రాజధానిలో పేదలకు ఇళ్లు ఉండొద్దా?

by Disha edit |
రాజధానిలో పేదలకు ఇళ్లు ఉండొద్దా?
X

మూడు రాజధానుల అంశం, అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై వైసీపీ, టీడీపీ మధ్య విభేదాలు, విమర్శలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. అయితే ఇందులో ఎవరి రాజకీయాలు, ఆర్థిక ప్రయోజనాలు వారికి ఉన్నాయి. చివరికి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వవద్దనే స్థాయికి ఈ విభేదాలు చేరాయి. అయితే ఈ ప్రాంతంలో భూముల కేటాయింపుపై టీడీపీ నాయకత్వంలోని కొందరు రైతులు మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో పేదలకు భూములు ఇస్తే సమతుల్యత దెబ్బతింటుందని, అభివృద్ధి కుంటుబడుతుందని వింతగా చెబుతున్నారు.

నిజానికి ఈ ప్రక్రియ 2021లోనే వైసీపీ మొదలుపెడితే రైతులు హైకోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకోవడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. కానీ 2022 అక్టోబర్ లో వైసీపీ ప్రభుత్వం సీఆర్డీఏ చట్టం-2014 కి మార్పులు చేసి, చట్టంలోని సెక్షన్ 53(డి) ప్రకారం ల్యాండ్ పూలింగ్ కింద సేకరించిన మొత్తం భూమిలో 5% భూమిని గృహ నిర్మాణాలకు కేటాయించవచ్చన్న అంశాన్ని ఆధారం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం చట్టంలోని సెక్షన్ 41 లో మార్పులు చేసింది. దీనినే ఆర్- 5 జోన్ అంటారు. ఈ సవరణలపై గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. దీంతో ఆ భూమికోసం గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని కురగల్లు, నిడమర్రు, కృష్ణాయపాలెం, తుళ్లూరు మండలం లోని మందడ, ఐనవోలు గ్రామాల పరిధిలోని భూములు 11 వందల ఎకరాలను ఇండ్ల నిర్మాణం కోసం కేటాయిస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. గత సంవత్సరం చేసిన చట్టాలకు అనుగుణంగా 2023 మార్చి 31న జీవో నెం.45 విడుదల చేసింది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో 50 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది.

ఇండ్ల స్థలాలపై వీడిన స్టేలు

అయితే ఈ జీఓ పై స్టే ఇవ్వాలని మరోసారి రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కానీ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించి, హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. పైగా తీర్పు సందర్భంగా, మీకిచ్చిన 35 సెంట్ల భూమి నుంచి పేదలకు స్థలం ఇస్తున్నారా? పేదలకు ఇళ్లస్థలం ఇవ్వటం వలన మీకు వచ్చే నష్టం ఏమిటి? అని పిటిషనర్లను సుప్రీంకోర్టు ప్రశ్నించినట్లు వార్తలు వచ్చాయి. మీకు ప్లాట్లు ఇస్తున్నప్పుడు పేదలకు ఇచ్చే స్థలాలను ఎందుకు అడ్డుకుంటున్నారని కోర్టు ప్రశ్నించినట్లు తెలుస్తున్నది. దీంతో తమ పిటిషన్లను, పిటిషనర్లు ఉపసంహరించుకున్నారు. అయితే స్టే కోసం రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అందుకు హైకోర్టు కూడా నిరాకరించింది. రాజధానిలో పేదలకు భూములు ఇస్తే అదీ అభివృద్ధేనని, అన్ని వర్గాల ప్రజలు రాజధానిలో ఉండాలని చెప్పింది. తుదితీర్పుకు లోబడి పేదలకు పట్టాలు ఇవ్వాలని చెప్పింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకి వెళ్ళినా తుది తీర్పు కు లోబడి ఇళ్ల స్థలాలు ఇవ్వవచ్చని తీర్పు ఇచ్చింది. దీంతో వైసీపీ ప్రభుత్వం అందుకు లోబడి ఇళ్లపట్టాలు ఇచ్చింది.

ఎందుకు ఆ దిగజారుడు మాటలు!

రాజధాని ప్రాంతంలోని అర్హులైన పేదలకు ఇళ్ల స్థలం ఇచ్చిన ప్రభుత్వానికి రాజకీయ కారణాలు ఏమైనా కావచ్చు. రాజధాని ప్రాంతంలో ఒక గుంట సాగుభూమి లేక ఒక సెంటు ఇళ్ల స్థలం కొనుక్కోవటం పేదలకు సాధ్యం కాని పరిస్థితుల్లో ఒక సెంటు ఇంటి స్థలమైనా వారికి ఆసరా ఇస్తుంది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఎవరికీ అభ్యంతరం ఉండకూడదు. పైగా ఒక సెంటు కు బదులు రెండు సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేయాలి. కానీ అందుకు విరుద్ధంగా టీడీపీ పేదల ఇళ్ల స్థలాల కోసం రాజధాని భూములు ఇవ్వరాదంటున్నది. అందుకు కొందరు రాజధాని రైతులను అడ్డుపెట్టుకున్నది. పేదలకు పట్టాలిస్తే వర్గ సమతుల్యత దెబ్బతిని పెట్టుబడులు రాక రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందదని ప్రచారం చేయిస్తున్నది. చివరికి చంద్రబాబు ఇళ్ల స్థలాల్లో శవాలను పూడ్చిపెడతారా... అని దిగజారి మాట్లాడారు.

పేదలకు రాజధాని ప్రాంతంలో నివసించే హక్కు లేదా? టీడీపీ డైరెక్షన్ లో కొందరు అమరావతి రైతులు, పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అంతగా రాద్దాంతం చేయడానికి కారణం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి గత ఎనిమిది సంవత్సరాలుగా వివాదం సాగుతున్నది. శివరామకృష్ణ కమిషన్ నివేదికకు విరుద్ధంగా చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించాడు. మూడు పంటలు పండే ప్రాంతంలో రాజధాని ఏర్పాటు పట్ల రైతుల్లో వ్యతిరేకత ఏర్పడింది. రాజధాని కోసం వెయ్యి ఎకరాలకు మించి భూమి అవసరం లేకపోయినా, చంద్రబాబు మాత్రం రైతుల భూములు,పేదల అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు 50 వేల ఎకరాలకు పైగా సామ, దాన, దండోపాయాలు ప్రయోగించి స్వాధీనం చేసుకోవడమే కాక భూ బ్యాంక్ పేరుతో లక్షలాది ఎకరాల సేకరణకు పూనుకోవటం ఎవరి ప్రయోజనాల కోసం! రాష్ట్ర ప్రయోజనం మాత్రం ఇందులో లేదు.

చంద్రబాబుకి అదే బాధ!

నిజానికి చంద్రబాబు అనుయాయులు, ఆశ్రితులు అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసిన తర్వాతే అమరావతిని చంద్రబాబు రాజధానిగా ప్రకటించారు. అందుకే ఈ ప్రాంతంలో పేదల ఇండ్లస్థలాలకు భూములు కేటాయిస్తే తన అనుయాయులకు, ఆశ్రితులు నష్టపోతారనే బాధే చంద్రబాబుదీ. అందుకే రైతుల పేరుతో ఆందోళన చేయిస్తున్నాడు. నిజానికి స్థలానికి ఒక సెంట్ భూమి చాలదు. కనీసం రెండు సెంట్లు కావాలి. కానీ టీడీపీని దెబ్బకొట్టి రాజకీయ ప్రయోజనం పొందడం కోసం వైసీపీ ప్రభుత్వ సెంట్ భూమికి పరిమితం చేసింది.

ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందటానికి శ్రామికులే మూలం. శ్రామికశక్తి ఫ్యాక్టరీల నిర్మాణానికి, ఉత్పత్తులకు మూలమై ప్రజల అవసరాలను తీరుస్తుంది. శ్రామికుల శక్తిని దోచుకునే బడా పెట్టుబడిదారులు వేలాది కోట్లు అధిపతులైనారు. పేదలు దుర్భర జీవితాలు గడుపుతున్నారు. శ్రామికులు లేకపోతే ఉత్పత్తి ఆగిపోయి మానవ మనుగడే స్తంభించిపోతుంది. అంతటి శక్తి కలిగిన శ్రామిక పేదలు రాజధాని ప్రాంతంలో ఉంటే సమతుల్యత దెబ్బతింటుందని అనటం పేదల ఎడల వారి స్వభావాన్ని తెలియచేస్తున్నది.

నాడు రాజధానికి వెయ్యి ఎకరాల కన్నా ఎక్కువ అవసరం లేదని చంద్రబాబు భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన సీపీఐ, సీపీఎం పార్టీలు నేడు టీడీపీకి కొమ్ము కాస్తూ మూడురాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా టీడీపీని మించి ఆందోళనలు చేస్తున్న ఈ పార్టీలు, పేదలకు ఇస్తామన్న ఇండ్లస్థలాలను అడ్డుకునే వారికి వ్యతిరేకంగా ఎందుకు ఆందోళన చేయటం లేదు? పాలకవర్గ ప్రభుత్వాలు చేసే సంస్కరణలను ఉపయోగించుకుని, వాటి బూటకత్వాన్ని బట్టబయలు చేసి కమ్యూనిస్టులనేవారు ప్రజా ఉద్యమాలు నిర్మించాలి తప్ప ఏదో ఒక పాలకపార్టీని భుజాన వేసుకోరు.

బొల్లిముంత సాంబశివరావు

రైతు కూలీ సంఘం సభ్యులు

98859 83526

Also Read: ‘సంక్షేమం’ టీడీపీని గద్దెనెక్కిస్తదా?


Next Story