ఉన్నది ఉన్నట్టు: హామీలు సరే... అమలేది

by Viswanth |
ఉన్నది ఉన్నట్టు:  హామీలు సరే... అమలేది
X

ప్రజాజీవితంలో ఉండే రాజకీయ నాయకులకు విశ్వసనీయత చాలా ముఖ్యమని వైఎస్ రాజశేఖరరెడ్డి తరచూ చెప్పేవారు. ఒక మాట ఇచ్చినప్పుడు దానికి కట్టుబడి ఉండాలన్నది ఆయన ఉద్దేశం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను చూసినప్పుడు ఆ విశ్వసనీయత గుర్తుకొస్తున్నది. గతేడాది బడ్జెట్‌లో దళితబంధు పథకానికి నిధులను కేటాయించినా ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. మళ్ళీ తాజా బడ్జెట్‌లో దాన్నే ప్రస్తావించారు. దేశంలోనే అద్భుతమైన పథకం అని గొప్పగా చెప్పుకుని భారీ స్థాయిలో నిధులను కేటాయించి అమలు చేయనప్పుడు దానికి సార్ధకత లేదు. గతేడాది ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మళ్ళీ వాటినే ప్రస్తావించింది. ఎందుకు అమలు చేయలేకపోయిందో వివరణ కూడా లేదు. బడ్జెట్ అంటే కేవలం అంకెల సముదాయం కాదు.. ప్రజల ఆశల, ఆకాంక్షల వ్యక్తీకరణ. నిజమే.. కానీ ఆ అంకెలు వాస్తవానికి దగ్గరగా లేనప్పుడు ప్రజలకు వాటిపై సందేహాలు వస్తాయి. అంకెల్లో ప్రభుత్వం వినిపించే హామీలను విశ్వసించరు. హామీల అమలులో చిత్తశుద్ధి, లెక్కల్లో వాస్తవికత లేనప్పుడు ఆ ప్రభుత్వం పట్ల ప్రజలకు విశ్వాసం ఉండదు. అది కేంద్రమైనా, రాష్ట్రమైనా. ఇప్పుడు రియలైజ్ కావాల్సింది ప్రజలు. ప్రభుత్వ నిజాయితీని గ్రహించే సమయం ఇది. ఆగ్రహిస్తారా.. అనుగ్రహిస్తారా అన్నది కాలం తేలుస్తుంది.

డ్జెట్ పెట్టినప్పుడల్లా విపక్షాల విమర్శలు సహజం. అది ఒక ట్రెండ్‌గానే మారింది. అంకెల గారడీ.. ఆచరణకు నోచుకోని హామీలు.. అంటూ ఆరోపణలూ వినిపిస్తుంటాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూస్తే కూడా అదే గుర్తుకొస్తుంది. గతేడాది ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మళ్ళీ వాటినే ప్రస్తావించింది. ఎందుకు అమలు చేయలేకపోయిందో వివరణ కూడా లేదు. బడ్జెట్ అంటే కేవలం అంకెల సముదాయం కాదు.. ప్రజల ఆశల, ఆకాంక్షల వ్యక్తీకరణ అని గతేడాది బడ్జెట్ ప్రసంగంలోనే మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. నిజమే.. కానీ ఆ అంకెలు వాస్తవానికి దగ్గరగా లేనప్పుడు ప్రజలకు వాటిపై సందేహాలు వస్తాయి. అంకెల్లో ప్రభుత్వం వినిపించే హామీలను విశ్వసించరు.

వైఎస్ రాజశేఖరరెడ్డి తరచూ విశ్వసనీయత అని వ్యాఖ్యానించేవారు. పబ్లిక్ లైఫ్‌లో ఉండే రాజకీయ నాయకులకు విశ్వసనీయత చాలా ముఖ్యమని చెప్పేవారు. ఒక మాట ఇచ్చినప్పుడు దానికి కట్టుబడి ఉండాలన్నది ఆయన ఉద్దేశం. ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్‌ను చూసినప్పుడు ఆ విశ్వసనీయత గుర్తుకొస్తున్నది. గతేడాది బడ్జెట్‌లో దళితబంధు పథకానికి నిధులను కేటాయించినా ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. మళ్ళీ తాజా బడ్జెట్‌లో దాన్నే ప్రస్తావించారు. దేశంలోనే అద్భుతమైన పథకం అని గొప్పగా చెప్పుకుని భారీ స్థాయిలో నిధులను కేటాయించి అమలు చేయనప్పుడు దానికి సార్ధకత లేదు. ఇదొక్క పథకమే కాదు.. ఇలాంటివి అనేకం తాజా బడ్జెట్‌లో ఉన్నాయి.

కాగితాలకే పరిమితమయ్యే వాగ్ధానాలు

ఒక ఏడాది అమలు చేయనప్పుడు మరోసారి దానిపట్ల ప్రజలకు నమ్మకం కలగదు. కనీసం ఆ స్కీమ్‌ను ఎందుకు కొనసాగించలేకపోయామన్న వివరణ కూడా ప్రభుత్వం నుంచి లేదు. నిధులను ఎందుకు విడుదల చేయలేదో కూడా చెప్పలేదు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని అసెంబ్లీ వేదికగానే ముఖ్యమంత్రి గతేడాది బడ్జెట్ సందర్భంగా హామీ ఇచ్చారు. లెక్కలతో సహా చెప్పారు. ఏడాది కాలం గడిచిపోయింది. మళ్లీ అదే హామీ రిపీట్ అయింది. ఈ సంవత్సర కాలంలో ఆయన ఇచ్చిన హామీ నెరవేరలేదు. రాష్ట్రంలో కాంట్రాక్టు కార్మికులే ఉండరు.. అందరినీ రెగ్యులర్ చేస్తాం.. ఔట్‌సోర్సింగ్ వ్యవస్థ చంద్రబాబు పుణ్యమే.. అంటూ విమర్శించారు. కానీ అది మాటగానే మిగిలిపోయింది.

సొంత జాగ ఉన్నవారికి ఇల్లు కట్టుకోడానికి ఐదు లక్షల సాయం చేస్తామని చాలా కాలం క్రితమే ప్రభుత్వం ప్రకటించింది. గతేడాది బడ్జెట్‌లో దీన్ని మూడు లక్షల రూపాయలకు తగ్గించి హామీ ఇచ్చింది. బడ్జెట్‌లో నిర్దిష్టంగా నిధులను కేటాయించకపోయినా డబుల్ బెడ్‌రూమ్ పథకానికి అటాచ్ చేసింది. కనీసం లబ్ధిదారులను గుర్తించడానికి మార్గదర్శకాలను సైతం రూపొందించలేదు. మళ్ళీ ఈ బడ్జెట్‌లో అదే హామీని కంటిన్యూ చేసింది. నిధులను కేటాయించింది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ విషయంలోనూ నిర్దిష్టమైన విధానం లేకుండా పోయింది. ఇండ్లను కట్టి నాలుగైదేళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు పంపిణీ చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది.

రైతుల రుణమాఫీ విషయంలోనూ గతేడాది ఇచ్చిన హామీ పట్టాలెక్కలేదు. ఒక్క పైసా నిధులను విడుదల చేయలేదు. లక్ష రూపాయల వరకు రుణం ఉన్న రైతులకు నాలుగు విడతల్లో మాఫీ చేస్తామంటూ 2019 బడ్జెట్ సందర్భంగానే ప్రభుత్వం వాగ్ధానం చేసింది. సర్కారు చెప్పిన నాలుగేళ్ళు అయిపోయింది. కానీ ఇప్పటికీ సగం మందికి కూడా మాఫీ కాలేదు. ఈ ఏడాది నిధులను కేటాయించిన ప్రభుత్వం రూ. 90 వేల వరకు అప్పు ఉన్నవారికి మాఫీ చేస్తామని చెప్పింది. అయినా ఇంకొంత మంది రైతులు మిగిలిపోతారు. ప్రభుత్వం ప్రామిస్ చేసినట్లు ఆ స్కీమ్ నాలుగేళ్ళ వ్యవధిలో అమలుకాకుండా అసంపూర్ణంగానే ఉండిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక హామీలు బడ్జెట్‌లో, హామీల్లో ఘనంగా కనిపిస్తాయి. కానీ వాటి ఆచరణ మాత్రం కాగితాల దగ్గరే ఆగిపోతున్నది.

వాస్తవాలకు అందని అంచనాలు

రానున్న ఏడాది కాలంలో ప్రభుత్వం ఏం చేయనున్నదో బడ్జెట్ ద్వారా తెలియజేస్తుంది. ప్రకటించే లెక్కలు అంచనాలే అయినా వాస్తవికతకు దగ్గరగా ఉండాలి. అలవికాని తీరులో అంచనాలు వేసుకోవడం, ఆ తర్వాత సవరించుకోవడం రొటీన్ అయిపోయింది. ప్రతీ ప్రభుత్వం సవరించిన అంచనాల పేరుతో మార్పులు చేయడం సహజమే. కానీ దానికి సహేతుకమైన కారణాలు ఉంటాయి. రెండేళ్ళుగా రాష్ట్ర బడ్జెట్‌లో అది కనిపించడంలేదు. కేంద్రం నుంచి భారీ స్థాయిలో గ్రాంట్ల రూపంలో సాయం వస్తుందని అంచనా వేసుకోవడం ఆ తర్వాత మార్చుకోవడం ఒక ప్రాక్టీసుగానే మారింది. ఈసారి కూడా అదే కంటిన్యూ అయింది. అతిగా ఆశించడం ఆ తర్వాత రివర్స్ అయిందని సర్దుకుంటున్నది.

కేంద్రంతో సఖ్యతగా ఉంటే నిధులు, ప్రాజెక్టులు వస్తాయని స్వయంగా ముఖ్యమంత్రే పలు సందర్భాల్లో గతంలో చెప్పారు. అందుకే ఫ్రెండ్లీ రిలేషన్స్ కొనసాగిస్తున్నామన్నారు. కేంద్రం దయాదాక్షిణ్యాలతో ఇస్తుందే తప్ప రాజ్యాంగపరంగా వ్యవహరించడం లేదన్నది ఆయన మాటలతోనే అర్థమవుతున్నది. అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూడాల్సిన కేంద్రం రాజకీయాలతో ముడిపెట్టి వ్యవహరించడం అప్రజాస్వామికం. కేంద్రంతో ఘర్షణ పడితే నిధులు రావని కేసీఆర్‌కు నిశ్చితాభిప్రాయం ఉన్నది. అయినా రెండేండ్లుగా కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఆశిస్తున్నారు. ఈసారీ అదే పొరపాటు చేశారు. అలాంటి సాయం అందదని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే లెక్కల్లో పెట్టుకున్నది.

బడ్జెట్ సైజును ఎక్కువ చేసి చూపించుకోడానికి ఆదాయం ఫలానా రూపంలో వస్తుందంటూ కేంద్ర గ్రాంట్లను ప్రభుత్వం చూపిస్తున్నది. అది రాదని తెలిసినా ప్రజలను మోసపుచ్చుతున్నది. ఇంటర్ స్టేట్ సెటిల్‌మెంట్ పేరుతో కొత్త పద్దును ప్రస్తావించింది. దాని ద్వారా కూడా ఆదాయం ఖాతాలోకి వచ్చే మొత్తాన్ని పేర్కొన్నది. బడ్జెట్ సైజును పెంచాలంటే దానికి తగిన ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో చూపించాలి. దానికి తగిన దారి వెతుక్కున్నది. ఇది వర్కవుట్ అయ్యేది కాదని ప్రభుత్వానికి తెలియందేమీ కాదు. అయినా ప్రజలను ఈ రూపంలో మోసం చేస్తున్నది. రాష్ట్రానికి ఉన్న అప్పుల లెక్కల విషయంలోనూ దాపరికం ఈ బడ్జెట్‌లో కనిపిస్తున్నది.

సమ్మిళిత అభివృద్ధి ఓ మేడిపండు

ఎనిమిదిన్నరేళ్ళుగా సంక్షేమ రాజ్యం కొనసాగుతూ ఉన్నదని ప్రభుత్వం బడ్జెట్ ద్వారా గొప్పగా చెప్పుకున్నది. 'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' అనే నినాదాన్ని అందుకున్నది. ఇతర రాష్ట్రాల్లో రాజకీయంగా నిలదొక్కుకోడానికి రాష్ట్రంలోని రైతాంగాన్ని వాడుకుంటున్నది. రైతుబంధు స్కీమ్‌ను ప్రస్తావిస్తున్నది. రైతుల ఆత్మహత్యలే లేని తెలంగాణ ఆవిష్కృతమైందని ప్రచారం చేసుకుంటున్నది. అదే నిజమైతే రాష్ట్ర పోలీసు శాఖ రూపొందించిన లెక్కల సంగతేంది కేంద్రానికి పంపిన జాబితా సంగతేంటి ప్రతి రోజూ రైతులు అప్పుల బాధలు, ఆకలి కేకలతో చనిపోతున్నది నిజం కాదా దూరపు కొండలు నునుపు తరహాలో ఇక్కడి స్కీమ్‌లను ఇతర రాష్ట్రాల్లోని రైతుల మధ్య ప్రచారం చేసి నమ్మించే ప్రయత్నం జరుగుతున్నది. ఎంతకాలం వీటిని దాచిపెట్టగలదు?

తలసరి ఆదాయం పెరిగిందంటూ గర్వంగా చెప్పుకుంటున్నది. హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాలను పక్కన పెడితే ఎనిమిదిన్నరేళ్ళలో రాష్ట్రం సాధించిన ప్రగతిపై క్లారిటీ వస్తుంది. భూస్వామి, రైతు భూమిని కలిపి సగటు తీసుకుంటే ఏమవుతుందో ఇప్పుడు తలసరి ఆదాయం తీరూ అంతే. అంబానీ, అదానీ ఆస్తుల్ని చూపించి దేశం సంపన్నంగా మారిందని చెప్పుకున్నట్లే ఉంటుంది. హామీల అమలులో చిత్తశుద్ధి, లెక్కల్లో వాస్తవికత లేనప్పుడు ఆ ప్రభుత్వం పట్ల ప్రజలకు విశ్వాసం ఉండదు. అది కేంద్రమైనా, రాష్ట్రమైనా. ఇప్పుడు రియలైజ్ కావాల్సింది ప్రజలు. ప్రభుత్వ నిజాయితీని గ్రహించే సమయం ఇది. ఆగ్రహిస్తారా.. అనుగ్రహిస్తారా అన్నది కాలం తేలుస్తుంది.

- విశ్వనాథ్

99714 82403

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672


Next Story

Most Viewed