సుందరీకరణ కోసం లక్షల కుటుంబాలు బలి కావాలా!?

by Disha edit |
సుందరీకరణ కోసం లక్షల కుటుంబాలు బలి కావాలా!?
X

దివంగత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ తన పాలనా కాలంలో గరీబీ హటావో (పేదరికాన్ని నిర్మూలించాలి) అనే నినాదం ఇచ్చారు! కానీ ఇప్పుడు గరీబ్ కో హటావో (పేదోడిని నిర్మూలించండి) అనే పరిస్థితి ఉంటోంది! అది ఢిల్లీ కావచ్చు, మన తెలంగాణలో కరీంనగర్ కావచ్చు, ఏపీలో లేదా ఇంకా వేరే ప్రదేశం కావచ్చు పేదోడు మబ్బుకిందనో లేక అర్జీలు ఇస్తూ, రేషన్ కోసం, మంచినీళ్ల కోసం, ఉద్యోగ దరఖాస్తు కోసం, పిల్లల అడ్మిషన్ కోసమైనా, దవాఖానలో వైద్యం కోసమైనా లైన్‌లో ఉండాల్సిందే, లైను కట్టాల్సిందే అంటే అతిశయోక్తి కాదు! 2016లో నోట్ల రద్దు సమయంలో ఇదే పరిస్థితి ఉండింది! ఇప్పుడు 2 వేల నోట్ల వాపసు పరిస్థితి అంతే ఉంది! ఇదే పని కొనసాగుతున్నది! దేశంలో ప్రభుత్వ ప్రభావం అయినా, ఏ దాదాగిరి ప్రభావం అయినా, దాష్టీక, ఆక్రమణల కూల్చివేత భారం అయినా ముందు పేదోడి మీద పడాల్సిందే! ఓటుకు, ఆ వేటుకూ పేదోడే టార్గెట్ అవుతున్నాడు! మురికివాడల్లో గుడిసెల్లో జీవిస్తున్న వారి జీవితాలు ఇప్పుడు కష్టతరం అయిపోయాయి!

సుందరీకరణకు లక్షలాదిమంది బలి

మూడు నెలల కాలంలో ఢిల్లీ సుందరీకరణ పేరిట 1600 పేదల ఇండ్లు బుల్డోజర్‌లతో కూల్చి వేసారు! మొత్తం రెండు లక్షల 60 వేల మందిని పూర్తిగా ఇల్లు లేని వారిని చేసేసింది ప్రభుత్వం! సెప్టెంబర్‌లో ఢిల్లీలో జి -20 దేశాల సమావేశాలు జరుగనున్నాయి. దీనికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం వహించనున్నారు.. ఢిల్లీలో దాని చుట్టు పక్కల సుందరీకరణ కోసం కేంద్రం వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించింది! విదేశీయులకు మన దేశంలోని పేదరికం, నిరుద్యోగం కనిపించొద్దు కదా! అందుకే గొప్పోళ్ళ ఇండ్లు అక్రమంగా కట్టినా వాటిని కూల్చడం లేదు! నిజానికి ఢిల్లీ ప్రాంతంలోనే 11 మంది ఎంపీలకు చెందిన 576 కట్టడాలు, ఇండ్లు అక్రమంగా నిర్మించి ఉన్న దాఖలాలు ఉన్నాయి! కానీ వారి జోలికి వీరు వెళ్ళరు, వారికి నోటీసులు ఇవ్వరు! పేదల ఇండ్లు మాత్రం కూల్చేస్తారు! దేశంలో 140 కోట్ల జనాభాలో 80 కోట్ల మంది పేదలు ఉన్నారు! వీరికి ప్రభుత్వం బతకడానికి ఉపాధి ఇవ్వకున్నా 5 కేజీల ఉచిత రేషన్ పోస్తుంది! ఇదీ కూడా కేవలం ఎన్నికల కోసమే అనేది జగమెరిగిన సత్యం! ఇది వాస్తవం!నేల మీది నిజం!

పేదల ఘోష వినిపించదా?

2030 నాటికీ దేశంలో పేదల సంఖ్య మరింత పెరిగి స్వంత ఇల్లు లేని వారి సంఖ్య 40 శాతం అయ్యే పరిస్థితి ఉందని చెబుతున్నారు! నిజానికి దేశంలో పట్టణాలు ఏర్పాటు కావడంలో పేదల కష్టమే ఎక్కువ ఉంది! గొప్పోళ్ళు అన్ని అక్రమణలను రెగ్యులరైజ్ చేసుకున్నారు, లేదా తమ ఆర్థిక, రాజకీయ బలంతో అక్రమణలను సైతం మేనేజ్ చేసుకుని ఉంటున్నారు! ఢిల్లీలో పేదల ఇండ్లు కూల్చే విషయంలో సుప్రీంకోర్టు గత ఆదేశాల మేరకు కనీసం నెల నుంచి వారం రోజుల ముందు నోటీసు ఇవ్వాలి! ప్రత్యామ్నాయం లేని వారికి పునరావాసం ఏర్పాటు చేయాలి! కానీ ఇక్కడ పేదోళ్ల ఇండ్లు కూల్చే విషయంలో చట్ట పాలన లేదు! రాజ్యాంగంలోని అధికారాలను హరిస్తున్నారు. జీవించే హక్కును కాలరాస్తున్నారు! ప్రాథమిక హక్కుల గురించి ప్రస్తుత ప్రభుత్వం ముందు ఎంత చెప్పినా వృధానే అవుతుంది! విశ్వ గురు కలలు కంటున్న పీఎం నరేంద్ర మోడీకి పేదల ఇండ్ల కూల్చివేత ఘోష కేక వినిపించడం కష్టమే! జి -20 దేశాల ముందు మన దేశం ప్రజల కష్టాలు కనిపించొద్దు! వినిపించొద్దు! అంతే!

కూల్చిందెన్ని, కేటాయించిందెన్ని?

జంతర్ - మంతర్ వద్ద 32 రోజులుగా మన కుస్తీ బిడ్డలు బీజేపీ ఎంపీ మీద చర్యల కోసం చేస్తున్న సత్యాగ్రహం వైపు కనీసం కన్నెత్తి చూడని ప్రభుత్వ పెద్దను ఏమనాలి? ఒక జాతీయ సర్వే ప్రకారం దేశంలోని 8 లక్షలకు పైగా పేదల ఇండ్లను, అక్రమ కట్టడాల పేరిట వివిధ రాష్ట్రాల్లో ఈ పదేండ్ల కాలంలో కూల్చి వేసారు! ఏక కాలంలో వీరికి పునరావాసం కల్పించాల్సి ఉండగా అది కూడా కల్పించలేదు! పేదల కోసం ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం ఎంత మంది పేదల ఇండ్లు కూల్చిందీ. పేదలకు ఎన్ని ఇండ్లు కేటాయించిందీ ఎన్నడూ లెక్క చెప్పలేదు! ఇలాంటి వారు పట్టణాల్లో పేవ్ మెంట్ల మీద, బస్సు స్టాండ్‌ల, రైల్వే స్టేషన్ల, చుట్టు పక్కన, రహదారుల పక్కన,ఫ్లై ఓవర్ బ్రిడ్జిల కింద షెల్టర్ తీసుకుని, జీవనం సాగిస్తున్నారు! ఇలాంటి వారి లెక్కలు తీయాలి! జనగణనలో ఈ విషయాన్ని ముందు తేల్చాలి!

బతుకు తెరువు మీద బుల్డోజర్లు

దేశంలో పేదలు తగ్గే బదులు పెరుగుతున్నారు! పేదరికం నిర్మూలన బదులు,పేదల నిర్మూలన, వారి బతుకుల మీద, బతుకు తెరువు మీద బుల్డోజర్లు నడిపిస్తున్న దాడి చేస్తూన్న పరిస్థితి ఉంది! ఇలాంటి పేదల మీద దాడులను కొనసాగిస్తున్నారు! వారిని కనీస నీడ లేని వారిగా చేసేస్తున్నారు! వారి పరిస్థితిని దుర్భరం చేసేస్తున్నారు! ఈ విషయాలు ఏవీ మన ప్రధానికి పట్టవు! జి-20 కి ఆయన నాయకత్వం వహించడం సంతోషమే! అయితే ఈ దేశం మంచిచెడ్డలు, ప్రజల సాధకబాధకాలు, చూడాల్సిన ప్రధాని బాధ్యతలు కూడా అయన మోస్తున్నారనే విషయాన్ని విస్మరించవద్దు! ఆ యోగం ఎక్కువగా దేశంలోని మెజారిటీ సామాన్యుల వల్లే కలిగిందని పీఎం మర్చిపోకూడదు! పునరావాసం ఏర్పాట్లు చేయకుండా, పేదోని బతుకుల్లో నిప్పులు పొసే విధంగా, వారి ఇండ్లు కూల్చుడు అన్యాయం మోదీజీ!

ఎండి. మునీర్

సీనియర్ జర్నలిస్ట్

99518 65223


Next Story

Most Viewed