అమ్మకానికి ఆడతనం?

by Disha edit |
అమ్మకానికి ఆడతనం?
X

వ్యభిచారాన్ని అరికట్టటం సాధ్యం కానప్పుడు చట్టబద్ధం చేయరెందుకని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. వ్యభిచారం ప్రపంచంలోనే అత్యంత పురాతన వృత్తి అని సోలిసిటర్‌ జనరల్‌ చేసిన వాదనపై కోర్టు స్పందించింది. చట్ట ప్రకారం అరికట్టలేకపోతున్నప్పుడు మీరెందుకు వ్యభిచారాన్ని చట్టబద్ధంగా గుర్తించరు? అలా గుర్తిస్తే ఆ వ్యాపారాన్ని పర్యవేక్షించవచ్చు, పునరావాసం కల్పించవచ్చు, బాధితులకు వైద్య సాయం అందించవచ్చని ధర్మాసనం పేర్కొంది. ఒక మహిళ తనంతట తానుగా తన శరీరానికో, తానిచ్చే సుఖానికో ఒక ధర కట్టుకుని వెళ్తే అది ఇల్లీగల్‌ అని చెప్పి ఆమెను అరెస్ట్ చేసే హక్కు పోలీసులకు ఉండదు. అలాంటి కేసులు కోర్టులలో కూడా నిలబడవు.

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ హస్తకళలకు, నాట్యానికి, అభివృద్ధికి ప్రసిద్ధి. భారతదేశంలో ఐదవ అతిపెద్ద మహానగరం. చుట్టుపక్కల మున్సిపాలిటీలను కలుపుకుంటే ప్రపంచంలోని మహానగరాలలో 41వ స్థానంలో ఉంటుంది. ఐటీ రంగంలో అగ్రగామి. అటువంటి మహా నగరం నేడు అనేక విశృంఖల మత్తుపదార్థాల వ్యాపారాలకు, అనైతిక వ్యభిచార దందాలకు ఆలవాలంగా మారిపోతున్నది. బొంబాయి మహానగరాన్ని తలదన్నే రీతిలో వ్యాపారం సాగుతున్నదంటే పరిస్థితి తీవ్రత ఎంతగా ఉందో ఊహించుకోవచ్చు. ఐటీ, రియల్ ఎస్టేట్ బూమ్‌తో నగదు అధికంగా ఉండే ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని అమాయక అమ్మాయిలను ఆకర్షిస్తున్నారు, పశ్చిమ బెంగాల్‌లోని గ్రామీణ ప్రాంతాలతోపాటు మహారాష్ట్ర గిరిజన ప్రాంతాలు, గుజరాత్‌ నుండి బాలికలను తీసుకువస్తున్నారు.

వరంగల్, నల్గొండ. ఖమ్మం నుంచి కూడా అమ్మాయిలు ఈ కూపంలోకి చేరుతున్నారు. కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, కాకినాడ, రాజమండ్రి, వైజాగ్ జిల్లాలకు చెందినవారే అధికమని సెక్స్ బ్రోకర్లు చెపుతున్న మాటలు ఆశ్చర్యంగా ఉన్నాయి. UNAIDS నివేదిక ప్రకారం 2016నాటికే దేశంలో 6,57,829 మంది వేశ్యలు ఉన్నారని అంచనా. అనధికారిక అంచనాల ప్రకారం దాదాపు 3 నుంచి 10 మిలియన్ మంది వేశ్యలు ఉన్నారు. నేడు అనధికారిక లెక్కల ప్రకారం 20 నుంచి 30 మిలియన్ దాటవచ్చని కొందరి అభిప్రాయం. భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద వాణిజ్య సెక్స్ పరిశ్రమలో ఒకటిగా విస్తృతంగా పరిగణించబడుతుంది. ఇది సెక్స్ టూరిజం ప్రపంచ కేంద్రంగా ఉద్భవించింది. సంపన్న దేశాల నుంచి సెక్స్ పర్యాటకులను ఆకర్షిస్తున్నది. భారతదేశంలో సెక్స్ పరిశ్రమ బహుళ-బిలియన్ డాలర్లు, వేగంగా అభివృద్ధి చెందుతున్నవాటిలో ఒకటి.

తెలంగాణలోనూ అదే రీతి

జంట నగరాలలో దాదాపు 8 నుంచి 10 వేల వరకు వ్యభిచార గృహాలు ఉన్నాయని అంచనా. భారీ వ్యాపారం సాగుతోంది. కొన్ని స్వచ్ఛంద సంస్థల అంచనాల ప్రకారం గత నాలుగు సంవత్సరాలలో నగరంలో వ్యభిచార గృహాల సంఖ్య 3 నుంచి 4 రెట్లు పెరిగింది. విటుల ఖర్చు సామర్థ్యాన్ని బట్టి రోజుకు రూ. 5000 నుంచి రూ. 10,000 లేదా అంతకంటే ఎక్కువగానే వసూలు చేస్తున్నారు. అమ్మాయిల అవసరాలను ఆసరాగా చేసుకొని దందా నిర్వహిస్తున్నారు. ఉద్యోగం ఇప్పిస్తామని, డబ్బు ఇస్తామని ఆశచూపించి వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు. ఇందుకోసం సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. వీరి మాయలో ఎక్కువగా కాలేజీ యువతులు, ఒంటరి మహిళలే పడుతుండటం గమనార్హం.

ఒక్కసారి ఇందులోకి దిగినవారు మళ్లీ బయటకు రావడం కష్టమే. వ్యాపారవేత్తలు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, యువత, ఉద్యోగులు, పలుకుబడి కలిగిన రాజకీయ నాయకుల నుంచి ఆటోవాలాల వరకు ఈ వ్యవహారంలో పాలు పంచుకుంటున్నారు. దేశంలోని సగానికి సగం పైగా జిల్లాలలో ఆడపిల్లలు వేశ్యావాటికలలోనే మగ్గిపోతున్నారని జాతీయ మహిళా కమిషన్ నివేదిక-2009 స్పష్టంగా పేర్కొంది. ఆనాడే 378 జిల్లాలలో దాదాపు 1800 వేశ్యావాటికలను మహిళా కమిషన్ గుర్తించింది. వ్యభిచార వృత్తి సాగించే 1,016 ప్రాంతాల వివరాలను కూడా తెలుసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలోని పలుప్రాంతాల నుంచి అమ్మాయిలను తరలించి అంగడిబొమ్మలుగా చేస్తున్నారని తేలింది. తమిళనాడు, ఒడిశా, బీహార్‌ వేశ్యావాటికలకు తరలిపోతున్న ఆడపిల్లల గాథలు ఎన్నెన్నో! దేశంలోని మహిళా జనాభాలో 2.4 శాతం మంది వేశ్యావృత్తిలో ఉన్నారు.

వ్యభిచారం చట్టబద్ధమేనా?

సెక్స్‌ను విక్రయించే విధానాన్ని 'వ్యభిచారం'గా పేర్కొనడం చట్టంలో ఎక్కడా లేదు. వేశ్యలను నియమించడం, వ్యభిచార గృహాలను నడపడం, హోటళ్లలో వ్యభిచారం, పిల్లలచే వ్యభిచారం చేయించడం వంటివి చట్టపరంగా నేరాలే. బహిరంగ ప్రదేశాలలో లైంగిక కార్యకలాపాలలో పాల్గొన్నందుకు జరిమానా విధించబడవచ్చు. భారత శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 37 ప్రకారం ఏకాభిప్రాయ సెక్స్ చట్టబద్ధం కాదు. వాస్తవానికి, సెక్స్ వర్కర్లు బహిరంగ ప్రదేశం నుండి 200 గజాల లోపు వ్యభిచారం చేయడాన్ని చట్టం నిషేధిస్తుంది. 18 ఏళ్లు నిండని పిల్లలను లేదా నిండినోళ్లను అవిద్య, వెనుకబాటుతనాన్ని ఆసరాగా చేసుకుని బలవంతంగా ఇందులోకి దించడం నేరమే.

వ్యభిచారం చట్టబద్ధం చేయబడితే, వ్యభిచార గృహాలను నిర్వహించే బాధ్యత రాష్ట్రం చేతిలో ఉంటుంది. లైసెన్స్ జారీ చేయడం ద్వారా ఈ బాధ్యతను సక్రమంగా నెరవేర్చవచ్చు. వేశ్యలకు తగిన వేతనం, వైద్య సదుపాయాలకు సంబంధించి మార్గదర్శకాలను కూడా రూపొందించవచ్చు. వేశ్యల వైద్య సంరక్షణ, వారి పిల్లల చదువులు, దోపిడీ, అత్యాచారాలకు వ్యతిరేకంగా హక్కులను చట్ట పరిధిలో పొందవచ్చు. సెక్స్ రాకెట్‌లను నిర్మూలించవచ్చు. జీవనోపాధిని కోల్పోయిన వేశ్యలకు రక్షణ గృహాలు ఏర్పాటు చేయవచ్చు. వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయడం సులభంగా డబ్బు సంపాదించడానికి మార్గం సుగమం చేస్తుంది. ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే పరిశ్రమగా మారే అవకాశం ఉంది. కాబట్టి నియంత్రించడానికి నియమాలు అత్యంత కఠినంగా ఉండాలి.

కోర్టులు ఏం చెబుతున్నాయి?

వ్యభిచారాన్ని అరికట్టటం సాధ్యం కానప్పుడు చట్టబద్ధం చేయరెందుకని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. వ్యభిచారం ప్రపంచంలోనే అత్యంత పురాతన వృత్తి అని సోలిసిటర్‌ జనరల్‌ చేసిన వాదనపై కోర్టు స్పందించింది. చట్ట ప్రకారం అరికట్టలేకపోతున్నప్పుడు మీరెందుకు వ్యభిచారాన్ని చట్టబద్ధంగా గుర్తించరు? అలా గుర్తిస్తే ఆ వ్యాపారాన్ని పర్యవేక్షించవచ్చు, పునరావాసం కల్పించవచ్చు, బాధితులకు వైద్య సాయం అందించవచ్చని ధర్మాసనం పేర్కొంది. ఒక మహిళ తనంతట తానుగా తన శరీరానికో, తానిచ్చే సుఖానికో ఒక ధర కట్టుకుని వెళ్తే అది ఇల్లీగల్‌ అని చెప్పి ఆమెను అరెస్ట్ చేసే హక్కు పోలీసులకు ఉండదు. అలాంటి కేసులు కోర్టులలో కూడా నిలబడవు. గత సంవత్సరం సెప్టెంబర్ 20న ముంబై హైకోర్టు ఇలాంటి కేసునే కొట్టిపారేసింది.

డా. బి. కేశవులు. ఎండీ.

మనస్తత్వ, రాజకీయ నిపుణులు

85010 61659

Next Story

Most Viewed