మీ విధానాల్లో తప్పులు ఒప్పుకోరా!?

by Disha edit |
మీ విధానాల్లో తప్పులు ఒప్పుకోరా!?
X

దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ అనుసరిస్తున్నారనే గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి, ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఎందుకు సమాధానం ఇవ్వలేకపోతున్నారు? కాళేశ్వరం ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్ట్ అయితే, ప్రభుత్వం చెప్పినట్లు లక్షల ఎకరాలకు నీరు ఇస్తున్నది నిజమైతే, కాళేశ్వరం ప్రాజెక్ట్ చూడటానికి వెళుతున్న ప్రతిపక్ష నాయకులను మీడియా ప్రతినిధులను అరెస్ట్ ఎందుకు చేస్తున్నట్లు? దేశంలో ఉన్న ఏ నీటి పారుదల ప్రాజెక్ట్‌కు ఎవరైన వెళ్ళవచ్చు చూడవచ్చు చూస్తున్నాం కూడా, ఎక్కడా అరెస్ట్‌లు జరగట్లేదే? అంతెందుకు పక్క రాష్ట్రంలో నిర్మాణమవుతున్న పోలవరం దగ్గర అరెస్ట్‌లు జరగడం లేదు! ఇక్కడ మాత్రమే ఎందుకు సమాధానం చెప్పగలరా? ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టు కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లోపం లేకుంటే, నష్టం జరగకుంటే, దోపిడీ చేయకుంటే ప్రతిపక్ష నాయకులను, మీడియాను తీసుకెళ్ళి చూపించి ప్రజల మన్ననలను పొందవచ్చు కదా! కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణలో పొలాలకు నీరు పారించడం కన్నా కేసీఆర్ కుటుంబానికి ధనాన్ని పారించిందని అందరూ నమ్ముతున్నారు! అదే బీజేపీ నాయకుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ‘ఏటీఎం’ అయిందన్నారు.

ఇక రాష్ట్రంలో భూ సమస్యలకు కారణమైన ధరణి పోర్టల్‌ను విదేశీ సంస్థకు అప్పజెప్పి, ఎంతో మంది రైతు కుటుంబాలకు భూమి లేకుండా చేస్తున్నారు.దీనిపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్న సమాధానం ఎందుకు చెప్పడం లేదు! అంతెందుకు మీ సభలో ధరణి పై ప్రశ్నించినా, సగం మంది ధరణి వద్దన్నది మీరు చూశారు కదా! అయిన దానిని ఎందుకు సమర్థించుకుంటున్నారు. అసలు ధరణి లేకపోతే రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లే కానట్లు మీరు మాట్లాడుతున్నారు..ధరణి ద్వారా 32 లక్షల ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ అయినట్టు అధికారిక లెక్కల ప్రకారం చెప్పారు. అందులో ముప్పై ఎకరాలైనా రైతులు కొన్నారా? కానీ అమ్ముకున్నది మాత్రం రైతులే కదా! ధరణి వల్ల ఎంతో మంది సమస్యలతో కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నది నిజం కదా? లక్షల ఎకరాల భూమి సమస్యలలో ఉన్నది నిజం కాదా? మరి ధరణి గొప్పదనం ఏది? ధరణితో జరిగే ఒకే ఒకే మేలు వెంటనే రిజిస్ట్రేషన్ తో పాటు మ్యుటేషన్ కావడం మాత్రమే! అందుకే భూ సమస్యలకు కారణమైన ధరణి పోర్టల్ సాప్ట్‌వేర్‌ను నిర్వహిస్తున్న విదేశీ సంస్థకు ఇచ్చిన కాంట్రాక్టును రద్దు చేసి కేంద్ర ప్రభుత్వ ఐటీ సంస్థ అయిన ఎన్ఐసీ (నేషనల్ ఇన్పర్మేటిక్స్ సెంటర్)కి ఇచ్చి ధరణి పోర్టల్‌లో ఉన్న లోపాలను సరిదిద్దాలి. అప్పుడు మాత్రమే ధరణి సమస్యలు పరిష్కరించ గలరు.

నారగొని ప్రవీణ్ కుమార్

ప్రెసిడెంట్, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్

98490 40195

Also Read:

ముగిసిన దశాబ్ది ఉత్సవాలు.. నెక్ట్స్ ఆ ప్రోగ్రామ్స్‌పై సీఎం కేసీఆర్ ఫోకస్!



Next Story

Most Viewed