Loan App Scam: రుణ యాప్ దారుణాలు

by Disha edit |
Loan App Scam: రుణ యాప్ దారుణాలు
X

రుణ యాప్‌ల ద్వారా అప్పు తీసుకున్నవారు లోన్ తీసుకున్నట్లు మీ ఇంట్లోని కుటుంబసభ్యులకు తెలియజేయాలి. యాప్ నిర్వాహకుల బెదిరింపులకు తలొగ్గి అఘాయిత్యాలు చేసుకోకుండా, రుణయాప్‌ల వారు బెదిరిస్తే పోలీస్ స్టేషన్ కు, సైబర్ క్రైమ్ వారికి ఫిర్యాదు చేయాలి. రుణయాప్‌ల ద్వారా అప్పులు తీసుకోవడం తగ్గించాలి. అత్యవసరమైతే ఆర్బీఐ నిబంధనల ప్రకారం పనిచేసే సంస్థల వద్ద మాత్రమే తీ‌సుకోవాలి. జాతీయ సైబర్ నేరాల ఫోరెన్సిక్ సంస్థ, సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఆన్‌లైన్ మోసాలు నియంత్రించాలి. ప్రాణం ఉంటే రుణం ఈ రోజు కాకపోతే రేపైనా తీర్చవచ్చు కానీ, ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి, అఘాయిత్యాలు చేసుకోకుండా, మనోర్భరంతో ఉండి మీ కుటుంబానికి బాసటగా నిలవండి.

రోజురోజుకూ రుణ యాప్‌ల అరాచకాలు పెరుగుతూనే ఉన్నాయి. ఎంతోమంది రుణయాప్ మోసాలకు బలవుతున్నారు. రుణం ఇచ్చి అధిక వడ్డీలు వసూలు చేస్తున్న ఈ అక్రమ యాప్(Loan app) బారినపడి అనేకమంది తీవ్ర అప్పుల పాలై అవి తీర్చలేక తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. గడిచిన ఐదేళ్లలో లోన్ యాప్‌ల వ్యాపారం రెట్టింపు కావడంతోపాటు నిర్వాహకుల వేధింపులు కూడా పెరిగాయి. అప్పు తీసుకున్న వారి ఫోన్ నంబర్లు, వారి ఛాయాచిత్రాలు, వారు ఎక్కడున్నారన్న సమాచారం, వారికి సంబంధించిన వీడియోలు సేకరించి వారి నంబర్లకు పంపించి బాధితులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. చట్టవిరుద్ధ రుణయాప్‌లు చిన్న మొత్తంలో డబ్బు ఇచ్చి అధిక వడ్డీ రేట్లు పెట్టి డబ్బు రికవరీ చేయడానికి బెదిరింపులకు పాల్పడటం మనం నిత్యం వివిధ మాధ్యమాలలో చూస్తూనే ఉన్నాం. ఈ రుణ యాప్‌లు చాలా ప్రమాదకరం.

మూతబడిన సంస్థతో పొత్తు పెట్టుకొని

వీరు లోన్ ఇచ్చే ముందే వారికి కావలసిన మన వ్యక్తిగత సమాచారం మొత్తం తీసుకొని రుణం మంజూరు చేస్తారు. వీటికి ఎలాంటి అనుమతులు ఉండవు. అయినా ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకుని, క్షణాల్లో రుణాలు అందిస్తూనే అధిక వడ్డీలు వసూలు చేస్తున్నాయి. రుణాలు చెల్లించడంలో విఫలమైన వారిపై సేకరించిన వ్యక్తిగత సమాచారం అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతూ వారి ప్రాణాలను సైతం బలి తీసుకుంటున్నాయి. ఇలా వ్యక్తిగత సమాచారం సేకరించడం, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమే కాక భద్రతకు ప్రమాదకరమని కేంద్రం హెచ్చరించింది. రుణ యాప్‌ల దందాను(Loan apps scams) అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఇచ్చిన నివేదిక ప్రకారం 600కు పైగా ఫేక్ రుణయాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అందుకే, ఏదైనా రుణ యాప్ ను డౌన్లోడ్ చేసుకునే ముందు యాప్ పేరు, దాని రేటింగ్, యాప్ స్టోర్‌లో సమీక్షలను పరిశీలించాలి.

నిజానికి రుణాలు భారతీయ రిజర్వు బ్యాంకు నుంచి అనుమతి పొందిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీ‌ఎఫ్‌సీ)తో ఒప్పందం కుదుర్చుకున్న యాప్‌లు రుణాలు ఇవ్వాలి. కానీ, కొన్ని యాప్‌లు మూతపడిన ఎన్‌బీ‌ఎఫ్‌సీలతో(NFBC) పొత్తు పెట్టుకుని ఆన్‌లైన్ రుణాల పేరిట అడ్డగోలుగా దందాలు చేస్తున్నాయి. కొన్ని యాప్‌లు బీద, మధ్యతరగతి కుటుంబాలు, చిరు వ్యాపారులు, యువతకు ఎలాంటి హామీ లేకుండా తక్కువ అప్పులు ఇచ్చి అధిక వడ్డీని వసూలు చేస్తున్నాయి. వడ్డీలు కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు యాప్ నిర్వాహకుల బెదిరింపులకి భయపడి వారి అమూల్యమైన ప్రాణాలు బలి తీసుకొని కానరాని లోకాలకు వెళ్తున్నారు. రుణ యాప్ నిర్వాహకుల వేధింపులతో 2021లో దేశవ్యాప్తంగా 68 మంది ఆత్మహత్య చేసుకుంటే, తెలంగాణలో ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయి.

రుణ యాప్‌ల వెనుక

రుణ యాప్ బాధితులు, యాప్ వేదింపులపై యేడాదిలోనే వివిధ పోలీస్ స్టేషన్‌లలో 2,500 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి విచారణ చేపట్టిన పోలీసులు ఈ యాప్ ల వెనుక కీలక పాత్ర పోషిస్తున్న వారు చైనాదేశస్థులని గుర్తించారు. వారు పెట్టుబడుల పేరిట మోసాలకు పాల్పడుతూ రూ. 903 కోట్లు కొట్టేసి అడ్డదారిలో చైనాకు పంపుతున్నట్టు పోలీసు విచారణలో వెలుగు చూసింది. ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్‌లో లోన్ యాప్ కార్యకలాపాలు 10 శాతం ఉండగా, భారత్ లో 45 శాతం, చైనాలో 28 శాతం, ఫిలిప్పీన్స్, మలేషియా, థాయిలాండ్‌లలో 10 శాతంగా ఉన్నాయి. ఈ యాప్ లింక్‌ను యూట్యూబ్ ద్వారా, ప్లే స్టోర్ ద్వారా పంపించి లేని ఉత్సుకతను ప్రజలకు చూపించి కోట్లు కొల్లగొట్టారు. వారిలో అధిక శాతం చైనా(china) దేశానికి చెందినవారే ఉన్నారు. ఆన్‌లైన్ మోసాలు, రుణయాప్‌ల ద్వారా సంపాదించిన డబ్బులను దొంగ పత్రాలతో ఏర్పాటు చేసిన కంపెనీల ద్వారా విదేశాలకు తరలించి, అక్కడి నుండి చైనాకు తరలిస్తున్నట్టు విచారణలో తెలిసింది.

రుణ యాప్ ల ద్వారా అప్పు తీసుకున్న వారు లోన్ తీసుకున్నట్లు మీ ఇంట్లోని కుటుంబసభ్యులకు తెలియజేయాలి. యాప్ నిర్వాహకుల బెదిరింపులకు తలోగ్గి అఘాయిత్యాలు చేసుకోకుండా, రుణయాప్‌ల వారు బెదిరిస్తే పోలీస్ స్టేషన్ కు, సైబర్ క్రైమ్ వారికి ఫిర్యాదు చేయాలి. రుణయాప్‌ల ద్వారా అప్పులు తీసుకోవడం తగ్గించాలి. అత్యవసరమైతే ఆర్బీఐ నిబంధనల ప్రకారం పనిచేసే సంస్థల వద్ద మాత్రమే తీ‌సుకోవాలి. జాతీయ సైబర్ నేరాల ఫోరెన్సిక్ సంస్థ, సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఆన్‌లైన్ మోసాలు నియంత్రించాలి. ప్రాణం ఉంటే రుణం ఈ రోజు కాకపోతే రేపైనా తీర్చవచ్చు కానీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి, అఘాయిత్యాలు చేసుకోకుండా, మనోర్భరంతో ఉండి మీ కుటుంబానికి బాసటగా నిలవండి.

మోటె చిరంజీవి

9949194327

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Next Story