‘ప్రపంచ స్థాయి సినిమా’గా ఎదిగామా..?

by Vinod kumar |
‘ప్రపంచ స్థాయి సినిమా’గా ఎదిగామా..?
X

‘ఆస్కార్’ ‘జాతీయ పురస్కారాల’లో తెలుగు సినిమా తన స్థాయిని ప్రదర్శించింది. ఇది శుభ పరిణామం. విజేతలైన నటులు, సాంకేతిక నిపుణులు, గేయ రచయితలు అందరికీ శుభాకాంక్షలు. ఈ నేపథ్యంలో తెలుగు సినిమా ప్రపంచస్థాయినందుకుందని, ప్రపంచ సినిమా తెలుగు సినిమాను చూస్తుందని మీడియా గర్వంగా ప్రకటించింది. ఇదీ సంతోషమే. ఆరున్నర దశాబ్దాలలో రాని జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం ‘అల్లు అర్జున్’కు లభించడం ఆనందదాయకం. ఈ సందర్భంగా ‘ప్రపంచ సినిమా’ అంటే ఏమిటి? తెలుగు సినిమా స్థాయి ఏ పాటిది అనే ప్రశ్నలు ఎంతోమంది గతకాలపు సినీ అభిమానుల్లో మెదిలాయి. వారంతా తమ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికల మీద పంచుకున్నారు. ‘ఆస్కార్’ ‘జాతీయ నటుడు’ బహుమతులు మీద కాస్త జోరుగానే వ్యంగ్యాత్మక వ్యాఖ్యానాలు చేశారు. ఇది ఆనందంతో కూడిన ఆవేదన అనేది అభిమానుల సర్దుబాటు.

బోలెడు ఖర్చు పెట్టడమే ప్రమాణమా..?

నిజంగా తెలుగు సినిమా ‘రియలిస్టిక్ సినిమా’గా ప్రపంచ స్థాయిలో నిలబడిందా? నిలబడగలదా? ప్రపంచ సినిమాకి కావలసిన ముడిసరుకేమిటి? తెలుగు సినిమా అందిస్తున్నదేమిటి? ‘ఆది పురుష్’ తీసి అదే ‘అవతార్’ స్థాయి అనీ, ‘భోళాశంకర్’ తీసి బోలెడు ‘ఖర్చు చేసాం’ కనుక భారతీయ సినిమా స్థాయి ఇదని అందామా? మరి ప్రపంచస్థాయి రియలిస్టిక్ సినిమాగా మన చిత్రాలను ఏ కోణంలో ప్రస్తావించాలి. ఒకప్పుడు ‘దాసి’, ‘మా భూమి’, ‘అనుగ్రహం’, ‘ఊరుమ్మడి బ్రతుకులు’, ‘ప్రాణం ఖరీదు’ వంటి చిత్రాలు వచ్చాయి. కానీ.. అవి విజయం సాధించలేదు. కానీ.. ప్రపంచ వేదికల పైన ‘తెలుగు సినిమా’ కొత్త దృక్కోణాన్ని ప్రదర్శించాయి. ‘నర్తనశాల’ ‘సీతా కళ్యాణం’ ‘మాయాబజార్’ వంటి చిత్రాల పాత్రలు, స్క్రీన్ ప్లే వంటివి నేటికి పాఠ్యాంశాలుగా విదేశీ సినిమా శిక్షణ సంస్థలలో స్థానం సంపాదించుకున్నాయి.

‘కలిసి ఉంటే కలదు సుఖం’ ‘మరో ప్రపంచం’ ‘సుడిగుండాలు’ వంటి చిత్రాలు ప్రపంచ స్థాయిలో ‘తెలుగు చిత్రం’ ప్రత్యేకతను చాటి చెప్పాయి. ఎన్.టి.ఆర్, ఏ.ఎన్నార్‌లు ఆయా చిత్రాలలో వయసుకి మించిన, తన గ్లామర్‌కు తగినవి కాకపోయినా పోషించారు. ‘శభాష్’ అనిపించుకున్నారు. అయినా వారికి ‘జాతీయ పురస్కారాలు’ రాలేదు. పాత్ర ముఖ్యం కాదు. నటుడి పాత్ర... పాత్ర పోషణలో పడిన కష్టం ముఖ్యమని ఓ నటుడు చేసిన వ్యాఖ్యానం మరి పై మూడు చిత్రాల్లో నటించిన మహానటులకు వర్తించదా? ‘అవార్డుల’ వెనుక దర్శక నిర్మాతల ‘కృషి’, ‘పట్టుదల’ పెట్టుబడి వంటివి కూడా ఉంటాయని సోషల్ మీడియా వేదికగా రకరకాల విశ్లేషణలు వెలువడ్డాయి. వదిలేద్దాం. ఇక్కడే ‘మనది ప్రపంచ స్థాయి సినిమా’ అనే బలుపు లాంటి వాపును చూసి మురిసిపోవడం జరుగుతున్నదనేది అభిమానుల ఆవేదన.

వినోదం తప్ప కష్టసుఖాలకు తావెక్కడ..?

అసలు ఏది ప్రపంచ సినిమా.. ఏది రియలిస్టిక్ సినిమా అని అడిగే వారుంటారు. ఒక్కసారి.. హంగేరీ, అమెరికా, రష్యా, చైనా, జపాన్ చిత్రాలను పరిశీలించవలసి ఉంటుంది. తెలుగులో కూడా విదేశీ సినిమాల మూల కథతో చిత్రాలు తీసి విజయాలు సాధించారు. (ఉదా: ఊపిరి) ఈ సినిమాలలో వర్గ పోరాటం, యుద్ధ వ్యతిరేకత, శ్రమ వర్గాల చైతన్యం, వ్యభిచారం, మానవీయత, నైతికత, భావోద్వేగాల స్వేచ్ఛ(?), మానవ మనస్తత్వాలు చిత్రణ ఇలా ప్రపంచంలోని ‘మానవుల’ సమస్త కష్టసుఖాలను ‘దోపిడి’ని చక్కని సాంకేతికతతో చిన్న సినిమాగా నిర్మిస్తున్న వైనం విస్మయం కలిగిస్తుంది. కార్మికుల సామూహిక చైతన్యాన్ని ‘స్ట్రైక్’, ‘బ్యాటిల్ షిప్ పోటిమ్కిన్’, ‘అక్టోబర్’ వంటివి ఒక్కసారి చూస్తే ప్రపంచస్థాయి సినిమా స్థాయి ఏమిటో అర్థమవుతుంది.


ఇక్కడ ఓ విశేషం చెప్పుకోవాలి. 1948 ప్రాంతంలోనే విట్టోరియా డిసికా తీసిన ‘బైసికల్ థీవ్స్’, ‘టూ విమెన్’ వంటి నియో రియలిస్టిక్ ఉద్యమపు గొప్పతనాన్ని ఇటాలియన్ చిత్రాల్లో చూడవచ్చు. వ్యభిచారంపై పోలాండ్ తీసిన ‘యువర్ నేమ్ ఇస్ జస్టిస్’ ఫ్రెంచ్ మూవీ ‘బ్లూ కలర్’ (నీలం రంగు) జపాన్ చిత్రం ‘రషోమెన్’ జీవావరణ విధ్వంసంపై వచ్చిన ‘అల్టిప్లానో’ మూలాల అన్వేషణపై వచ్చిన గ్రీకు చిత్రం ‘ఎథనేసియా’ చెకోస్లావేకియా ‘ది హౌస్’, పోలెండ్ చిత్రం ‘ మై నేమ్ ఈస్ కీ’ గుజరాతి చిత్రం ‘హెల్లారో’ కొడుకు కోసం తల్లి అన్వేషణ ‘చేజింగ్’ (నాకు ‘విమానం’ సినిమా గుర్తొచ్చింది) అనేవి కొన్ని మాత్రమే. ఇంకా ఇటువంటి చిత్రాలు ఎన్నో… ఎన్నెన్నో ఉన్నాయి.

కమర్షియల్ ఫార్ములానే గతి..

తెలుగులో కూడా ‘ప్రతిఘటన’ ‘దేశంలో దొంగలు పడ్డారు’ ‘కలియుగ సీత’ ‘లక్ష్మణ రేఖ’ ‘పూజకు పనికిరాని పువ్వు’ వంటి సందేశాత్మక చిత్రాలు వచ్చినా అవన్నీ ‘ప్రాంతీయత’లోని భిన్నపార్శ్వాలను సృశించేవే కావటం. వ్యభిచారం పైన కమర్షియల్ చిత్రంగా వచ్చిన ‘కళ్యాణ మండపం’ (కాంచన -వి. మధుసూధన రావు) వంటివి ‘ప్రపంచస్థాయి’ కథలున్న సినిమాలని వాదించలేము కదా. ఇక్కడ మరో విషయం ఏమిటంటే హర్రర్ చిత్రాలలో సహితం ‘ప్రపంచ సినిమా’ ఏదో ఒక ‘సమస్య’ను ప్రవేశపెట్టడం. రొమేనియన్ల ఊచకోతను అక్కడక్కడ ప్రస్తావిస్తూ ‘ది నన్’ వచ్చింది. ఇది పక్కా కమర్షియల్ చిత్రం. అయినా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి తెలుగు సినిమాలు? తెలుగు చిత్రాలలోని కమర్షియల్ ఫార్ములాతో ‘ప్రపంచ సినిమా’ను పోల్చలేము.

కారణం సాంకేతికత, కథాకథనాలు, నటీనటులలోని సహజమైన నటనా రీతులు. ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, గ్రాఫిక్స్ ఇలా ఇరవై నాలుగు విభాగాలలో వందలాది మంది ‘నిపుణులు’ పనిచేస్తారు. ‘తెలుగు సినిమా’ కూడా గ్రాఫిక్స్ కోసం ‘హాలీవుడ్’ వైపు చూస్తున్నది. ఇహ పాటలు, ఫైట్స్, నాటకీయత వంటివి పైన పేర్కొన్న సినిమాల్లో కూడా ఎంతో ఉన్నాయి. కానీ వాటిలో ‘సహజత్వం’ పేరుకొని ఉండటం గమనించదగ్గ అంశం. కోట్లు ఖర్చు చేసి నిర్మించడం, ‘అవార్డులు’ తెచ్చుకోవడం ఈ వ్యాపార ప్రపంచంలో ఎంతో సులభం. కానీ… ఆయా చిత్రాలకు ‘శాశ్వతత్వం’ ఎంతవరకు అనేది ప్రధానాంశం.

జీవితాల సున్నిత ఆవిష్కరణే సినిమా..

ఇక్కడ ఓ రెండు చిత్రాల ప్రస్తావన అవసరం. ‘శశాంక్ రిడెంప్షన్’ ‘లవ్ సెక్స్ అండ్ థోకా’ అనే చిత్రాలు మనకు తెలియని చరిత్రను సెల్యులాయిడ్ సాక్షిగా చెబుతాయి. మనసును కదిలిస్తాయి. ఇటువంటి చిత్రాలను గమనించి ఆ దిశగా తెలుగు సినిమాను తీసుకు వెళ్లగలమేమో ఆలోచన చేయవలసి ఉంది. ‘ప్రపంచ సినిమా’లోని మరో ప్రధానమైన భాగం ఏమిటంటే ‘స్క్రీన్ ప్లే’. కథను ‘అండర్ ప్లే’ గా ఉంచటం. మెల్లగా సినిమా ప్రారంభమై క్రమేపి ప్రేక్షకుడు ‘సినిమా’ పట్ల మమకారం పెంచుకోవటం. కొన్ని సినిమాలు ‘మనిషి’ ప్రయాణం ఏమిటో తెలియజేస్తాయి. ‘రాంబో’ సినిమాలు కూడా ‘సెంటిమెంట్’ను తగు మోతాదులో ‘ప్లే’ చేయటం గమనించవచ్చు. ఏ తరహా చిత్రమైన సాంకేతికంగా ‘హై లెవెల్’ లో ఉంటాయి. ముఖ్యంగా మానవ మనస్తత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తాయి. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ వంటి చిత్రాలు జీవితం పట్ల ఆశను కల్పిస్తాయి. సినిమాలకు సమాజం పైన ప్రభావం చూపే శక్తి ఉంది. ‘టైటానిక్’, ‘అవతార్’, ‘పెరల్ హార్బర్’, ‘జురాసిక్ పార్క్’, ‘రేప్’ వంటి చిత్రాలతో పాటు ‘షార్క్’, ‘స్పీడ్’ వంటివి కూడా కమర్షియల్‌గా విజయవంతమయ్యాయి. ‘కృత్రిమత్వం’ తక్కువగా ఉండే చిత్రీకరణ విధానం ఇందుకు దోహదపడతాయి. అలాగని ‘ప్రపంచ సినిమా’ అంటే గొప్పదని కాదు. కానీ.. గొప్పగా మాత్రం ఉంటుంది. జీవితాలను సజీవంగా, జ్ఞాపకాలను సున్నితంగా, ఆవిష్కరించగల నైపుణ్యం ఆ చిత్రాలకు ఉంది.

కోట్లు ఖర్చు చేసేది సందేశాలకా..!

తెలుగు సినిమాకు వందేళ్లకు పైబడిన చరిత్ర ఉంది. ఎందరో మహానుభావులు మన సినిమా ఎదుగుదలకు కృషి చేశారు. నాటి హెచ్.ఎం. రెడ్డి, రఘుపతి వెంకయ్య నుంచి నేటి రాజమౌళి, బి. నరసింగరావు, శేఖర్ కమ్ముల వరకు తెలుగు సినిమాను ప్రపంచ స్థాయి సినిమాగా ఎదిగేందుకు కృషి చేశారు. ఈ క్రమంలో ఎన్నో వెలుగునీడలున్నాయి. కానీ క్రమంగా తెలుగు సినిమా అంటే ‘కళాత్మకం’ కాదు ‘కమర్షియల్ ఫార్ములా’గా మాత్రమే తీర్చిదిద్దుతున్నారు. ఇది విచారకరం. ‘సెల్యులాయిడ్’ను ‘కళాత్మకం’, రసాత్మకం చేసిన బాపు, శ్యామ్ బెనగల్, కె.వి. రెడ్డి, మృణాళ్ సేన్, సత్యజిత్ రే, రాజ్ కపూర్ వంటి దర్శకులు ఉన్నారు. వర్తమానం వ్యాపారాత్మక ప్రపంచం. కోట్లు ఖర్చు చేసేది సందేశాలు ఇవ్వటానికి కాదనేది నేటి వ్యాపార మనస్తత్వ కళాకారుల మనోగతం. నిజమే.. కానీ.. పెట్టుబడులు కూడా మిగలడం లేదు కదా ‘తాము నమ్మిన సిద్ధాంతం’లో. ఏవో నాలుగు అవార్డులు తెచ్చు’కొన్నం’త మాత్రాన తెలుగు సినిమా ప్రపంచ స్థాయి సినిమాగా గర్వించలేము. అలాగని సత్తా, శక్తి లేదని కాదు. ‘రిస్క్’ ఎందుకనేది ఓ ‘భయం’. నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకు మార్కెట్ ఉంది. కొంతమంది దర్శకులు, నిర్మాతలు, నటీనటులకు అభిమానులు కూడా ఉన్నారు. కాకపోతే వారంతా ‘ఎంటర్టైన్మెంట్’ కోరుకుంటున్నారని ‘ట్రేడ్’ వర్గాలంటున్నాయి. ఏది ఏమైనా ప్రపంచస్థాయికి తెలుగు సినిమాను తీసుకు వెళ్ళగలిగే శక్తి సామర్ధ్యాలున్నా వెళ్లేందుకు ముందడుగు వేయడం లేదనేది నిజం.

- భమిడిపాటి గౌరీశంకర్,

94928 58395

Next Story

Most Viewed