సీఆర్‌పీల గోడు వినిపించుకుంటారా?

by Disha edit |
సీఆర్‌పీల గోడు వినిపించుకుంటారా?
X

సమగ్ర శిక్షలో పనిచేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్లకు స్కూల్ అసిస్టెంట్, ఎస్‌జీటీ నియామకాలలో అన్ని అర్హతలు ఉన్నా వెయిటేజీ ఇవ్వకపోవడంతో ఏండ్లుగా పనిచేస్తున్న సీఆర్‌పీలకు అన్యాయం జరుగుతున్నది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేసేంత వరకు ప్రభుత్వ నియమకాలలో వెయిటేజీ ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతున్నారు.

విద్యాశాఖలో భాగంగా ఉన్న సమగ్ర శిక్షా పథకంలో గత పది సంవత్సరాలుగా 2,117 మంది క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు పనిచేస్తున్నారు. 2011లో నియామకం అయిన నాటి నుంచి నేటి వరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీరిని చిన్నచూపు చూస్తున్నది. 'పంజాబ్ రాష్ట్రం-జగ్జీత్ సింగ్'కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన 'సమాన పనికి -సమాన వేతనం' తీర్పును అమలు చేయకుండా సీఆర్‌పీలకు అన్యాయం చేస్తున్నది.

భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో సమగ్ర శిక్షా ప్రాజెక్టు అమలవుతున్నది. ఇతర రాష్ట్రాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ఆయా ప్రభుత్వాలు పేస్కేలు అమలు చేస్తూ వేతనాలు ఇస్తున్నాయి. కానీ, తెలంగాణ రాష్ట్రంలో తక్కువ వేతనాలిస్తూ శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు ముందు కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని, మహిళా కాంట్రాక్టు ఉద్యోగులకు ఆరు నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీలు నీటి మూటలుగా మిగిలిపోయాయి.

ఏ సౌకర్యాలూ లేవు

రాష్ట్రంలోని 1,817 స్కూల్ కాంప్లెక్సులలో పనిచేస్తున్న సీఆర్‌పీలు ఉద్యోగ బాధ్యతల రీత్యా పాఠశాలలను సందర్శిస్తున్నప్పుడు ఎనిమిది మందికి రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దమ్మపేట మండలానికి చెందిన సోడెం మల్లికార్జున్ చనిపోగా, మిగతా ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కరోనాతో ఇద్దరు మరణించగా అనేక మంది దవాఖానాలో చేరి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి లక్షలలో అప్పుల పాలయ్యారు. మరో ఐదుగురు ఇతర అనారోగ్య కారణాలతో మరణించారు. ప్రభుత్వం నేటి వరకు కూడా ఏ ఒక్క సీఆర్‌పీని కూడా ఆదుకోలేదు.

ఆంధ్రప్రదేశ్‌లో చనిపోయిన ఒప్పంద ఉద్యోగులకు సాధారణ మరణమైతే రూ. రెండు లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. ఐదు లక్షలు, అంత్యక్రియల ఖర్చులు చెల్లిస్తున్నారు. మహిళా సీఆర్‌పీలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు వంటి అనేక సదుపాయాలు కల్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఏ, డీఏలు ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని ,గ్రూప్ ఇన్సూరెన్స్, నగదు రహిత వైద్య సదుపాయానికి అవకాశం కల్పించాలని, చనిపోయినవారి కుటుంబాలను ఆదుకోవాలని, గాయపడిన సీఆర్‌పీలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కాంట్రాక్టు ఉద్యోగులందరూ ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. అయినప్పటికీ పాలకులు పట్టించుకోకపోవడంతో వారి రోదనలు అరణ్య రోదనలుగానే మిగిలాయి.

పక్క రాష్ట్రంలో జీతాలు పెరిగినయి

2018-19 సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో సీఆర్‌పీలకు వేతనంగా రూపాయలు ₹23500 కేంద్ర విద్యా శాఖ ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు కి ప్రతిపాదనలు పంపి బడ్జెట్ మంజూరు చేయించుకొని వేతనాలు ఇస్తుండగా, తెలంగాణ రాష్ట్రంలో కేవలం ₹19500 మాత్రమే చెల్లిస్తున్నారు.ఉన్నత విద్యా శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్, వొకేషనల్ కాలేజీ లెక్చరర్లకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టైం స్కేల్ వేతనాలు ఇస్తూ, జీఓ నెంబర్ 16 ప్రకారం వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖలో భాగమైన సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టులో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి, ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేయాలి.

నేషనల్ రూరల్ హెల్త్ మిషన్‌లో కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు ప్రభుత్వ నియామకాలలో ప్రభుత్వం వెయిటేజీ ఇచ్చింది. ఔట్ సోర్సింగ్ ఏఎన్ఎంలకు కూడా వెయిటేజీ ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్లకు స్కూల్ అసిస్టెంట్, ఎస్‌జీటీ నియామకాలలో అన్ని అర్హతలు ఉన్నా వెయిటేజీ ఇవ్వకపోవడంతో ఏండ్లుగా పనిచేస్తున్న సీఆర్‌పీలకు అన్యాయం జరుగుతున్నది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేసేంత వరకు ప్రభుత్వ నియమకాలలో వెయిటేజీ ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతున్నారు.

తిరందాస్ సంతోష్‌ కుమార్

తెలంగాణ క్లస్టర్ రిసోర్స్ పర్సన్ యూనియన్ (టీసీఆర్‌సీఏ)

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

96668 60680

Next Story