ఎన్నికల వేళ సరిహద్దు డ్రామాలు

by Disha edit |
ఎన్నికల వేళ సరిహద్దు డ్రామాలు
X

దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు హానిచేసే పనులను ఏ దేశం కూడా సహించదు. మరి అలాంటి ప్రవర్తనను ఈ మధ్య కాలంలో చైనా మన పట్ల అనుసరిస్తోంది. గడిచిన దశాబ్ద కాలంగా భారత్, చైనా దేశాల మధ్యలో సత్సంబంధాలు లేవు.ఇరు దేశాలు ఒకదాని పట్ల ఒకటి అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నాయి. దీనికి కారణం అనేక రాజకీయ, భౌగోళిక, ఆధిపత్య కారణాలు ఉండటమే.

ఆసియా ఖండంలోనే భారత్, చైనాలు రెండు అతిపెద్ద దేశాలు. ప్రస్తుతం భారత్, చైనా రెండు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం రోజురోజుకు ముదురుతోంది. గతంలో ఇదే విషయమై ఇరు సైన్యాలు డొక్లామ్ వద్ద బాహాబాహీకి తర్వాత గాల్వాన్ వద్ద కాల్పులకు సైతం దిగిన సంగతి మనకు తెలిసిందే. ఇలా వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ)వద్ద ఒకవైపు ఉద్రిక్త వాతావరణం ఉంటే మరోవైపు చైనా ఎప్పటికప్పుడు కొత్త వివాదాలకు తెరలేపుతూ కయ్యానికి కాలు దువ్వుతూనేఉంది.

మన భూభాగాలకు చైనా పేర్లు

భారత దేశ అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ముప్పై ప్రాంతాలకు చైనా చైనీస్, టిబెటన్, పిన్ యున్ భాషలలో నూతన పేర్లను పెడుతూ పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత సోమవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. చైనా మొత్తం అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్ లేదా జాంగ్నావ్ అని పిలుస్తుంది. ఈ పేరుతోనే అక్కడి భూభాగాలలోని ప్రాంతాల పేర్లు మారుస్తున్నట్లు వివిధ కథనాలలో పేర్కొంది‌. అందులో 11 నివాస స్థానాలు, 12 పర్వతాలు, నాలుగు నదులు, ఒక సరస్సు, ఒక పర్వత ప్రాంతంతో పాటు కొంత భూభాగానికి నూతన పేర్లు పెడుతున్నట్లు వెల్లడించింది. ఇలా అరుణాచల్ ప్రదేశ్‌లోని భూభాగాలకు చైనా పేర్లు మార్చడం గత ఏడేళ్లలో ఇది నాలుగోసారి. మొదటిసారిగా 2017 లో 6 స్థలాలకు, 2021లో 15 స్థలాలకు పేర్లను మార్చింది. గతేడాది 11 ప్రాంతాల పేర్లు మార్చింది. ఈ సరిహద్దు వివాదం ఇప్పటికే ఇరు దేశాల మధ్య యుద్ధానికి దారితీసింది.ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ లోని 90 వేల చదరపు కిలోమీటర్ల భూభాగం తమదేనని చైనా వాదిస్తోంది. ఆక్సాయ్ చిన్ ప్రాంతంలోని 38 వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించిందని ఇండియా చెబుతుంది. భవిష్యత్తులో ఈ కొత్త పేర్లను చూపించి అంతర్జాతీయంగా చట్టబద్ధం చేసుకోవాలని చైనా భావిస్తుంది. ఈ పేర్లు మార్చడం ద్వారా తన వాదనలకు మరింత బలం చేకూరుతుందని చైనా ఆలోచిస్తుంది.

శ్రీలంకతోనూ వివాదం..

ఇలా ఉండగా, తమిళనాడులోని రామేశ్వరం, శ్రీలంకల మధ్యలో 281 ఎకరాల విస్తీర్ణం గల చిన్న ద్వీపం కచ్చాతీవు. ఇది తమిళనాడుకు 25 కి.మీల దూరంలో ఉంది. 17వ శతాబ్దం వరకు మధురై జమీందార్ ఆధ్వర్యంలో, తరువాత బ్రిటిష్ వారి కాలంలో మద్రాసు ప్రెసిడెన్సీలో అంతర్భాగంగా ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ప్రభుత్వ పత్రాలలో భారతదేశ ప్రాంతంగానే పేర్కొనబడింది. అయితే శ్రీలంక కూడా ఈ ద్వీపం పై తమకు హక్కులు ఉన్నాయని వివిధ సందర్భాలలో చాటుకుంటూ వస్తుంది. ఈ ద్వీపాన్ని రెండు దేశాల మత్స్యకారులు ఉపయోగించుకుంటున్నారు. ఇది కొన్నిసార్లు సరిహద్దు ఉల్లంఘనలకు, దేశాల మధ్య ఉద్రిక్తతలకు కూడా కారణం అవుతోంది.

కాలక్రమంలో కచ్చతీవుకు సంబంధించి ఇరు దేశాల మధ్య రెండు ముఖ్యమైన సమావేశాలు 1974లో జరిగాయి. ఈ రెండు సమావేశాల అనంతరం కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు ఇస్తున్నట్లు నాటి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వలలు ఆరబెట్టుకునేందుకు భారతీయ మత్స్యకారులను, ద్వీపంలోని చర్చికి వీసా లేకుండా సందర్శకులను అనుమతించేలా మాత్రం ఒప్పందం చేసుకున్నారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం నిర్ణయంపై అప్పటి తమిళనాడు సీఎం కరుణానిధి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 1976లో భారత్, శ్రీలంక మధ్య సముద్ర సరిహద్దుకు సంబంధించి మరో ఒప్పందం జరిగింది. దీనిలో భారత మత్స్యకారులు, ఫిషింగ్ ఓడలు శ్రీలంక స్పెషల్ ఫైనాన్స్ జోన్లోకి ప్రవేశించరాదని కరాఖండిగా పేర్కొబడింది. ఈ అంశం కచ్చతీవు ద్వీప వివాదానికి మరింత ఆజ్యం పోసింది. తమిళనాడు మత్స్యకారులు తీవ్ర అసహనానికి, ఆగ్రహానికి గురైనారు. 1977 ఎమర్జెన్సీ తర్వాత కచ్చతీవు ద్వీపాన్ని భారత్‌కు తిరిగి ఇవ్వాలని కోరుతూ తమిళనాడు శాసనసభలో తీర్మానం చేశారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం కూడా కచ్చతీవు ద్వీపం మీద సరైన దృష్టి పెట్టలేదు.

భారత్ చుట్టూ సైనిక స్థావరాలు

భారత్ పై పట్టు సాధించేందుకు ఏ అవకాశాన్నీ చైనా వదలడం లేదు. దానిలో భాగంగానే భారత్ చుట్టూ అనేక సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంటుంది. అలాంటి చైనా చూపు భారత్ భూభాగానికి అతి సమీపంలో ఉన్న కచ్చతీవు ద్వీపంపై పడింది. కానీ మొన్నటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ, అరుణాచల్ ప్రదేశ్‌ లోని వివిధ ప్రాంతాలకు చైనా పేర్లు మార్చడంతో అకస్మాత్తుగా కచ్చతీవు వివాదాన్ని ఎన్నికల సమావేశంలో తెరపైకి తెచ్చారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి అడుగులు వేస్తోంది. అంటే ఒకేసారి తమిళ ప్రజల మన్ననలతోపాటు ఓట్లను సాధించవచ్చునని‌. అలాగే శత్రు ఆలోచనలను ముందే పసిగట్టి ఇక్కడ పై చేయి సాధించవచ్చునని. పథకం ప్రకారం గత వారం రోజులనుండి కచ్చతీవు ద్వీప విషయం పదేపదే మాట్లాడుతున్నారు. ఏదిఏమైనా ఎన్నికల వేళ డ్రాగన్ సరిహద్దు డ్రామాలు, దానిని రక్తికట్టించే పాలకుల ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారు.

డాక్టర్ సందెవేని తిరుపతి

చరిత్ర పరిరక్షణ సమితి

9849618116

Next Story