- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
అయోధ్య రాముడికి వార్షికోత్సవం..!

అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట జరిగి చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. 2024 జనవరి 22న రాములవారికి జరిగిన ప్రాణ ప్రతిష్ట ఘట్టాలు తలుచుకుంటే ఒళ్లంతా పులకరిస్తోంది. దసరా, దీపావళి, సంక్రాంతి పండగలను మించిన శుభదినం. హిందూ కాలమానం ప్రకారం 2024 జనవరి 22న ( పుష్య మాసంలో శుక్ల ద్వాదశి) రాముల వారి ప్రాణ ప్రతిష్ట జరిగింది. హిందూ పంచాంగం ప్రకారం ఆ మహోత్సవానికి జనవరి 11 నాటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం వేడుక చేసుకోవడానికి సిద్ధమైంది. "ప్రతిష్ట ద్వాదశి" అనే పేరుతో మహత్తర కార్యక్రమానికి రూపకల్పన చేసింది శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.
మొదటి వార్షికోత్సవం సందర్భంగా..
దాదాపు 500 సంవత్సరాల తర్వాత శ్రీరామచంద్రుడు బాలరాముడిగా తన జన్మస్థలంలో నిర్మితమైన నూతన మందిరంలో కొలువుదీరిన రోజును (ప్రతిష్ట ద్వాదశి) అంటారు. ఈ సందర్భంగా అయోధ్య రామ జన్మభూమి మందిరం పరిసర ప్రాంతాలలో మూడు రోజుల పాటు ఉత్సవాలు.. విశేష కార్యక్రమాలు నాలుగు ప్రదేశాలలో నిర్వహిస్తారు. వేద మంత్రాలు జపించడం, యజ్ఞం, శ్రీరామరక్ష స్తోత్రం.. హనుమాన్ చాలీసా.. పురుష సూక్తం.. శ్రీ సూక్తం.. ఆదిత్య హృదయం పారాయణంతో పాటు,అధర్వ శీర్ష మొదలైన స్తోత్రాలు ఉంటాయి. దక్షిణ దిశలోని ప్రార్థన మండపంలో ప్రతీరోజు రాగా సేవ, అభినందన గీతాలు.. భక్తి పాటలు.. మంగళ హారతులు ఉంటాయి. మూడు రోజులు శ్రీరామ చరిత మానస పఠనం ప్రసంగాలు ఉంటాయి. ఈ విధంగా మందిరం మొదటి వార్షికోత్సవం సందర్భంగా రాములవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మందిర ప్రారంభ వార్షిక మహోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు హాజరవుతుండడం విశేషం.
రాముల వారి దర్శనం మహాభాగ్యం..
త్రేతాయుగంలో రాములవారి పట్టాభిషేకంలో పాల్గొనని ప్రజలంతా నేడు కలియుగంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం అత్యంత అదృష్టంగా భావిస్తున్నారు. రాముల వారి ప్రాణప్రతిష్ట కళ్లారా చూడటం ఈ జన్మకు సార్థకత ఏర్పడిందని మురిసిపోతున్నారు. ఈ సుదినానికి ఏడాది గడిచిన సందర్భంగా నాటి మధురమృతులను రామభక్తులు స్మరిస్తూ తరిస్తున్నారు. అసలు అయోధ్య రామ మందిరం అనేది ఓ కల. అది సాధ్యం కానీ అంశం. అని కొట్టిపారేసిన రోజుల నుంచి..అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తి చేసి హిందువుల కలను సాకారం చేశారు. ఈ మందిరాన్ని ఐదు శతాబ్దాల తర్వాత భవ్యంగా నిర్మాణం చేసుకోవడం ఓ చరిత్ర. ప్రపంచ హైందవ జాతిని ఏకం చేసిన ఉద్యమం రామ జన్మభూమి పోరాటం. ఆగర్భ శ్రీమంతుడు నుంచి మొదలుకుంటే.. అడుక్కుతినే వారి వరకు ప్రతి హిందువు మనస్ఫూర్తిగా నిధి సమర్పించి, ఉదారంగా విరాళాలు సమర్పించి నిర్మించుకున్న మందిరం హిందువుల స్వాభిమాన సంకేతం. ఈ మందిరం ప్రారంభ ఘడియలు అపురూపం.. అమోఘం.! విరామమెరుగని పోరాటంలో లెక్కకు మించిన ప్రాణ త్యాగం చేసిన కరసేవకుల త్యాగ చరిత్ర అజరామరం.. ఆచంద్రార్కం.! మొత్తంగా చెప్పాలంటే హైందవ విజయానికి చిహ్నం రామ మందిరం. కులాలు, వర్గాలు, ప్రాంతాలు, భాషలు, పేద ధనిక తరతరమ భేదాలు మరిచి రామనామం జపించిన చైతన్య స్ఫూర్తి.. ఐక్యత రాగం రామ మందిరం.!
హిందూ సమాజాన్ని కదిలించి..
ఐదు శతాబ్దాల తర్వాత పోరాడి విజయం సాధించి నిర్మించుకున్న రాముల వారి ప్రాణప్రతిష్ట మహోత్సవంలో ప్రతి హిందువును భాగస్వామి చేయాలనే సంకల్పం స్ఫూర్తిదాయకం. మందిర ప్రారంభానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానించాలని చేపట్టిన కార్యక్రమం అద్భుతం. ప్రతి ఇంటికి రాములవారి అక్షింతలు అందజేసి మందిర ప్రారంభానికి ఆహ్వానించిన కార్యక్రమం మహాద్భుతం. 2024 జనవరి 1 నుంచి 15 వరకు కనీవినీ ఎరుగని రీతిలో అయోధ్య అక్షింతలు వితరణ చేశారు. దేశంలోని ఐదు లక్షల పదివేలకు పైగా గ్రామాలకు వెళ్లి దాదాపు 11 కోట్ల కుటుంబాలకు అక్షింతలు అందజేసిన కార్యక్రమం ఓ ఆధ్యాత్మిక విప్లవం సృష్టించింది. దాదాపు 40 కోట్లకు పైగా శ్రీరామ భక్తులను కలిసి అక్షింతలు ఇచ్చి అయోధ్యకు ఆహ్వానించడం ఓ హిస్టరీ. ఇక మందిరం ప్రారంభం రోజున పూజ సామాగ్రి, పూలు, పండ్లకు కొరత ఏర్పడింది. వ్యాపారులు ఊహించలేని విధంగా కాషాయ వస్త్రాలు కొనుగోలు జరిగాయి. ఎటు చూసినా జై శ్రీరామ్ నినాదాలు వినిపించాయి. దీపావళిని మించి జనవరి 22వ తేదీ రాత్రి టపాసులు పేలాయి. ప్రతి ఇంటిపై దీపాలు వెలిగాయి. ఇలా ఒకటేమిటి నాటి స్మృతులు తలుచుకుంటేనే మనసులో విజయ చిద్విలాసం తొణికిసలాడుతోంది.
నెలకు కోటికి పైగా భక్తులు..
ప్రాణ ప్రతిష్ట తర్వాత దేశంలోని నలుమూలల నుంచి ప్రత్యేక రైళ్లలో రామభక్తులు అయోధ్యకు తరలి వెళ్లారు. అత్యంత నియమనిష్టలు, భక్తిశ్రద్ధలతో రాములవారిని దర్శించుకుని స్వామి వారి ఆశీస్సులు పొందారు. జన్మ తరించిన అనుభూతితో ఆనంద డోలికల్లో మునిగి తేలారు. ఐదు శతాబ్దాల తర్వాత మందిర ప్రాంగణంలోకి కాలు పెట్టిన రామభక్తుల అనుభూతి అంతా ఇంతా కాదు. రామాలయ నిర్మాణం ప్రారంభం తర్వాత ప్రపంచ వింతలలో ఒకటైన తాజ్ మహల్‌ను మించి అయోధ్య రాముడిని దర్శించుకోవడం విశేషంగా చెప్పవచ్చు. నెలకు దాదాపు కోటికి పైగా భక్తులు రాములవారిని దర్శించుకోవడం ప్రత్యేకత. మందిరం ప్రారంభించిన తర్వాత మొట్టమొదటి దీపావళి రికార్డు స్థాయిలో దీపోత్సవం నిర్వహించారు. దీపావళి రోజు 25 లక్షల దీపాలు ఏకకాలంలో వెలిగించి గిన్నిస్ రికార్డులు సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ ఇంకా రాములవారిని దర్శనం చేసుకొని భక్తులు ఉంటే వెంటనే వెళ్లి దర్శనం చేసుకుని రాములవారి అనుగ్రహం పొందాలి.
పగుడాకుల బాలస్వామి
ప్రచార ప్రసార ప్రముఖ్
విశ్వహిందూ పరిషత్
99129 75753