాజికవర్గమే పార్టీలో పెద్దన్న పాత్ర పోషించడం వంటివి టీడీపీకి ఇప్పటికీ నష్టం చేకూరుస్తున్నాయి. 2014లో 72 శాతం మంది ‘కమ్మ’ సామాజికవర్గం టీడీపీకి ఓటేస్తే, 2019లో అది 60 శాతానికి దిగజారింది. బీసీల్లో మార్పు వచ్చినప్పుడల్లా టీడీపీ ఓడిపోతూ వస్తున్నది. 1989, 2004, 2009, 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి ప్రధాన కారణం బీసీ ఓట్లు తగ్గడమే! మొత్తం జనాభాలో సుమారు 55 శాతం ఉండే బీసీలు గెలుపోటములు నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తారు. 2014లో 54 శాతం మంది బీసీలు టీడీపీకి ఓటేస్తే, 2019లో ఈ సంఖ్య 46 శాతానికి పడిపోయింది. బీసీల్లో ముఖ్యంగా యాదవులు టీడీపీ ఆవిర్భావం నుంచి మద్దతుగా నిలబడ్డారు. కానీ, 2019లో యాదవులు వైసీపీకి 50 శాతం, టీడీపీకి 41 శాతం మాత్రమే మద్దతు ఇచ్చారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ కాపులకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందనే కోపంతో బీసీలు ఆ పార్టీకి దూరమైనట్లు క్షేత్రస్థాయిలో సంకేతాలు కనిపిస్తున్నాయి. టీడీపీలో బీసీ పెద్ద నాయకులమని చెప్పుకునే వారంతా ఆయా వర్గాల ఓట్లను సమీకరించడంలో విఫలమయ్యారు.

1995లో చంద్రబాబు సీఎం అయ్యాక, ఎస్సీల వర్గీకరణ చేపట్టారు. నాటి నుంచి ఎస్సీల్లో ఉపకులమైన మాదిగలు టీడీపీకి మద్దతు ఇస్తూ వచ్చారు. 2014 ముందు వరకు కాంగ్రెస్‌, టీడీపీలకు మాదిగల మద్దతు దాదాపు సమానంగా ఉండేది. కానీ, 2019లో సగానికి పైగా వైఎస్సార్సీపీ వైపు మళ్లారు. 2019లో వైఎస్సార్సీపీకి 64 శాతం మంది మాదిగలు ఓట్లు వేస్తే, టీడీపీకి 30 శాతం మందే ఓట్లేశారు. అలాగే 2019లో టీడీపీకి రెడ్డి సామాజికవర్గం కేవలం 7 శాతం మాత్రమే మద్దతిచ్చారు కానీ 2014లో వీరిది 30 శాతం. అలాగే 2019లో టీడీపీ బీజేపీకి ఎదురు తిరగడం వలన ముస్లిం సామాజికవర్గంలో 13శాతం మద్దతును పెంచుకోగలిగింది. 2014లో బీజేపీతో కలిసి పోటీ చేసిన టీడీపీకి 33 శాతం ముస్లింలు మద్దతివ్వగా, అది 2019లో 46 శాతానికి పెరిగింది. బీజేపీతో పొత్తుపెట్టుకున్నప్పుడల్లా టీడీపీకి ముస్లిం ఓట్లు తక్కువగా వస్తున్నాయి.1999, 2004, 2014లోనూ ఇదే ప్రతిబింబిస్తోంది. 2014లో జనసేనతో కలిసి పోటీ చేసిన టీడీపీకి 49 శాతం కాపు ఓట్లు రాగా, 2019లో విడిగా పోటీ చేయడంతో ఆ ఓట్లు 44 శాతానికి తగ్గాయి. జనసేనతో పొత్తు లేకపోవడం వల్ల టీడీపీ 5 శాతం కాపు ఓట్లను కోల్పోయింది.

జనసేన ఓట్‌బ్యాంక్

జనసేన మొట్టమొదటిసారి పోటీ చేసిన 2019 ప్రత్యక్ష ఎన్నికల్లో కమ్యూనిస్టులు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ 5.6 శాతం సాధించి ఒక్క సీటు గెలుపొందింది. ఈ ఓట్లలో 26 శాతం కాపు సామాజికవర్గం నుండి వచ్చినవే. మిగతావి బీసీలు 7 శాతం, రెడ్లు 3 శాతం, గౌడలు, ఎస్సీలు చెరో ఒక్క శాతం మద్దతు ఇచ్చారు.

2009లో ప్రజారాజ్యం పార్టీకి మొత్తం 18 శాతం ఓట్లు రాగా, అందులో 59 శాతం కాపులవే! ఆ తర్వాతి స్థానంలో బీసీలు 16 శాతం, ఎస్సీలు 9 శాతం మద్దతిచ్చారు. పీఆర్పీతో పోలిస్తే జనసేనకు కాపు ఓట్లు గణనీయంగా తగ్గిపోయాయి. జనసేన పార్టీ నాయకత్వం 2009లో ప్రజారాజ్యం పార్టీ సాధించిన ఓట్లు, సామాజికవర్గాల మద్దతు ఎందుకు కూడగట్టుకులేకపోతున్నామనే అంశంపై మేధోమధనం, ఆత్మపరిశీలన చేసుకుని అన్ని సామాజికవర్గాలను కూడగట్టుకొని ముందుకు వెళ్ళినప్పుడే రాజకీయంగా లబ్ధి కలుగుతుంది. ఆ దిశగా జనసేన నాయకత్వం అడుగులు వేయాలి.

పార్టీలు.. ప్రతికూలాంశాలు

పీపుల్స్‌పల్స్‌ బృందం గత 4 సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఏయే సామాజికవర్గాలు ఏయే రాజకీయ పార్టీలకు మద్దతు ఇస్తున్నాయి, 2019 ఎన్నికల తరువాత వివిధ సామాజికవర్గాల్లో వస్తున్న మార్పులను గమనిస్తోంది. 2024 ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే... వైసీపీ రెడ్డి, దళితులు సామాజికవర్గాల్లో తన మద్దతును క్రమంగా కోల్పోతోంది. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అనేక పదవుల్లో రెడ్డి సామాజికవర్గం వారిని నియమిస్తున్నా వారు సంతృప్తిగా లేరు. దానికి ప్రధానకారణం గ్రామాల్లో రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారి ఆధిపత్యానికి చెక్‌పడడంతో వారి ఉనికికే ప్రమాదమని భావిస్తున్నారు. ముఖ్యంగా వాలంటీర్లకు ఉన్న గౌరవం కూడా తమకు లేదనే భావనలో గ్రామాల్లోని రెడ్డి సామాజికవర్గానికి చెందిన నాయకులు భావిస్తున్నారు. 2019లో వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు మళ్లించడం, దళితులపై దాడులు పెరిగిపోవడం తదితర అంశాలు వైఎస్‌ఆర్‌సీపీకి ప్రతికూలంశాలుగా మారుతున్నాయి. ఖచ్చితంగా ఈ సామాజికవర్గాల్లో టీడీపీ కన్నా ఆధిక్యత కొనసాగినా 2019లో వచ్చినంత మద్దతు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లభించే అవకాశాలు లేవు. అలాగే 2019లో వైసీపీకి మద్దతిచ్చిన ‘కమ్మ’ సామాజికవర్గమంతా తిరిగి టీడీపీ గూటికి చేరుకున్నారు. కేవలం కొంతమంది నాయకులు పేరుకు వైసీపీలో కొనసాగుతున్నారు. ఇక, కాపులు వైసీపీని వర్గ శత్రువులుగా చూస్తున్నారు. తెలంగాణ నుంచి తీసుకెళ్లి ఆర్‌.కృష్ణయ్యకు రాజ్యసభ సీటు ఇచ్చినా...ఆంధ్రా బీసీల్లో వైసీపీ పట్ల సానుభూతి పెరిగిన ఆనవాళ్లు ఎక్కడా కనపడటం లేదు.

ఇక, తెలుగుదేశం విషయానికొస్తే... కమ్మ ఓట్లు తిరిగి టీడీపీ గూటికి చేరినట్టే! టీడీపీ ఆవిర్భావం నుండి చేదోడుగా ఉన్న బీసీ సామాజికవర్గం వారు టీడీపీ నాయకత్వం అనుకున్నంతగా తిరిగి రాలేదు కానీ, కొంతవరకు వచ్చారు. వారిని ఆకర్షించడానికి టీడీపీ నాయకత్వం ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనబడటం లేదు. ఇక టీడీపీ- బీజేపీల పొత్తును ముస్లింలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవేళ టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే, 2019లో వచ్చిన ముస్లిం ఓట్లకంటే ఈ సారి వచ్చే ఓట్లు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. 2024లో జరిగే శాసనసభ ఎన్నికల్లో టీడీపీ గట్టిపోటీ ఇవ్వాలనుకుంటే సోషల్‌ ఇంజనీరింగ్‌పై ప్రత్యేక దృష్టిపెట్టి బీసీలను ఆకట్టుకోవడంతోపాటు, ఆ సామాజికవర్గం నుండి కనీసం 60 శాతం ఓట్లు సాధిస్తేనే రాజకీయ రణక్షేత్రంలో నిలవగలుగుతుంది. దీంతోపాటు ఆ పార్టీ వెన్నెంట నడిచే కులాలను ఆకట్టుకుని ముందుకు వెళ్తేనే టీడీపీకి భవిష్యత్‌ గ్యారంటి ఉంటుంది. లేని పక్షంలో మరోఓటమికి సిద్ధంగా ఉండాల్సిందే.

జనసేనకు 2019తో పోలిస్తే ఈసారి ఓటింగ్‌ శాతం పెరుగుతుంది. జనసేన పార్టీ నాయకత్వం కూడా సకల జనులను, అన్ని సామాజికవర్గాలను ఆకర్షించినప్పుడే ఒకబలమైన రాజకీయశక్తిగా రూపొందుతుంది. సోషల్‌ మీడియా కన్నా సోషల్‌ ఇంజనీరింగ్‌ పై జనసేన నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టి పార్టీ ఒక్క సామాజికవర్గానికి సంబంధించిందనే అపవాదును తొలగించే దిశగా ఆ పార్టీ నాయకత్వం అడుగులు వేయాలి. అప్పుడే ఆ పార్టీకి భవిష్యత్‌ ఉంటుంది.

ఆ పార్టీలు.. నోటాతో పోటీ

ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీని కలిసి ఓడించనక్కర్లేదు. ఓట్లు వేసేవారిలో రెండు మూడు శాతం తమ అభిప్రాయాన్ని మార్చుకుంటే అధికారపగ్గాలు మారిపోయే అవకాశం ఉంటుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనిస్తే 2024 ఎన్నికలు ఏకపక్షంగా మాత్రం జరగవు! హోరాహోరీ పోటీ నెలకొంటుంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలకు ఏ ఒక్క సామాజికవర్గం, సమూహం మద్దతివ్వడం లేదు. వారు నోటాతో పోటీపడుతున్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు తమ ప్రధాన ఓటు బ్యాంకైన ఆయా సామాజికవర్గాల మద్దతును కాపాడుకుంటూనే, ఇతర సామాజిక వర్గాలను కలుపుకుపోయే పార్టీకే విజయావకాశాలు ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, 2024 లో ఏపీలో జరిగే ఎన్నికలు కూడా ‘క్యాస్ట్‌ వారే’ కానీ ‘క్లాస్‌వార్' కాదు.

జి.మురళికృష్ణ,

రీసెర్చర్స్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,

[email protected]

Next Story