ఇంజినీరింగ్ అంటే చదువు కాదు.. జీవితాన్ని మార్చే అవకాశం!

by Ravi |   (  Updated:2025-06-20 01:15:28  IST  )

నేడు ఇంటర్మీడియట్ అనంతరం అనేక మంది విద్యార్థులు ఇంజినీరింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందుకు కారణం..

ఇంజినీరింగ్ అంటే చదువు కాదు.. జీవితాన్ని మార్చే అవకాశం!
X

నేడు ఇంటర్మీడియట్ అనంతరం అనేక మంది విద్యార్థులు ఇంజినీరింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందుకు కారణం.. సాధారణ డిగ్రీలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం, ఇంజినీరింగ్ చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత, అలాగే సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉపాధి లభించవచ్చన్న భావన.. కానీ ఈ నిర్ణయం భావోద్వేగంతో కాక, శాస్త్రీయంగా, విద్యార్థుల ఆసక్తి, నైపుణ్యాల ఆధారంగా పాఠశాల స్థాయిలో నుంచే తీసుకోవాలి.. అయితే, అలాంటి శాస్త్రీయ విధానం మన దేశంలో ఇప్పటికీ అందుబాటులో లేదు..

ఈ పోటీ ప్రపంచంలో ఐఐటీలు, ఎన్‌ఐటీలు, కేంద్ర విశ్వ విద్యాలయాలు, కొన్నిచోట్ల ప్రభుత్వ కళాశాలలు, కొంతమేర ప్రైవేటు కళాశాలలు తప్ప మిగిలిన వాటిలో నాణ్యత కలిగిన బోధన అందుబాటులో ఉండటం లేదు. అందుకే ఈ కోర్సు చదవాలనుకునే విద్యార్థులు అడ్మిషన్ పొందే ముందే భవి ష్యత్తులో ఉపయోగపడే బ్రాంచ్ మన లక్ష్యాన్ని చేరుకునేందుకు అనువైన వాతావరణం కలిగిన మంచి కళాశాల ఎంపికపై పూర్తి దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈ ఒక్క నిర్ణయమే విద్యార్థి జీవితాన్ని మలుపు తిప్పగలదు..

బ్రాంచ్ ఎంపిక ఎందుకు ముఖ్యమంటే..?

నేడు లక్షలాది మంది విద్యార్థులు ఇంజినీరింగ్ చదువుతున్నా, సరైన నైపుణ్యాల లేమితో, గమ్యం లేనివారిగా నిరుద్యో గులుగా మిగిలిపోతున్నారు. టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో ఉపాధి అవకాశాలు కూడా మారిపోతున్నాయి. అందువల్ల మధ్యతరగతి కుటుంబాల విద్యా ర్థులకు సరైన బ్రాంచ్, సరైన కళాశాల ఎంపిక కత్తిమీద సాము లాంటిది. అందుకే బ్రాంచ్ ఎంపికకు ముందు విద్యా ర్థులు.. భవిష్యత్ లక్ష్యాలు, తమలో ఉన్న నైపుణ్యాలపై ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సంబంధిత రంగంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా? భవిష్యత్తులో అభివృద్ధి చెందే అవకాశాలున్నాయా? అనే విషయాలను ముందుగా తెలుసుకోవాలి.. బ్రాంచ్ ఎంపికలో ముఖ్యంగా ఆయా రంగాల ప్రాముఖ్యత, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వాటి పాత్ర వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. స్నేహితులు, చుట్టాలు చెప్పారనే కార ణంతో నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు.. శాస్త్రీయంగా పరిశీలించిన తర్వాతే, బ్రాంచ్ అయినా, కాలేజీ ఎంపిక నిర్ణయం అయినా జరగాలి.

డిగ్రీ అవగాహన ముఖ్యమే..!

సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడాలని కోరుకునే వారు కంప్యూటర్ సైన్స్ తీసుకొని, కోడింగ్, పరిశ్రమల ఆధారిత సర్టిఫికెట్లు, ప్రాజెక్ట్ అనుభవంపై దృష్టి పెట్టాలి. అయితే ఏ బ్రాంచ్ అయినా సరే, తగిన నైపుణ్యాలుంటే విజయవంతం కావచ్చు. విద్యార్థి కెరీర్ అతని చేతుల్లోనే ఉంటుందనే నిజాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు.. అత్యుత్తమ కళాశాలల్లో కనీస ఉద్యోగ అవకాశాలు కలిగిన బ్రాంచిలో చదివిన, విద్యార్థికి మంచి భవిష్యత్తు ఉంటుంది. కానీ కళాశాల ఎంపిక తల్లిదండ్రులకు అత్యంత క్లిష్టంగా మారింది. ఎందుకంటే రోజుకో ప్రైవేటు కళాశాలో, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలో పుట్టుకొస్తున్నాయి. పైగా కార్పొరేట్ ప్రచారాలు, పీఆర్వోల హామీలను నమ్మి తల్లిదండ్రులు, విద్యార్థులు మోసపోతున్నారు.. గతంలో కొన్ని సాప్ట్‌వేర్ కంపెనీలు తమకి అవసరమైన నైపుణ్యాలు నేర్పి మరీ ఉద్యోగం ఇచ్చేవి. కానీ ఈ రోజుల్లో ఉద్యోగ నైపుణ్యంతో పాటు డిగ్రీ ద్వారా నేర్చుకున్న ఎన్నో విషయాలు కూడా భవిష్యత్తుకు కీలకంగా మారాయి..

కాలేజీ ఎంపికలో పరిశీలించాల్సిన అంశాలు..

అందుకే ఇంజినీరింగ్ కాలేజీ ఎంపికకు ముందు AICTE గుర్తింపు, విశ్వవిద్యాలయ అనుబంధం, యూజీసీ గుర్తింపు, న్యాక్ గుర్తింపు, ఎన్.‌ఆర్.‌ఐ.ఎఫ్ ర్యాంకులు, పరిశోధనా కేంద్రాలు, స్వయం ఉపాధికి అవకాశం కలిగించే మౌలిక వసతులు, పేటెంట్లు, పరిశోధనా పత్రాలు, పరిశ్రమల అనుబంధంతో పాటు సరైన అర్హతలు, నైపుణ్యాలు గల బోధకుల నిష్పత్తి 1:2:6 (ప్రతి ప్రొఫెసర్ కింద ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రతి అసోసియేట్ ప్రొఫెసర్ కింద ఆరుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారా? లేదా అని గమనించాలి) అంతే కాకుండా, గత మూడేళ్లుగా ఉన్న ఉద్యోగ నియామక వివరాలు, విద్యతో పాటు నైపుణ్య అభివృద్ధి కోసం శిక్షణ వసతులు, ఇంట ర్న్‌ షిప్‌లు, వర్క్‌షాప్‌లు, పూర్వ విద్యార్థుల మెంటర్షిప్, నిపుణుల పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు పరిశ్రమలకు అవసరమైన మేరకు సిలబస్ రూపకల్పన జరుగుతుందా? లేదా తెలుసుకోవాలి. ముందుచూపు గల నాయకత్వం, లాభాపేక్ష లేకుండా ఉన్న విజనరీ కాలేజీ యాజమాన్యం ఉంటే, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉత్తమ వాతావరణాన్ని అందించగలుగుతారు..

అడ్మిషన్ తీసుకునే ముందే.. ఆలోచించండి!

ఇక కంపెనీలు ఇప్పుడు సర్టిఫికేట్ కన్నా నైపుణ్యాలనే చూస్తున్నాయి. కనుక టెక్నికల్, నాన్-టెక్నికల్ రంగాలలో సమతుల్య ప్రణాళిక అవసరం. కొన్ని కాలేజీలు ప్రభుత్వాల ప్రోత్సాహంతో విద్యార్థులలో ఆవిష్కరణను పెంపొందిస్తున్నాయి.. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళితే ఈ సర్టిఫికెట్లు, ప్రాజెక్టులు, పరిశోధన పత్రాలు కీలకంగా మారతాయి. నూత న ఆవిష్కరణలు, పరిశోధనలు విద్యార్థులను ప్రపంచ స్థాయి లో అభివృద్ధి చేస్తాయి. కాలేజీల ఎంపికలో ఇలాంటి అంశా లను పరిగణనలోకి తీసుకుని నిర్ణయించుకోండి. తల్లిదండ్రు లు భావోద్వేగంతో కాకుండా, పిల్లల ఆసక్తి, మార్కెట్ అవసరాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. ప్రకట నల మాయలో పడకుండా, నిపుణుల సలహా తీసుకొని సరైన బ్రాంచ్, సరైన కళాశాల ఎంపిక చేయాలి. నాలుగు సంవత్సరాలు గురువుల మార్గదర్శనంలో ప్రణాళికాబద్ధంగా చదివితే భవిష్యత్తు బంగారం అవుతుంది. ఇంజినీరింగ్ అంటే చదువు కాదు.. జీవితాన్ని మలిచే అవకాశమని గుర్తుంచుకోండి. అందుకే అడ్మిషన్ తీసుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించండి..!

డా. రామకృష్ణ కొలికిపోగు

ప్రొఫెసర్, సీబీఐటీ

79818 06718

Next Story