విద్యా వ్యవస్థ బాగుంటే..

by Disha edit |
విద్యా వ్యవస్థ బాగుంటే..
X

సర్వ వ్యవస్థలు నాశనమైనా, విద్యా వ్యవస్థ బాగుంటే ఆశాజనకంగా ఉంటుంది. అది కూడా రోగగ్రస్తం అయితే, ఆ దేశానికి ఇక ముక్తి మార్గం ఉండదు. విద్య ఒక వ్యాపారం అయిపోయి చాన్నాళ్లయింది. దాని దుష్ప్రభావం మనం అనుభవిస్తున్నాము.

విద్యావంతుల చేతుల్లోంచి, ధనవంతులు, బలవంతుల చేతుల్లోకి విద్య వెళ్ళిపోయింది. ధనార్జనే విద్యాసంస్థల ఏకైక లక్ష్యం అయిపోయింది. అన్ని సమస్యలకూ మూలం అవిద్య. అంత కంటే ప్రమాదకరమైనది అక్రమ విద్య. అన్ని సమస్యలకూ పరిష్కారం విద్య. ఆలోచనా విధానం, దాని ద్వారా జీవన విధాన మార్గదర్శనం చేసేదే విద్య.

సర్వ వ్యవస్థలు నాశనమైనా..

విద్య అంటే ఏమిటి? చాలా మందికి విద్య అంటే - బడికి వెళ్లడం, తర్వాత కళాశాలకి, విశ్వవిద్యాలయానికి వెళ్ళటం, ఉద్యోగం సంపాదించడం ఇలా చాలా మందికి విద్య అంటే - భుక్తి మార్గం. విద్య పరమార్ధం ఉద్యోగం సంపాదించటం. అది ఆశ్చర్యకరం కాదు. ఎందుకంటే జీవిత పరమార్ధమే డబ్బు సంపాదించటం అయిపోయింది. విద్య దానికి మార్గమైంది. కొంత కాలం వరకు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ప్రియంగా ఉండేవి. ఆ రంగం ఒడిదుడుకులని ఎదుర్కోవడంతో, ఇప్పుడు భద్రతాపరంగా ప్రభుత్వ ఉద్యోగాలకి అర్రులు చాస్తున్నారు. తక్షణ సుఖం ముఖ్యం, దీర్ఘకాల ప్రయోజనాలు అనవసరమై పోయాయి. ఇది జీవన దృక్పథంలో లోపం. విద్య అనేది ఈ ఆలోచనా విధానాన్ని సవరించేదిగా ఉండాలి, కానీ విద్య కూడా ఈ లోపభూయిష్ట జీవన దృక్పథానికి బాధితురాలు అయిపోయింది.

సర్వ వ్యవస్థలు నాశనమైనా, విద్యా వ్యవస్థ బాగుంటే ఆశాజనకంగా ఉంటుంది. అది కూడా రోగగ్రస్తం అయితే, ఆ దేశానికి ఇక ముక్తి మార్గం ఉండదు. విద్య ఒక వ్యాపారం అయిపోయి చాన్నాళ్లయింది. దాని దుష్ప్రభావం మనం అనుభవిస్తున్నాము. విద్య విద్యావంతుల చేతుల్లోంచి, ధనవంతుల బలవంతుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ధనార్జనే విద్యాసంస్థల ఏకైక లక్ష్యం అయిపోయింది.

విద్య అంటే..

నిన్న ఒక విద్యార్థిని మార్గనిర్దేశనం చేయమని, సలహా ఇమ్మని అతని తండ్రి అభ్యర్ధించారు. తెలంగాణ పదో తరగతి పరీక్షలో అతనికి 9.3 సిజిపిఏ వచ్చింది. ప్రముఖ కార్పొరేట్ విద్యాసంస్థలో చదువుకున్నాడు. నాలుగు చిన్న ప్రశ్నలు వేసాను. నాలుగు కూడా తప్పు చెప్పాడు. అందులో ఒకటి - 350 లో 14% ఎంత అని. కాగితం, కలం ఉపయోగించి సమయం తీసుకుని. నిదానంగా అలోచించి చేయమని చెప్పాను. 301 అని చెప్పాడు. సాయం చేద్దామనే ఉద్దేశంతో ఎలా వచ్చిందని అడిగాను. తప్పు గ్రహించి సరిదిద్దుకుంటాడేమోనని. సవరించుకోలేదు సరి కదా, ఆ సమాధానం సమర్ధించుకుంటూ జవాబిచ్చాడు. ఇదీ మన విద్య పరిస్థితి.

వీళ్ళే రేపు డాక్టర్లు అవుతారు, ఇంజినీర్లవుతారు, పోలీసులు అవుతారు, లాయర్లవుతారు, నాయకులవుతారు. అదే మన దేశం ముందున్న పెను ప్రమాదం. ఇటువంటి చదువు వల్ల ఉపయోగం లేకపోవడమే కాకుండా, తీరని నష్టం జరుగుతుంది. సమయం మించి పోకముందే నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం ఉపయోగం? అన్ని సమస్యలకూ మూలం అవిద్య. అంత కంటే ప్రమాదకరమైనది అక్రమ విద్య. అన్ని సమస్యలకూ పరిష్కారం విద్య. ఆలోచనా విధానం, దాని ద్వారా జీవన విధాన మార్గదర్శనం చేసేదే విద్య.

ప్రొ. సీతారామ రాజు సనపల

రక్షణ శాఖ (డిఆర్‌డీఓ) పూర్వ శాస్త్రజ్ఞులు.

72595 20872



Next Story

Most Viewed