నడుస్తున్న చరిత్ర:నీలి జెండా సవాలు విసురుతుందా?!

by Disha edit |
నడుస్తున్న చరిత్ర:నీలి జెండా సవాలు విసురుతుందా?!
X

నలుగురు కూచున్న చోట పలకరింపులు, అడ్డా కూలీల బతుకుల విచారణ, కలుపుగోలు మాటలు, వెంట నీలి రంగు కండువాల కార్యకర్తలు, యువకులు, నేతలు, ప్రజలు వెరసి ప్రవీణ్ పాదయాత్ర నిదానంగా, నిలకడగా సాగుతోంది. కేసీఆర్ లక్ష్యంగా విమర్శ సాగినపుడు 'తెలంగాణ కోసం అమరులైన 1300 మందిలో పదముగ్గురు కూడా పై కులాల వారు లేరని, బలహీనవర్గాల త్యాగధనులు తెచ్చిన తెలంగాణాలో 22 మంది బీసీ ఎమ్మెల్యేలు, నలుగురు బీసీ మంత్రులున్నారని, ఇదెక్కడి న్యాయం!' అని అడుగుతున్నారు.

పాదయాత్రలంటే ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకోవడానికి, పాలనా ఫలితాలను కళ్లారా గమనించడానికి పనికొచ్చే ఏకైక సులభ మార్గం. రాజులు రాత్రివేళ మారువేషాలతో వీధులు, అంగళ్లలో తిరిగి పాలన ఎలా ఉందని ఆరా తీసే సందర్భాలు జానపద కథలలో చూస్తుంటాం. ప్రజల బతుకు తీరును గమనించేందుకు ఆసక్తి ఉన్న సాధారణ పౌరుడి నుండి ప్రభుత్వాధినేత దాకా ఎవరైనా అడుగులేస్తేనే అసలు విషయం అంతు చిక్కుతుంది. ఈ మధ్య తెలంగాణాలో వివిధ రాజకీయ నేతలు చేస్తున్న పాదయాత్రల పర్వాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ప్రెస్‌మీట్‌లో 'నేను చచ్చినా పాదయాత్ర చేయ' అన్నట్లున్నారు.

పాదయాత్రలు చేసే పరిస్థితి ఎప్పుడు ఎవరికి ఎందుకు వస్తుందో ఊహకందని విషయమే అయినా, పాదయాత్రను తక్కువ చేసి చూడకూడదు. క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో 14 ఏండ్లు మన దేశంలో కాలినడకన తిరుగుతూ ఎన్నో విషయాలను గ్రంథస్థం చేసిన మహా యాత్రికుడు హుయాన్‌త్సాంగ్ చైనీయుడైన మనకు చారిత్రక బంధువయ్యాడు. మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం, వినోబా భావే భూదానోద్యమం పాదయాత్రలలలో గొప్ప ఫలితాలు సాధించిన చారిత్రక సంఘటనలుగా వినతికెక్కాయి.

మూడేసి పాదయాత్రలు

ఎవరి పాలనలోనైనా అంతా జనామోదంగా ఉందని కచ్చితంగా చెప్పలేం. ప్రజల వద్దకు పాలన అని ఉద్యోగులను అదరగొట్టిన చంద్రబాబు తనకు రాష్ట్రంలో ఎదురే లేదనుకున్న సందర్భంలో వై‌ఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ధూళి ఆయన్ని 2004 లో పదవిలోకి రాకుండా అడ్డుకుంది. ఆధునిక రాజకీయ యవనికపై వై‌ఎస్‌ఆర్ పాదయాత్ర ఒక సంచలనంగా మిగిలింది. ఆనాటి నుంచి వివిధ పేర్లతో జనం ముందుకొస్తున్న పాదయాత్రికులకు ఆయన అడుగులే ప్రేరణ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మూడు పాదయాత్రలు కొనసాగుతున్నాయి.

కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క 'పీపుల్స్ మార్చ్'పేరిట ఒకటి అది 500 కి.మీ.సాగే 32 రోజుల యాత్ర. భట్టి నియోజకవర్గం మధిరకే పరిమితమైన మినీ యాత్ర ఇది. తెలంగాణ వై‌ఎస్‌ఆర్‌టీపీ అధినాయకురాలు షర్మిల నడుస్తూ నడిపిస్తున్న 'ప్రజాప్రస్థానం' మరొకటి. ఇది చేవెళ్ల నుంచి తిరిగి చేవెళ్ల వరకు 400 రోజులపాటు 4000 కి.మీ. సాగే మహా యాత్ర. బీ‌ఎస్‌పీకి తెలంగాణ రాష్ట్రానికి చీఫ్ కోఆర్డినేటర్ అయిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ 'బహుజన రాజ్యాధికార యాత్ర' మార్చి ఆరున మొదలైంది ఇది 300 రోజులు, 5000 గ్రామాల పర్యటన దీని లక్ష్యం. మూడు వందల రోజులలో ముప్పై రోజులు ముగుస్తున్నాయి. పది నెలల యాత్రలో ఒక నెల ముగిస్తే ఒక మైలురాయి దాటినట్లే.

ఉన్నత హోదాను వదులుకుని

సాధారణంగా పక్కా రాజకీయనేతలు, సుదీర్ఘ కాలం ప్రజా జీవితంలో ఉన్నవారు తమ పార్టీకి లేదా సొంత రాజకీయ ప్రయోజనాల కోసం పాదయాత్రలను ఆశ్రయిస్తున్నారు. ఎన్నికల ముందు పాలక పక్షాన్ని విమర్శిస్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు ఇదో కష్టసాధ్య మార్గం. ఈ మార్గం ఎంచుకున్న ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పుట్టు రాజకీయ నేత కాదు. వాళ్ల నాయన ఊరి పెద్ద కాదు, భూస్వామి కాదు. కనీసం పంచాయతీ మెంబరు కూడా కాదు. నిజానికి ఆయన వృత్తి రాజకీయమే కాదు. ఉద్యోగం చేసుక బతికే దళిత కుటుంబం ఆయన నేపథ్యం.

ఆయన పోలీసు శాఖలో ఉన్నతోద్యోగం చేసి రాజీనామా చేసిన ఐ‌పీఎస్ స్థాయి అధికారి అనే విషయం అందరికి తెలిసిందే. ఆరేండ్ల సర్వీసును వదిలేసి బహుజన సమాజ్ పార్టీలో చేరి స్టేట్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు చేపట్టి ఇప్పుడు పాదయాత్రలో ఉన్నారు. ఏసీ వాహనాలలో తిరుగుతూ, ఏసీ గదులలో పని చేస్తూ, లక్షల రూపాయలు జీతంగా పొందుతూ సర్వీసు పూర్తి చేసి, నీడపట్టున సుఖంగా శేష జీవితాన్ని గడిపే స్థోమత ఆయన అధికార హోదాకు ఉంది. అవన్నీ వదిలేసి ఇప్పుడు ఎర్రటి ఎండలో కాలినడకన నీలి జెండా, ఏనుగు గుర్తును పట్టుకొని తిరుగుతున్నారు.

భ్రమల బతుకు ఇంకా వద్దంటూ

పాలక, ఇతర విపక్ష పార్టీలు ప్రవీణ్ పాదయాత్రను తేలిగ్గా తీసుకున్నట్లు పైకి కనబడుతున్నా ఆయన ప్రసంగాలలో వాడి, వేడి ఉందన్న విషయం కాదనలేము. టీఆర్‌ఎస్ పాలనే లక్ష్యంగా ఆయన చేస్తున్న విమర్శ బలహీనవర్గాలలోకి సూటిగా వెళుతోంది. 'అగ్రవర్ణ ధనవంతులే రాజకీయ నాయకులు, వాళ్లే కాంట్రాక్టర్లు, వాళ్లకే కమిషన్లు, వాళ్లకే ఉద్యోగాలు, వాళ్లే ఆస్తులు కూడబెట్టుకుంటారు, వాళ్లే భూములు కబ్జా చేస్తారు, వాళ్లే కోట్లు విలువచేసే ఇళ్లల్లో ఉంటారు, వాళ్లే విమానాలు ఎక్కుతారు, వాళ్లే విదేశాలకు పోతారు, ఇవన్నీ మనకెప్పుడు దక్కాలి, స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా మనం ఎక్కడున్నామో అక్కడే ఉన్నాం. 80 శాతం మనం 20 శాతం వాళ్లు, వాళ్ళు ఐక్యంగా ఉండి మనల్ని విడదీసి లాభం పొందుతున్నారు.

మన తాతలు, మన తండ్రులు ఇట్లనే మోసపోయిండ్రు, మనం కూడా గొర్రెలు బర్రెలకే భ్రమసి పోతున్నాం, గొర్రెలు, బర్రెలు మీరే ఉంచుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టు మాకు ఇవ్వండి అనాలే ' అని ప్రవీణ్ యువతను ఉత్సాహపరుస్తూ తన మాటలతో ఆకట్టుకొంటున్నారు. వారికి ఏనుగు బొమ్మను చూపిస్తూ 'ఇదేం బొమ్మ! మంచిగుందా!' అని పార్టీ చిహ్నాన్ని అంతటా పరిచయం చేస్తున్నారు. స్కూలుకు వెళ్లని పిల్లలతో అక్షరాభ్యాసం చేయించి 'ఐపీఎస్ సాధించిన వ్యక్తి చేతులలో అక్షరాలు దిద్దినా అంతటివారు, నన్ను మించిన వారు కావాలని' ఆశీస్సులు ఇస్తున్నారు.

వారి త్యాగాలు యాదికి లేదా?

గ్రామ కూడళ్లలో మీటింగులు, నలుగురు కూచున్న చోట పలకరింపులు, అడ్డా కూలీల బతుకుల విచారణ, కలుపుగోలు మాటలు, వెంట నీలి రంగు కండువాల కార్యకర్తలు, యువకులు, నేతలు, ప్రజలు వెరసి ప్రవీణ్ పాదయాత్ర నిదానంగా, నిలకడగా సాగుతోంది. కేసీఆర్ లక్ష్యంగా విమర్శ సాగినపుడు 'తెలంగాణ కోసం అమరులైన 1300 మందిలో పదముగ్గురు కూడా పై కులాల వారు లేరని, బలహీనవర్గాల త్యాగధనులు తెచ్చిన తెలంగాణాలో 22 మంది బీసీ ఎమ్మెల్యేలు, నలుగురు బీసీ మంత్రులున్నారని, ఇదెక్కడి న్యాయం!' అని అడుగుతున్నారు.

ఏడు నెలల పాటు గోల్కొండను ఏలిన సర్వాయి పాపన్న, ముదిరాజ్ వీరుడు పండుగ సాయన్న, చాకలి ఐలమ్మ, అమరుడు దొడ్డి కొమురయ్య తదితర బీసీ వీరుల చరిత్ర కనుమరుగు చేశారు, పాఠ్యపుస్తకాలలో వారికి చోటు దక్కలేదు. పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, మడేలు స్వామి, కాటమరాజు ఇలా ఎందరో శ్రామిక వర్గాల దేవతలు గుళ్లకు, పూజలకు నోచుకోవడం లేదని తన ప్రసంగాల్లో అంటున్నారు. బలహీనవర్గాలంటే సామాజిక పర వెనుకబాటు జనమే కాదు, అగ్రవర్ణాలలోని పేదలకు కూడా విద్య, వైద్యం, సంపద దక్కాలని స్పష్టపరుస్తున్నారు.

ఆకలిదప్పులను తడుముతూ

నీడకు, నీళ్లకు దిక్కులేని అడ్డా కూలీలను చూసి వేదనతో వారిని వాటేసుకున్న దృశ్యాలు, ఒక పూరి గుడిసెలోకి వంగి వెళ్లి లోపలంతా పరిశీలించి కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు వార్తలుగా వచ్చాయి. 30 రోజులలో సుమారు 300 గ్రామాల దాకా ఆయన పాదయాత్ర ఖాతాలో పడ్డాయి. పాదయాత్ర ఆరంభం రోజున ప్రవీణ్‌కుమార్ ఇంట్లో భార్య, పిల్లలు ఆయనకు అభినందనలు, వీడ్కోలు పలికిన ఉద్వేగభరిత సన్నివేశం చూసినవారిని కదిలిస్తుంది. ఇంటి పెద్ద ఉన్నత విద్యతో పొందిన సౌకర్యవంత జీవితాన్ని త్యజించి జనం కోసం పని చేయ సంకల్పిస్తే కుటుంబం ఆందోళన చెందకుండా ఉండలేదు.

ఇదంతా ఒక వైపయితే ఆయన పాదయాత్రపై పత్రికల, ప్రసార మాధ్యమాల కవరేజి మాత్రం స్థాయికి తగ్గట్లుగా లేదనాలి. మార్చి ఆరున జనగామ జిల్లా ఖిలాషాపుర్ లో ప్రారంభ సభకు జన స్పందన జోరుగా ఉన్నా ఆ వార్త మాత్రం కొన్ని పత్రికలలో జిల్లా ఎడిషన్‌లోకి వెళ్లింది, కొన్ని పత్రికలు అది వార్తే కాదనుకున్నాయి. అదే పరిస్థితి ఆర్మూర్ లో ఏప్రిల్ మూడున ఆయన పాల్గొన్న బీసీ రాజ్యాధికార సంకల్ప సభకు ఎదురైంది. సుమారు నాలుగు గంటల పాటు ధూమ్‌ధాం‌గా సాగిన ఈ సభ ఖచ్చితంగా ఫ్రంట్ పేజీలో రావాల్సింది. 'అల్బర్ట్ పింటోకో గుస్సా క్యో ఆతాహై'సినిమాలో కార్మికుల సమ్మెకు సంబంధిన వార్తలు పత్రికలలో రాకపోవడం చూసి హీరో 'మిల్లు ఒక ధనవంతుడిది, పత్రిక మరో ధనవంతుడిది' అని తోటివారితో అంటాడు. నిజానికి పత్రికలో వార్త కన్నా ప్రజా స్పందనే గొప్పది.

బి.నర్సన్

94401 28169

Next Story

Most Viewed