నాయకులపై ఆరోపిస్తే దాడులు చేస్తారా.!?

by Disha edit |
నాయకులపై ఆరోపిస్తే దాడులు చేస్తారా.!?
X

స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దళిత బంధు పథకంలో అవినీతి అక్రమాలు జరిగాయని దీనికి సంబంధించి నా వద్ద సమాచారం ఉందని ఇకపై అలాంటివి జరగకుండా దళిత బంధు అమలు చేయాలని ప్రకటించిన తర్వాత రోజు, ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండలం లో దళిత బంధు పైలట్ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయంటూ స్వయంగా దళిత బంధు లబ్ధిదారులు వివిధ మీడియా ఛానల్ లలో వారి యొక్క సమస్యను వివరించిన విషయం తెల్సిందే.

వారిపై అనుచిత వ్యాఖ్యలు

అయితే ఈ నియోజకవర్గంలో అవినీతీ జరిగిందని స్వయంగా బాధితులే తమ గోడును వెలబోసుకుంటే దానిమీద కనీసం విచారణకు అదేశాలు ఇవ్వకుండా ప్రజల్ని, ప్రజాస్వామ్యవాదుల్ని, ప్రశ్నిస్తున్న వాళ్లను అదిరించి, బెదిరించి, అక్రమ కేసులు పెట్టి బనాయించి భౌతిక దాడులకు దిగి వేధిస్తున్నారు బీఆర్ఎస్ వర్గీయులు. నిజానికి ప్రజలు ప్రశ్నిస్తున్నప్పుడు బాధ్యతాయుతంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రజాప్రతినిధులకు ఉంటుంది. కానీ ఆరోపణలు చేస్తే కనీస విజ్ఞత లేకుండా దాడులు చేస్తారా? అలాగే ఇటీవల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో స్థానిక ఎమ్మెల్యే దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు దీనికి నిరసనగా అఖిలపక్ష పార్టీల నాయకులు ఎమ్మార్పీఎస్ శ్రేణులు ఒక సమావేశం ఏర్పరచి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు. ఆ సమావేశం నుంచి ఇంటికి వెళ్తున్న అడ్వకేట్ యుగంధర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అలాగే గతంలో ఇదే నియోజకవర్గంలో ఉద్యమకారుడు పాల్వాయి నగేష్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ రెండు ప్రధాన సంఘటనలపై స్థానిక ప్రజా ప్రతినిధిపై ఆరోపణలు వచ్చాయి. నియోజకవర్గంలో దాడులు అరాచకాలు, భూ దందాలు, బెదిరింపులు ఫ్యాక్షనిజం, రౌడీయిజం రోజురోజుకు మితిమీరిపోవడంతో మతాలకు, కులాలకు పార్టీలకు అతీతంగా నిరసన కార్యక్రమానికి పూనుకున్న ప్రజాస్వామిక వాదులను అణచివేస్తున్నారు.

అందరూ ఏకం కావాలి!

రాష్ట్రంలో పౌర ప్రజాస్వామిక హక్కులనేవి లేకుండా పాలన కొనసాగుతుంటే ఇందుకేనా తెలంగాణ తెచ్చుకుందనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో దళితులపై దాడులు, అక్రమ కేసులు. అరెస్టులు పార్టీ ఫిరాయింపులు మూకుమ్మడిగా దాడులు చేయడం బెదిరింపులకు పాల్పడడం నిత్యకృత్యం అయింది. ప్రస్తుతం అంగబలం తో అధికార యంత్రాంగం అండతో ఎక్కడ ఏం చేస్తారన్న భయాందోళనలో ప్రజలు ఉన్నారు. సామాజిక ఉద్యమకారులపై దాడులకు పాల్పడుతున్న వారిపట్ల సమగ్ర విచారణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో బహిరంగంగా పట్టపగలే దాడులు చేయడం, హత్యాయత్నానికి పాల్పడే వ్యక్తుల పట్ల పోలీసు ఉన్నత అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అలాగే మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ మంత్రి దళితులను కించపరుస్తూ మాట్లాడితే చర్యలేవి? తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం కోసం దళిత సామాజిక వర్గాల వారు సైతం ముఖ్య భూమిక పాత్ర పోషించారని గుర్తెరగాలి. ఈ రోజు దళితులపై, రేపు ఇంకొకరిపై జరగొచ్చు అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు అందరూ ఏకం కావాలి. రాష్ట్రంలో తమ హక్కులను తాము కాపాడుకునేందుకు ప్రతి పౌరుడు ప్రశ్నించాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

వేముల గోపీనాథ్

తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడు

96668 00045


Next Story

Most Viewed