బీఆర్ఎస్ కు జాతీయ పార్టీ హోదా శాశ్వతమేనా?

by Ravi |
బీఆర్ఎస్ కు జాతీయ పార్టీ హోదా శాశ్వతమేనా?
X

జాతీయ పార్టీ స్థాపించడానికి కావాల్సిన అర్హతలు ఏమిటి? విధి విధానాలేమిటి? ఒక పార్టీని జాతీయ పార్టీగా ఎలా గుర్తిస్తారు. భారత్‌లో బహుళ పార్టీల రాజకీయ వ్యవస్థ అమలులో ఉంది. అంటే దేశంలో ఎన్ని పార్టీలైనా ఉండొచ్చు. అలాగే, ఈ పార్టీలను జాతీయ, ప్రాంతీయ పార్టీలుగా ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఇవే కాకుండా ఎన్నికల సంఘంలో నమోదు చేసుకున్న రిజిస్టర్డ్ పార్టీలు కూడా ఉంటాయి.

ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన -1968 ప్రకారం (ఈ నిబంధనను కాలానుగుణంగా మార్చుతున్నారు) చివరగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో లోక్‌సభ లేదా అసెంబ్లీ స్థానాలలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో అభ్యర్థులు పోటీ చేయాలి. ఎన్నికలలో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం సాధించాలి. దీనితోపాటు ఏదైనా ఒక రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి కనీసం నలుగురు అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికవ్వాలి. లేదా కనీసం నాలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి. లేదా గత సాధారణ ఎన్నికలలో లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం రెండు శాతం సీట్లను గెలుచుకొని ఉండాలి. గెలుపొందిన అభ్యర్థులు మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వాలి.

ప్రాంతీయ పార్టీగా గుర్తింపు

ఎన్నికల సంఘం 2013లో జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే ఒక రాజకీయ పార్టీ ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించడంతో పాటు రెండు అసెంబ్లీ స్థానాలను గెలవాలి. లేదా ఆ రాష్ట్రంలో లోక్‌సభకు జరిగిన ఎన్నికలలో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లతో పాటు ఒక లోక్‌సభ స్థానాన్ని గెలవాలి. లేదా ఆ రాష్ట్రంలోని ప్రతి 25 లోక్‌సభ స్థానాలకు ఒక స్థానాన్ని గెలవాలి. లేదా ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో మూడు శాతం ఓట్లు లేదా మూడు సీట్లు సాధించాలి. లేదా లోక్‌సభ లేదా శాసనసభలో గత ఎన్నికలలో ఆ పార్టీకి రాష్ట్రంలో పోలై చెల్లిన ఓట్లలో ఎనిమిది శాతం వచ్చి ఉండాలి.

అయితే, ఒక పార్టీ ఒక ఎన్నికలో జాతీయ పార్టీగా లేదా ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందితే అదే హోదా శాశ్వతంగా ఉండదు. అంటే, ఎన్నికల తరవాత పార్టీలు తమ గత హోదాను కలిగి ఉండటం లేదా కోల్పోవడం జరుగుతుంది. దీనివల్లే జాతీయ పార్టీల సంఖ్య, ప్రాంతీయ పార్టీల సంఖ్య మారే అవకాశం ఉంటుంది.

దేశంలో ఎన్ని జాతీయ పార్టీలున్నాయి?

2021 సెప్టెంబర్ 23వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ప్రస్తుతం దేశంలో ఎనిమిది జాతీయ పార్టీలు ఉన్నాయి. 1 .ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC), 2. భారతీయ జనతా పార్టీ (BJP), 3. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI), 4. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (CPI(M)), 5. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (AITC), 6. బహుజన్ సమాజ్‌ పార్టీ (BSP),

7. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP), 8. నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP). జాతీయ, ప్రాంతీయ పార్టీ గుర్తింపు సాధించలేని పార్టీలను రిజిస్టర్డ్‌ పార్టీలుగా పరిగణిస్తారు. కొత్తగా స్థాపించిన పార్టీ ఒక రాష్ట్ర శాసన ఎన్నికలలో కనీసం పది స్థానాలలో పోటీ చేయాలి. 50 కంటే తక్కువ నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రాలు అయితే కనీసం ఐదు స్థానాలలో పోటీ చేయాలి. 20 కంటే తక్కువ లోక్‌సభ స్థానాలు ఉంటే కనీసం రెండు స్థానాలలో పోటీ చేయాలి. భారత రాజ్యాంగం ప్రకారం భారత్ రాష్ట్ర సమితి (BRS) ని‌ ఎన్నికల‌ సంఘం గుర్తిస్తే వచ్చేది‌ రిజిస్టర్డ్ పార్టీ హోదా మాత్రమే. జాతీయ పార్టీ కాదని గుర్తుంచుకోవాలి.

ALSO READ : బీఆర్ఎస్ విస్తరణ ఆంధ్రప్రదేశ్ లో తేలికేనా? ముఖ్యపాత్ర ఎవరిది


సభావత్ కళ్యాణ్

ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ వనవాసి కన్వీనర్

90143 22572

Advertisement

Next Story

Most Viewed