మన దేశానికి.. జమిలి ఎన్నికలు అవసరమా?

by Ravi |
మన దేశానికి.. జమిలి ఎన్నికలు అవసరమా?
X

త కొన్నేళ్లుగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమ అంతర్గత పార్టీ చర్చల్లోనూ, భాగస్వామ్య పక్షాలతోనూ 'ఒకే దేశం,' - 'ఒకే ఎన్నికల విధానం' అనే అంశంపై మేధోమధనం చేస్తూనే వుంది. కానీ దాన్ని ఎలా అమలు చేయాలనే విధి విధాన విషయాల్లో స్పష్టత రాలేదు. ఆ సందర్భంగా లా కమిషన్ అనేక ప్రశ్నలను గతంలోనే లేవనెత్తింది. అయితే, అన్నివర్గాలకూ సంతృప్తి కలిగే విధంగా ముందుకు తీసుకుపోయే విషయంలో ఏ రాజకీయ పార్టీకి స్పష్టత ఇంతవరకు రాలేదు. ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థకూ, రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి, దేశ సమైక్యతకు నష్టం కలగకుండా, ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించటం సాధ్యమా అనేది ప్రధాన సమస్య.

వేరు వేరుగా నిర్వహిస్తే..

ప్రస్తుత భారత రాజ్యాంగ నియమాల ప్రకారం జమిలి ఎన్నికలు ఎంతవరకు సాధ్యం? లోక్‌సభకూ, రాష్ట్ర శాసన సభలకూ, స్థానిక సంస్థలకూ అన్నింటికీ కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే అది ఒక పెద్ద సవాలు. ఏక కాలంలో శాంతి భద్రతల పరిరక్షణకు ఎక్కువ సంఖ్యలో పోలీసు సిబ్బంది కావాలి. ఎన్నికల అధికారులు, సిబ్బంది, శిక్షణ, ఈవీఎంలు, మౌలిక సదుపాయాలు, సమన్వయ యంత్రాంగం, ఎన్నికల వ్యయభారం మొదలైన సమస్యల సాధ్యాసాధ్యాలపై స్పష్టమైన అంచనాలు ఉండాలి. అందుకోసమే ఈ సమస్యల అధ్యయనానికి పూర్వ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారధ్యంలో ప్రత్యేక సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం నియమించింది.

140 కోట్ల జనాభా కలిగిన ఇంత పెద్ద ప్రజాస్వామిక దేశంలో ఒకేసారి ఎన్నికల నిర్వహణ అంటే మాటలు కాదు. పైగా, కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల అవసరాలు, విధులు, సమస్యలు వేటికవే ప్రత్యేకమైనవి. ఈ వ్యవస్థలో ఎవరి బాధ్యతలు ఏమిటో ఓటర్లకు స్పష్టంగా తెలియాలి. ఎన్నికలు విడివిడిగా నిర్వహిస్తేనే, ఓటర్లు ఆయా ప్రభుత్వాల పనితీరుపై స్థానిక సమస్యల ఆధారంగా ప్రజాప్రతినిధుల పనితీరుపై తీర్పు చెప్పగలిగే అవకాశం ఉంటుంది. అలా వెలువడే ప్రజా తీర్పులే నిజమైన ప్రజాస్వామ్యానికి ఊపిరినిస్తాయి. గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాలు, మొదలుకొని లోక్‌సభ వరకు అన్నింటికీ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే, జాతీయ అంశాల ప్రచార హోరులో రాష్ట్ర, స్థానిక సమస్యలు చర్చకు రాకుండా పోతాయి.

ధర్మ సందేహాలు ఎన్నో..?

మనదేశం బహుళత్వానికి ప్రతీక. ఈ సందర్భంలో ప్రజల ప్రాంతీయ, స్థానిక అవసరాలు, కోరికలు ఆకాంక్షలతో జాతీయ సమస్యలపై ఏకకాలంలో ఒకేసారి తమ అభిప్రాయాన్ని ఓటు ద్వారా చెప్పమని ఓటర్లను కోరటం సమంజసం కాదు. వారు గందరగోళానికి గురవుతారు. ఇక రెండవ విషయం, ఏదో ఒక రాష్ట్రంలో తరచూ ఎన్నికలు జరుగుతూ ఉండడం వల్ల, ప్రజాపాలన స్థంభించిపోతుందనేది. ఈ వాదనకు కూడా తర్క బద్దమైన విలువ లేదు. పైగా ఒకే దేశం, ఒకే ఎన్నికల పద్ధతి వాస్తవ రూపం దాల్చాలంటే, కొన్ని రాష్ట్రాల్లో శాసనసభలను ముందుగానే రద్దు చేయాల్సి ఉంటుంది. మరికొన్ని రాష్ట్రాల్లో వాటి కాల పరిమితిని పొడిగించాల్సి ఉంటుంది. అలా చేయాలంటే ముందుగా భారత రాజ్యాంగానికి సవరణ చేయాలి. గతంలో ఇలాంటి రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసే రాజ్యాంగ సవరణలు చెల్లవని సుప్రీం కోర్టు తీర్పు కూడా చెప్పింది. ఈ విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. ఇదే విషయాన్నిసుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, దివంగత జస్టిస్ పి.బి. సావంత్ కూడా బలపరిచారు.

ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలతో కయ్యానికి కాలుదువ్వుతున్నది. వీటి మధ్య సంఘర్షణాత్మక వాతావరణ స్థితిలో ఏకాభిప్రాయం సాధ్యమా అనేది వెయ్యి డాలర్ల ప్రశ్న. గతంలో దేశమంతా ఒకే పార్టీ కొనసాగిన రోజుల్లో లోక్‌సభకు, రాష్ట్ర శాసన సభలకు ఏకకాలంలోనే ఎన్నికలు జరిగేవి. ఇప్పుడు వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు బలపడిన తర్వాత ఈ పద్ధతి మారిపోయింది. ఒకవేళ మళ్లీ పాత పద్ధతి అమలులోకి వస్తే, ఏ రాష్ట్రంలో నైనా ప్రజాతీర్పు ఏపార్టీకీ పూర్తి మెజారిటీ రాని స్థితిలో, ఏమి చేయాలి ఇలాంటి అనేక ధర్మ సందేహాలు ఉన్నాయి. జమిలి ఎన్నికల కంటే ముందుగా కొన్ని సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం తీసుకు రావాలి.

సంస్కరణలు తీసుకురావాలి!

ఎన్నికల ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరించాలి. అవినీతి, హత్య, బ్యాంకు రుణాల ఎగవేతదారులు మొదలైన నేర చరిత్ర కలవారిని ఎన్నికలలో పోటీకి అనర్హులుగా ఎన్నికల కమిషన్ ప్రకటించాలి. మద్యం, డబ్బుల పంపిణీల్లో పట్టుబడిన వారిని ఎన్నికల్లో పోటీ నుండి తొలగించాలి. పార్టీ ఫిరాయింపు దారులను అరికట్టాలి. ఎన్నికల ముందే ఓటర్ల జాబితాను నిశిత పరిశీలన చేయాలి. లోపాలు సవరించాలి. దొంగ ఓట్లను నివారించాలి. నిష్పాక్షికంగా ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు తగిన రక్షణ కల్పించాలి. ఎన్నికల అధికారులు అవినీతికి పాల్పడి పట్టుబడితే ఉద్యోగం నుండి తొలగించాలి. ఎన్నికల అవకతవకలపై విచారణ వేగవంతం చేయడానికి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలి. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో ఫిరాయించే వారి సభ్యత్వం తక్షణమే రద్దు చేయాలి. మరో ఐదు ఏళ్ళపాటు తిరిగి పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలి. ఎన్నికల్లో కుల, మత, విద్వేషాలు రెచ్చగొట్టే వారిని వెంటనే అనర్హులుగా ప్రకటించాలి. ఇలా ఎన్నికల సంస్కరణలు తెచ్చి ప్రజాప్రతినిధులను నిజాయితీగా ఎన్నుకునే వాతావరణం సృష్టిస్తే మన ప్రజాస్వామ్యానికి విలువ, గౌరవం పెరుగుతుంది. లేకపోతే ఎన్నికలు యథావిథిగా అవినీతి ప్రహసనంగా మిగులుతాయి.

డా.కోలాహలం రామ్ కిశోర్

98493 28496

Next Story

Most Viewed