కరోనా పెంచిన టీబీ కేసులు

by Disha edit |
కరోనా పెంచిన టీబీ కేసులు
X

దేశంలో కరోనా మహమ్మారి చివరి దశకి చేరింది. కానీ ఇది అనేక ఇతర వ్యాధులను పెంచింది. కరోనా రోగనిరోధక శక్తిపై చాలా ప్రభావం చూపింది. దీనివల్ల చాలా మంది గుండె, ఊపిరితిత్తులు రోగాల బారిన పడి మానసిక ఆరోగ్యం క్షీణించింది. అలాగే కరోనా కారణంగా ఇప్పుడు క్షయవ్యాధి (టీబీ) కేసులు కూడా పెరగడం ప్రారంభించాయి. ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య 20 నుంచి 30 శాతం పెరిగింది. ఆశ్చర్యకరంగా ఈ వ్యాధికి యువత ఎక్కువగా గురవుతున్నారు. గతంలో యువతలో టీబీ కేసులు చాలా తక్కువ. కానీ ఇప్పుడు చిన్న వయస్సులోనే టీబీ బారిన పడటంతో వైద్యులు ఆశ్చర్యపోతున్నారు. ఈ రోగులందరు మొదటగా మూడు వారాల కంటే ఎక్కువగా దగ్గుతో బాధపడుతున్నారు. కానీ అందరు దీనిని సాధారణ ఫ్లూ అనుకుంటున్నారు. కానీ దగ్గు తగ్గకపోవడంతో పాటు ఊపిరితిత్తుల సమస్యలు మొదలవడంతో ఆస్పత్రికి వస్తున్నారు. ఇక్కడ పరీక్షలు చేయగా టీబి తో బాధపడుతున్నట్లు తేలుతోంది. వాస్తవానికి కరోనా సమయంలో టీబీ వ్యాధి తగ్గినట్లు అనిపించింది కానీ అది తగ్గలేదు. దీని కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కోవిడ్‌ వల్ల రోగనిరోధక శక్తి బలహీనపడటంతో సులభంగా టిబీ బారిన పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచంలో ప్రతిరోజు 4,100 మంది టీబీ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే ఏటా 1.22 కోట్ల మంది దీని బారిన పడుతున్నారు.

వీరికే ఈ వ్యాధి ఎక్కువ సోకుతుంది..

గతంలో కలరా, పోలియో వంటి మహమ్మారులను అంతం చేశాం కానీ, క్షయ మాత్రం ఇంకా మానవాళిని వేధిస్తూనే ఉంది. గత యాభై ఏళ్లుగా మనం ఈ వ్యాధిని అంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. కానీ అంతం చేయలేక భంగపడుతూనే ఉన్నాం. డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం ప్రపంచంలో ఉన్న క్షయ వ్యాధిగ్రస్తుల్లో సగానికి పైగా మన దేశంలోనే ఉన్నారు. క్షయ కారణంగా మన దేశంలోనే 4,80,000 మంది ఏటా మరణిస్తున్నారు. రోజుకి 1300 మంది అన్నమాట. ఇంతగా చాప కింద నీరులా క్షయ వ్యాపిస్తున్నా కూడా ప్రభుత్వాలు ఏం చేయలేకపోతున్నాయి. అయితే ఈ వ్యాధి గ్రస్తులు తెలుగు రాష్ట్రాల్లో తక్కువగానే ఉన్నా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, బీహార్‌, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో క్షయ తీవ్రంగా ఉంది. కరోనా ఎంట్రీ ఇచ్చాక, ప్రభుత్వాలు పూర్తిగా తమ దృష్టిని కరోనాపై పెట్టడంతో క్షయ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన వారు చాలా ఇబ్బందులు పడ్డారు.

క్షయ అనేది మైక్రో బాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్‌ అనే బ్యాక్టీరియా వల్ల కలిగే అంటు వ్యాధి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, టీబీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అంటు వ్యాధి సంబంధిత మరణాల రేటుకు కారణం. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ఇది తొమ్మిదవ ప్రధాన కారణం. ఇది ఎక్కువగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. ఇది ఊపిరితిత్తులకు సంబంధించినదైనా, చర్మము నుండి మెదడు వరకు శరీరంలో ఏ భాగానికైనా ఈవ్యాధి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ వ్యాధి పూర్తిగా నయం చేయగలిగినది, నివారించదగినది. ఈ వ్యాధి గాలి బిందువుల ద్వారా ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది. టిబీ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, ఉమ్మినప్పుడు టిబీ ఇన్ఫెక్షన్‌ మరొకరికి సోకే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి వంట పాత్రలు పంచుకోవడం, లాలాజలం ద్వారా ఇంకొకరికి వ్యాధి సంక్రమించదు. ఈ వ్యాధి డయాబెటిస్, హెచ్ఐవి, క్యాన్సర్ రోగులు, అవయవ మార్పిడి చేసుకున్న వారు, స్టెరాయిడ్స్ వాడిన వారికి, కిడ్నీ సమస్యలు ఉన్నవారికి, సిలికోసిస్‌ ఉన్నవారికి, పోషకాహారలోపం, పోగాకు వినియోగం చేస్తున్నవారికి ఎక్కువగా సోకుతుంది. శరీరంలో ఏ భాగానికైనా ఈ వ్యాధి సోకుతుంది. ఇది ఎక్కువగా ఊపిరితిత్తులను ప్రభావితం చేసినా, క్రమంగా ఇతర భాగాలకు సోకుతుంది.

అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి..

ఈ వ్యాధి నిర్మూలనకు చికిత్సలో దీర్ఘకాలం బహుళ యాంటీబయోటిక్స్ ఉపయోగించడం ఉంటుంది. అందుకే రెండువారాలకు మించి దగ్గు ఉంటే వెంటనే ఆస్పత్రిలో టీబీ పరీక్ష చేయించుకోవాలి. ఇది చురుకైన అంటువ్యాధి. ఈ వ్యాధి సోకిన వ్యక్తులకు సరైన వెంటిలేషన్ అవసరం. వీలయినంత ఒంటరిగా ఉండడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా జైళ్లు, నర్సింగ్‌ హోమ్‌లు, అనాధ ఆశ్రయాలు వంటి రద్దీగా ఉండే ప్రదేశాలలో టీబీ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి సంక్రమణ నియంత్రణ చేయాలి. ఈ వ్యాధి సోకిన వ్యక్తులు చికిత్సను మధ్యలో ఆపితే ప్రాణాంతకం. అలాగే పోషకాహారం తీసుకోవాలి.

దేశంలోని ప్రతి పది మంది స్త్రీలలో ఒకరికి ఈ వ్యాధి సోకుతోందని అంచనా. పురుషుడికి ఆ వ్యాధి వస్తే వైద్యం దొరుకుతుంది. కాని స్త్రీకి వస్తే దానిని గుర్తించడంలో ఆలస్యం చేయవద్దు. వైద్యం నిర్లక్ష్యం చేయడం మానండి. స్త్రీ ఆరోగ్యమే కుటుంబ ఆరోగ్యం. ఆమె దగ్గుతూ వుంటే అది పోపు వల్ల వచ్చిన దగ్గు అనుకోకుండా వెంటనే వైద్యం చేయించండి. స్త్రీలు ఈ వ్యాధిపై విజయం సాధించాలంటే ప్రజా ప్రతినిధులు, పాలనా వ్యవస్థ ప్రచార, చైతన్య కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలి. వ్యాధి సోకితే మందులు వాడుతూ, విశ్రాంతి తీసుకుంటూ, పౌష్టికాహారం తీసుకుంటే టీబీ సులభంగా నయం అవుతుంది. కానీ స్త్రీలకు విశ్రాంతి, పౌష్టికాహారం దొరకడం కష్టం. ఇప్పటికీ చాలా మందికి టీబీ సోకితే నెలకు పౌష్టికాహారం కోసం రూ.500 ఇస్తారన్న సంగతి తెలియదు. అలాగే టీబీ సోకిన వ్యక్తిని వివక్షతో చూడకూడదు. ప్రభుత్వం దీని పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఏడాది మార్చి 24న పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా అది ఇంకా పెంచాలి. టిబీ సోకిన వ్యక్తికి మానసిక ధైర్యం కలిగించి క్షయ వ్యాధిని నిర్మూలించడంలో సహకరిద్దాం.

(నేడు ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా)

డా. ఎం. రాజీవ్

ఎం.డి పల్మొనరీ మెడిసిన్ (ఉస్మానియా)

94943 49922

Next Story

Most Viewed