చదువుకుంటేనే సమాజ హోదా

by Ravi |
చదువుకుంటేనే సమాజ హోదా
X

విద్య లేని వాడు వింత పశువు' అన్నారు పెద్దలు. జీవన వికాసానికి, పరిపూర్ణతకు చదువు ఓ గీటురాయి. మానవ ప్రగతికి అక్షరాస్యత తప్పనిసరి. అక్షరాస్యత గల ప్రాంతం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది. అక్షరాస్యత మనిషి జీవన స్థితిగతులను మార్చుతుంది. వారివారి సంస్కృతులను, ఆచార వ్యవహారాలను బలపరచుకునేలా చేస్తుంది. నేడు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు కనీసం వారి పేరు చదివే, రాసుకునే స్థితి లేకపోవడం బాధాకరం. యునెస్కో మనిషి జీవించడానికి ఆహారం ఎంత అవసరమో, చదువు కూడా అంతే అవసరమని యునెస్కో నిర్వచించింది. అందుకే యేటా సెప్టెంబర్ ఎనిమిదిన ఉత్సవాలు జరుపుకోవాలని నిర్దేశించింది.

బాధ్యతలు అర్థం చేసుకునేందుకు

గ్లోబల్ మానిటరింగ్ రిపోర్ట్ ప్రకారం ప్రతి ఐదుగురు పురుషులలో ఒకరు, మూడింట రెండు వంతుల మహిళలు నిరక్షరాస్యులుగా ఉన్నారని తేలింది. ప్రపంచంలో దక్షిణ, పశ్చిమ ఆసియా దేశాలలో వయోజన అక్షరాస్యత రేటు అత్యల్పంగా 57.6 శాతంగా ఉంది. అక్షరాస్యత రేటు తక్కువగా నున్న దేశాలలో బుర్కినా ఫాసో, మాలి నైజర్, ఖతర్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అక్షరాస్యత సూచి అభివృద్ధి కోసం పలువురు మేధావులు, దాతృత్వ సంస్థలు, ప్రపంచాభివృద్ధి పరిశోధనా కేంద్రం, రోటరీ ఇంటర్నేషనల్, మొంట్‌బ్లాక్, జాతీయ అక్షరాస్యతా సంస్థలు ఈ ఉద్యమం‌లో భాగస్వాములు అవుతున్నాయి. అక్షరాస్యత కుటుంబ హోదా, సమాజ హోదా, అంతర్జాతీయ స్థాయిలో దేశం హోదా పెరగడానికి దోహదపడుతుంది.

నిరంతర విద్య పొందేందుకు ప్రజలను ప్రోత్సహిస్తే వారు కుటుంబం, సమాజంతో పాటు దేశం పట్ల తమ బాధ్యతలను అర్థం చేసుకుంటారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో చదువురాని వారు అనేకం. కనీసం సంతకం ఎలా పెట్టాలో తెలియని వారు చాలా మందే ఉన్నారు. వీరి అక్షరాస్యత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని పథకాలు అమలు చేసిన ప్రయోజనం లేకుండా పోతోంది. పథకాలను చిత్తశుద్ధితో అమలు చేయాలి, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు బడ్జెట్‌లో విద్యారంగానికి అధిక మొత్తంలో నిధులు కేటాయించాలి. ప్రతి ఒక్కరిని విద్యావంతులను చేయాలి అప్పుడే దేశం అన్ని రంగాలలో ముందుకు వెళుతుంది.

Also Read : అక్షరాస్యతతోనే అభివృద్ధి

కామిడి సతీశ్‌రెడ్డి

జయశంకర్ భూపాలపల్లి

98484 45134

Next Story