నడుస్తున్న చరిత్ర:ఎన్నికల గుత్తేదారు పీకే

by Disha edit |
నడుస్తున్న చరిత్ర:ఎన్నికల గుత్తేదారు పీకే
X

తెలంగాణలో పీకే టీంలు తిరుగుతున్నట్లు, కొన్ని అసెంబ్లీ స్థానాలలో సమాచార సేకరణ పూర్తయిందని వార్తలొస్తున్నాయి. ఉద్యమ సహచరులను చేరదీయాలని, కొందరు సిట్టింగులను దూరం పెట్టాలని పీకే సూచించినట్లు కూడా తెలుస్తోంది. వాస్తవానికి తెలంగాణాలో పూర్తిగా నియంతృత్వ పాలన సాగుతోంది. పథకాల పేరిట, ప్రాజెక్టుల పేరిట రాష్ట్రం దివాళా తీసింది. సిట్టింగులు, స్టాండింగులు అందరూ సొంత ఎజెండాలతో సాగుతున్నారు. పార్టీలోని పెద్దలు, చిన్నలు భూకబ్జాలు, ఇసుక దందాలు, కమిషన్ల లెక్కల్లో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ ఆఫీసులలో అవినీతి విజృంభించింది. ప్రజలు లంచాలిచ్చి పనులు చేయించుకుంటున్నారు. ఎన్నికల వాగ్దానాలలో ఎన్నో అమలు కాలేదు.

లెక్కల మాస్టారు తమ ఇంటి పై మరో అంతస్తు కడతానని పదేళ్ల క్రితం మేస్త్రీ దగ్గరికెళితే 'దాంతో ఏం లాభం సార్! అదే పది లక్షలు పెట్టి బయట ప్లాట్లు కొనండి. ఏడాదిలో పైసలు డబుల్ అయితాయి' అన్నాడు. కట్టే ఓపిక లేక మేస్త్రీ చెప్పినట్లే ఆయన ఊరు బయట జాగా కొన్నాడు. ఆరేళ్లకు దాని ధర పెట్టుబడికి ఆరు రెట్లయింది. సగం భూమి నమ్మితేనే పై అంతస్తు ఖర్చు తీరింది. ఇటుకల బట్టి నడిపే కస్టమరుతో బ్యాంక్ ఆఫీసర్ 'ఇటుకల రవాణాకు సీజన్‌లో ట్రాక్టర్ కిరాయి ఎంతవుతుంది?' అని అడిగితే, ఆయన 'సుమారు యాభై వేలవుతుంది' అన్నాడు. 'ట్రాక్టర్‌కు లోన్ తీసుకోండి. అదే డబ్బు మాకు కిస్తీ గా కడితే మూడు నాలుగేళ్లలో ట్రాక్టర్ మీ సొంతమవుతుంది.' అన్నాడు. అది నిజమని కాలం నిరూపించింది.

పైన పేర్కొన్న నలుగురివి విభిన్న వృత్తులు. కావున ఒకరికి తట్టిన ఆలోచన మరొకరికి రాలేదు. అదే వృత్తి నైపుణ్యం, పరిపక్వ జ్ఞానానికి నిదర్శనం. ఎందుకోగానీ ఇదే సూత్రం మన రాజకీయ నాయకులకు వర్తించడం లేదు. సుమారు నాలుగు దశాబ్దాలుగా రాజకీయ క్షేత్రంలో విజయవిహారం చేస్తున్నామని గర్వంగా చెప్పుకొనే నాయకులు ఇప్పుడు దారి దొరకనట్లు తికమక పడుతున్నారు. ఎవరన్నా బయటకి లాగితే బాగుండు అని దిక్కులు చూస్తున్నారు. ఈ పరిస్థితి రావడానికి కారణం పైన పేర్కొన్న వివిధ వృత్తుల వారిలో ఉన్న నిజాయితీ మన నేతల్లో లోపించడమేనా! అనే అనుమానం కలుగుతుంది.

ఎందుకంత భయం?

2021 లో తమిళనాడులో పదేళ్లపాటు పాలనకు దూరమున్న డీఎంకే ఎన్నికల వ్యూహకర్తల తోడ్పాటు తీసుకోవడం, ఏడు విడతల ఓటింగ్ షెడ్యూల్, బడా నాయకుల మోహరింపుతో హడలెత్తించిన బీజేపీని ఢీకొనేందుకు పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీకి 'వ్యూహాల ఊతకర్ర'అనివార్య అవసరం పడొచ్చు. కానీ, ఇప్పుడు వ్యూహకర్తలు లేనిది గెలువలేమనే భయం టీఆర్‌ఎస్‌కు పట్టుకుంది. గెలుపునకు మూరెడు దూరంలో ఉన్న పార్టీలను 'వ్యూహాలు' గట్టునెక్కించే అవకాశం ఉంది. ఎవరెంత ఊదరగొట్టినా ప్రజల్లో మంచి పేరున్న ప్రభుత్వాలను పడగొట్టడం ఎవరికీ సాధ్యం కాదు. రాజకీయ వ్యూహకర్తలు కూడా వెనుక ముందు ఆలోచించే ఒప్పందానికి వస్తారు. ఒక రకంగా పార్టీలు వారి సాయం కోసం దేబిరించడం అంటే పార్టీ పెద్దలలో తమపై తమకు నమ్మకం కోల్పోవడమే అనుకోవాలి.

మన దేశంలో ఎన్నికల వ్యూహకర్త అంటే ప్రశాంత్ కిషోరే. ఇప్పటికే అవసరానికి మించిన అనవసర ప్రచారం తో మన మీడియా ఆయన్ని తలకెత్తుకుంది. ఆయన బొమ్మ వేసి అతను అన్నవి, అననివి ఉహాగానాలుగా ప్రాచుర్యానికి తేవడం మన పత్రికలకు, టీవీలకు హాట్ టాపిక్ అయింది. ఈ మధ్య ఆజ్‌తక్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ దీనికి తాజా ఉదాహరణ. యాంకర్లు ముగ్గురు కలిసి ప్రశ్నల బాణాలు సంధించినా ఆయన పనికొచ్చే ఒక్క మాటా చెప్పలేదు. అది చూసినవారికి అసలు పాత్రికేయులు ఆయన్ని కలవడమే అనవసరమనిపిస్తుంది. కాంగ్రెస్, ప్రశాంత్ కిషోర్ మధ్య చర్చలు విఫలమయ్యాక 'ప్రశాంత్ కిషోర్ ఎన్నికలలో ఉపయోగపడే ఉత్పత్తులు అమ్ముకొనే వ్యాపారి' అని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ట్వీట్ చేశారు.

ఆ మాటలన్నీ చిలుక పలుకులే

‌ఇక ప్రశాంత్ కిషోర్ విషయానికొస్తే ఆయన పక్కాగా 'నాకేంటి!' అనే బాపతు బిజినెస్ మ్యాన్. వ్యాపారికి తన ఎదుగుదల, లాభాలే ముఖ్యం. 'అయ్యో పాపం'అనే భూతదయ, నా దేశం అనే అనురక్తి ఉండవు. ఉంటే ఎదగడు. ఎన్నికల వ్యూహాల కోసం ఆయన 2015లో స్థాపించిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐప్యాక్) పరిచయాన్ని కలిగించే యూట్యూబ్ వీడియోను చూస్తే చాలా నిజాలు తెలుస్తాయి. టీం లీడర్ల మాటలన్నీ చిలుకపలుకులే.

రాజకీయాలలో పాల్గొనకుండా దేశ రాజకీయాలని శుద్ధి చేసే ప్రక్రియలో భాగంగా ఓటర్లు ఎన్నికలలో మంచి నిర్ణయం తీసుకొనేలా జ్ఞానబోధ చేయడమే తన లక్ష్యమని వారు వల్లె వేశారు. అంతా ప్రణాళికాబద్ధ బూటకపు పదజాలమే. అయితే, వారి మాటలు నమ్మిన వీక్షకులు కూడా తక్కువే. చాలామంది 'మీ నిర్వాకం మాకు తెలుసులే!'అన్నట్లు కామెంట్లు పెట్టారు. దేశాన్ని అమ్మే వారి చేతిలో కేంద్ర పాలన పెట్టిన మోసకారులు మీరు అని, మత విద్వేషాలు రెచ్చిపోవడానికి మీరే కారకులు అని, మీ దుకాణం మూసేయడమే దేశానికి మేలు అని ఇలాంటి అర్థం వచ్చే కామెంట్లు ఎన్నో ఆ వీడియో కింద ఉన్నాయి. వీటివలన దేశ రాజకీయాలలో పీకే ప్రమేయం నేటి యువతకు ఇష్టం లేదనే విషయం స్పష్టం అవుతోంది.

నిజాలు అర్థమవుతున్నాయా?

దేశంలో జరిగే ఎన్నికలలో వ్యూహకర్తలు ప్రవేశిస్తే అది మన ప్రజాస్వామ్యానికే ప్రమాదమని టీవీ కథనాలు కూడా ఈ మధ్య మొదలయ్యాయి.బేరమాడుకొన్న పార్టీల విజయం కోసం వ్యూహాస్వాములు దేనికైనా సిద్ధపడతారు. 2014లో బీజేపీ గెలుపు వెనుక పీకే హస్తం ఉందని అందరికి తెలుసు. బీజేపీని గెలిపిస్తే స్విస్ బ్యాంకులలో భారతీయులు దాచిన నల్లధనాన్ని దేశానికి రప్పించి ప్రతి పౌరుడి ఖాతాలో రూ.పదిహేను లక్షలు వేస్తామని, ఏడాదికి కోటి ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రధాని మోడీ ఆ ఎన్నికల ప్రచారంలో వెయ్యి సార్లు అనవచ్చు. అనేవారికి, అనిపించేవారికి అవి తుస్సు వాగ్దానాలని తెలుసు. పాపం! ఓటర్లకే ఆ మర్మం అర్థం కాలేదు. వ్యూహకర్తల కుతంత్రాలకు ఇదో ఉదాహరణ.

వీరి కథ ఇలా ఉంటే తెలంగాణాలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పీకే, టీఆర్‌ఎస్ దోస్తీ పక్కా అయినట్లే అనిపిస్తుంది. అయితే, దేశంలో ఇతర రాజకీయ పార్టీలకు తెలంగాణ రాష్ట్ర సమితికి చాలా తేడా ఉంది. సుమారు దశాబ్దంన్నర కాలం పాటు సర్వ శక్తులూ ఒడ్డి, సకల బాధలను, సవాళ్లను అధిగమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేత కేసీఆర్ కె. రాష్ట్రంలో ఆయన్ని ఎరుగని పిల్లాడు కూడా ఉండడు. అలాంటి నేత మూడోసారి గెలుపు కోసం ఈవెంట్ మేనేజర్లను ఆశ్రయించడం అంటే తన అశక్తతను ఒప్పుకున్నట్లే, తన వ్యూహాలు చప్పబడ్డాయని, బెడిసికొడుతున్నాయని ప్రకటించినట్లే అనుకోవాలి. ఇందులో నిజం కూడా ఉంది. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఆయన తడబాటు బయటపడింది. పథకాల ఆసరాతో ఓట్లు పొందే అలవాటున్న కేసీఆర్ 'దళితబంధు' హుజురాబాద్‌లో గెలుపునకు బ్రహ్మాస్త్రం అనుకున్నారు. నిజానికి అదే అసలైన ప్రతిబంధకమని ఫలితాలు చెప్పాయి.

వ్యూహకర్త ఆలోచనలతోనే

తెలంగాణలో పీకే టీంలు తిరుగుతున్నట్లు, కొన్ని అసెంబ్లీ స్థానాలలో సమాచార సేకరణ పూర్తయిందని వార్తలొస్తున్నాయి. ఉద్యమ సహచరులను చేరదీయాలని, కొందరు సిట్టింగులను దూరం పెట్టాలని పీకే సూచించినట్లు కూడా తెలుస్తోంది. వాస్తవానికి తెలంగాణాలో పూర్తిగా నియంతృత్వ పాలన సాగుతోంది. పథకాల పేరిట, ప్రాజెక్టుల పేరిట రాష్ట్రం దివాళా తీసింది. సిట్టింగులు, స్టాండింగులు అందరూ సొంత ఎజెండాలతో సాగుతున్నారు. పార్టీలోని పెద్దలు, చిన్నలు భూకబ్జాలు, ఇసుక దందాలు, కమిషన్ల లెక్కల్లో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ ఆఫీసులలో అవినీతి విజృంభించింది. ప్రజలు లంచాలిచ్చి పనులు చేయించుకుంటున్నారు. ఎన్నికల వాగ్దానాలలో ఎన్నో అమలు కాలేదు, అయినవి కూడా ఆలస్యంగా, అనివార్యంగా అయినవే. ఇంత జరిగినా తెలంగాణ ప్రజలు ఇప్పటికీ రాష్ట్ర నిర్మాణంలో భాగం కావడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నారు. నేతలలోనే నిజాయితీ, చిత్తశుద్ధి కొరవడింది. పీకే వచ్చినా ప్రజలకు చెప్పేదేమీ లేదు.కొత్త పథకాల జోలికి వెళ్లకుండా కేసీఆర్ ప్రజల విశ్వాసాన్ని పొందే దారి చూపవలసిందే.

-బి.నర్సన్

94401 28169


Next Story

Most Viewed