మానవత్వమే మతం, సామరస్యమే కులం...!

by Disha edit |
మానవత్వమే మతం, సామరస్యమే కులం...!
X

శాస్త్ర సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతోంది. అంతర్జాల వలతో మనుషుల మధ్య దూరాలు సమసిపోయాయి. దేశాల సరిహద్దులు భౌతిక కంచెలుగా తెల్లబోతున్నాయి. స్మార్ట్ ఈ-సేవలు ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసాయి. వసుదైక కుటుంబంలో కులమతాలు సమసిపోతున్నాయి. ప్రపంచంలో 12 మతాలను ఆచరిస్తారు. ఇండియాలో మూడువేల కులాలు 19,500 భాషలు ఉన్నాయి. ఇలాంటి వైవిధ్య భరిత భారతం భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తేనే మానవాళి సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని అర్థం చేసుకోవలసిన సమయం ఆసన్నమైంది.

మానవాళిని ఏకతాటిపైకి తెచ్చేలా..

అంతర్జాతీయ స్థాయిలో కొంతమేర మతసామరస్యం నెలకొని ఉండగా, మనదేశంలో అక్కడక్కడ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, ఉద్యోగ, ఉపాధి లాంటి రంగాల్లో కులాల కుళ్ళు కుతంత్రాలు, మతాల మంటలు వికృత రూపం దాల్చుతూ నిత్యకృత్యంగా సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా మతసామరస్యం అందని ద్రాక్షే అవుతున్నది. పరమత సహనం నేతిబీరలో నెయ్యి చందంగా మారింది. స్వార్థంతో కులమతాలకు ఆజ్యం పోస్తున్న దేశద్రోహులు గుంటనక్కలా మన చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. 'నా కోసం, నా వారి కోసం, నా కులస్తుల కోసం, నా మతస్థుల కోసం' అనే నినాదాలు ప్రజల మధ్య అగాధాలను పెంచుతూ, శాంతి స్థాపనకు విఘాతాలుగా నిలుస్తున్నాయి. ప్రపంచంలో నెలకొన్న వివిధ మతాలు, కులాలు, నమ్మకాలు, విశ్వాసాలను పరస్పర అవగాహనతో అర్థం చేసుకొని ప్రజల మధ్య పరమత సహనం పాటిస్తూ దేవాలయాలు, చర్చ్‌లు, మసీదులు, గురుద్వారాలను శాంతి సందేశ వితరణ కేంద్రాలుగా మానవాళిని ఏకతాటిపై నిలిపేలా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందనే విషయాన్ని గుర్తు చేసేందుకు మతసామరస్య సద్భావనల ఆవశ్యకతను ప్రతియేటా ఫిబ్రవరి 01-07 వరకు 'ప్రపంచ మతసామరస్య సద్భావన వారోత్సవాలు' ఐక్యరాజ్యసమితి జరుపుతుంటుంది. దీనిని 2010లో జోర్డాన్ రాజు అబ్దుల్లా-2 ప్రతిపాదనతో ఐరాస సభ్య దేశాలు తీసుకున్న తీర్మానం ప్రకారం 2012 నుంచి ప్రతీయేటా ఫిబ్రవరిలో జరుపుతుంటారు.

సమసమాజ స్థాపనకు పునాది:

ప్రేమించే హృదయంలో భగవంతుడిని చూస్తూ, పరమత సహనం వహిస్తూ, ఇతరుల విశ్వాసాలను గౌరవిస్తూ, ఇరుగు పొరుగును గౌరవించడంలోనే సమాజ శాంతి దాగి ఉందనే విషయాన్ని అన్ని మత బోధనలు ప్రచారం చేస్తున్నాయని అర్థం చేసుకోవాలి. ఆస్తికులు, నాస్తికులు మనుషులే అని తెలుసుకొని, సాగరమంత సహనంతో జీవిస్తేనే మానవ ప్రగతి, ప్రపంచశాంతి సాధ్యమని తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా అనేక మతాలు, గ్రూపులు, సంస్థలు పరమత సహనానికి పరీక్షలు పెడుతూ స్వార్థపూరితంగా మనుషుల మధ్య మంటలు రాజేసే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుసుకోవాలి. వివిధ మతాల మధ్య పరస్పర సహకారం, శాంతి స్థాపన, సహనశీలత, విశ్వాసాల అవగాహన లాంటి సద్భావనలు నేడు అత్యవసరాలుగా కనిపిస్తున్నాయి. కరోనా కల్లోలంలో మానవాళి సామాజిక దూరాలు పాటిస్తూ, మానసికంగా ఐక్యంగా ఉండడం చూశాం. కులమతాలకు అతీతంగా మానవత్వం వెల్లివిరిసింది. పలు సంఘాల మధ్య పరస్పర సహకారం వికసించింది. మానవత్వమే మతమని, మనుషులంతా ఒకటే అని భావించని ఎడల 'మన గోతిని మనమే తవ్వుకున్నవారం' అవుతామని గుర్తించాం. మత గ్రంథాలన్నీ మంచితనాన్ని, మానవత్వాన్ని, సోదరభావాన్ని ప్రబోధిస్తున్నాయి. మతాన్ని ఆయుధంగా మలిచి మానవత్వాన్ని హత్య చేయరాదు. ఓర్పు, సహనం, క్షమ, శాంతి, దయ, కరుణ నిండిన మనసులు దేవుడు కొలువున్న కోవెలలుగా నిలుస్తాయి. చెడును తిరస్కరిస్తూ, మంచిని జీర్ణించుకోవడమే స్వర్గతుల్య సమాజ స్థాపనకు పునాది అని తెలుసుకుందాం.

సర్వమత సహనశీలతకు నిదర్శనాలు:

శాంతియుత సహజీవనమే భారతదేశ విజయ మంత్రం కావాలి. అబ్దుల్‌ కలాం, బిస్మిల్లా ఖాన్‌, మాతా అమృతానందమయి, షిర్డీ సాయి, ఏసుదాస్‌ లాంటి మహానుభావులు సర్వమత సహనశీలురుగా మన ముందు నిలిచారు. ఏసుదాస్‌ ద్వారా అయ్యప్ప గీతాలు, బిస్మిల్లా ఖాన్ షెహనాయ్‌ ద్వారా కాశీ విశ్వనాధుడి మేల్కొలుపు, సర్వమత రూపంగా అబ్దుల్‌ కలాం, శ్రీరంగం ఆలయంలో షేక్‌ చినమౌలానా నాదస్వరం, తిరుమల వెంకన్న 2వ భార్య బీబీ నాంచారమ్మ పరమత స్త్రీ, సేవా మూర్తి పుట్టపర్తి సాయి, పీరీల పండుగలో హిందూ భక్తులు, ఉర్సు/షరీఫ్‌ల్లో హిందూ పూజలు లాంటివి భారతీయ ప్రత్యేకతలుగా నిలుస్తున్నాయి. దేశ ప్రధానిగా పని చేసిన మన్మోహన్‌ సింగ్‌, రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన అబ్దుల్‌ కలాం, జైల్‌ సింగ్‌, ఫకృద్ధీన్‌ అలీ అహ్మద్‍, జాకీర్‌ హుసేన్‌లు భారతీయ మతసామరస్యానికి నిదర్శనాలుగా నిలుస్తున్నారు. మన మత బోధనలను ఒంటపట్టించుకొని, పరమతాలను గౌరవిస్తూ మానవత్వంతో సద్భావన కలిగి జీవించడమే ప్రపంచశాంతికి కారణమని నమ్ముతూ సంపూర్ణ అవగాహనతో సమైక్యంగా నడుచుకుందాం. అందరిలో ఒకే రక్తం ప్రవహిస్తోందని, సోదర భావంతో ముందుకు సాగుదాం.

(ఫిబ్రవరి 01-07 ప్రపంచ మత సామరస్య సద్భావన వారోత్సవాలు)

బుర్ర మధుసూదన్ రెడ్డి

9949700037


Next Story

Most Viewed