సమాచార స్వేచ్ఛకు సంకెళ్లు

by Disha edit |
సమాచార స్వేచ్ఛకు సంకెళ్లు
X

2019 మార్చి 31 నాటికి దేశంలోని అన్ని సమాచార కమిషన్‌లలో 2,18,347 ఆప్పీళ్లు, ఫిర్యాదులు పెండింగులో ఉన్నాయి. 30 జూన్ 2022 నాటికి ఆ సంఖ్య 3,14,323కి పెరిగింది. కేంద్ర సమాచార కమిషన్‌లో 26,724 దరఖాస్తులు పెండింగులో ఉండగా, మహారాష్ట్ర కమిషన్‌లో లక్ష, ఉత్తరప్రదేశ్‌లో45 వేలు, కర్ణాటకలో 30 వేలు, బిహార్‌లో 21 వేలు పెండింగులో ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అతి తక్కువగా పెండింగులో ఉన్నాయి. ఈ పెండింగ్ కేసుల కొండలు కరగాలంటే యేడాది నుండి 24 యేళ్లు పడుతుంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర, బిహార్, కేరళ, కేంద్ర కమిషన్‌లో పెండింగ్ దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉంది.

ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కొరకు సాగుతున్న ప్రజాస్వామ్య దేశంలో 58 ఏళ్లపాటు ప్రజలకు ఎలాంటి సమాచారం అందుబాటులో ఉంచకుండానే బండి నడిపించేసారు. చివరకు ఇటు పౌర సమాజం, అటు ఉద్యమకారుల నిరంతర ఉద్యమాలకు తలొగ్గిన ఎట్టకేలకు 2005 అక్టోబర్ 12 నుండి సమాచార హక్కు చట్టాన్ని అమలులోకి తెచ్చారు. అయినప్పటికీ, గత 17 యేళ్లుగా పాలనలో జవాబుదారీతనం, పారదర్శకత పెంపొందిస్తున్నామంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విప్లవాత్మక శాసనానికి తూట్లు పొడిచేందుకు శతవిధాల ప్రయత్నిస్తూనే ఉన్నాయి.

రాష్ట్రాల సమాచార కమిషన్‌లలో పెరిగిపోతున్న పెండింగ్ దరఖాస్తులు, జరిమానాలు విధించడంలో ఉదాసీనత, కమిషనర్‌లను నియమించడంలో నిర్లక్ష్యం, సవరణలతో చట్టాన్ని సారహీనం చేయడం లాంటి చర్యలతో స్ఫూర్తిని నీరుగార్చుతున్నారు.

అంతటా ఉదాసీనత

దేశంలో కేంద్ర సమాచార కమిషన్‌తో పాటు 28 రాష్ట్రాలలో సమాచార కమిషన్‌లు పని చేస్తున్నాయి. ఇటీవల విడుదలైన 'సతర్క్ నాగరిక్ సంఘటన్' నివేదిక ప్రకారం 2019 మార్చి 31 నాటికి దేశంలోని అన్ని సమాచార కమిషన్‌లలో 2,18,347 ఆప్పీళ్లు, ఫిర్యాదులు పెండింగులో ఉన్నాయి. 30 జూన్ 2022 నాటికి ఆ సంఖ్య 3,14,323కి పెరిగింది. కేంద్ర సమాచార కమిషన్‌లో 26,724 దరఖాస్తులు పెండింగులో ఉండగా, మహారాష్ట్ర కమిషన్‌లో లక్ష, ఉత్తరప్రదేశ్‌లో45 వేలు, కర్ణాటకలో 30 వేలు, బిహార్‌లో 21 వేలు పెండింగులో ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అతి తక్కువగా పెండింగులో ఉన్నాయి. ఈ పెండింగ్ కేసుల కొండలు కరగాలంటే యేడాది నుండి 24 యేళ్లు పడుతుంది.

పశ్చిమ బెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర, బిహార్, కేరళ, కేంద్ర కమిషన్‌లో పెండింగ్ దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. నిబంధనల ప్రకారం ఒక కమిషనర్ యేడాదిలో 3,200 కేసులను విచారించాలి. క్షేత్రస్థాయిలో ఇలా జరగడం లేదు. చాలా రాష్ట్రాల కమిషన్‌లలో ఖాళీల సంఖ్య ఎక్కువగా ఉంది. ఝార్ఖండ్‌లో గత 29 నెలలుగా కమిషనర్‌లు లేరు. త్రిపుర, మేఘాలయలోనే ఇదే పరిస్థితి. మణిపూర్‌లో ప్రధాన సమాచార కమిషనర్ లేక 44 నెలలు. పశ్చిమ బెంగాల్ ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రధాన సమాచార కమిషన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

కమిషన్‌ల ఉదాసీన వైఖరి

దేశంలో సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి 17 వసంతాలు గడిచినా ఇప్పటి వరకు దీనిని మూడు శాతం మంది ప్రజలే వినియోగించుకున్నారు. కేసుల విచారణలో కమిషన్‌లు ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నాయి. సమాచారం ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేస్తున్న అధికారులపై సహ చట్టం సెక్షన్ 20 ప్రకారం కొరడా ఝళిపించాల్సినప్పటికీ పట్టించుకోవడం లేదు. 1 జూలై 2021 నుంచి 31 జూన్ 2022 వరకు దేశంలో కేంద్ర సమాచార కమిషన్, 23 రాష్ట్రాల కమిషన్‌లు 5,805 కేసులలో రూ. 3.12 కోట్ల జరిమానా విధించాయి. అత్యధికంగా కర్ణాటకలో 1,265 కేసులలో రూ.1.03 కోట్ల జరిమానా విధించారు. కేంద్ర సమాచార కమిషన్ 142 కేసులలో రూ.7.51 లక్షలు మాత్రమే జరిమానా విధించింది. మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఒడిశా కమిషన్‌లు ఎక్కువ జరిమానా విధిస్తున్నాయి. కమిషన్‌లకు వస్తున్న కేసులలో ఐదు శాతానికి మాత్రమే జరిమానా పడుతోంది. సెక్షన్ 20(2) ప్రకారం గడిచిన ఏడాదిలో దేశంలో ఒక్క ప్రజా సమాచార అధికారి పైన చర్యలు తీసుకోలేదు.

సమాచారానికి సర్కారు గ్రహణం..

2018లో తీసుకొచ్చిన సమాచార హక్కు చట్టం సవరణ బిల్లు కమిషన్‌ల పని తీరును ప్రభావితం చేసింది. కేంద్ర ప్రభుత్వం అరకొర నిధులు కేటాయించి చట్టానికి తూట్లు పొడిచే ప్రయత్నాలు చేస్తున్నది. 2013 -14లో రూ.18.46 కోట్లు కేటాయించగా, 2021-22 లో రూ.5.50 కోట్లు, 2022-23 లో మూడు కోట్లు మాత్రమే కేటాయించింది. ఇటీవల గుజరాత్ గత 18 నెలల నుంచి పది మంది సహ చట్టం ఉద్యమకారులను దరఖాస్తులు పెట్టకుండా నిషేధించింది.

చాలా రాష్ట్రాలలో విశ్రాంత అధికారులను కమిషనర్లుగా నియమించి కమిషన్‌లను వృద్ధాశ్రమాలుగా మారుస్తున్నారు. సమాచారం అడిగితే భౌతిక దాడులకు దిగుతున్నారు. అక్రమాలను వెలుగులోకి తెచ్చే క్రమంలో ఇప్పటివరకు దేశంలో 95 మందికి పైగా ఉద్యమకారులు అమరులయ్యారు.

పారదర్శకతకు పట్టం కట్టాలి

పాలనలో పారదర్శకతకు ఎంతగా ప్రాధాన్యమిస్తే ప్రజలకు ప్రజాస్వామ్యంపై అంతగా విశ్వాసం ఇనుమడిస్తుందని ప్రధాని మోడీ ఏనాడో ఉద్ఘాటించారు. గ్రామపంచాయతీ మొదలుకొని పార్లమెంట్ వరకు ప్రజాధన వినియోగానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఆన్‌లైన్‌లో ఉంచాలి. రాజకీయ అవసరాలను, ఆశ్రిత పక్షపాతాన్ని పక్కనపెట్టి సమాచార కమిషనర్‌లను నియమించాలి. బిహార్ లాంటి వెనుకబడిన రాష్ట్రాలలో కాల్ సెంటర్ల ద్వారా సహ చట్టం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ పద్ధతి అన్ని రాష్ట్రాలలో అమలు కావాలి.

ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తులను స్వీకరించాలి. చట్ట ప్రచారానికి, సమాచారాధికారుల శిక్షణకు ఎక్కువ మొత్తంలో నిధులను కేటాయించాలి. స్వచ్ఛంద సమాచారానికి సంబంధించిన 17 అంశాలను యేటా అప్‌డేట్ చేయాలి. దీంతో సగం దరఖాస్తులు తగ్గిపోతాయి. తమకు కావలసిన సమాచారాన్ని స్వేచ్ఛాయుత వాతావరణంలో పొందే అవకాశాన్ని ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.


అంకం నరేశ్

630165324

Next Story