వాతావరణ మార్పుతో.. ఆహార భద్రతకు పెనుముప్పు

by Disha edit |
వాతావరణ మార్పుతో.. ఆహార భద్రతకు పెనుముప్పు
X

త్తరాదిలో వరిని ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో వర్షాల కారణంగా, దేశంలోని ఇతర ప్రాంతాలలో లోటు వర్షపాతం వంటి వాతావరణ మార్పుల కారణంగా వరి ఉత్పత్తి దెబ్బతింది. దీంతో కేంద్రం భారత్ బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. క్రమంగా ఇప్పుడు బియ్యం ఎగుమతులను సైతం నిషేధించేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నదనే వార్తలు వస్తున్నాయి. అయితే, దేశ ప్రజల అవసరాలకు ఎంత మేరకు ఆహార ధాన్యాల అవసరం అవుతాయో కూడా మన కేంద్ర ప్రభుత్వ వద్ద సరైన అంచనాలు లేవంటే, మోడీ పరిపాలన ఎంత అసమర్థంగా, ఎంత అధ్వానంగా సాగుతోందో దేశ ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్ధం అవుతోంది. ఇక కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ అంతా అయోమయం మంత్రి మనకు ఎంత గాలించినా, ఈ దేశంలో కాదు కదా మరే దేశంలో కూడా దొరకడు. ఈయన రెండు, మూడు నెలల వ్యవధిలో నాలుగు సార్లు మాటలు మార్చాడు.

ఉదాహరణకు తెలంగాణ రాష్ట్ర మంత్రులు, బీఆర్ఎస్ ఎంపీలు ఎన్నిసార్లు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ.. మా రాష్ట్రంలో వరి పంట విస్తారంగా పండింది, కనుక ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్.సీ.ఐ.) ద్వారా ఈ ధాన్యాన్ని సేకరించ వలసిందిగా అనేక సార్లు విజ్ఞప్తి చేసినా, కేంద్రమంతి పీయూష్ గోయల్ 2021 డిసెంబర్ 3న 'మా దగ్గరే అవసరానికి మించి గోదాముల్లో ధాన్యం నిలువలు నాలుగు సంవత్సరాలకు సరిపడా ఉన్నాయనీ, డాంబికాలు పలికాడు. పైగా మీ పంటను బహిరంగ మార్కెట్‌లో అమ్ముకోండి' అని హేళనగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి ఉచిత సలహా కూడా ఇచ్చాడు.

అప్పుడో మాట.. ఇప్పుడో మాట

అలాగే తెలంగాణలో మర ఆడించిన బియ్యం తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరితే, కేంద్రం అనేక సార్లు కొర్రీలు పెట్టి పూర్తిస్థాయిలో కొనుగోలు చేయకుండా.... ఏదో మొక్కుబడిగా, నామమాత్రంగా కొనుగోలు చేసింది.ఇప్పుడు దేశంలో, విదేశాల్లో బియ్యం కొరత ఏర్పడింది, కనుక బియ్యం కావాలని కేంద్ర ప్రభుత్వం గగ్గోలు పెడుతుంది. పైగా రైతులు తమ ధాన్యాన్ని అవసరం ఉన్న ఇరుగు, పొరుగు రాష్ట్రాలకూ, ఇతర దేశాలకు ఎగుమతులు చేయకుండా నిషేధం కూడా విధించింది. రైతులకు నష్టం కలిగించే, ఇలాంటి తెలివి తక్కువ నిర్ణయాలను చూసి ప్రజలు నివ్వెరపోతున్నారు.

వాస్తవానికి ఇప్పుడు అమెరికాలో బియ్యం, గోధుమల నిల్వలు తరిగి పోయాయి. ముఖ్యంగా మన ప్రవాస తెలుగు ప్రజలకు బియ్యం కొరత ఏర్పడింది. ఇప్పుడు మన రైతులు అమెరికా, ఇతర యూరోపియన్ దేశాలకు బియ్యం ఎగుమతి చేస్తే, మన తెలుగు రైతులకు మంచి లాభాలు వస్తాయి. ఈ తరుణంలో బియ్యం ఎగుమతులపై నిషేధం విధించటంపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. విదేశీ అవసరాలు, మార్కెట్‌లో ఎగుమతులు, దిగుమతులపై సరైన అవగాహన లేని కేంద్ర ప్రభుత్వ అనాలోచిత చర్యవల్ల రైతుల ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

దేశంలో రైతులు పండించే వరి ధాన్యానికి అంతర్జాతీయంగా మార్కెట్ లేదని గతంలో కేంద్ర వ్యవసాయ మంత్రి అన్నాడు. కనుక, ఒక గింజను కూడా తెలంగాణ నుంచి తాము సేకరించేది లేదనీ,'కరాకండీ'గా చెప్పాడు. పైగా వరి పంట పండిచవద్దనీ, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని మీ రైతులకు చెప్పుకోండని సలహా కూడా ఇచ్చాడు. దానితో మన రైతులు కూడా గిట్టుబాటు ధర లేని వరి సాగును సగానికి తగ్గించారు. ఇప్పుడు దేశ, విదేశాల్లో వరి ధాన్యానికి బాగా డిమాండ్ పెరిగింది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కేంద్ర గోదాముల్లో నిలువలు నిండుకున్నాయి. ముందు చూపు లేని మోదీ సర్కార్ 'ప్రజల ఆకలి'తో రైతుల జీవితాలతో ఆటలు ఆడుకుంటుంది.

తత్తరపాటు నిర్ణయాలు..

రాష్ట్రంలో విపరీతంగా పండిన వరి పంటను కొనడం చేతకాక మీ రాష్ట్రంలోని ప్రజలకు నూకలు తినటం అలవాటు చేయండని గత సంవత్సరం మార్చిలో కేంద్ర మంత్రి బీరాలు పలికి.. అర్ధ సంవత్సరం దాటకుండానే మాటమార్చి నూకల అవసరం ఉందని ఆలస్యంగా గమనించి నూకల ఎగుమతిపై కూడా నిషేధం విధించారు. ఇది కేంద్రం తెలివి.

ఇక కేంద్రంలో బియ్యం నిల్వలు పెరిగాయన్నా కేంద్రమంత్రి గత సంవత్సరం జూలై 6న దేశంలో వరి సాగు తగ్గిందని, భవిష్యత్తులో బియ్యం కొరత ఏర్పడుతుంది కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఆహార కొరత రాకుండా మీ రైతులను వరి సాగు చేసేలా ప్రోత్సహించండి అని నాలుక మడత తిప్పాడు. ఇలా సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోలేని కేంద్ర మంత్రి ఇంత పెద్ద వ్యవసాయ ఆధారిత దేశంలో ఇంత అయోమయంలో ఉంటే ఏలా! ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం బాస్మతియేతర బియ్యం ఎగుమతిపై 20 శాతం పన్ను విధించింది. దీనిపై విమర్శలు రావటంతో ఆ నిర్ణయాన్ని తిరిగి వెనుకకు తీసుకుంది. ఇలాంటి తత్తరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఆయనకు పరిపాటే.

కేంద్ర ప్రభుత్వం, ఇలాంటి అనాలోచిత, అసమర్థ నిర్ణయాలు తీసుకోవడం వల్ల తెలంగాణతో పాటు వరి, గోధుమలు పండించే ఇతర రాష్ట్రాలకు కూడా పెను శాపంగా మారనుంది. ఎగుమతి నిషేధించిన కొన్ని రకాలను తెలంగాణలో అధికంగా పండిస్తున్నారు. వీటిని ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతులు చేస్తారు. తద్వారా రైతులకు మద్దతుకు మించిన ధర లభిస్తున్నది. కానీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎగుమతులపై నిషేధం విధించింది. దానితో వ్యాపారులు అధిక ధర వెచ్చించి ఈ రకం ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు రైతులకు నష్టపోయే ప్రమాదం ఏర్పడింది.

నిషేధంతో ఎన్నారైల హాహాకారాలు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇలాంటి తొందరపాటు నిర్ణయాలతో దేశ, విదేశాల్లో ఉంటున్నటువంటి మన భారత పౌరులను కూడా తీవ్ర బాధలకు గురి చేస్తోంది. బియ్యం ఎగుమతిపై నిషేధం విధించడంతో అమెరికాలోని భారతీయులు ముఖ్యంగా బియ్యం అధికంగా వినియోగించే తెలుగువారు హాహాకారాలు చేస్తున్నారు. ఇక ముందు బియ్యం కొరత ఉండవచ్చు అన్న భయంతో, ముందస్తు జాగ్రత్తతో, షాపింగ్ మాల్స్‌పై పడి బస్తాలకు, బస్తాలు బియ్యం కొనుగోలు చేస్తున్నారు. దీంతో తెలుగు వారు అధికంగా ఉండే ప్రాంతాల్లో మాల్స్‌లో బియ్యం నో స్టాక్ అని బోర్డులు పెడుతున్నారు. అనేక మాల్స్ ముందు బియ్యం కొనేందుకు ప్రజల కిలోమీటర్ల దూరంలో నిలబడ్డారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో సైతం వైరల్ అయ్యాయి.

అమెరికాలోని ఓహియోలోని మేషన్ పట్టణంలో ఉన్న స్టోర్లలో ఒక కొనుగోలుదారుకు ఒక్కటే బియ్యం బ్యాగ్ విక్రయిస్తామని షరతు విధించారు. బాస్మతి రైస్‌తో పాటు అన్ని రకాల బియ్యం శుక్రవారం కొన్ని గంటల్లోనే అమ్ముడుపోయాయని మాల్స్ యజమానులు చెబుతున్నారు. బియ్యం కోసం ప్రజలు ఒక్కసారిగా ఎగబడటంతో మాల్స్‌లో రెండు రోజుల్లోనే బియ్యం ధరలు 11 శాతం పైగా పెరిగాయి. భారతీయులు అత్యధికంగా ఉండే టెక్సాస్ లో 20 పౌండ్ల సాధారణ బియ్యం సంచి 34 డాలర్లకు అంటే (రూ. 2,787.68) రూపాయలకు అమ్ముతున్నారు.

యావత్ ప్రపంచంపై ప్రభావం

భారత ప్రభుత్వం బియ్యం ఎగుమతులను నిషేధించడం ప్రపంచం మొత్తంపై ప్రభావం పడుతుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ రష్యా యుద్ధ ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాల ధరలు విపరీతంగా పెరిగాయి. అత్యధికంగా బియ్యం ఉత్పత్తిదారు అయినటువంటి చైనాలో కూడా వాతావరణం అనుకూలించకపోవడంతో దిగుబడి బాగా పడిపోయింది. ఈ నేపథ్యంలో భారత దేశం తెలివిగా, జాతీయ, అంతర్జాతీయ పంటలపై దృష్టి పెట్టాల్సి ఉంది. మన రైతుల పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లభించేలా చూడాల్సిన బాధ్యత తనపై ఉందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వంపై ఎప్పటికి తెలుసుకుంటుందో ఆ భగవంతుడికే తెలియాలి.

డా. కోలాహలం రామ్ కిశోర్,

98493 28496


Next Story

Most Viewed