క్యాసినో గమ్మత్తు.. ఓ మత్తు

by Ravi |
క్యాసినో గమ్మత్తు.. ఓ మత్తు
X

తెలుగు రాష్ట్రాల నుంచి నెలకు ఒకటీ రెండు సార్లయినా గోవాకి.. ప్రత్యేకంగా క్యాసినోకి వెళ్లే వారి సంఖ్య గణనీయంగానే ఉంది. మేం వెళ్లిన ఒక్క క్రూజర్‌లో 30 నుంచి 40 శాతం మంది తెలుగు మాట్లాడే వారే ఉన్నారంటే నమ్మండి. క్యాసినో మత్తు భలే గమ్మత్తుగా ఉంటుందనేది ఓ సారి చూస్తే తప్ప తెలియదు. వీరిలో సంపాదించిన వారి కంటే పోగొట్టుకున్న వారే అధికం. ఐతే క్యాసినో వల్ల నష్టపోయామని మాత్రం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. క్యాసినో ఓ గమ్మత్తు. ఆ గమ్మత్తు వెనుక మత్తు దాగి ఉన్నది. మత్తుకు బానిస కావద్దు.

మేం వారం రోజుల క్రితం గోవా వెళ్లాం. గోవా అంటే బీచ్‌లో ఎంజాయ్ ఎలాగూ ఉంటుంది. ఐతే ఎటూ గోవా వెళ్లాం కదా అని సినిమాల్లో చూసే క్యాసినో గేమ్స్‌ని ఓ సారి చూసొద్దామనుకున్నాను. రూ.2500 పెడితే లోపలికి వెళ్లొచ్చు కదా అనుకుంటే.. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ రేట్ మినిమం రూ.4500లకు చేరింది. ఇక ఎలాగూ అక్కడి దాకా వెళ్లి తిరిగి రావడం ఇష్టం లేక తప్పదన్నట్లుగానే టికెట్ తీసుకుని లోపలికి వెళ్లాం. ఫ్లైట్‌లో ప్రయాణించడానికి ఎలాంటి కండిషన్లు ఉన్నాయో క్యాసినోకూ అంతే. మన ఆధార్ కార్డు లేదా మరే ఇతర గుర్తింపు కార్డు అయినా సరే ఇవ్వాల్సిందే. దాన్ని స్కాన్ చేసుకున్న తర్వాతే లోపలికి వెళ్లేందుకు ట్యాగ్ వేస్తారు. ఆ ట్యాగ్ చేతికి ఉన్నంత సేపు మనం క్యాసినో కింగ్స్ అన్నట్లే. 24 గంటల సేపు గడపొచ్చునన్న మాట. చిన్న బోట్‌లో మమ్మల్ని ఐదు నిమిషాల జర్నీ తర్వాత క్రూజర్‌కి చేర్చారు. ఎలాగూ చేతికి ట్యాగ్ ఉంది. అందులోనూ మా చేతికి గ్రీన్ కలర్ ట్యాగ్. ఇంకొందరికి వేర్వేరు కలర్స్‌తో ఉన్నాయి. అవి ఎంట్రీ ఫీజు ఇంకెక్కువగా చెల్లించడం ద్వారా సమకూరుతుందట. దానికి అదనపు సేవలు కూడా ఉంటాయి. మాది మాత్రం కింది స్థాయి ఎంట్రీ మాత్రమే. లోపలికి వెళ్లగానే ఘనంగానే స్వాగతం ఉంటుంది. ఆ స్వాగతం వెనుక డబ్బులు కనిపిస్తుంటాయి. ఎలాగూ తెచ్చుకున్నదంతా మాకు ఇచ్చి వెళ్లేందుకే.. రండి అన్నట్లుగా కనిపిస్తుంటుంది. లోపలికి వెళ్లగానే కనిపించేది క్యాసినో గేమ్స్ విభాగమే. ఒకటీ రెండు కాదు.. మేం వెళ్లిన క్రూజర్‌లో మూడు అంతస్తుల్లోనూ గేమ్స్ ఉన్నాయి. ఐతే మూడింటి మధ్య వ్యత్యాసం ఉంటుంది. కింద రూ.వందల్లో పెడితే, మధ్య అంతస్తులో రూ.వేలల్లో నడుస్తుంది. ఇక ఆపైన రూ.లక్షల్లో ఉంటుంది.

రూ.వెయ్యి కాయిన్స్ ఫ్రీ

మేం లోపలికి వెళ్లి కౌంటర్ దగ్గర మాకు ఇచ్చిన టికెట్ చూపించగానే వెయ్యి రూపాయల విలువైన కాయిన్స్ ఇచ్చారు. అదే తొలి పెట్టుబడి అన్నమాట. పది రకాల గేమ్స్ గురించి తెలుసుకోవడమంటే, కనీస అవగాహన పొందాలంటే ఒక్క రోజు సరిపోదని అర్థమైంది. కాకపోతే చిన్నప్పుడు జాతరలో లక్కీ లాటరీ మాదిరిగా ఓ గేమ్ ఉంది. ఏదైనా ఒక నెంబర్ మీద మనం కాయిన్ పెట్టాలి. పక్కనే ఓ రౌండ్ టేబుల్ లో గోళీని తిప్పుతారు. అది ఏ నెంబర్ మీద ఆగుతుందో వారికి లక్కీ అన్న మాట. పది మంది వివిధ నంబర్ల మీద కాయిన్స్ పెడితే ఎక్కువగా ఎవరూ పెట్టని నంబర్ల మీదనే ఆ గోళీ ఆగడం విశేషం. ఎప్పుడో ఓ సారి మాత్రం రిటర్న్స్ వస్తాయి. అట్లా నాక్కూడా రూ.10 వేల దాకా వచ్చాయి. ఐతే మనిషి ఆశాజీవి. అందుకే ఇంకా వస్తాయని మళ్లీ మళ్లీ ఆడేటట్లు అక్కడి పరిస్థితులు పురిగొల్పుతాయి. ఆఖరికి చేతిలో కాయిన్స్ అన్నీ పోయాయి. వామ్మో.. మళ్లీ కాయిన్స్ కొనుక్కోవద్దని తొందరగానే గుర్తించి బతుకు జీవుడా అంటూ చూడడానికే పరిమితమయ్యాం. నాతో పాటు వచ్చిన వారికి మొదట్లోనే చేతులు ఖాళీ అయ్యాయి. క్యాసినో మనిషిని ఉవ్విళ్లూరిస్తుంది. మళ్లీ మళ్లీ ఆడేటట్లుగా చేస్తుంది. అందుకే నూటికి 99 శాతం మంది జేబులు ఖాళీ అవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అక్కడ కుటుంబ సభ్యులంతా కూర్చొని ఆడే స్థితి కనిపించింది.

మహిళలు కింగ్సే

క్యాసినో ఆడేందుకు మగవాళ్లు మాత్రమే వెళ్తారనుకోవడం పొరపాటు. మేం వెళ్ళిన రోజు 25 శాతం వరకు మహిళలు ఉన్నారు. వారంతా విదేశీయులేం కాదు. అందులో తెలుగు మహిళలు కూడా ఉన్నారు. ఐతే వారిలో కొందరు మా మాదిరిగా మొదటి సారేం కాదు. మాకు ఒక్క గేమ్ గురించి తెలుసుకోవడానికే గంట సమయం పట్టింది. వాళ్లేమో అన్ని టేబుల్స్ తిరుగుతూ ఎంచక్కా ఆడేస్తున్నారు. ఐతే ఎన్ని వచ్చాయో, ఎన్ని పోయాయో మాత్రం చెప్పలేదు. కానీ క్యాసినోతో ఎంజాయ్ చేస్తున్నారని మాత్రం అర్థమైంది. భార్యాభర్తలు, తండ్రీ కూతుళ్లు, తల్లీ కూతుళ్లు కూడా ఆడుతూ కనిపించారు. సంస్కృతీ సంప్రదాయం కంటే క్యాసినో గేమ్ మత్తును ఆస్వాదించేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగానే ఉన్నారని తెలిసింది.

విదేశాల్లోనూ గేమ్స్

తెలుగు రాష్ట్రాల నుంచి క్యాసినో వంటి గేమ్స్ ఆడేందుకు గోవాకే కాదు.. నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ వంటి దేశాలకూ వెళ్తున్నారు. ఐతే విదేశాలకు వెళ్లే వారిలో పెద్ద పొలిటీషియన్లు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. క్యాసినోతో పాటు పోకర్, బ్లాక్ జాక్, రూలెట్, బాక్రా, క్రాప్, తీన్ పత్తి, అందర్ బాహర్, టైగర్ డ్రాగన్ వంటి ఎన్నో గేమ్స్ ఉన్నాయి. డబ్బులు సంపాదించడానికా? ఎంజాయ్ చేయడానికా? ఏదో ఒకటి కావచ్చు. కానీ ఈ క్యాసినోలకు వెళ్లే వారిని అలరించడానికి పాటలు, డాన్సులు వంటివి ఆకట్టుకుంటాయి. అందులోనూ కాస్ట్‌లీ మద్యం అందుబాటులో ఉంటుంది. అంటే క్యాసినోలో ఆడొచ్చు.. తినొచ్చు.. పాడొచ్చు.. డ్యాన్స్ చేయొచ్చు. క్యాసినోల్లో పందెం కాసే గ్యాంబ్లింగ్ గేమ్స్ అనేకం ఉంటాయి. కొన్ని మాన్యువల్‌గా, మరికొన్ని ఆన్‌లైన్‌లో గేమ్స్ ఉంటాయి. వాటిలో నిజాయితీ శాతం ఎంతో మాత్రం నాకు తెలియదు. ఐతే ఎంట్రీ ఫీజు భారీగానే ఉంటుంది. కనుక రెస్టారెంట్లలో ఫుడ్, బార్లలో మద్యం ఫ్రీ. పెద్ద హాలు ఉంటుంది. మధ్యలో టేబుల్స్. అవి కూడా ఎక్కువగా గ్రీన్ కలర్ లోనే ఉంటాయి. అందరూ డబ్బుల కోసం ఆడతారు. వందమందిలో పదిమంది కూడా హ్యాపీగా నాకు డబ్బులు వచ్చాయని అనడం లేదు.

రోజూ రూ.కోట్లే

క్యాసినో జూదమే. డబ్బులు పోగొట్టుకునే ఆటే. ఐతే తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎంజాయ్‌మెంట్ లేదు. జనాన్ని దురలవాట్లకు దూరం చేసేందుకు ఇక్కడి ప్రభుత్వాలు వీటిని రద్దు చేశాయి. కానీ ప్రతి రోజూ ఇక్కడి సొమ్ము గోవాకే రూ.కోట్లల్లో తరలుతున్నది. వ్యసనపరులను ఏం చేసినా అడ్డుకోలేరని అర్థమవుతున్నది. ప్రతి రోజూ కొన్ని వేల మంది గోవాకు వెళ్తున్నారంటే ఖర్చు ఎంతో అంచనా వేయొచ్చు. ఇక థాయిలాండ్, శ్రీలంక, నేపాల్ వంటి దేశాలకు వెళ్లే వారి సంఖ్య తక్కువేం కాదు. ఇక్కడ తప్పా, ఒప్పా అంటే ఆయా కుటుంబాల స్థితిగతుల మీదనే మాట్లాడుకోవాలి. ఆదాయ వనరులు పుష్కలంగా ఉన్నోళ్లు ఏం చేసినా నడుస్తుంది. కానీ పేద, మధ్య తరగతి వర్గాలు కూడా ఇలాంటి వాటికి ఆకర్షితులైనప్పుడే చర్చనీయాంశంగా మారుతున్నది. ఓ మోస్తరు ఆదాయమో, కేవలం నెల జీతంతో కుటుంబాన్ని నడిపే వారెవరూ అటువైపు ఆలోచించకూడదు. ఓ సారి ఆస్వాదించాలన్న ఆశ కూడా తప్పే. ఆ ఆస్వాదింపుతోనే ఆశ మొదలవుతుంది. ఆ ఆశ వ్యసనంగా మార్చే అవకాశం ఉంది. ఏదేమైనా క్యాసినో ఓ గమ్మత్తు. ఆ గమ్మత్తు వెనుక మత్తు దాగి ఉన్నది. మత్తుకు బానిస కావద్దు. మధ్య తరగతి యువత తరచూ గోవా వంటి ప్రాంతాలకు ఎంజాయ్మెంట్ అంటూ, ఫ్రెండ్స్ తో ట్రిప్ అంటూ వెళ్తుంటే కుటుంబ పెద్దలు ఓ లుక్ వేయకపోతే ఆగమయ్యే చాన్స్ ఉన్నది.

– శిరందాస్ ప్రవీణ్ కుమార్

80966 77450

Next Story

Most Viewed