వారికి ఎస్‌సీ హోదా దక్కుతుందా!?

by Ravi |   (  Updated:2022-11-28 18:45:27  IST  )

వారికి ఎస్‌సీ హోదా దక్కుతుందా!?... did muslims got sc reservation

వారికి ఎస్‌సీ హోదా దక్కుతుందా!?
X

బీజేపీ బాలకృష్ణన్ కమిషన్‌ను నియమించడంలో ముఖ్య ఉద్దేశ్యం దళిత ముస్లింలు, క్రైస్తవులకు ఎస్‌సీ హోదా ఇస్తే వారంతా బీజేపీకి ఓటు బ్యాంకుగా మారుతారని. దేశంలో 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. వారిలో చీలిక తేవటం ద్వారా ఎక్కువ శాతం మంది దళిత ముస్లింలుగా మారే అవకాశం ఉంది. సున్నీలు కటిక బీదరికంలో ఉన్నందున వీరు కూడా దళిత ముస్లింలుగా మారవచ్చు. షియాలు బీజేపీకి ఎప్పటి నుంచో ఓటు బ్యాంకుగా ఉన్నారు. గత్యంతరం లేక ముస్లింలు బలవంతంగా బీజేపీకి ఓటు వేయాల్సిన పరిస్థితులను సృష్టిస్తున్నారు. అందులో భాగంగానే కాశ్మీర్‌లో గుజ్జర్లకు, పహాడీ వర్గాలకు ఎస్‌సీ హోదా ఇచ్చారు. భారతదేశాన్ని హిందూదేశంగా మార్చడానికి బీజేపీ అడుగులు వేస్తున్నది. ముస్లింలు తమ హక్కులను, సమస్యలను ఒక ఎజెండాగా రూపొందించుకుని ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది.

దేశంలో మతం మారిన దళిత ముస్లింలకు, దళిత క్రైస్తవులకు ఎస్‌సీ హోదా కల్పించే అంశం మీద సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం వీరి స్థితిగతుల మీద అధ్యయానికి 6 అక్టోబర్ 2022న అత్యున్నతస్థాయి కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఇద్దరు సభ్యులతో కూడిన ఈ కమిషన్‌కు సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్ కేజీ బాలకృష్ణన్‌ నేతృత్వం వహిస్తారని ప్రకటించింది. 'కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ యాక్ట్ 1952- సెక్షన్ 3' ప్రకారం దీనిని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ, ఇందులో ప్రధాన లోపం ఏమిటంటే, ఎప్పటి నుంచి మతం మారిన దళితుల గురించి అధ్యయనం చేయాలనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. 1950 ఆగష్టు 10 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు షెడ్యూల్డ్ కుల హోదా తొలగించబడిన హిందూయేతర దళితుల గురించి బాలకృష్ణన్ కమిషన్ అధ్యయనం చేయవలసి ఉంది.

సమాచారం లేకుండానే

దళిత మూలాలు ఉన్న ముస్లింలు, క్రైస్తవులకు సంబంధించిన సమాచారమేదీ కేంద్రం వద్ద లేదు. ఇందుకోసం దేశం నలుమూల నుంచి దళిత ముస్లింలు, దళిత క్రైస్తవులు తమ సమాచారాన్ని బాలకృష్ణన్ కమిషన్‌కు సమర్పించాలి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 కు ముందు దళిత హోదా ఉన్న ముస్లిం జన సముదాయాలను దళిత ముస్లింలుగా, దళిత హోదా ఉన్న క్రైస్తవ జనసముదాయాలను దళిత క్రైస్తవులుగా పిలుస్తున్నారు. వీరిలో కొందరు జీవనోపాధి కొరకు పారిశుద్ధ్య కార్మికులుగా, అంటరాని, అపరిశుభ్ర వృత్తులలో ఇప్పటికీ కొనసాగుతున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ద్వారా ముస్లింలకు, క్రిస్టియన్లకు, సిక్కులకు 1936లో రాజకీయ రిజర్వేషన్‌లు తొలగించారు. మతాన్ని మార్చుకున్న దళిత ముస్లింలు, దళిత క్రైస్తవులకు అదే సమయంలో ఎస్‌సీ హోదా కల్పించారు. 1946 నుంచి 1949 వరకు మన దేశ రాజ్యాంగ పరిషత్ చర్చలు జరిగాయి.

1909 నుంచి 1936 వరకు ఉన్న ముస్లిం రాజకీయ రిజర్వేషన్‌లను కొనసాగించాలని ముస్లింలీగ్ తరుపున ముహమ్మద్ పోకర్ సహాబ్ వాదించారు. మైనారిటీ హక్కుల స్పష్టత కొరకు హెచ్‌సీ ముఖర్జీ కమిటీని నియమించారు. ఇందులో ఉన్న 11 మంది సభ్యులలో ఒక్క ముస్లిం కూడా లేరు. అంబేద్కర్‌తో పాటు మరో ఇద్దరు సభ్యులు మాత్రమే ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్ కొనసాగించాలని ప్రతిపాదించారు. సర్దార్ పటేల్ ప్రతిపాదించిన ఈ తీర్మానం 3 :11 నిష్పత్తిలో వీగిపోయింది. అనంతరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1936 లో ఉన్న కొన్ని కులాలను దళితులుగా గుర్తించారు. వీరికి మతంతో సంబంధం లేదు. ఉదాహరణకు మెహతర్ కులం ముస్లింలలోనూ, హిందువులలోనూ ఉంది. తెలుగు రాష్ట్రాలలో లద్దాఫ్, నూర్‌బాషా, దూదేకులు 1936 నుంచి 1950 వరకు ఎస్‌సీ జాబితాలో ఉన్నారు. వీరితోపాటు 96 కులాలు కూడా ఆ జాబితాలో ఉన్నాయని సచార్ కమిటీ పేర్కొంది.

Also read: మైనారిటీల సంక్షేమం మాటలకే పరిమితమా?

సుప్రీంకోర్టుకు వెళ్లినా

1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా హిందూ మతంలో ఉన్న దళితులకు మాత్రమే ప్రభుత్వం ఎస్‌సీ హోదా ఇచ్చింది. 1956లో సిక్కులకు, 1990లో బుద్ధిస్టులకు ఎస్‌సీ హోదా ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ బీసీ-ఈ జాబితాలో 54 జన సముదాయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా గతంలో ఎస్‌సీ హోదా కలిగినవే. హిందూ మతంలోని దళితులు ఎంత వెనుకబడి ఉన్నారో దాని కంటే కూడా ముస్లింలు, క్రైస్తవులు చాలా వెనుకబడి ఉన్నారు. ఏడు దశాబ్దాలుగా ఎస్‌సీ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రశాంత్ భూషణ్ అనే స్వచ్ఛంద కార్యకర్త సహకారంతో 2004లో ఫాదర్ బోస్కో సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఆరీస్ ముహమ్మద్ కృషి ఫలితంగా పలు ముస్లిం సంఘాలు కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యాయి.

2004లో సుప్రీంకోర్టు దీని మీద కేంద్ర ప్రభుత్వాన్ని సమాధానం అడిగింది. దీంతో అప్పటి యూపీఏ-1 ప్రభుత్వం 2005లో రంగనాథ్ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేసి, నివేదిక వచ్చిన తరువాత నిర్ణయం తీసుకొంటామని కోర్టుకు తెలిపింది. దళిత ముస్లింలు, దళిత క్రైస్తవులకు ఎస్‌సీ హోదా కల్పిస్తే రిజర్వేషన్‌లు 50 శాతం దాటిపోతాయని నివేదించింది. ఆరీస్ ముహమ్మద్ చొరవతో మిశ్రా కమిషన్ నివేదికను 2007లో వెలుగు చూసింది. మతాన్ని దళిత హోదాతో ముడి పెట్టవద్దని కమిషన్ సూచించింది. కానీ, ఈ సిఫారసు స్పష్టంగా లేదని యూపీఏ-2 నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టలేదు.

ఓబీసీ గణన కోసం

మతమార్పిడి తర్వాత కూడా దళిత ముస్లింలు, దళిత క్రైస్తవుల సామాజిక, విద్య, ఆర్థిక స్థితిగతులు మారలేదని సచార్ కమిటీ తన నివేదికలో అంతకు మునుపే పేర్కొన్న విషయం మనం మరువరాదు. దళితులకు, గిరిజనులకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. రిజర్వేషన్‌లు 50 శాతం దాటకూడదు కాబట్టి పెంచటం లేదని ప్రభుత్వాలు దాటవేస్తున్నాయి. 1992లో ఇందిరా సహానీ కేసులో '50 శాతం రిజర్వేషన్ దాటటానికి గల కారణాలను, అసాధారణ పరిస్థితులను ఒక సమగ్ర నివేదికగా గణాంకాల సహితంగా నిరూపించాలని' సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఈ విషయం ప్రభుత్వాలకు తెలిసినా వాస్తవాలను ప్రజలకు చెప్పటం లేదు. దేశంలో ఇప్పటి వరకు బ్రిటీష్ ఇండియాలోని 1931 కులగణననే ప్రామాణికంగా తీసుకోని అంచనాలను రూపొందిస్తున్నారు. జనాభా లెక్కలలో మతాన్ని పరిగణిస్తారు. కులం కాలమ్ లేదు. ఎస్‌సీ, ఎస్‌టీలకు మాత్రమే ఉంది. ఇకముందు జరగబోయే జనగణనలో ఓబీసీ కాలమ్ కోసం కూడా చేర్చాలని డిమాండ్ చేయాలి.

Also read: వందేళ్లుగా వారిని ప్రభుత్వం నేరస్థులుగానే పరిగణించిందా?ఇంతకీ ఎవరు వారు

ఇక ఉద్యమించక తప్పదు

తెలుగు రాష్ట్రాలలో బీసీ-బీలో దూదేకుల, లద్దాఫ్, నూర్‌బాషాలు ఉన్నారు, బీసీ-ఏలో మెహతర్‌లు ఉండేది. వారిని 2006లో బీసీ జాబితా నుంచి తొలగించారు. బీసీ-బీలో ఉన్న దూదేకులు మొత్తం నిజంగా దూదేకులు కారు. 70 శాతం వేరు వేరు ముస్లిం జన సముదాయాల నుంచి వచ్చారు. నిజమైన దూదేకులకు ఇప్పటికీ రిజర్వేషన్ దొరకలేదు. వారికి ఎస్‌సీ హోదా కోసం దళిత ముస్లిం సంక్షేమ సంఘం అధ్యక్షుడు షేక్ సత్తార్ సాహెబ్ జాతీయస్థాయిలో ఉద్యమాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో బీసీ-ఈకి నాలుగు శాతం రిజర్వేషన్ 2007 నుంచి సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి అమలవుతున్నాయి. బాలకృష్ణన్ కమిషన్ నియామకం చట్టబద్దంగా చాలా పకడ్బందీగా ఉంది. ముస్లిం సమాజం తగిన జాగ్రత్తలతో కమిషన్‌కు సహకరిస్తే ముస్లిం స్థితిగతులపై సమగ్ర నివేదిక తయారు కావచ్చు.

ఇపుడు బీజేపీ బాలకృష్ణన్ కమిషన్‌ను నియమించడంలో ముఖ్య ఉద్దేశ్యం దళిత ముస్లింలు, క్రైస్తవులకు ఎస్‌సీ హోదా ఇస్తే వారంతా బీజేపీకి ఓటు బ్యాంకుగా మారుతారని. దేశంలో 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. వారిలో చీలిక తేవటం ద్వారా ఎక్కువ శాతం మంది దళిత ముస్లింలుగా మారే అవకాశం ఉంది. సున్నీలు కటిక బీదరికంలో ఉన్నందున వీరు కూడా దళిత ముస్లింలుగా మారవచ్చు. షియాలు బీజేపీకి ఎప్పటి నుంచో ఓటు బ్యాంకుగా ఉన్నారు. గత్యంతరం లేక ముస్లింలు బలవంతంగా బీజేపీకి ఓటు వేయాల్సిన పరిస్థితులను సృష్టిస్తున్నారు. అందులో భాగంగానే కాశ్మీర్‌లో గుజ్జర్లకు, పహాడీ వర్గాలకు ఎస్‌సీ హోదా ఇచ్చారు. భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చడానికి బీజేపీ అడుగులు వేస్తున్నది. ముస్లింలు తమ హక్కులను, సమస్యలను ఒక ఎజెండాగా రూపొందించుకుని ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది.


జియాఉద్దీన్ ముహమ్మద్

ముస్లిం హఖ్ అధ్యక్షులు

99892 36393

Next Story