ఆరోగ్య సంరక్షణలో ఫార్మసిస్టుల పాత్ర ఎంత?

by Disha edit |
ఆరోగ్య సంరక్షణలో ఫార్మసిస్టుల పాత్ర ఎంత?
X

తెలంగాణ రాష్ట్రంలోనూ బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలలో ఫార్మసిస్ట్‌లను నియమించలేదు. అసలే ఆరోగ్య శాఖలో అరకొరగానే ఫార్మసిస్ట్‌లు ఉన్నారు. వారు పని ఒత్తిడితోనూ, తక్కువ వేతనాలతోనూ, పదోన్నతులు లేకా క్షోభ పడుతున్నారు. ప్రభుత్వం మెడికల్ ప్రాక్టిషనర్స్‌ను పెంచడానికి కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తున్నది. అది మంచిదే కానీ, ఈలోగా అందుబాటులో ఉన్న ఫార్మసిస్ట్‌లను వినియోగించుకుంటే మంచిది. ఆరోగ్య రంగంలో మెడికల్ ప్రాక్టిషనర్ ఎంత ముఖ్యమో, ఫార్మసిస్ట్ కూడా అంతే ముఖ్యం. అందుకే ప్రభుత్వాలు ఫార్మసిస్ట్‌ల ప్రాధాన్యాన్ని గుర్తించి ప్రాథమిక చికిత్సకులుగా అనుమతించాలి. వారి సంఖ్యను పెంచాలి.

ప్రపంచవ్యాప్తంగా ఔషధ ఉత్పత్తిలో భారత్ మూడవ స్థానంలో ఉంది. ప్రపంచ దేశాలకు కావలసిన 60 శాతం వ్యాక్సిన్‌, 20 శాతం జనరిక్ ఔషధాలు భారత్ నుంచే సరఫరా అవుతున్నాయి. అందుకే మన దేశాన్ని ప్రపంచ ఔషధశాలగా అభివర్ణించారు. దీనినే స్ఫూర్తిగా తీసుకొని 'ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్' 61 వ జాతీయ ఫార్మసీ సప్తాహానికి (61st National Pharmacy Week (NPW)-2022) 'ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్-ఇండియా'(Pharmacy of the World - India) అనే నినాదాన్ని ఎంపిక చేసింది. అమెరికా ఆమోదిత ఔషధ పరిశ్రమలున్నవి భారత్‌లోనే. ఇప్పటికే ఫార్మా ఎగుమతులలో 2013-14 నాటితో పోలిస్తే 103 శాతం వృద్ధి చెందామని పీఐబీ(pib) ప్రకటించింది. దేశ ఎగుమతులలో ఫార్మా వాటా 5.92 శాతం కాగా, వాటిలో 73.31 శాతం బయోలాజికల్స్ వ్యాక్సిన్స్. మిగితావి బల్క్ డ్రగ్స్. ఇప్పటికే ప్రపంచంలో రెండు వందల దేశాలకు పైగా భారత్ ఔషధాలను ఎగుమతి చేస్తుంది. అలాగే, దీని విస్తరణకు సైతం అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు 'ఫార్మస్యూటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్' తెలిపింది.

స్వాతంత్య్రానికి పూర్వమే

కరోనా సమయంలో ప్రపంచ దేశాలన్ని తమ స్వార్థానికి వ్యాక్సిన్ తయారు చేసి సొంత ప్రజలకే కాక అవసరాల కోసం దాచుకున్నాయి. మన దేశం తన పౌరులందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వడమే కాకుండా ఐక్యరాజ్యసమితికి, ఇతర దేశాలకు సరఫరా చేసి ప్రపంచానికి సురక్ష కవచంగా నిలిచింది. ప్రపంచానికి 90 శాతం వ్యాక్సిన్ మనదేశమే అందించింది. దేశంలో తయారైన వ్యాక్సిన్‌లలో మూడవ వంతు తెలంగాణలో తయారవుతున్నాయి. పలు కంపెనీలు ఇక్కడి నుంచే ఉత్పత్తి చేయడంతో హైదరాబాద్‌ 'ఫార్మాబాద్'(pharmabad) గా పేరు తెచ్చుకుంది. దేశంలో కావలసినంత ఫార్మసీ నిపుణులు ఉన్నారు. అందుకే కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు జరుగుతున్నాయి. వివిధ అవసరాలకు అనుగుణంగా ఉండే కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

నిజానికి స్వాతంత్ర్యానికి పూర్వమే ఫార్మసీ విద్య, వృత్తి, వర్తకం నియంత్రణ కోసం అడుగులు పడ్డాయి. అందులో భాగంగానే 1939లో 'ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్'(Indian Pharmaceutical Association) ఏర్పడింది. 1940లో డ్రగ్స్ చట్టం అమలులోకి వచ్చింది. 1948లో ఫార్మసీ చట్టం ఆమోదం పొందింది. ప్రస్తుతం భారత్ ఫార్మసీ రంగంలో ఎంత పురోగతి సాధించినా ఆ గుర్తింపును ఫార్మసిస్ట్‌లు పొందడం లేదు. ఎందుకంటే, ఫార్మా వ్యాపారులు లాభాలు గడిస్తున్నారు తప్ప పార్మసిస్టులను పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ప్రభుత్వాలు సైతం సరైన గుర్తింపు ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం పాత చట్టాలను రద్దు చేసి కొత్తవి రూపొందించడంతో గుణాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని ఆశించారు. కానీ, నిరాశే మిగిలింది. పాత చట్టంలో ఔషధ వితరణకు మెడికల్ ప్రాక్టిషనర్‌కు మాత్రమే మినహాయింపు ఉండేది. కొత్త చట్టంలో ఆరోగ్య రంగానికి దగ్గరలో ఉన్న అందరికీ ఔషధాల వితరణ హస్తగతం చేశారు. ఇది ఫార్మసీ చట్ట స్పూర్తికే వ్యతిరేకం.

Also read: వైద్యుడు కాని వైద్యుడు ఫార్మసిస్టు

వారు లేకుండానే

నిజానికి ఫార్మసీ చట్టం ప్రకారం ఔషధ వితరణ అధికారం ఫార్మసిస్ట్‌లకు మాత్రమే ఉంటుంది. ఇది అతిక్రమించిన వారు శిక్షార్హులు. డ్రగ్స్ చట్ట సవరణ ద్వారా ఇది అపహాస్యం పాలైంది. మరో కొత్త చట్టం ద్వారా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (Medical Council of India) ను రద్దు చేసి, నేషనల్ మెడికల్ కమిషన్ (National Medical Commission) ను ఏర్పాటు చేశారు. ఫార్మకాలజీ వంటి ఉమ్మడి విషయంలో అధ్యాపకులుగా ఫార్మసిస్ట్ అర్హతలను చేర్చడానికి NMC సుముఖంగా లేదు. ఆసుపత్రులలో పూర్తి స్థాయి ఫార్మసీ విభాగాలు ఉండాలని సుప్రీంకోర్టు నిర్దేశాలు, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ రెగ్యూలేటరీ నిబంధనలు, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెగ్యూలేషన్ ఉన్నా ఎన్ఎంసీ పట్టించుకునే స్థితిలో లేదు. రాష్ట్ర లైసెన్సింగ్ ఆథారిటీలూ పట్టించుకోవు. కేంద్ర ప్రభుత్వ జాతీయ ఆరోగ్య విధానంలో 'మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడైర్'(Mid-Level Health Providers) ను (ఎమ్‌ఎల్‌హెచ్‌పీ) ప్రవేశపెట్టారు ఇందులో ఫార్మసిస్ట్‌లను ఎంఎల్‌హె‌చ్‌పీగా నియమించుకోవాలని సిఫారసు చేశారు. కానీ, కుంటిసాకులతో నేషనల్ హెల్త్ మిషన్ దానిని తొక్కిపెట్టింది. వెల్‌నెస్ సెంటర్లను ఫార్మసిస్ట్‌లు లేకుండానే నడిపిస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలోనూ బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలలో ఫార్మసిస్ట్‌లను నియమించలేదు. అసలే ఆరోగ్య శాఖలో అరకొరగానే ఫార్మసిస్ట్‌లు ఉన్నారు. వారు పని ఒత్తిడితోనూ, తక్కువ వేతనాలతోనూ, పదోన్నతులు లేకా క్షోభ పడుతున్నారు. ప్రభుత్వం మెడికల్ ప్రాక్టిషనర్స్‌ను పెంచడానికి కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తున్నది. అది మంచిదే కానీ, ఈలోగా అందుబాటులో ఉన్న ఫార్మసిస్ట్‌లను వినియోగించుకుంటే మంచిది. ఆరోగ్య రంగంలో మెడికల్ ప్రాక్టిషనర్ ఎంత ముఖ్యమో, ఫార్మసిస్ట్ కూడా అంతే ముఖ్యం. అందుకే ప్రభుత్వాలు ఫార్మసిస్ట్‌ల ప్రాధాన్యాన్ని గుర్తించి ప్రాథమిక చికిత్సకులుగా అనుమతించాలి. వారి సంఖ్యను పెంచాలి. ఫార్మసీ చట్టం వజ్రోత్సవాల సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకుని అమలు పరచాలి.

Also read: కాసుల వేటలో ఫార్మా ఇండస్ట్రీ

(ఫార్మసీ చట్టం వజ్రోత్సవాలు నవంబర్ 20-26)


డా.రాపోలు సత్యనారాయణ

ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ మెంబర్

94401 63211


Next Story

Most Viewed